ఆ ‘రాళ్ల దెబ్బల’ నుంచి రక్షించుకోండి! | special story to kidney stones | Sakshi
Sakshi News home page

ఆ ‘రాళ్ల దెబ్బల’ నుంచి రక్షించుకోండి!

Published Thu, Mar 9 2017 12:16 AM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

ఆ ‘రాళ్ల దెబ్బల’ నుంచి రక్షించుకోండి! - Sakshi

ఆ ‘రాళ్ల దెబ్బల’ నుంచి రక్షించుకోండి!

అందరికీ ఆరోగ్యాన్నిచ్చేవే అయినా కొందరికి అవి కాస్త ప్రతికూలంగా పనిచేస్తాయి. అలా పాలు, పాలకూర వంటివి కొందరికి కిడ్నీలో రాళ్లను ఏర్పరచుతాయి. అలాగే పైన పల్చటి పొర ఉండే టమాటా కాస్తా... టెంకాయి పైన టెంకలాంటి రాయిని కిడ్నీలో  ఏర్పరుస్తుంది. ఇలా కిడ్నీలకు వచ్చే మరో ప్రమాదం రాళ్ల రూపంలో ఉంటుందన్నమాట. వాటి వల్ల  కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ రాళ్ల దెబ్బలనుంచి కిడ్నీలను కాపాడుకోవాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. అదే చేస్తుంది ఎంతో మేలు.
పెద్ద ప్రమాదాన్నే నివారించే ఆ చిరు జాగ్రత్తలివే... (చదవండి: అర్థంచేసుకోకపోతే.. కిడ్నీ ఒక పెద్ద పజిల్‌)

రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాల్సి ఉంటుంది కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది.

ఆగ్సలేట్‌ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి.

క్యాల్షియం సప్లిమెంట్లనూ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల çసూచనల మేరకు ఆహార నియమాలను పాటించాలి.

ఆల్కహాల్‌ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ.

ఆరెంజ్‌ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్‌ జ్యూస్‌ మంచిదే. అయితే విటమిన్‌ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్‌ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్‌లను ఎక్కువగా తీసుకోకూడదు.

కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు.

కిడ్నీకి గండం... మందులూ, మద్యం
మూత్రపిండాల ఆరోగ్యానికి గండంగా పరిణమించేవి మామూలుగా మనం వాడే మందులు, కొందరు అలవాటుగా తీసుకునే మద్యం. మీరు చాలసార్లు వినే ఉంటారు... చీప్‌లిక్కర్‌ కిడ్నీలను కొట్టేస్తుందని. సాధారణంగా ఒంటిని శుభ్రపరచడం అన్నది కిడ్నీల పని కదా. చీప్‌లిక్కర్‌లో మత్తును సమకూర్చడానికి వేసే వివిధ రకాల రసాయనాలను రక్తం నుంచి తొలగించడానికి కిడ్నీలు తమ సామర్థ్యానికి మించి కష్టపడతాయి. అలా మలినాలనూ, కాలుష్యాలనూ తొలగిస్తూ, తొలగిస్తూ, తమ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్‌గా చెబుతుంటారు. ఇదే పరిణామం మద్యం వల్ల కూడా వస్తుంది. వాస్తవానికి మద్యం అంటేనే కూడా బాటిలెత్తు కాలుష్యం. ఆ కలుషిత పదార్థాలను తొలగించే ప్రక్రియను నిరంతరాయం చేస్తూ చేస్తూ కిడ్నీలు అలసిపోతాయి. ఇక ఓవర్‌ ద కౌంటర్‌ డ్రగ్స్‌గా మనం పేర్కొనే మందులతోనూ ఇదే అనర్థం కలుగుతుంది.

ఆ మందులలోని మలినాలను తొలగించడానికి కిడ్నీలు కష్టపడతాయి. మందులలోని ఆ మాలిన్యాలను తొలగించేలోపే మళ్లీ వేసుకున్న మందులలోని మలినసంద్రం మళ్లీ మూత్రపిండాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతటి కష్టాన్ని ఓర్చలేక అవి కిడ్నీ ఫెయిల్యూర్‌ లాంటి కండిషన్‌లకు దారితీస్తాయి. అలాంటప్పుడు కృత్రిమంగా మనిషి జీవించి ఉండగలిగే మేరకు మాత్రమే ఒంట్లోని కాలుష్యాలను యంత్రాల సహాయంతో తొలగించే ప్రక్రియ ‘డయాలసిస్‌’తో నిత్యం నరకబాధలను చూస్తూ రోజుల ప్రాతిపదికన రోగులు తమ ప్రాణాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇలాంటి బాధలేమీ పడకుండా నిండా ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవితం గడపాలంటే రెండంటే రెండు కిడ్నీలను పదిలంగా చూసుకుంటే చాలు. ఆ రెండు కిడ్నీలే నిండు నూరేళ్లు! సంతోషాల క్యాలెండర్‌ లెక్కల్లో వెరసి వెయ్యేళ్లు!!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement