చెప్పుకోలేని కష్టం
ఏమని చెప్పాలి?
ఎలా చెప్పాలి?
ఎవరికని చెప్పాలి?
ఆడవాళ్లకు ఆఫీసుల్లో సరైన బాత్రూమ్స్ ఉండవు.
ఇంటిసామాన్లు తెచ్చుకునేటప్పుడు...
బయటి పనులు చేసుకునేటప్పుడు...
రోడ్ల మీదికి వెళ్లినప్పుడు...
ఆడవాళ్లకు టాయిలెట్లు ఉండవు.
ఆపుకునీ, ఆపుకునీ నరకయాత పడటమే కాకుండ ఆరోగ్యం కూడా పాడైపోతుంది.
ఇది చెప్పకోలేని కష్టం. ఏమని చెప్పాలి?
ఎలా చెప్పాలి? ఎవరికని చెప్పాలి?
మహిళల్లో మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు చాలా తరచుగా వస్తుంటాయి. ఇందులో ముఖ్యమైనది మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడం. దీంతోపాటు తమ ప్రమేయం లేకుండా మూత్రం కారిపోవడం (యూరినరీ ఇన్‌కాంటినెన్స్) కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అలాగే ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ అనే సమస్యతో కూడా చాలామంది మహిళలు బాధపడుతూ ఉంటారు. మూత్ర సంబంధిత వ్యాధులలో ఇది తీవ్రమైనదిగా వైద్యులు పేర్కొంటారు. ఎందుకంటే ఇది నేరుగా కిడ్నీతో ముడిపడి ఉంటుంది. ఇవే కాకుండా మూత్రంలో చీము సమస్యతో బాధపడేవారూ ఉంటారు. మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, చలిజ్వరం వంటి లక్షణాలతో కూడా చాలా మంది మహిళలు వైద్యులను సంప్రదిస్తుంటారు. సాధారణ ఇబ్బందిగా మొదలయ్యే మూత్ర సంబంధిత సమస్యలు ఆ తర్వాత వ్యాధిగా మారి తరచూ ఇబ్బంది పెడుతుంటుంది. ఈ క్రమంలో మూత్రం నుంచి ఒక్కోసారి రక్తం కూడా వస్తుంటుంది.
వయసు రీత్యా వచ్చే సమస్యలు
స్త్రీలు ఈ సమస్యతో చిన్నప్పటి నుంచే బాధపడుతున్నట్లయితే యాంటీబయాటిక్స్‌తో అప్పటికప్పుడు సమస్య నుంచి ఉపశమనాన్ని ఇప్పించడంతో సరిపెట్టకూడదు. ఇన్ఫెక్షన్ సమస్యకు అసలు కారణాలని పేరెంట్స్ ద్వారా వైద్యులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే వారు జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల అవయవాలలో పుట్టుకతోనే వచ్చే మార్పుల (కంజెనిటల్ అనామలీస్) వల్ల మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అసలు కారణం తెలుసుకోకుండా ఎన్నిసార్లు చికిత్స ఇప్పించినప్పటికీ ఏమాత్రం ఉపయోగం ఉండదు సరికదా... ఏకంగా మూత్రపిండాలే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
అలాగే యువతుల్లో, కొత్తగా పెళ్లైన మహిళల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సాధారణమని చెప్పవచ్చు. కొత్తగా పెళ్లయిన వాళ్లకి హనీమూన్ సిస్టయిటిస్ వల్ల ఈ సమస్య వస్తుంది. ఇక వయసు పైబడిన మహిళల్లో (పోస్ట్ మెనోపాజల్ ఉమన్‌లో) కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వచ్చే సమస్యే. దీనికి కారణం నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే హార్మోన్ల ప్రభావమే. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపం వల్ల మూత్రనాళం సన్నబడే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండటంతో అది మాటిమాటికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. అంతేకాకుండా ఈ హార్మోన్ల లోపం వల్ల మూత్రాశయంలోని కణాలకు రోగకారకమైన బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది.
ఈ సమస్య ఎన్ని రకాలు
మూత్ర మార్గంలో వివిధ ప్రదేశాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్, వాటి స్థానాన్ని బట్టి పేర్లను నిర్ణయిస్తారు. ఈ పేర్లను బట్టి ఇన్ఫెక్షన్ సరిగ్గా ఏ స్థానంలో ఉందో గుర్తుపట్టడానికి వైద్యులకు వీలవుతుంది. దాన్ని బట్టే చికిత్స కూడా ఆధారపడి ఉంటుంది. మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అని అంటారు. అలాగే మొదటిసారి మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని ప్రైమరీ ఇన్ఫెక్షన్ అనీ, మళ్లీ మళ్లీ రావడాన్ని పర్సిస్టెంట్ బ్యాక్టీరియూరియా లేదా రికటెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. ఇవేకాకుండా మరికొన్ని తీవ్రమైన సమస్యలు కూడా మహిళలు ఎదుర్కొంటారు.
యూరినరీ ఇన్‌కాంటినెన్స్... అంటే మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం అన్నది పురుషుల కంటే స్త్రీలలో కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కొంతమందిలో కాన్పులు కష్టమైనవారికి, స్థూలకాయంతో... హార్మోన్ సమస్యలతో బాధపడుతున్న వారికి, అలాగే మరికొంతమందిలో మెనోపాజ్ (రుతుక్రమం) ఆగిపోయిన తర్వాత ఈ సమస్య తలెత్తుతుంది. ఇంకొంతమందిలో అవసరం లేకుండానే మూత్రాశయ కండరాలు సంకోచిస్తుంటాయి. దీనివల్ల కూడా మాటిమాటికీ మూత్రం రావడం జరుగుతుంది. అలాగే మూత్రాశయానికి సంబంధించిన నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. 55 ఏళ్లలోపు వయసున్న 50 శాతం మంది మహిళలు యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కు లోనవుతుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ అందులో పది శాతం మంది కూడా వైద్యులను సంప్రదించడానికి ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం సిగ్గు, బిడియం. దీనివల్ల చాలా మంది మహిళలు తమ బాధలను తమలోనే నొక్కిపెట్టుకుంటారు. సమస్య తీవ్రమైనప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదిస్తుంటారు. ఈ సమస్య అంత పెద్దది కాకపోయినప్పటికీ ఇటు మానసికంగానూ, అటు శారీరకంగానే కాకుండా సామాజికంగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఒక్కోసారి పెల్విస్‌కు ముప్పు ఏర్పడి, దాని చుట్టూ ఉండే అనుబంధ కండరాలకు మూత్రం వల్ల ఏర్పడిన పచ్చితో చర్మ సంబంధిత అలర్జీలు కూడా వస్తాయి. సమస్య తీవ్రత పెరిగి సర్జరీకి దారితీయవచ్చు.
ఈ బ్యాక్టీరియానే కారణం...
యూరినరీ ఇన్ఫెక్షన్కు పూర్తి చికిత్స అందించకపోతే కిడ్నీలపైన కూడా ప్రభావం చూపుతుంది. మూత్ర విసర్జక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురవడానికి ప్రధానమైన కారణం ‘ఈ-కొలి’ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా బయటి వాతావరణంలోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది మూత్ర విసర్జన మూత్రనాళాల్లోకి వెళ్తుందో అప్పుడు దీనివల్ల కిడ్నీకి అత్యంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇందులోని ‘క్లెబిసియల్లా, ఇంటరోకోకస్ ఫైకలిస్’ అనే రెండు బ్యాక్టీరియాలు చాలా కీడు చేసేవి. యాంటీబయాటిక్స్లాంటి మందులకు కూడా ఇవి లొంగవు.
మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వేసవి కాలంలోనే వస్తుంటాయి. ఈ సీజన్లో ఎక్కువగా డీహైడ్రేషన్‌కు లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ముప్పు వాటిల్లుతుంది. దాంతో మంచినీరు కిడ్నీలకు అందక అవి శరీర మలినాలతో కూడా మూత్రమార్గాన్ని సరిగా శుద్ధి చేయలేకపోతాయి. దాంతో ఇన్ఫెక్షన్స్ పేరుకుపోయి మంట పుట్టడం, నొప్పి రావడం, మూత్రం కొద్దికొద్దిగా వస్తూ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది.
ఇతర సమస్యలుంటే ఇంకా ప్రమాదం
సాధారణంగా ఈ సమస్యకు డాక్టర్లు యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. అయితే సమస్యకు కారణమైన బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్‌కు లొంగడం లేదు. అంతేకాకుండా డయాబెటిక్, హైబీపీ పేషెంట్లలో ఈ సమస్య తలెత్తితే దాని ప్రభావాన్ని తగ్గించడం వైద్యులకు పెద్ద సవాలే. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడటానికి పెద్ద మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని వారి శరీరం తట్టుకోలేదు. అప్పటికే వారు తమతమ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మందులను వాడుతూ ఉంటారు. దీనివల్ల ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది పేషెంట్లు ఈ మందుల ప్రభావాన్ని తట్టుకోలేక మధ్యలోనే వాటిని ఆపేస్తుంటారు. దానివల్ల ఆ సమస్య లోలోపలే తీవ్రమై ఏకంగా కిడ్నీకే ఎసరు పెట్టేస్తుంది. దాంతో డయాలసిస్ లేదా మూత్రపిండాల మార్పిడి తప్ప వేరే మార్గం లేని ప్రమాదకర పరిస్థితి తలెత్తే అవకాశం ఏర్పడుతుంది. షుగర్ పేషెంట్స్ సాధారణం కన్నా కాస్త ఎక్కువగా నీళ్లను శరీరానికి అందిస్తుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అలాగే దీని బారి నుంచి కాపాడుకోవచ్చు కూడా.
నిర్ధారణ పరీక్షలు...
సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ అదే సమస్య మళ్లీ మళ్లీ వస్తుంటే మాత్రం నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. అది ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకోవాలి. ఆ అంశాల మీదే నిర్దిష్టమైన చికిత్స ఆధారపడి ఉంటుంది.
ఆ పరీక్షలు : సీయూఈ యూరిన్ కల్చర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సీటీ, ఎమ్మారై ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి) సిస్టోస్కోప్ (యూటీఐ) రక్తపరీక్ష (కిడ్నీ ఫెయిల్యూర్)
చికిత్స: సాధారణంగా వచ్చే మూత్ర వ్యాధులకు మందులతోనే డాక్టర్లు సరిపెట్టేస్తారు. ఒకవేళ సమస్య అసాధారణం అనిపిస్తే కాస్త ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇస్తారు. సమస్య ఇంకాస్త ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, పరీక్షలు నిర్వహించి, అందుకు అనుగుణంగా చికిత్స పద్ధతిని అవలంబిస్తారు. పుట్టుకతో వచ్చే లోపాలకు, మూత్రపిండాల్లో రాళ్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు అవసరమైతే సర్జరీ చేసి... ఆయా లోపాల్ని సరిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మూత్రావయవాల్లో టీబీ వల్ల కూడా మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ డాక్టర్‌కి అనుమానం వస్తే టీబీ క్రిముల కోసం ప్రత్యేకమైన మూత్రపరీక్షలు చేసి, చికిత్సను అందిస్తారు.
నివారణే మేలు...
శరీరానికి తగినంత మంచినీరు అందించకపోవడమే మూత్ర సంబంధిత వ్యాధులకు కారణమని వైద్యులు అంటున్నారు. ఆధునిక మహిళల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ, కీలక బాధ్యతలు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. భోజనం విషయం ఎలాగున్నప్పటికీ కనీసం మంచినీరు తాగేంత తీరిక కూడా వారికి ఉండటం లేదు. దాంతో మహిళల్లోనే మూత్ర సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక మాంసాహారాన్ని ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి హానికరం. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేయాలి. కాఫీ, టీ, జంక్ఫుడ్స్ లాంటి వాటి జోలికి వెళ్లకూడదు. ప్రాంతాల్లోని వారితో పాటు పట్ణణాల్లోని స్లమ్స్‌లో నివసించే మహిళలు కూడా శుభ్రత పాటించేలా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రయత్నించాలి. మల, మూత్ర విసర్జన తర్వాత నీటితో శుభ్రం చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకురావాలి. ఇలాంటి ప్రాథమిక సూత్రాలు పాటిస్తే కనీసం చేతులారా సమస్యను కొని తెచ్చుకునే బాధ తప్పుతుందని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోద హస్పిటల్స్, సికింద్రాబాద్
టాయిలెట్స్ లేనందువల్ల సమాజానికే కాదు... ఒంటికీ నష్టం. ఇది ఆడవాళ్లలో ఎక్కువ. పురుషులూ, మగపిల్లలూ ఆరుబయటైనా మూత్ర విసర్జన చేస్తుంటారు. కానీ మహిళలు అలా చేయరు. వాళ్లకు ఆ అవసరంపై ‘సాక్షి ఫ్యామిలీ’ ఎన్నో సార్లు కథనాలు ప్రచురించింది. పెద్దలూ, ఆలోచనాపరులు, స్వచ్ఛందసేవాసంస్థలు, అధికారులు, యువత ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి మహిళలకు టాయిలెట్ సౌకర్యాలను కల్పించేలా వారిలో చైతన్యం తెచ్చేందుకు ‘సాక్షి’ తన వంతు కృషి చేస్తోంది. పురుషులతో పాటు మహిళలకూ టాయిలెట్స్ సమకూర్చేందుకు జరిగే కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది ‘సాక్షి’.