బ్యాలెగ్స్‌ యోగా | yoga special | Sakshi
Sakshi News home page

బ్యాలెగ్స్‌ యోగా

Published Wed, Jan 4 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

బ్యాలెగ్స్‌ యోగా

బ్యాలెగ్స్‌ యోగా

యోగా

జీవితంలో రెండు కాళ్ల మీద నిలబడాలంటే ముందు ఒక కాలి మీద నిలబడటం నేర్చుకోవాలి. బేలెన్సింగ్‌. మనసు, దేహం, ఘటన... వీటి మధ్య సమన్వయం లేకపోతే అడుగు తడబడుతుంది. బేలెన్స్‌ కోల్పోతుంది. తప్పటడుగు పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే మనసును లగ్నం చేసి యోగా చేయాలి. మరీ ముఖ్యంగా– ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసనం వేయాలి.

ఇది నేరుగా చేయాల్సిన ఆసనం. కష్టం అనిపిస్తే ఆసరా సహాయంతో కూడా చేయవచ్చు. ఇది చేయాలంటే ముందుగా సమస్థితిలో నిలబడండి. ఇప్పుడు ఎడమకాలి మీద నిలబడి కుడికాలును ముందు నుంచి తీసుకొని  బొటనవేలును లేదా పాదాన్ని కుడిచేతితో పట్టుకుని శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్‌ చేస్తూ పైకి లేపాలి. మోకాలు నిటారుగా ఉండేటట్లుగా భూమికి సమాంతరంగా వచ్చేటట్లుగా ప్రయత్నించాలి. ఎడమచేతిని నడముకు పక్కన సపోర్ట్‌గా పెట్టుకుని కాలిని ఇంకొంచెం పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయవచ్చు. 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కుడికాలి పాదాన్ని నెమ్మదిగా కిందకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండో కాలిమీద నిలబడి చేయాలి. సపోర్ట్‌ కావాలనుకుంటే కుర్చీ లేదా డైనింగ్‌ టేబుల్‌ ఇంకా బాగా చేయాలంటే కిటికీ గ్రిల్‌ ముందు నిలబడి  కిటికీ సపోర్ట్‌ తీసుకుంటూ కాలుని అంచెలంచెలుగా పైకి  తీసుకువెళ్లవచ్చు.

యోగావగాహన
ఆసనం పూర్తి స్థాయిలో చేయగలిగితేనే ఉపయోగం లేకపోతే ఫలితం ఉండదు అనేది కేవలం అపోహ మాత్రమే. పూర్తిగా శరీరాన్ని వంచినవారికి ఎంత ఉపయోగం ఉంటుందో కొంచెం వంచినవారికి కూడా అంతే ఉంటుంది. ప్రయత్నం లోపం లేకుండగా నూటికి నూరుశాతం చేసినపుడు కండరాలు, అంతర్గత అవయవాల మీద ప్రభావం ఇద్దరిలోనూ ఒకే విధంగా ఉంటుంది.

శక్తిలోపం లేకుండా చేయాలి. శక్తిని పెంచి క్రమక్రమంగా ఎక్కువ చేస్తూ పోవడానికి ప్రయత్నించాలి. మొదటి వారం 5 శాతం, 2వ వారం 10 శాతం ఎక్కువ చొప్పున ఎఫర్ట్‌ పెడుతూ పోవాలి.

మలవిసర్జన, మూత్ర విసర్జన బాగా జరిగిన తరువాత జీర్ణాశయం పెద్ద ప్రేగులు, మూత్రాశయం ఖాళీ అవుతాయి కాబట్టి దాని ప్రభావం యోగసాధన మీద ఉండి బాగా చేయగలరు.

మూత్రాశయం నిండుగా ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేసి ఆసనాలు, ప్రాణాయామాలు చేయడం మంచిది.

యోగా చేయడానికి ముందు స్నానం చేసి చర్మాన్ని శుభ్రం చేయడం వల్ల చర్మంలో ఉన్నటువంటి చమట గ్రంధులు శుభ్రపడటంతో తెరుచుకుంటాయి. దీని వల్ల శరీరంలోని మలిన పదార్థాలు చర్మం ద్వారా విసర్జింబడి చర్మం ప్రకాశవంతం అవుతుంది.

ఈసారి సమస్థితిలో నిలబడి కుడికాలును ముందు నుంచి పైకి తీసుకువెళ్లే బదులు కుడిపక్క నుండి  వీలైనంత పైకి తీసుకుని వెళ్లాలి. కొత్తగా సాధన చేసేవారికి మోకాలు వంపు లేకుండా చేయడం సాధ్యం కాకపోవచ్చు. దాని వల్ల నిరుత్సాహ పడకుండా రెండు వారాలు సాధన చేస్తే పురోగతి కచ్చితంగా ఉంటుంది. ఈ రెండు ఆసనాలను సాధన చేయడంలో ఇబ్బందులు ఎదుర్కునే వారు కుర్చీ సాయంతోనూ ఇలా చేయవచ్చు. ఇలా ఆసరా తీసుకోవడం వల్ల  కలిగే లాభాలలో ఎటువంటి మార్పు ఉండదు.

ఎ.ఎల్‌.వి కుమార్‌
ట్రెడిషనల్‌
యోగా ఫౌండేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement