ఆయనకు తోడుండడమే ఆమె దీక్ష
ముద్రగడ! ఇప్పుడు మార్మోగుతున్న పేరు!
కాపులు, రిజర్వేషన్లు, ఉద్యమాలు అంటూ క్షణం తీరిక లేకుండా ఊపిరి సలపని కార్యాచరణలో ఉన్నారు ముద్రగడ పద్మనాభం! ఆయనతో పాటే ఆయన జీవన సహచరి పద్మావతి. తన పద్దెనిమిదో ఏట పద్మనాభంతో కలసి ఏడు అడుగులు వేసిన ఆమె... నాలుగు దశాబ్దాలుగా ఆయన ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నారు. సహధర్మచారిణిగా పేరులోనే కాదు, ఆయన చేపట్టిన ఉద్యమాల్లోనూ భాగస్వామ్యం స్వీకరించారు. కాపులకు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రేపు భర్తతో కలసి నిరాహార దీక్షకూ దిగనున్నారు. ఇలా ఆమె దీక్ష చేయడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ పద్మావతిని పలకరించింది.
ప్రతిదీ నాకు చెబుతారు
‘ఆయన ప్రజల మనిషి. సహాయం కోసం ఇంటికి వచ్చేవారెవరైనా సరే అసంతృప్తితో వెళ్లకూడదు. అదే ఆయన అభిమతం. నమ్ముకున్నవారికి అండగా ఉండడమే ఆయనకు తెలిసిన రాజకీయం. వేళకు వండి పెట్టడం, ఆయన కోసం వచ్చినవాళ్ల మంచీచెడ్డ కనుక్కోవడం వరకే నాకు తెలుసు. రాజకీయాలపై నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఆయన చేసే ప్రతి పనీ నాకు చెబుతారు. ఒక్కోసారి చెప్పకున్నా నా సమ్మతం ఉన్నట్లే. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా అందులో మంచి ఉంటుంది’ అని చెప్పారు ముద్రగడ పద్మావతి.
పద్మావతి స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని పెద్దలాపల్లి. ఆమె తల్లిదండ్రులు గొల్లపల్లి చెల్లారావు, రామయ్యమ్మ. సాధారణ రైతు కుటుంబం. అప్పటికే ముద్రగడ పద్మనాభం తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు ఎమ్మెల్యే. ‘పద్మనాభం గారితో పెళ్లి సంబంధం (1974లో) అనగానే మాకు చాలా గొప్ప అయింది. ఆయన మాటతీరు, నడత అన్నీ మా వాళ్లకు బాగా నచ్చాయి’ అంటూ చిరునవ్వుతో గుర్తు చేసుకున్నారు పద్మావతి.
వంటలు... ఒత్తిళ్లు...
‘పద్మనాభం గారు చిన్నప్పటి నుంచి మంచి భోజనప్రియులు. ఎక్కడైనా ఏదైనా కొత్త వంటకం రుచి చూస్తే చాలు... ఇంటికొచ్చి చెబుతారు. రెండుమూడు సార్లు ప్రయత్నించైనా సరే వంటకం రుచిగా వచ్చే వరకూ వదిలిపెట్టనివ్వరు. ఒకసారి ఢిల్లీలో ప్రధానమంత్రి విందులో బాదం సూప్ ఇచ్చారట. అదెలా తయారుచేయాలో చెఫ్‌తో మాట్లాడి మరీ తెలుసుకొని వచ్చారు. హైదరాబాద్‌లో దొరికే కుబానీ స్వీట్ తయారీ గురించి కూడా అలాగే తెలుసుకొని ఇంట్లో చేయించారు. నేను కూడా ఆయన అభిరుచికి తగ్గట్లుగానే వంటలు చేస్తుంటాను. అంతేకాదు, ఇంటికొచ్చే అతిథులకు ఏ మెనూ తయారు చేయాలో చెప్పేస్తారు. ఆయనకు నచ్చే స్వీట్ సగ్గుబియ్యం హల్వా కూడా తరచుగా చేస్తుంటాను’ అని భర్త భోజన ప్రియత్వం గురించి చెప్పారు పద్మావతి. అయితే ఇలా హోటళ్లలో వంటకాల గురించి చెప్పినా రాజకీయాల్లో ఎదురయ్యే ఒత్తిళ్ల గురించి ఏనాడూ ఇంట్లో తన వద్ద ప్రస్తావించరని ఆమె అన్నారు.
సివిల్స్‌కి అనుకున్నాం
‘మాకు ముగ్గురు పిల్లలు. పెద్దవాడు బాలుకి మా మామ వీరరాఘవరావు పేరు, రెండో అబ్బాయి గిరికి మా నాన్న చెల్లారావు పేరు పెట్టాం. అమ్మాయి క్రాంతి అసలు పేరు సత్యవతి. అంటే మా అత్తగారి పేరు. పద్మనాభంగారు కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తారో ప్రజల కోసం అంతకన్నా ఎక్కువ తపనతో ఉంటారు’ అని పద్మావతి చెప్పారు. పక్కనే ఉన్న ముద్రగడ మాట్లాడుతూ... ‘మా పిల్లల్ని రాజకీయాల్లో కాకుండా సివిల్ సర్వీసు అధికారులుగా చూడాలని తపించేవాళ్లం. కానీ బాలు బాల్‌బాడ్మింటన్ ఆడుతూ ప్రమాదానికి గురై ఫిజికల్లీ చాలెంజ్డ్ అయ్యాడు. అప్పటికే ఇంగ్లండ్‌లో ఎంఎస్ చేసి వచ్చిన గిరి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అన్నకు అలా జరగడంతో ఇంటికి వచ్చేశాడు. అలా ఇద్దరి సివిల్స్ లక్ష్యం నెరవేరలేదు’ అని భావోద్వేగంతో చెప్పారు. ఇక మనవరాలు (గిరి కుమార్తె) భాగ్యశ్రీ. ఇప్పుడు ప్రీస్కూల్ చదువుతోంది. ముద్రగడ దంపతులకు ఈ చిన్నారి అంటే ప్రాణం.
మామ చెప్పినట్లే...
‘మా మామగారు 1977 జూలైలో గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో బెడ్‌పై ఉండి ఆయన చెప్పిన చివరి మాటలే నా భర్త మనసులో చెరగని ముద్ర వేశాయి. వీలైనంత వరకూ తోటివారికి సాయం చేయాలనేది ఆయన ఆశయం. ఆ స్ఫూర్తితోనే పద్మనాభం గారు కూడా పనిచేస్తున్నారు. రాజకీయాల కోసం ఉద్యమాలు చేస్తున్నారని ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఆయన మనసు ఏమిటో నాకు తెలుసు’ అని చెప్పారు పద్మావతి.
తండ్రి వీరరాఘవరావు ఆకస్మిక మరణంతో 1977లో రాజకీయాల్లో అడుగుపెట్టిన పద్మనాభం 1978లో జనతాపార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1983లో ఆవిర్భవించిన టీడీపీకి అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 1985 ఉప ఎన్నికలోనూ విజయం సాధించారు. 1988లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 1989లో ఎమ్మెల్యే అయ్యారు. రవాణా, జౌళి శాఖలను మంత్రిగా పర్యవేక్షించినా, ఎక్సైజ్ మంత్రిగానే ఆ శాఖతో అనుబంధాన్ని పెనవేసుకున్నానని చెప్పారు ముద్రగడ పద్మనాభం. ‘ఏ పదవిలో ఉన్నా, తర్వాత కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజాసేవలో మాత్రం ఎప్పుడూ ముందుంటారు. మా మామగారు చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు’ అని పద్మావతి చెప్పారు.
ఉద్యమంలోనూ వెంటే
‘1997లో పద్మనాభం గారు కాపునాడు ఉద్యమం చేశారు. ఆయనతో పాటే నేనూ దీక్షకు దిగాను. రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ ఆయన నిరాహార దీక్షకు దిగారంటే అందులో న్యాయం ఉండే ఉంటుంది. అయినా ఆయన భోజనం చేయకుండా నేను ఎప్పుడూ చేయలేదు. అందులోనూ ఒక మంచి పని కోసం దీక్ష చేస్తున్నప్పుడు నా వంతు చేసే సహాయం తోడు ఉండటమే’ అని చెప్పారు పద్మావతి. రేపటి నుంచి స్వగ్రామం కిర్లంపూడిలో ముద్రగడ తలపెట్టిన నిరాహార దీక్షలోనూ పాల్గొనడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా దీక్షలో ఆయన వెంటే ఉంటానని చెప్పారు పద్మావతి.
మీ పాత దీక్ష అనుభవాలు?
గతంలో దీక్ష చేసినప్పుడూ మా ఆరోగ్యంపై ఎలాంటి భయం పెట్టుకోలేదు. నా భర్త వెంట నడవటమే నా ధర్మం. ఆయన మాటే నాకు శిరోధార్యం.
భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా?
అలాంటి ఆలోచనే లేదు.
ఆశయం కోసం పోరాటం
మీ భర్తపై ఇన్ని కేసులు పెట్టారు కదా? అందోళనగా లేదా?
ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.
ఆయనకు ఏమైనా అవుతుందన్న భయం ఉందా?
నా భర్తకు దీక్షకు దిగడం కొత్తకాదు. ఆయన ఒక ఆశయం కోసం పోరాడుతున్నారు. అలాంటప్పుడు భయపడాల్సిందేముంటుంది?
- అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, కాకినాడ
ఫొటోలు: గరగ ప్రసాద్