అనుమానపు మకిలి ఊడ్చిన ముత్యాల ముగ్గు | special story to old movie 'Mutyala Muggu' | Sakshi
Sakshi News home page

అనుమానపు మకిలి ఊడ్చిన ముత్యాల ముగ్గు

Published Fri, Sep 1 2017 12:04 AM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

అనుమానపు మకిలి ఊడ్చిన ముత్యాల ముగ్గు

అనుమానపు మకిలి ఊడ్చిన ముత్యాల ముగ్గు

ఇంటి ముందు కసువు చిమ్ముకోవాలి. శుభ్రంగా కళ్లాపి చల్లుకోవాలి. ముగ్గు పిండి తెచ్చుకోవాలి. ముంగాళ్ల మీద కూచుని చుక్కా చుక్కా చక్కగా దిద్దాలి. ఆనెక ఆ చుక్కలన్నింటినీ కలపాలి. ముగ్గును తీర్చిదిద్దాలి. రంగులద్దాలి. గొబ్బెమ్మల సిగన పూలు పెట్టి ముచ్చటను తీసుకు రావాలి. తెలుగు లోగిళ్ల ముందు ఇల్లాలి ఓపికతో అలా ముగ్గులు కళకళలాడుతాయి. మంగళప్రదమైన భావ తరంగాలను తీసుకు వస్తాయి. తెలుగు ఇల్లాలే కాదు ఏ భారతీయ ఇల్లాలైనా ఇంతే ఓపికతో తన ఇంటిని తీర్చిదిద్దుకుంటుంది. కాపురాన్ని చక్కబెట్టుకుంటుంది.

‘ముత్యాలముగ్గు’ సినిమాలో కూడా సంగీత తాను కోడలిగా వచ్చిన ప్యాలెస్‌ ముందు ఇలాగే అందమైన ముగ్గులు వేసింది.రంగవల్లులను తీర్చిదిద్దింది. ‘ముల్తైదు కుంకుమ బతుకంత ఛాయ’ అని తులసి కోట ముందు నించుని తన నుదుటున కుంకుమను సరిదిద్దుకుంది. పేద పిల్ల. అయితేనేం? గుణం ఉన్న పిల్ల. కళ ఉన్న పిల్ల. జీవితంలోకి కాంతిని తెచ్చే పిల్ల. అందుకే భర్త శ్రీధర్‌కి సంగీత అంటే ప్రాణం, ప్రేమ. ఏదో పల్లెటూళ్లో సంగీత పెళ్లికి మాటవరుసకు వెళ్లి, ఆ పెళ్లి చెడిపోతే, తానే మాంగల్యం కట్టి ప్యాలెస్‌కు తీసుకుని వచ్చాడు. అతడు అంత గొప్ప సంస్కారి.

ఆమె అంతకుమించిన సహనశీలి. కాని ఇది కొంతమందికి నచ్చలేదు. ప్యాలెస్‌లో పని చేసే మేనేజర్‌ అల్లు రామలింగయ్యకు నచ్చలేదు. ప్యాలెస్‌లోనే ఉంటూ శ్రీధర్‌ను తన కూతురికిచ్చి కట్టబెట్టి ప్యాలెస్‌ను ఆక్రమించుకుందాం అని ఎదురు చూస్తున్న మేనమామ ముక్కామలకు నచ్చలేదు. కొంపలు కూల్చడమే వృత్తిగా పెట్టుకొని ఏ కొంప దొరుకుతుందా ఎప్పుడు కూలుద్దామా అని వేచి ఉండే రావు గోపాలరావుకూ నచ్చలేదు. ఈ ముగ్గురూ చేతులు కలిపారు. ప్యాలెస్‌ ముంగిలిలో సంగీత తీర్చిదిద్దుకున్న ముగ్గులను ఎద్దుల్లా తొక్కారు.
ఆమె కాపురాన్ని కూల్చితే, ఆమెను ఇంటి నుంచి  తరిమేయడం వల్ల తన కూతురిని శ్రీధర్‌ రెండో పెళ్లి చేసుకోగలిగితే అంతే చాలు అనుకున్న ముక్కామల లక్ష రూపాయల కాంట్రాక్ట్‌ను రావు గోపాలరావుకు ఇస్తాడు. తోడుగా అల్లు రామలింగయ్యను భాగస్వామిని చేసుకుంటాడు.

రావు గోపాలరావు సంగీత మీద శ్రీధర్‌కు అనుమానం వచ్చేలా చేయగలుగుతాడు.తన నమ్మినబంటూ, పెళ్లిళ్లు చేసుకుని పారిపోయే నిత్య పెళ్లికొడుకూ అయిన నూతన ప్రసాద్‌ చేత సంగీతకు పదే పదే  ఫోన్లు చేయిస్తాడు. ‘నీ భర్త ఉన్నాడా?’ అని అడిగి కట్‌ చేయిస్తూ ఉంటాడు. ఆమెకు ఏమీ అర్థం కాదు. శ్రీధర్‌కు అనుమానం వస్తుంది. ఆ అనుమానాన్ని రూఢీ చేసుకోవడానికి ఢిల్లీ వెళుతున్నానని అబద్ధం చెప్పి ఆ రాత్రి ఇంటికి చేరుకుంటాడు. ఆ సంగతి ముందే తెలిసిన రావు గోపాలరావు బృందం సంగీత గదిలో నూతన్‌ ప్రసాద్‌ను రహస్యంగా ప్రవేశపెడుతుంది. శ్రీధర్‌ తలుపు తట్టే సమయానికి ఒంటి మీద సగం బట్టలతో నూతన్‌ ప్రసాద్‌ తలుపులు తెరిచి పారిపోతాడు. నిద్రలో ఉన్న సంగీత ఏం జరిగిందో అర్థంగాక శిలలా బిగుసుకుపోతుంది. ఇంకేముంది? ఆమె కాపురం బుగ్గిపాలైంది. ఆ ప్యాలెస్‌ ముందు ముగ్గు శాశ్వతంగా పాడుబడింది. అప్పటికే ఆమె గర్భవతి.

కాని శ్రీధర్‌ పుట్టింటికి పంపించేస్తాడు. అక్కడికి వెళ్లడానికి ముఖం చెల్లక ఆమె ఏటి వొడ్డున తెలిసిన వారి దగ్గర ఆశ్రయం పొందుతుంది. అక్కడే  కవలల్ని ప్రసవిస్తుంది. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ ఎదురు చూపులు చూస్తుంది. సత్యానికి ఒక లక్షణం ఉంది. దానిని ఏడు సముద్రాల అవతల పారేసినా బతికి బట్టగట్టి తాను బయల్పెట్టాల్సిన సంగతిని బయల్పెడుతుంది. అలా నిజం రావు గోపాలరావు నోటి ద్వారానే  బయట పడుతుంది. అనుమానించిన భర్త కంట పశ్చాత్తాపంతో కన్నీటి వరద పొంగుతుంది. ఆమె కాళ్ల మీద పడలేక దగ్గరకు తీసుకుని వెక్కివెక్కి ఏడుస్తాడు. మరి జన్మలో ఎడబాటుకు వీలు లేనంత గాఢంగా హత్తుకుంటాడు. కథ ముగుస్తుంది. ప్యాలెస్‌ ముందు ఈసారి ‘పరస్పర నమ్మకం’ అనే ముగ్గు రూపం తీసుకుంది. ఆ ముగ్గు చెదరదు. ఆ కాపురం మరి శాశ్వతం.

1975లో విడుదలైన ‘ముత్యాల ముగ్గు తెలుగు  సినిమాల్లో క్లాసిక్‌గా నిలిచింది. దర్శకుడు బాపు,  రచయిత ముళ్లపూడి వెంకట రమణకు ఎనలేని పేరు తెచ్చింది. నటుడు రావు గోపాలరావు ఈ సినిమాతో దాదాపు 30 ఏళ్ల కెరీర్‌కు తిరుగులేని పునాది వేసుకున్నారు. మంచి సంగీతం, మంచి సాహిత్యం, మంచి దృశ్యం కలిస్తే ఒక మంచి సినిమా అవుతుందని‘ముత్యాల ముగ్గు’ నిరూపించింది. స్త్రీని అనుమానించడం రామాయణ కాలం నుంచి ఉంది. నిర్థారణలు లేకుండా ఆమెను కారడవులకు సాగనంపడం ఈ నేటికీ సమాజంలో కొనసాగుతూనే ఉంది.  అనుమానించడం మగవాడి వంతు. శిక్ష వేయడం అతడి అధికారం. కాని అనుమానించిన రాముడే మచ్చను మిగుల్చుకున్నాడు తప్ప సీత కాదు. ముత్యాల ముగ్గులో భర్త మూర్ఖుడుగా మిగిలాడు తప్ప భార్య కాదు. నాటి నుంచి నేటి వరకు ఈ శీలం చుట్టూ సాగే ఉద్వేగాలను పట్టుకోవడం వల్లే ‘ముత్యాల ముగ్గు’ విజయం సాధించింది. ‘లవ కుశ’ స్ఫూర్తితో తయారైన ఈ సినిమా ఆ లవ కుశ మల్లేనే పెద్ద విజయం సాధించింది.

‘ఎక్స్‌ ఫ్యాక్టర్‌’ అంటూ ఉంటారు. ఆ రోజుల్లో ఈ సినిమాలో అలాంటి ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్స్‌ చాలా ఉన్నాయి. లైట్లు వాడకుండా శాటిన్‌ క్లాత్‌తో ఔట్‌ డోర్‌ సన్నివేశాలను అందంగా తీసిన ఇషాన్‌ అర్యా ఫొటోగ్రఫీ ఒక ఫ్యాక్టర్‌. అంత వరకు లౌడ్‌ విలనీకి అలవాటు పడ్డ జనానికి రావు గోపాలరావు చూపిన సాఫ్ట్‌ విలనీ ఒక ఫ్యాక్టర్‌. కుత్తుకలు కోసే వాడు కూడా మామూలు మనిషిలానే ఉంటాడని అతడికీ కళాపోషణ ఉంటుందని అతడూ తన కూతురిని ప్రాణం కంటే మిన్నగా పోషిస్తాడని ఈ సినిమా చూపించి ప్రేక్షకులను షాక్‌ చేసింది. ‘అలో అలో అలో’... ‘ఆకాశంలో ఏదో మర్డర్‌ జరిగినట్టు లేదూ’... ‘సిఫార్సులతో కాపురాలు చక్కబడవు’ వంటి గొప్ప డైలాగులు రాసిన ముళ్లపూడి వెంకట రమణ రచన ఒక ఫ్యాక్టర్‌. ఇక ప్రతి దృశ్యాన్ని ఒక పెయింటింగ్‌లా చూపించిన బాపు దర్శకత్వం మరో ఫ్యాక్టర్‌. ఈ సినిమాలో మనుషులతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఒక పాత్ర పోషిస్తాడు. సీతమ్మనురాముడితో కలిపిన హనుమంతుడు ఈ సినిమాలో పిల్లల ఊహలలో ఆలంబనగా నిలిచి వారికే కాదు ప్రేక్షకులకు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. ఆయనకు ప్రతీకగా ఒక కోతి పిల్లల భుజాల మీద ఎప్పుడూ ఉంటుంది.

అదే  సినిమాలో అల్లు రామలింగయ్యను శిక్షిస్తుంది. రాముడి నగలను కాజేయ బోయిన అల్లు రామలింగయ్య మీద కోతి దాడి చేస్తుంది. అప్పటి నుంచి అతడికి అందరూ కోతుల్లాగా కనిపించే మానసిక జాడ్యం వస్తుంది. ఆ  సన్నివేశాన్ని అద్భుతంగా చేసిన అల్లు రామలింగయ్య చప్పట్లు కొట్టించుకుంటారు. అలాగే కనిపించేది కొన్ని క్షణాలే అయినా ‘కాలుకెంత చేయికెంత కాలేజీ సీటుకెంత కన్సెసన్‌ ఏమైనా ఉందా?’ అంటూ చిటికెలు వస్తూ మాడ కూడా అందరికీ గుర్తుండిపోతాడు. అన్నట్టు ఈ సినిమాను ఎన్‌.టి.రామారావు చూసి సంగీత, శ్రీధర్‌ల మొదటి రాత్రి సన్నివేశాలను ప్రస్తావిస్తూ ‘మా పెళ్లిరోజులు గుర్తొచ్చాయి బ్రదర్‌’ అని ముళ్లపూడితో అన్నారట.‘ముత్యాల ముగ్గు’లాంటి సినిమాలు పదే పదే సంభవించవు. సంభవించినవి కలకాలం నిలుచుండిపోతాయి. ఇన్నాళ్ల తర్వాత ముత్యాల ముగ్గు గురించి మనం మాట్లాడుకుంటున్నది అందుకే. ఆ ముగ్గును మన జ్ఞాపకాలలో రీబ్రష్‌ చేసుకుంటున్నదీ అందుకే. అది వెలుగు. అది ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ.


నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...
‘ముత్యాల ముగ్గు’లో పాటలన్నీ పడవెక్కి ప్రయాణిస్తాయి. చులాగ్గా సాగిపోతూ ప్రేక్షకులకు ఆహ్లాదం పంచుతాయి. ఆరుద్ర రాసిన ‘ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు’ రామకృష్ణ గొంతులో ఎంతో అందంగా ఉంటుంది. ఆయనే రాసిన ‘ముత్యమంతా పసుపు’ పాటను ఇంటింట్లో ప్రతి ఇల్లాలు పాడుకుంది.  సి.నారాయణ రెడ్డి తెలంగాణ జానపదం నుంచి స్వీరించి రాసిన ‘గోగులు పూచె గోగులు పూచె ఓ లచ్చ గుమ్మాడి’ పాట కొత్త దంపతుల ముచ్చట్ల మీద చిత్రీకరణ జరుపుకొని మనోహరంగా ఉంటుంది. ఇక హలం మీద తీసిన ‘ఎంతటి రసికుడవో తెలిసెరా’ అచ్చ తెనుగు శృంగారాన్ని పంచింది. ముత్యాల ముగ్గులో కనిపించే ప్యాలెస్‌ తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మ సతీమణి ‘రాణి ఇందిరా ధన్‌రాజ్‌ గిరి’ది.

గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప కవి అయినా సినిమాలకు పాటలు రాయరు. కాని ముత్యాల ముగ్గు కోసం మొదటి, చివరి పాట రాశారు. అదే అద్భుతమైన  ‘నిదురించే తోట లోకి పాట ఒకటి వచ్చింది’. అందులో తరలి వెళ్లిపోయిన భర్తను నావతో పోల్చి ‘రేవు బావురుమంటున్నదని నావకు చెప్పండి’ అని కథానాయిక చేత అనిపించడం శేషేంద్రశర్మ కవితాగాఢతకు నిదర్శనం. అన్నట్టు ఈ సినిమాలో మంగళంపల్లి పాడిన ‘శ్రీరామ జయరామ సీతారామ’ పాట ఉంది.
– కె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement