దివంగత నటుడు రావు గోపాలరావు సతీమణి కమలకుమారి (73) శనివారం తుది శ్వాస విడిచారు. కమలకుమారి హరికథ కళాకారిణి. ఆంధ్రపదేశ్, కర్ణాటకల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన ఘనత ఆమెది. దూరదర్శన్‌లో చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మంచి పేరు సంపాదించుకున్నారామె. స్వతహాగా పురాణాలను ఇష్టపడని రావు గోపాలరావు ఓ సందర్భంలో కమలకుమారి చెప్పిన హరికథ విని, తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
ఆమె హరికథ చెప్పే తీరుకి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ తర్వాత స్నేహితులు కొందరు ‘మీ ఇద్దరూ చక్కని ప్రతిభావంతులు. ఎందుకు పెళ్లి చేసుకోకూడదు’ అంటే... అప్పటికే ఒకరి పట్ల మరొకరికి మంచి అభిప్రాయం ఉండటంతో వివాహం చేసుకున్నారు. భార్యను ఏనాడూ ఏకవచనంతో పిలవలేదాయన. ‘కుమార్జీ’ అని పిలిచేవారట. ఈ విషయాన్ని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలకుమారి తెలిపారు. భర్త మరణం తర్వాత తనలో సగభాగం చచ్చుబడినట్లయిందని కూడా ఆమె పేర్కొన్నారు.
ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారిలో పెద్ద కుమారుడు రావు రమేశ్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రావు రమేశ్ మంచి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలకుమారి హైదరాబాదులోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకుని నటుడు చిరంజీవి స్వయంగా వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంకా పలువురు సినీ రంగ ప్రముఖులు కమలకుమారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment