రావు రమేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు.
సినిమాల్లోకి వద్దన్నారు
మాది విశాఖ. మా నాన్నగారు టీచర్. మా తాతయ్య గారు హెడ్ మాస్టారుగా రిటైర్ అయ్యారు. సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు నో అన్నారు. వన్ ఇయర్ ట్రై చేస్తా. అవకాశాలు రాకపోతే మీరు చెప్పినట్టు ఉద్యోగం చేస్తా అని చెప్తే సరే అన్నారు. ఏడాదిలోపే 'మజిలీ' చేసే ఛాన్స్ వచ్చింది. అది విడుదల అయ్యే టైంకి మరో రెండు నెలల్లో 'జోహార్' చిత్రీకరణకు వారణాసి వెళ్లాలని కబురు వచ్చింది. నాగశౌర్య గారి 'అశ్వత్థామ'లో నటించాను. రైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశా.
అల్లు అర్జున్ మా అన్నయ్య
ఆ తర్వాత 'తిమ్మరుసు', 'శ్యామ్ సింగ రాయ్', 'సత్యభామ', రీసెంట్ 'ఆయ్'తో పాటు ఇంకొన్ని సినిమాల్లో నటించాను. కాలేజీలో ఉండగా అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్ చూసి బన్నీ గారు స్వయంగా నన్ను ఎంపిక చేశారు. మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీలో నా క్యారెక్టర్ ఏంటంటే.. 'నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య' అనుకునే టైపు.
అల్లు ఫ్యామిలీకి, నాకు కనెక్షన్ ఉందేమో
ఈ మూవీ ట్రైలర్ చూసి అల్లు అరవింద్.. 'ఏవయ్యా... నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నావ్ అంట. తెలిసింది' అని సరదాగా అన్నారు. అల్లు ఫ్యామిలీకి, నాకు ఏదో కనెక్షన్ ఉందేమో! అల్లు అర్జున్ గారితో 'ఓఎల్ఎక్స్' యాడ్ చేశా. అల్లు అరవింద్ గారి బ్యానర్ లో 'ఆయ్' చేశా. ఈ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా. 'ఆయ్' మంచి విజయం సాధించింది. అది 'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment