తెలుగు సినిమాల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్. ఇతడిని హీరోగా పెట్టి తీసిన సినిమా 'మారుతీనగర్ సుబ్రమణ్యం'. నార్మల్‌గా అయితే ఇదో చిన్న సినిమా. కానీ సుకుమార్ భార్య నిర్మాతల్లో ఒకరు కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రావడం కాస్తంత బజ్ క్రియేట్ అయింది. తాజాగా (ఆగస్టు 23) ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండిపోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య). అప్పులతో సంసారం చేస్తున్న సుబ్రమణ్యం అకౌంట్‍లో రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? చివరకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? అనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
సినిమాలో ఎంటర్‌టైన్ ఉంటే చాలు. స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నారా? ఐటమ్ సాంగ్ ఉందా లాంటి విషయాల్ని ప్రేక్షకుల్ని పట్టించుకోరు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్‌ని హీరోగా పెట్టి తీసిన సినిమా ఇది. అప్పుడెప్పుడో 1998లో టీచర్ల ఉద్యోగానికి కోర్ట్ స్టే ఇవ్వడం, మన అకౌంట్‌లో అనుకోకుండా డబ్బులు వచ్చి పడటం.. ఇలా మనకి తెలిసిన వార్తల‍్ని కాన్సెప్ట్‌గా తీసుకుని తీసిన మూవీ 'మారుతీనగర్ సుబ్రమణ్యం'.
మొదలుపెట్టడమే మారుతీనగర్ అనే ప్రాంతంలో ఉండే సుబ్రమణ్యం అసలు ఎలాంటి వాడు? అతడు కుటుంబ పరిస్థితి ఏంటి అనేది క్లియర్‌గా చెప్పి సినిమా మొదలుపెట్టారు. ఓవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు అన్నట్లు పేర్చుకుంటూ వెళ్లిపోయారు. సిచ్యుయేషనల్ కామెడీతో రాసుకున్న సన్నివేశాలు చాలావరకు వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కొన్నిచోట్ల ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదు
ఫ్యామిలీ డ్రామా తీసుకుని అసలు రూ.10 లక్షలు.. సుబ్రమణ్యం అకౌంట్‌లోకి ఎవరు వేశారు అనే చిన్న పాయింట్‌తో సినిమాని చివరి వరకు నడపడం బాగుంది. రావు రమేశ్‌కి కూడా సగటు తెలుగు హీరోల్లానే స్లో మోషన్ షాట్స్, డ్యాన్స్‌లు పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ ఇందులో సుబ్రమణ్యం కొడుకు అర్జున్ ప్రేమించే కాంచన అనే అమ్మాయి సీన్లు అయితే మరీ సినిమాటిక్‌గా, లాజిక్‌కి దూరంగా అనిపిస్తాయి. మెగా ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్, చిరంజీవి రిఫరెన్సులు కూడా సినిమాలో పెట్టారు. కాకపోతే అవి కుదిరేశాయి.
తల్లిదండ్రుల ముందే రిలేషన్‌షిప్, బ్రేకప్ లాంటివి కాంచన పాత్ర చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటుంది. దీనికి ఆమె తల్లిదండ్రులు పెద్దగా షాక్ అవ్వకుండా అదేదో తమకు చాలా అలవాటు ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు. రియల్ లైఫ్ ఇలా ఎవరు ఉంటార్రా బాబు అనిపిస్తుంది. అయితే ఇదంతా యూత్ కోసం రాసుకున్న సీన్లలా అనిపిస్తాయి. అలానే సినిమాలో లక్షల డబ్బుని చాలా సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంటారు. ఇదంతా కాస్త లాజిక్‌కి దూరంగా అనిపిస్తుంది. ఇలా కొన్ని పొరపాట్లు తప్పితే సినిమా ఓవరాల్‌గా సరదాగా నవ్వుకోవడానికి బాగుంది.
ఎవరెలా చేశారు?
రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఒదిగిపోయాడు. ఇతడి కొడుకుగా చేసిన అంకిత్.. బాగానే చేశాడు. మొన్నే 'ఆయ్'తో, ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటి.. గ్లామర్‌గా కనిపించడం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. ఇంద్రజ కూడా స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు ఓకే.
టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమా చాలా రిచ్‌గా తీశారు. సినిమాటోగ్రఫీ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. పాటలు వినడానికి ప్లస్ చూడటానికి కూడా బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ లక్ష‍్మణ్ కార్య.. సింపుల్ స్టోరీ లైన్ తీసుకుని, దానికి తనదైన హాస్యం జోడించి ఎంటర్‌టైన్ చేశాడు. గతంలో 'హ్యాపీ వెడ్డింగ్' మూవీతో ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్నాడు. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. ఫైట్స్ లాంటివి లేకుండా మనసారా కాసేపు నవ్వుకుందామనుకుంటే 'మారుతీనగర్ సుబ్రమణ్యం' మంచి ఆప్షన్.
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment