Rao Gopala Rao
-
ఓవైపు విలనిజం.. మరోవైపు హాస్యం.. వీళ్ల స్టైలే సెపరేటు
చాలా సినిమాల్లో శాడిస్ట్ విలన్లను చూశాం. భీభత్సానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే విలన్లను కూడా అనేక మూవీస్‌లో చూశాం. చాలా సినిమాల్లో కాకపోయినాకొన్ని చిత్రాల్లో ఇంటిలిజెంట్ విలన్లను చూశాం. కానీ అతి భయంకరమైన విలనీజాన్ని ప్రదర్శిస్తూ, అదే సమయంలో నవ్వించే విలన్లను చూశారా మీరు ? ఆ క్యారెక్టర్ మీద ప్రేక్షకుల్లో భయం పోకుండా చూసు కుంటూ మళ్లీ అదే ప్రేక్షకులను నవ్వించాలి. ఇది చాలా క్లిష్టమైన టాస్క్. సిల్వర్ స్క్రీన్ మీద ఈ టాస్క్‌ని వండర్స్‌లా పండించిన వాళ్లపై ఒక లుక్ వేద్దామా… ►సినిమాలో హీరో ఎంత కామనో విలన్ కూడా అంతే కామన్. విలన్ క్యారెక్టర్ ఎంత భయంకరంగా, బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత స్ట్రాంగ్‌గా ఎలివేట్ అవుతుంది. అలా కాకుండావిలన్ కామెడీ చేస్తే ఏమౌతుంది ? అది కామెడీ సినిమా అవుతుంది. కానీఒకే సినిమాలో ఒకే క్యారెక్టర్‌తో ఇటు విలనీజాన్ని, అటు కామెడీని పండిస్తూ మూవీలోని సీరియస్‌నెస్‌ని దెబ్బ తీయకుండా నటించడం సాధారణ విషయం కాదు. అలాంటి ఛాలెంజ్‌ని తమ అసాధారణ నటనతో అధిగమించిన కొద్ది మంది నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు. శత్రువు సినిమాలో వెంకటరత్నం పాత్రలో కోటా శ్రీనివాసరావు జీవించారు. వెంకటరత్నం అత్యంత దుర్మార్గుడు. తన అక్రమాలకు ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాడు. అలాంటి పాత్రకే కామెడీ టచ్ ఇచ్చారు దర్శకుడు కోడి రామకృష్ణ.సినిమా అంతా ఇలాంటి మేనరిజంతోనే కామెడీ టచ్‌తోనే వెంకటరత్నం క్యారెక్టర్ సాగుతుంది. కానీ విలన్ తాలుకూ దుర్మార్గాలకు ఆ కామెడీ అంటకుండా కోటా అద్భుతంగా నటించారు.కొంచెం నవ్వించగానే కామెడీ విలన్ అన్న భావన వస్తుంది. కానీ నవ్వించే చోట నవ్విస్తూ అదే సమయంలో అత్యంత దుర్మార్గుడుగా విలనీజం పండిస్తూ అద్భుతంగా నటించారు కోటా. ►తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలన్ క్యారెక్టర్లలో ఒకటి ముత్యాల ముగ్గు చిత్రంలో కొంపలు కూల్చే కాంట్రాక్టర్. ఈ పాత్రలో రావుగోపాలరావు జీవించేశారు. సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో రావుగోపాలరావు క్యారెక్టర్ కూడా ఆ స్థాయిలో సక్సెస్ అయింది. హత్యలు చేయడం దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి వారిని విడదీయడం దాకా దగుల్బాజీ పనులను కాంట్రాక్ట్ పద్దతిలో చేసే కాంట్రాక్టర్ పాత్ర రావుగోపాలరావుది. సినినమా మొత్తంలోనూ అత్యంత క్రూరమైన పనులను చాలా సౌమ్యంగా చేస్తుంది కాంట్రాక్టర్ పాత్ర. మడిసన్నాక కాస్తంత కళాపోసనుండాలయ్యా…ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటుంది అంటూ గోదావరి యాసలో రావుగోపాలరావు చెప్పిన డైలాగ్స్ ఒక రేంజ్లో పేలాయి. ఈ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్స్‌తో విడుదలైన ఎల్.పి.రికార్డులు, ఆడియో క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. ఇంతగా అలరించిన అదే క్యారెక్టర్లో విలన్‌గా ప్రేక్షకులను భయ పెట్టారు రావుగోపాలరావు. ఒకే పాత్రలో రెండు షేడ్స్‌ని అద్భుతంగా ప్రదర్శించారు. విలన్ కూడా మనిషే. అతనికి సెంటిమెంట్లు ఉంటాయి. అతనికి బాధ వేస్తుంది. భయం వేస్తుంది. ఇంత వరకు ఓకే. కానీ…విలన్ పదే పదే నవ్వేసి, ప్రేక్షకులను నవ్వించాడు అంటే…ఆ విలనిజం తాలుకూ భయం పోతుంది. విలన్ అనగానే సహజంగా ఆడియన్స్‌లో కలిగే గగుర్పాటు మాయమవుతుంది. అది మిస్ కానివ్వకుండా తన పాత్రని కాసేపు కామెడీ ట్రాక్ మీద, కాసేపు కుతంత్రాల ట్రాక్ మీద నడిపించడం నటుడుకి నిజంగా ఛాలెంజే. ►తెలుగు ప్రేక్షకులకు విలనిజాన్ని కొత్త కోణంలో పరిచయం చేసిన నటుల్లో పరేష్ రావెల్ ఒకరు. క్షణక్షణం చిత్రంలో నాయర్ క్యారెక్టర్ దశాబ్దాలు గడిచినా ప్రేక్షకులకు గుర్తిండిపోయింది. అత్యంత దుర్మారుడుగా ఒక వైపు కనిపిస్తూనే అదే సమయంలో ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్వించాడు రావెల్. ఆ పాత్రని రాంగోపాల్ వర్మ డిజైన్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. డెన్లు గట్రా లేకుండా… చిన్న మఫ్లర్ కట్టుకొని కామన్ మ్యాన్ లా కనిపిస్తూనే అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుంది నాయర్ క్యారెక్టర్. ►ఒకవైపు సీరియస్ విలన్‌గా ఎక్స్‌ఫోజ్ అవుతూ…తన మీద ఉన్న క్రూయల్ ఫీల్ అలానే మెయిన్‌టెన్ అయ్యేలా చూసుకుంటూ అదే సమయంలో కామెడీ చేయడం చాలా కష్టం. దాన్ని చాలా ఈజీగా చేసేశాడు పరేష్ రావెల్. దొంగలకు కూడా వెర్రి డౌట్స్ ఉంటాయని ,రౌడీలలో కూడా క్యూరియాసిటీ ఉంటుందని నాయర్ క్యారెక్టర్‌తో చెప్పాడు డైరెక్టర్. పాములు పగ పడతాయంటావా? అడవిలో ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టుంటారు లాంటి నార్మల్ డౌట్స్‌తో మొదలు పెడితే…చాలా రకాలుగా నవ్వించాడు పరేష్ రావెల్. ►భయంకరమైన విలన్‌గా, కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్‌గా ప్రేక్షకులను జయప్రకాష్ రెడ్డి ఏ రేంజ్లో భయపెడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలానే…పక్కా కమెడియన్‌గా కూడా చాలా సిని మాల్లో మెప్పించారు. అయితే…ఒకే సినిమాలో ఇటు సీరియస్ విలన్‌గా, మరి కాసేపు కామెడీ టచ్‌తో వావ్ అనిపించింది కృష్ణ మూవీలో కృష్ణ సినిమాలో ప్రధాన విలన్ బాబాయ్, అతను చేసే ప్రతి దుర్మార్గంలోనూ పాలు పంచు కునే క్యారెక్టర్ జయప్రకాష్ రెడ్డిది. మెయిన్ విలన్ జగ్గా చేసే ప్రతి పాపపు పనికి స్కెచ్ గీసే పాత్రలో కూడా ఆయన హాస్యం పండించారు. రవితేజ, జయప్రకాష్ రెడ్డి…ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి కాంబినేషన్లలో వచ్చే సీన్లు ఒక రేంజ్లో పేలాయి. -
‘అహా నా పెళ్ళంట’ మూవీలో కోట పాత్రకు ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా!
రాజేంద్ర ప్రసాద్ తొలి కామెడీ చిత్రం ఆహా నా పెళ్లంట. ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా 1987 వచ్చిన ఈ మూవీకి జంధ్యాల దర్శకత్వం వహించారు. తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ట్రెండ్‌కు రెడ్ కార్పెట్ పరిచిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా అన్నివర్గాల ప్రేక్షకుల అలరించాడు. అంతేగకా హాస్య బ్రహ్మ బ్రహ్మనందంను నటుడిగా పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే. ఇందులో బ్రహ్మి నత్తివాడిగా.. అరగుండు పాత్రలో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ మూవీలో ఇప్పటికి ప్రత్యేకంగా గుర్తు చేసుకునే పాత్ర పిసినారి లక్ష్మీపతి. ఈ పాత్రలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒదిగిపోయారు. చెప్పాలంటే ఆహా నా పెళ్లంట మూవీ గుర్తు వస్తే చాలు ముందుగా గుర్తోచ్చే పాత్ర కోట శ్రీనివాస్‌దే. ఇంటి దూలానికి బతికి ఉన్న కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ చికెన్ కూరతో అన్నం తింటున్నట్టుగా ఆస్వాధించిన సన్నివేశం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇక చూట్టాలు ఇంటికి వస్తే ఇలా చేయాలంటూ ఆ సన్నివేశాన్నే ఉదహరణగా తీసుకుంటూ చమత్కరిస్తుంటారు. అంతేగాక బట్టలను పొదుపు చేసేందుకు పేపర్ చుట్టుకుని పడుకోవడం ఇలా ఎన్నో సీన్లలో పిసినారి లక్ష్మిపతిగా కోట తన నటనతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ఇప్పటికీ ఆ సీన్లు గుర్తోస్తే నవ్వని వారుండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ పాత్రను తాను తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా కోట పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఒదిగిపోయాడు. అంతలా ఆ పాత్రను పండించిన కోట శ్రీనివాస్‌ను మొదట తీసుకునేందుకు నిర్మాత రామానాయుడు ఒప్పుకొలేదట. ఈ విషయాన్ని స్వయంగా కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. ఎందుకంటే ఈ మూవీకి పిసినారి లక్ష్మిపతి పాత్రే కీలకం. అది పండితేనే ఈ సినిమా హిట్ లేదంటే పరాజయం చూడాల్సిందే. అంతటి ఈ ప్రధాన పాత్రకు కోట శ్రీనివాస రావును తీసుకోవాలని డైరెక్టర్ జంధ్యాల రామానాయుడికి సూచించాడట. అయితే ఈ పాత్ర కోటతో వద్దని ప్రముఖ నటుడు రావుగోపాలరావుతో చేయించాలని ఆయన అనుకున్నట్లు కోట వివరించాడు. అయితే జంధ్యాల మాత్రం ఆయనను తప్ప ఇంకేవరిని లక్ష్మీపతి పాత్రకు ఒప్పుకోలేదట. ఈ విషయంపై రామానాయుడు, జంధ్యాల దాదాపు 20 రోజుల పాటు వాదించుకున్నారని ఆయన అన్నాడు. అయితే కోట నటించిన మండలాధీశుడు చిత్రం విడుదల తర్వాత జంధ్యాల ఈ పాత్రకు కోటను ఫిక్స్ అయ్యారట, దీంతో ఆ మూవీలో పిసినారి పాత్రకు కోటను తప్ప ఇంకేవరిని తీసుకున్న పరాజయం తప్పదని తెల్చి చెప్పాడట. దీంతో రామానాయుడు చివరకు ఈ పాత్రకు కోట శ్రీనివాసరావును ఓకే చేశారట. కాగా ఒక రోజు చెన్నై వెళ్లడానికి కోట శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టుకు వెళ్తుండా అక్కడ ఆయనకు రామానాయుడు కనిపించారట. కోటను చూసిన ఆయన ఇక్కడకు రావయ్యా నీతో ఓ విషయం చెప్పాలని పిలిచాడట. జంధ్యాలతో ఓ సినిమా ప్లాన్ చేశా అని, అందులో లక్ష్మీపతి పాత్ర గురించి కోటకు చెప్పి. జంధ్యాలతో జరుగుతున్న వాదన గురించి కూడా వివరించాడట. వాదన ఎందుకండీ ఈ క్యారెక్టర్‌కు రావు గోపాలరావే న్యాయం చేస్తాడని ఆయన బదులిచ్చినట్లు తెలిపారు. కానీ రావుగోపాలరావుకు ఎంత మేకప్ వేసినా ఆయన ముఖంలో ప్యూర్‌నెస్ రాదని జంధ్యాల అంటున్నారని రామానాయుడు ఆయనతో అన్నారని, ఏం చెప్పాలో అర్థంకాక సందిగ్ధంలో ఉన్న కోటకు ఆ పాత్రను నువ్వే చేయాలని బంపర్ ఆఫర్ ఇచ్చేశాడట రామానాయుడు. -
‘ఏదో సామెత చెప్పినట్టు.. డిక్కీలో పడుకోబెట్టేస్తాను’
‘వేటగాడు’లో దివాన్జీ అయిన రావు గోపాలరావుకు విలువైన హారం కావాలి. దానిని మెడలో వేసుకొని మారువేషంలో ఎన్.టి.ఆర్ వస్తాడు. ‘మా గురువు కల్లు కొండయ్య గారు’ అని నగేష్ ఎన్.టి.ఆర్ గురించి బిల్డప్ ఇస్తాడు. ఎన్.టి.ఆర్ ఊరికే ఉంటాడా? ‘ఏరా కుయ్యా’ అని రావు గోపాలరావును తిడతాడు. తిడితే పర్వాలేదు. ‘ఏవన్నాను’ అని ఆయన్నే రిపీట్ చేయమంటాడు. అప్పుడు రావుగోపాలరావు ‘ఏదో కుయ్యా అని చిన్న సౌండ్ ఇచ్చారండీ’ అంటాడు. ప్రేక్షకులు ఎంత నవ్వుతారో. ఆ సినిమాలోనే రావు గోపాలరావు ప్రాసతో ప్రాణాలు తీస్తుంటాడు. కొడుకైన సత్యనారాయణ విసిగిపోయి గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస మాట్లాడతావో మాట్లాడు చూస్తాను అంటాడు. దానికి రావు గోపాలరావు చెప్పే డైలాగ్– ‘ఈస్టు స్టువర్టుపురం స్టేషనుమాస్టరు గారి ఫస్టు సన్ వెస్ట్‌కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిష్టరు టెస్టులో ఫస్టు క్లాసులో బెస్టుగా పాసయ్యాడని తన నెక్స్ట్ ఇంటాయాన్ని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెను రోస్టుతో బెస్టు బెస్టు అంటూ తినేసి హోస్టుకు కూడా మిగల్చకుండా ఒక్కముక్క కూడా వేస్టు చేయకుండా సుష్ఠుగా భోంచేసి పేస్టు పెట్టి పళ్లు తోముకుని మరీ రెస్టు తీసుకున్నాడట ఏ రొస్టు లేకుండా. చాలా, ఇంకా వదలమంటావా భాషా బరాటాలు మాటల తూటాలు యతిప్రాసల పరోటాలు..... ’ ఇంకెక్కడి సత్యనారాయణ. పాయే. రావు గోపాలరావు విలన్‌గా తెలుసు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు. కాని కామెడీని పండించే నటుడుగా వచ్చిన అవకాశాలను వదలుకోలేదటాయన. ‘ముత్యాల ముగ్గు’లో అంత సీరియస్ విలనే అయినా ‘డిక్కీలో పడుకోబెట్టేస్తానని’ ప్రేక్షకులు భయంభయంగానే అయినా నవ్వేలా చేశాడు. చిరంజీవి ‘మగ మహారాజు’లో రావు గోపాలరావు ఎప్పుడూ ఒక మరుగుజ్జు పిల్లాడిని చంకనేసుకొని దింపినప్పుడల్లా వాడు ఏడుస్తుంటే హైరానాపడుతూ తెగ నవ్విస్తాడు. ‘మా ఊళ్లో మహాశివుడు’ రావు గోపాలరావు ప్రతిభకు మచ్చుతునక. అందులో ఆయన శివుడుగా భూమ్మీదకు వచ్చి పూజారి అయిన సత్యనారాయణతో పాలిటిక్స్, కరప్షన్, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాల గురించి మాట్లాడుతూ నవ్విస్తాడు. శోభన్‌బాబు ‘దేవత’ సినిమాలో రావు గోపాలరావు జయప్రదకు వరుసకు బాబాయ్. కాని జయప్రదకు చెల్లెలు శ్రీదేవి పెళ్లి కానిదే తాను చేసుకోకూడదని ఉంటుంది. ఆ సంగతి తెలిసినా రావు గోపాలరావు శ్రీదేవితో జయప్రద పెళ్లి గురించి మాట్లాడుతుంటే సడన్‌గా జయప్రద వస్తుంది. ఆ సమయంలో కప్పిపుచ్చుకోవడానికి రావు గోపాలరావు చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. రావు గోపాలరావుతో జంధ్యాల ‘రావు గోపాలరావు’ సినిమా తీశాడు. అందులో ఆయనకు మతిమరుపు ప్రొఫెసర్ వేషం ఇచ్చాడు. కోడి రామకృష్ణ ‘తోడు దొంగలు’ సినిమాలో పూర్తి స్థాయి కామెడీ వేషం చేయించాడు. అందులో లాంచి గైడుగా రావు గోపాలరావు చాలా సందడి చేస్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్‌తో నటించిన ‘ఆఒక్కటీ అడక్కు’లో రొయ్యల నాయుడుగా కామెడీ పండిస్తాడాయన. చివరి రోజులలో ఆయన నాగార్జున ‘అల్లరి అల్లుడు’లో వాణిశ్రీ భర్తగా నటించారు. ‘ఏదో సామెత చెప్పినట్టు’ అనేది ఆయన ఊతపదం. ఆయన చెప్పే సామెతలు అసలు సామెతలేనా అని సందేహం వస్తుంటుంది. ‘ఇదెలా ఉందంటే చీర కట్టుకోవే చిలకమ్మా గుడికెళదాం అని గుండూరావంటే తొక్కతో సహా ఎప్పుడో తినేశాను అనందంట అనసూయమ్మ. అలా ఉంది వ్యవహారం’... ఇది ఆయన చెప్పే సామెత. 57 ఏళ్ల చిన్న వయసులోనే రావు గోపాల రావు మరణించారు. కాని ఆయన ఇదిగో ఇలాంటి పాత్రలతో ప్రేక్షకుల ముఖాలపై మందస్మితమై వెలుగుతుంటారు. -
రావు రమేశ్‌కు మాతృవియోగం
దివంగత నటుడు రావు గోపాలరావు సతీమణి కమలకుమారి (73) శనివారం తుది శ్వాస విడిచారు. కమలకుమారి హరికథ కళాకారిణి. ఆంధ్రపదేశ్, కర్ణాటకల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన ఘనత ఆమెది. దూరదర్శన్‌లో చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మంచి పేరు సంపాదించుకున్నారామె. స్వతహాగా పురాణాలను ఇష్టపడని రావు గోపాలరావు ఓ సందర్భంలో కమలకుమారి చెప్పిన హరికథ విని, తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఆమె హరికథ చెప్పే తీరుకి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ తర్వాత స్నేహితులు కొందరు ‘మీ ఇద్దరూ చక్కని ప్రతిభావంతులు. ఎందుకు పెళ్లి చేసుకోకూడదు’ అంటే... అప్పటికే ఒకరి పట్ల మరొకరికి మంచి అభిప్రాయం ఉండటంతో వివాహం చేసుకున్నారు. భార్యను ఏనాడూ ఏకవచనంతో పిలవలేదాయన. ‘కుమార్జీ’ అని పిలిచేవారట. ఈ విషయాన్ని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలకుమారి తెలిపారు. భర్త మరణం తర్వాత తనలో సగభాగం చచ్చుబడినట్లయిందని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారిలో పెద్ద కుమారుడు రావు రమేశ్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రావు రమేశ్ మంచి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలకుమారి హైదరాబాదులోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకుని నటుడు చిరంజీవి స్వయంగా వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంకా పలువురు సినీ రంగ ప్రముఖులు కమలకుమారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
నాన్న స్థాయికి ఎదగడమంటే సాహసమే!
శ్రీకాకుళం, అరసవల్లి: ‘తెలుగు సినీ చరిత్రలో నాన్న రావు గోపాలరావు అంటే ఓ చరిత్ర... ఓ నిఘంటువు. ఏదో కొన్ని సినిమాల్లో బాగా నటించి ఆడేస్తే...గొప్పోళ్లం కాదు..’అంటూ ప్రముఖ విలక్షణ నటుడు రావు రమేష్ కుమార్ తనదైన శైలిలో చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నాన్న రావు గోపాలరావు పేరు సినిమాతెర ఉన్నంత కాలం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొత్త సినిమాలన్నీ ఏప్రిల్‌లో ఖరారు అవుతాయని, కళామతల్లి సేవలో తనకు పాత్ర దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇటీవలే 100 సినిమాలు దాటాయని, అయినా నిత్య విద్యార్థిగానే ఇండస్ట్రీలో ఉంటానని తెలిపారు. తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదని, విభిన్న పాత్రలేవైనా చేస్తానని చెప్పారు. ఇటీవల దువ్వాడ జగన్నాధం (డిజె) సినిమాలో రొయ్యిల నాయుడు పాత్రను, గతంలో నాన్న రావు గోపాలరావు ‘ఆ ఒక్కటీ అడక్కు..’అనే సినిమాలో పోషించిన పాత్రను పోలినట్టు నటించే ప్రయత్నం చేశానని, ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. శ్రీకాకుళంలోనే పుట్టానని, తన తల్లి కుటుంబీకులంతా అరసవల్లిలోనే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చానని తెలిపారు. అనంతరం బ్రాహ్మణ వీధిలో ఉన్న మేనమామ కుమారుడు మండా శుకుడు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన్ను పరామర్శించారు. నీలమణిదుర్గ సేవలో.. పాతపట్నం: పాతపట్నంలో కొలువైన శ్రీనీలమణిదుర్గ అమ్మవారిని నటుడు రావు రమేష్ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను అందజేశారు. -
గోపాలరావుగారి అబ్బాయి
-
అనుమానపు మకిలి ఊడ్చిన ముత్యాల ముగ్గు
ఇంటి ముందు కసువు చిమ్ముకోవాలి. శుభ్రంగా కళ్లాపి చల్లుకోవాలి. ముగ్గు పిండి తెచ్చుకోవాలి. ముంగాళ్ల మీద కూచుని చుక్కా చుక్కా చక్కగా దిద్దాలి. ఆనెక ఆ చుక్కలన్నింటినీ కలపాలి. ముగ్గును తీర్చిదిద్దాలి. రంగులద్దాలి. గొబ్బెమ్మల సిగన పూలు పెట్టి ముచ్చటను తీసుకు రావాలి. తెలుగు లోగిళ్ల ముందు ఇల్లాలి ఓపికతో అలా ముగ్గులు కళకళలాడుతాయి. మంగళప్రదమైన భావ తరంగాలను తీసుకు వస్తాయి. తెలుగు ఇల్లాలే కాదు ఏ భారతీయ ఇల్లాలైనా ఇంతే ఓపికతో తన ఇంటిని తీర్చిదిద్దుకుంటుంది. కాపురాన్ని చక్కబెట్టుకుంటుంది. ‘ముత్యాలముగ్గు’ సినిమాలో కూడా సంగీత తాను కోడలిగా వచ్చిన ప్యాలెస్ ముందు ఇలాగే అందమైన ముగ్గులు వేసింది.రంగవల్లులను తీర్చిదిద్దింది. ‘ముల్తైదు కుంకుమ బతుకంత ఛాయ’ అని తులసి కోట ముందు నించుని తన నుదుటున కుంకుమను సరిదిద్దుకుంది. పేద పిల్ల. అయితేనేం? గుణం ఉన్న పిల్ల. కళ ఉన్న పిల్ల. జీవితంలోకి కాంతిని తెచ్చే పిల్ల. అందుకే భర్త శ్రీధర్‌కి సంగీత అంటే ప్రాణం, ప్రేమ. ఏదో పల్లెటూళ్లో సంగీత పెళ్లికి మాటవరుసకు వెళ్లి, ఆ పెళ్లి చెడిపోతే, తానే మాంగల్యం కట్టి ప్యాలెస్‌కు తీసుకుని వచ్చాడు. అతడు అంత గొప్ప సంస్కారి. ఆమె అంతకుమించిన సహనశీలి. కాని ఇది కొంతమందికి నచ్చలేదు. ప్యాలెస్‌లో పని చేసే మేనేజర్ అల్లు రామలింగయ్యకు నచ్చలేదు. ప్యాలెస్‌లోనే ఉంటూ శ్రీధర్‌ను తన కూతురికిచ్చి కట్టబెట్టి ప్యాలెస్‌ను ఆక్రమించుకుందాం అని ఎదురు చూస్తున్న మేనమామ ముక్కామలకు నచ్చలేదు. కొంపలు కూల్చడమే వృత్తిగా పెట్టుకొని ఏ కొంప దొరుకుతుందా ఎప్పుడు కూలుద్దామా అని వేచి ఉండే రావు గోపాలరావుకూ నచ్చలేదు. ఈ ముగ్గురూ చేతులు కలిపారు. ప్యాలెస్ ముంగిలిలో సంగీత తీర్చిదిద్దుకున్న ముగ్గులను ఎద్దుల్లా తొక్కారు. ఆమె కాపురాన్ని కూల్చితే, ఆమెను ఇంటి నుంచి తరిమేయడం వల్ల తన కూతురిని శ్రీధర్ రెండో పెళ్లి చేసుకోగలిగితే అంతే చాలు అనుకున్న ముక్కామల లక్ష రూపాయల కాంట్రాక్ట్‌ను రావు గోపాలరావుకు ఇస్తాడు. తోడుగా అల్లు రామలింగయ్యను భాగస్వామిని చేసుకుంటాడు. రావు గోపాలరావు సంగీత మీద శ్రీధర్‌కు అనుమానం వచ్చేలా చేయగలుగుతాడు.తన నమ్మినబంటూ, పెళ్లిళ్లు చేసుకుని పారిపోయే నిత్య పెళ్లికొడుకూ అయిన నూతన ప్రసాద్ చేత సంగీతకు పదే పదే ఫోన్లు చేయిస్తాడు. ‘నీ భర్త ఉన్నాడా?’ అని అడిగి కట్ చేయిస్తూ ఉంటాడు. ఆమెకు ఏమీ అర్థం కాదు. శ్రీధర్‌కు అనుమానం వస్తుంది. ఆ అనుమానాన్ని రూఢీ చేసుకోవడానికి ఢిల్లీ వెళుతున్నానని అబద్ధం చెప్పి ఆ రాత్రి ఇంటికి చేరుకుంటాడు. ఆ సంగతి ముందే తెలిసిన రావు గోపాలరావు బృందం సంగీత గదిలో నూతన్ ప్రసాద్‌ను రహస్యంగా ప్రవేశపెడుతుంది. శ్రీధర్ తలుపు తట్టే సమయానికి ఒంటి మీద సగం బట్టలతో నూతన్ ప్రసాద్ తలుపులు తెరిచి పారిపోతాడు. నిద్రలో ఉన్న సంగీత ఏం జరిగిందో అర్థంగాక శిలలా బిగుసుకుపోతుంది. ఇంకేముంది? ఆమె కాపురం బుగ్గిపాలైంది. ఆ ప్యాలెస్ ముందు ముగ్గు శాశ్వతంగా పాడుబడింది. అప్పటికే ఆమె గర్భవతి. కాని శ్రీధర్ పుట్టింటికి పంపించేస్తాడు. అక్కడికి వెళ్లడానికి ముఖం చెల్లక ఆమె ఏటి వొడ్డున తెలిసిన వారి దగ్గర ఆశ్రయం పొందుతుంది. అక్కడే కవలల్ని ప్రసవిస్తుంది. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ ఎదురు చూపులు చూస్తుంది. సత్యానికి ఒక లక్షణం ఉంది. దానిని ఏడు సముద్రాల అవతల పారేసినా బతికి బట్టగట్టి తాను బయల్పెట్టాల్సిన సంగతిని బయల్పెడుతుంది. అలా నిజం రావు గోపాలరావు నోటి ద్వారానే బయట పడుతుంది. అనుమానించిన భర్త కంట పశ్చాత్తాపంతో కన్నీటి వరద పొంగుతుంది. ఆమె కాళ్ల మీద పడలేక దగ్గరకు తీసుకుని వెక్కివెక్కి ఏడుస్తాడు. మరి జన్మలో ఎడబాటుకు వీలు లేనంత గాఢంగా హత్తుకుంటాడు. కథ ముగుస్తుంది. ప్యాలెస్ ముందు ఈసారి ‘పరస్పర నమ్మకం’ అనే ముగ్గు రూపం తీసుకుంది. ఆ ముగ్గు చెదరదు. ఆ కాపురం మరి శాశ్వతం. 1975లో విడుదలైన ‘ముత్యాల ముగ్గు తెలుగు సినిమాల్లో క్లాసిక్‌గా నిలిచింది. దర్శకుడు బాపు, రచయిత ముళ్లపూడి వెంకట రమణకు ఎనలేని పేరు తెచ్చింది. నటుడు రావు గోపాలరావు ఈ సినిమాతో దాదాపు 30 ఏళ్ల కెరీర్‌కు తిరుగులేని పునాది వేసుకున్నారు. మంచి సంగీతం, మంచి సాహిత్యం, మంచి దృశ్యం కలిస్తే ఒక మంచి సినిమా అవుతుందని‘ముత్యాల ముగ్గు’ నిరూపించింది. స్త్రీని అనుమానించడం రామాయణ కాలం నుంచి ఉంది. నిర్థారణలు లేకుండా ఆమెను కారడవులకు సాగనంపడం ఈ నేటికీ సమాజంలో కొనసాగుతూనే ఉంది. అనుమానించడం మగవాడి వంతు. శిక్ష వేయడం అతడి అధికారం. కాని అనుమానించిన రాముడే మచ్చను మిగుల్చుకున్నాడు తప్ప సీత కాదు. ముత్యాల ముగ్గులో భర్త మూర్ఖుడుగా మిగిలాడు తప్ప భార్య కాదు. నాటి నుంచి నేటి వరకు ఈ శీలం చుట్టూ సాగే ఉద్వేగాలను పట్టుకోవడం వల్లే ‘ముత్యాల ముగ్గు’ విజయం సాధించింది. ‘లవ కుశ’ స్ఫూర్తితో తయారైన ఈ సినిమా ఆ లవ కుశ మల్లేనే పెద్ద విజయం సాధించింది. ‘ఎక్స్ ఫ్యాక్టర్’ అంటూ ఉంటారు. ఆ రోజుల్లో ఈ సినిమాలో అలాంటి ‘ఎక్స్’ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. లైట్లు వాడకుండా శాటిన్ క్లాత్‌తో ఔట్ డోర్ సన్నివేశాలను అందంగా తీసిన ఇషాన్ అర్యా ఫొటోగ్రఫీ ఒక ఫ్యాక్టర్. అంత వరకు లౌడ్ విలనీకి అలవాటు పడ్డ జనానికి రావు గోపాలరావు చూపిన సాఫ్ట్ విలనీ ఒక ఫ్యాక్టర్. కుత్తుకలు కోసే వాడు కూడా మామూలు మనిషిలానే ఉంటాడని అతడికీ కళాపోషణ ఉంటుందని అతడూ తన కూతురిని ప్రాణం కంటే మిన్నగా పోషిస్తాడని ఈ సినిమా చూపించి ప్రేక్షకులను షాక్ చేసింది. ‘అలో అలో అలో’... ‘ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదూ’... ‘సిఫార్సులతో కాపురాలు చక్కబడవు’ వంటి గొప్ప డైలాగులు రాసిన ముళ్లపూడి వెంకట రమణ రచన ఒక ఫ్యాక్టర్. ఇక ప్రతి దృశ్యాన్ని ఒక పెయింటింగ్‌లా చూపించిన బాపు దర్శకత్వం మరో ఫ్యాక్టర్. ఈ సినిమాలో మనుషులతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఒక పాత్ర పోషిస్తాడు. సీతమ్మనురాముడితో కలిపిన హనుమంతుడు ఈ సినిమాలో పిల్లల ఊహలలో ఆలంబనగా నిలిచి వారికే కాదు ప్రేక్షకులకు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. ఆయనకు ప్రతీకగా ఒక కోతి పిల్లల భుజాల మీద ఎప్పుడూ ఉంటుంది. అదే సినిమాలో అల్లు రామలింగయ్యను శిక్షిస్తుంది. రాముడి నగలను కాజేయ బోయిన అల్లు రామలింగయ్య మీద కోతి దాడి చేస్తుంది. అప్పటి నుంచి అతడికి అందరూ కోతుల్లాగా కనిపించే మానసిక జాడ్యం వస్తుంది. ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చేసిన అల్లు రామలింగయ్య చప్పట్లు కొట్టించుకుంటారు. అలాగే కనిపించేది కొన్ని క్షణాలే అయినా ‘కాలుకెంత చేయికెంత కాలేజీ సీటుకెంత కన్సెసన్ ఏమైనా ఉందా?’ అంటూ చిటికెలు వస్తూ మాడ కూడా అందరికీ గుర్తుండిపోతాడు. అన్నట్టు ఈ సినిమాను ఎన్.టి.రామారావు చూసి సంగీత, శ్రీధర్ల మొదటి రాత్రి సన్నివేశాలను ప్రస్తావిస్తూ ‘మా పెళ్లిరోజులు గుర్తొచ్చాయి బ్రదర్’ అని ముళ్లపూడితో అన్నారట.‘ముత్యాల ముగ్గు’లాంటి సినిమాలు పదే పదే సంభవించవు. సంభవించినవి కలకాలం నిలుచుండిపోతాయి. ఇన్నాళ్ల తర్వాత ముత్యాల ముగ్గు గురించి మనం మాట్లాడుకుంటున్నది అందుకే. ఆ ముగ్గును మన జ్ఞాపకాలలో రీబ్రష్ చేసుకుంటున్నదీ అందుకే. అది వెలుగు. అది ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది... ‘ముత్యాల ముగ్గు’లో పాటలన్నీ పడవెక్కి ప్రయాణిస్తాయి. చులాగ్గా సాగిపోతూ ప్రేక్షకులకు ఆహ్లాదం పంచుతాయి. ఆరుద్ర రాసిన ‘ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు’ రామకృష్ణ గొంతులో ఎంతో అందంగా ఉంటుంది. ఆయనే రాసిన ‘ముత్యమంతా పసుపు’ పాటను ఇంటింట్లో ప్రతి ఇల్లాలు పాడుకుంది. సి.నారాయణ రెడ్డి తెలంగాణ జానపదం నుంచి స్వీరించి రాసిన ‘గోగులు పూచె గోగులు పూచె ఓ లచ్చ గుమ్మాడి’ పాట కొత్త దంపతుల ముచ్చట్ల మీద చిత్రీకరణ జరుపుకొని మనోహరంగా ఉంటుంది. ఇక హలం మీద తీసిన ‘ఎంతటి రసికుడవో తెలిసెరా’ అచ్చ తెనుగు శృంగారాన్ని పంచింది. ముత్యాల ముగ్గులో కనిపించే ప్యాలెస్ తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మ సతీమణి ‘రాణి ఇందిరా ధన్‌రాజ్ గిరి’ది. గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప కవి అయినా సినిమాలకు పాటలు రాయరు. కాని ముత్యాల ముగ్గు కోసం మొదటి, చివరి పాట రాశారు. అదే అద్భుతమైన ‘నిదురించే తోట లోకి పాట ఒకటి వచ్చింది’. అందులో తరలి వెళ్లిపోయిన భర్తను నావతో పోల్చి ‘రేవు బావురుమంటున్నదని నావకు చెప్పండి’ అని కథానాయిక చేత అనిపించడం శేషేంద్రశర్మ కవితాగాఢతకు నిదర్శనం. అన్నట్టు ఈ సినిమాలో మంగళంపల్లి పాడిన ‘శ్రీరామ జయరామ సీతారామ’ పాట ఉంది. – కె.