Special Story On Popular Villains Who Played Comedian Role In Same Movie - Sakshi
Sakshi News home page

ఓవైపు విలనిజం.. మరోవైపు హాస్యం.. వీళ్ల స్టైలే సెపరేటు

Published Sat, Oct 8 2022 3:15 PM | Last Updated on Sat, Oct 8 2022 5:47 PM

Popular Villains Who Played Comedian Role In Same Movie - Sakshi

చాలా సినిమాల్లో శాడిస్ట్ విలన్లను చూశాం. భీభత్సానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే విలన్లను కూడా అనేక మూవీస్‌లో చూశాం. చాలా సినిమాల్లో కాకపోయినాకొన్ని చిత్రాల్లో ఇంటిలిజెంట్ విలన్లను చూశాం. కానీ అతి భయంకరమైన విలనీజాన్ని ప్రదర్శిస్తూ, అదే సమయంలో నవ్వించే విలన్లను చూశారా మీరు ? ఆ క్యారెక్టర్ మీద ప్రేక్షకుల్లో భయం పోకుండా చూసు కుంటూ మళ్లీ అదే ప్రేక్షకులను నవ్వించాలి. ఇది చాలా క్లిష్టమైన టాస్క్. సిల్వర్‌ స్క్రీన్‌ మీద ఈ టాస్క్‌ని వండర్స్‌లా పండించిన వాళ్లపై ఒక లుక్ వేద్దామా…


సినిమాలో హీరో ఎంత కామనో విలన్ కూడా అంతే కామన్. విలన్ క్యారెక్టర్ ఎంత భయంకరంగా, బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత స్ట్రాంగ్‌గా ఎలివేట్ అవుతుంది. అలా కాకుండావిలన్ కామెడీ చేస్తే ఏమౌతుంది ? అది కామెడీ సినిమా అవుతుంది. కానీఒకే సినిమాలో ఒకే క్యారెక్టర్‌తో ఇటు విలనీజాన్ని, అటు కామెడీని పండిస్తూ మూవీలోని సీరియస్‌నెస్‌ని దెబ్బ తీయకుండా నటించడం సాధారణ విషయం కాదు. అలాంటి ఛాలెంజ్‌ని తమ అసాధారణ నటనతో అధిగమించిన కొద్ది మంది నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు.

శత్రువు సినిమాలో వెంకటరత్నం పాత్రలో కోటా శ్రీనివాసరావు జీవించారు. వెంకటరత్నం అత్యంత దుర్మార్గుడు. తన అక్రమాలకు ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాడు. అలాంటి పాత్రకే కామెడీ టచ్ ఇచ్చారు దర్శకుడు కోడి రామకృష్ణ.సినిమా అంతా ఇలాంటి మేనరిజంతోనే కామెడీ టచ్తోనే వెంకటరత్నం క్యారెక్టర్ సాగుతుంది. కానీ విలన్ తాలుకూ దుర్మార్గాలకు ఆ కామెడీ అంటకుండా కోటా అద్భుతంగా నటించారు.కొంచెం నవ్వించగానే కామెడీ విలన్ అన్న భావన వస్తుంది. కానీ నవ్వించే చోట నవ్విస్తూ అదే సమయంలో అత్యంత దుర్మార్గుడుగా విలనీజం పండిస్తూ అద్భుతంగా నటించారు కోటా.

తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలన్ క్యారెక్టర్లలో ఒకటి ముత్యాల ముగ్గు చిత్రంలో కొంపలు కూల్చే కాంట్రాక్టర్. ఈ పాత్రలో రావుగోపాలరావు జీవించేశారు. సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో రావుగోపాలరావు క్యారెక్టర్ కూడా ఆ స్థాయిలో సక్సెస్ అయింది. హత్యలు చేయడం దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి వారిని విడదీయడం దాకా దగుల్బాజీ పనులను కాంట్రాక్ట్ పద్దతిలో చేసే కాంట్రాక్టర్ పాత్ర రావుగోపాలరావుది. సినినమా మొత్తంలోనూ అత్యంత క్రూరమైన పనులను చాలా సౌమ్యంగా చేస్తుంది కాంట్రాక్టర్ పాత్ర.

మడిసన్నాక కాస్తంత కళాపోసనుండాలయ్యా…ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటుంది అంటూ గోదావరి యాసలో రావుగోపాలరావు చెప్పిన డైలాగ్స్ ఒక రేంజ్లో పేలాయి. ఈ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్స్‌తో విడుదలైన ఎల్.పి.రికార్డులు, ఆడియో క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. ఇంతగా అలరించిన అదే క్యారెక్టర్లో విలన్‌గా ప్రేక్షకులను భయ పెట్టారు రావుగోపాలరావు. ఒకే పాత్రలో రెండు షేడ్స్‌ని అద్భుతంగా ప్రదర్శించారు. 

విలన్ కూడా మనిషే. అతనికి సెంటిమెంట్లు ఉంటాయి. అతనికి బాధ వేస్తుంది. భయం వేస్తుంది. ఇంత వరకు ఓకే. కానీ…విలన్ పదే పదే నవ్వేసి, ప్రేక్షకులను నవ్వించాడు అంటే…ఆ విలనిజం తాలుకూ భయం పోతుంది. విలన్ అనగానే సహజంగా ఆడియన్స్‌లో కలిగే గగుర్పాటు మాయమవుతుంది. అది మిస్ కానివ్వకుండా తన పాత్రని కాసేపు కామెడీ ట్రాక్ మీద, కాసేపు కుతంత్రాల ట్రాక్ మీద నడిపించడం నటుడుకి నిజంగా ఛాలెంజే. 

తెలుగు ప్రేక్షకులకు విలనిజాన్ని కొత్త కోణంలో పరిచయం చేసిన నటుల్లో పరేష్ రావెల్ ఒకరు. క్షణక్షణం చిత్రంలో నాయర్ క్యారెక్టర్ దశాబ్దాలు గడిచినా ప్రేక్షకులకు గుర్తిండిపోయింది. అత్యంత దుర్మారుడుగా ఒక వైపు కనిపిస్తూనే అదే సమయంలో ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్వించాడు రావెల్. ఆ పాత్రని రాంగోపాల్ వర్మ డిజైన్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. డెన్లు గట్రా లేకుండా… చిన్న మఫ్లర్ కట్టుకొని కామన్ మ్యాన్ లా కనిపిస్తూనే అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుంది నాయర్ క్యారెక్టర్. 

ఒకవైపు సీరియస్ విలన్‌గా ఎక్స్ఫోజ్ అవుతూ…తన మీద ఉన్న క్రూయల్ ఫీల్ అలానే మెయిన్టెన్ అయ్యేలా చూసుకుంటూ అదే సమయంలో కామెడీ చేయడం చాలా కష్టం. దాన్ని చాలా ఈజీగా చేసేశాడు పరేష్ రావెల్. దొంగలకు కూడా వెర్రి డౌట్స్ ఉంటాయని ,రౌడీలలో కూడా క్యూరియాసిటీ ఉంటుందని  నాయర్ క్యారెక్టర్తో చెప్పాడు డైరెక్టర్. పాములు పగ పడతాయంటావా?  అడవిలో ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టుంటారు లాంటి నార్మల్ డౌట్స్‌తో మొదలు పెడితే…చాలా రకాలుగా నవ్వించాడు పరేష్ రావెల్.

భయంకరమైన విలన్‌గా, కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్‌గా ప్రేక్షకులను జయప్రకాష్ రెడ్డి ఏ రేంజ్లో భయపెడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలానే…పక్కా కమెడియన్‌గా కూడా చాలా సిని మాల్లో మెప్పించారు. అయితే…ఒకే సినిమాలో ఇటు సీరియస్ విలన్‌గా, మరి కాసేపు కామెడీ టచ్‌తో వావ్ అనిపించింది కృష్ణ మూవీలో కృష్ణ సినిమాలో ప్రధాన విలన్ బాబాయ్‌, అతను చేసే ప్రతి దుర్మార్గంలోనూ పాలు పంచు కునే క్యారెక్టర్ జయప్రకాష్ రెడ్డిది. మెయిన్ విలన్ జగ్గా చేసే ప్రతి పాపపు పనికి స్కెచ్ గీసే పాత్రలో కూడా ఆయన హాస్యం పండించారు. రవితేజ, జయప్రకాష్ రెడ్డి…ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి కాంబినేషన్లలో వచ్చే సీన్లు ఒక రేంజ్‌లో పేలాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement