mutyala muggu
-
నది దోచుకు పోతున్న నావను...
ఆలుమగల మధ్య ఎడబాటులోని అనంతమైన దుఃఖాన్నీ, అంతటి దుఃఖంలోనూ కనబడే సన్నటి ఆశారేఖనీ, మళ్లీ ఏమీ వెలుగు కనబడటం లేదని తెలిసినప్పుడు కలిగే దాంపత్యమంతటి లోతైన వేదననీ... ఏకకాలంలో వ్యక్తం చేసిందంటే, అది గుంటూరు శేషేంద్ర శర్మ కవిత అయివుండాలి, ముత్యాలముగ్గు కోసం ఆయన రాసిన పాట అయివుండాలి. ‘నిదురించే తోటలోకీ పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది’ పాట మొత్తం ఒక వేదనామయ కవిత! ఆకురాలిన అడవి మీద వసంతం దయచూపినట్టూ, విఫలమైన కోర్కెలు గుమ్మంలో వేలాడినట్టూ, నదినే (సర్వస్వాన్ని) నావ దోచుకుపోతున్నట్టూ దానికి రేవు బావురుమన్నట్టూ చిత్రించడం శేషేంద్రకే చెల్లింది. ‘శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది ‘విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి ‘కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా నది దోచుకు పోతున్న నావను ఆపండి రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’ ఈ ముత్యాలముగ్గు చిత్రానికి సంగీతం సమకూర్చింది కె.వి.మహదేవన్. పాడింది సుశీల. 1975లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు బాపు. సంగీత, శ్రీధర్ నటీనటులు. గుంటూరు శేషేంద్ర శర్మ -
అనుమానపు మకిలి ఊడ్చిన ముత్యాల ముగ్గు
ఇంటి ముందు కసువు చిమ్ముకోవాలి. శుభ్రంగా కళ్లాపి చల్లుకోవాలి. ముగ్గు పిండి తెచ్చుకోవాలి. ముంగాళ్ల మీద కూచుని చుక్కా చుక్కా చక్కగా దిద్దాలి. ఆనెక ఆ చుక్కలన్నింటినీ కలపాలి. ముగ్గును తీర్చిదిద్దాలి. రంగులద్దాలి. గొబ్బెమ్మల సిగన పూలు పెట్టి ముచ్చటను తీసుకు రావాలి. తెలుగు లోగిళ్ల ముందు ఇల్లాలి ఓపికతో అలా ముగ్గులు కళకళలాడుతాయి. మంగళప్రదమైన భావ తరంగాలను తీసుకు వస్తాయి. తెలుగు ఇల్లాలే కాదు ఏ భారతీయ ఇల్లాలైనా ఇంతే ఓపికతో తన ఇంటిని తీర్చిదిద్దుకుంటుంది. కాపురాన్ని చక్కబెట్టుకుంటుంది. ‘ముత్యాలముగ్గు’ సినిమాలో కూడా సంగీత తాను కోడలిగా వచ్చిన ప్యాలెస్ ముందు ఇలాగే అందమైన ముగ్గులు వేసింది.రంగవల్లులను తీర్చిదిద్దింది. ‘ముల్తైదు కుంకుమ బతుకంత ఛాయ’ అని తులసి కోట ముందు నించుని తన నుదుటున కుంకుమను సరిదిద్దుకుంది. పేద పిల్ల. అయితేనేం? గుణం ఉన్న పిల్ల. కళ ఉన్న పిల్ల. జీవితంలోకి కాంతిని తెచ్చే పిల్ల. అందుకే భర్త శ్రీధర్‌కి సంగీత అంటే ప్రాణం, ప్రేమ. ఏదో పల్లెటూళ్లో సంగీత పెళ్లికి మాటవరుసకు వెళ్లి, ఆ పెళ్లి చెడిపోతే, తానే మాంగల్యం కట్టి ప్యాలెస్‌కు తీసుకుని వచ్చాడు. అతడు అంత గొప్ప సంస్కారి. ఆమె అంతకుమించిన సహనశీలి. కాని ఇది కొంతమందికి నచ్చలేదు. ప్యాలెస్‌లో పని చేసే మేనేజర్ అల్లు రామలింగయ్యకు నచ్చలేదు. ప్యాలెస్‌లోనే ఉంటూ శ్రీధర్‌ను తన కూతురికిచ్చి కట్టబెట్టి ప్యాలెస్‌ను ఆక్రమించుకుందాం అని ఎదురు చూస్తున్న మేనమామ ముక్కామలకు నచ్చలేదు. కొంపలు కూల్చడమే వృత్తిగా పెట్టుకొని ఏ కొంప దొరుకుతుందా ఎప్పుడు కూలుద్దామా అని వేచి ఉండే రావు గోపాలరావుకూ నచ్చలేదు. ఈ ముగ్గురూ చేతులు కలిపారు. ప్యాలెస్ ముంగిలిలో సంగీత తీర్చిదిద్దుకున్న ముగ్గులను ఎద్దుల్లా తొక్కారు. ఆమె కాపురాన్ని కూల్చితే, ఆమెను ఇంటి నుంచి తరిమేయడం వల్ల తన కూతురిని శ్రీధర్ రెండో పెళ్లి చేసుకోగలిగితే అంతే చాలు అనుకున్న ముక్కామల లక్ష రూపాయల కాంట్రాక్ట్‌ను రావు గోపాలరావుకు ఇస్తాడు. తోడుగా అల్లు రామలింగయ్యను భాగస్వామిని చేసుకుంటాడు. రావు గోపాలరావు సంగీత మీద శ్రీధర్‌కు అనుమానం వచ్చేలా చేయగలుగుతాడు.తన నమ్మినబంటూ, పెళ్లిళ్లు చేసుకుని పారిపోయే నిత్య పెళ్లికొడుకూ అయిన నూతన ప్రసాద్ చేత సంగీతకు పదే పదే ఫోన్లు చేయిస్తాడు. ‘నీ భర్త ఉన్నాడా?’ అని అడిగి కట్ చేయిస్తూ ఉంటాడు. ఆమెకు ఏమీ అర్థం కాదు. శ్రీధర్‌కు అనుమానం వస్తుంది. ఆ అనుమానాన్ని రూఢీ చేసుకోవడానికి ఢిల్లీ వెళుతున్నానని అబద్ధం చెప్పి ఆ రాత్రి ఇంటికి చేరుకుంటాడు. ఆ సంగతి ముందే తెలిసిన రావు గోపాలరావు బృందం సంగీత గదిలో నూతన్ ప్రసాద్‌ను రహస్యంగా ప్రవేశపెడుతుంది. శ్రీధర్ తలుపు తట్టే సమయానికి ఒంటి మీద సగం బట్టలతో నూతన్ ప్రసాద్ తలుపులు తెరిచి పారిపోతాడు. నిద్రలో ఉన్న సంగీత ఏం జరిగిందో అర్థంగాక శిలలా బిగుసుకుపోతుంది. ఇంకేముంది? ఆమె కాపురం బుగ్గిపాలైంది. ఆ ప్యాలెస్ ముందు ముగ్గు శాశ్వతంగా పాడుబడింది. అప్పటికే ఆమె గర్భవతి. కాని శ్రీధర్ పుట్టింటికి పంపించేస్తాడు. అక్కడికి వెళ్లడానికి ముఖం చెల్లక ఆమె ఏటి వొడ్డున తెలిసిన వారి దగ్గర ఆశ్రయం పొందుతుంది. అక్కడే కవలల్ని ప్రసవిస్తుంది. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ ఎదురు చూపులు చూస్తుంది. సత్యానికి ఒక లక్షణం ఉంది. దానిని ఏడు సముద్రాల అవతల పారేసినా బతికి బట్టగట్టి తాను బయల్పెట్టాల్సిన సంగతిని బయల్పెడుతుంది. అలా నిజం రావు గోపాలరావు నోటి ద్వారానే బయట పడుతుంది. అనుమానించిన భర్త కంట పశ్చాత్తాపంతో కన్నీటి వరద పొంగుతుంది. ఆమె కాళ్ల మీద పడలేక దగ్గరకు తీసుకుని వెక్కివెక్కి ఏడుస్తాడు. మరి జన్మలో ఎడబాటుకు వీలు లేనంత గాఢంగా హత్తుకుంటాడు. కథ ముగుస్తుంది. ప్యాలెస్ ముందు ఈసారి ‘పరస్పర నమ్మకం’ అనే ముగ్గు రూపం తీసుకుంది. ఆ ముగ్గు చెదరదు. ఆ కాపురం మరి శాశ్వతం. 1975లో విడుదలైన ‘ముత్యాల ముగ్గు తెలుగు సినిమాల్లో క్లాసిక్‌గా నిలిచింది. దర్శకుడు బాపు, రచయిత ముళ్లపూడి వెంకట రమణకు ఎనలేని పేరు తెచ్చింది. నటుడు రావు గోపాలరావు ఈ సినిమాతో దాదాపు 30 ఏళ్ల కెరీర్‌కు తిరుగులేని పునాది వేసుకున్నారు. మంచి సంగీతం, మంచి సాహిత్యం, మంచి దృశ్యం కలిస్తే ఒక మంచి సినిమా అవుతుందని‘ముత్యాల ముగ్గు’ నిరూపించింది. స్త్రీని అనుమానించడం రామాయణ కాలం నుంచి ఉంది. నిర్థారణలు లేకుండా ఆమెను కారడవులకు సాగనంపడం ఈ నేటికీ సమాజంలో కొనసాగుతూనే ఉంది. అనుమానించడం మగవాడి వంతు. శిక్ష వేయడం అతడి అధికారం. కాని అనుమానించిన రాముడే మచ్చను మిగుల్చుకున్నాడు తప్ప సీత కాదు. ముత్యాల ముగ్గులో భర్త మూర్ఖుడుగా మిగిలాడు తప్ప భార్య కాదు. నాటి నుంచి నేటి వరకు ఈ శీలం చుట్టూ సాగే ఉద్వేగాలను పట్టుకోవడం వల్లే ‘ముత్యాల ముగ్గు’ విజయం సాధించింది. ‘లవ కుశ’ స్ఫూర్తితో తయారైన ఈ సినిమా ఆ లవ కుశ మల్లేనే పెద్ద విజయం సాధించింది. ‘ఎక్స్ ఫ్యాక్టర్’ అంటూ ఉంటారు. ఆ రోజుల్లో ఈ సినిమాలో అలాంటి ‘ఎక్స్’ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. లైట్లు వాడకుండా శాటిన్ క్లాత్‌తో ఔట్ డోర్ సన్నివేశాలను అందంగా తీసిన ఇషాన్ అర్యా ఫొటోగ్రఫీ ఒక ఫ్యాక్టర్. అంత వరకు లౌడ్ విలనీకి అలవాటు పడ్డ జనానికి రావు గోపాలరావు చూపిన సాఫ్ట్ విలనీ ఒక ఫ్యాక్టర్. కుత్తుకలు కోసే వాడు కూడా మామూలు మనిషిలానే ఉంటాడని అతడికీ కళాపోషణ ఉంటుందని అతడూ తన కూతురిని ప్రాణం కంటే మిన్నగా పోషిస్తాడని ఈ సినిమా చూపించి ప్రేక్షకులను షాక్ చేసింది. ‘అలో అలో అలో’... ‘ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదూ’... ‘సిఫార్సులతో కాపురాలు చక్కబడవు’ వంటి గొప్ప డైలాగులు రాసిన ముళ్లపూడి వెంకట రమణ రచన ఒక ఫ్యాక్టర్. ఇక ప్రతి దృశ్యాన్ని ఒక పెయింటింగ్‌లా చూపించిన బాపు దర్శకత్వం మరో ఫ్యాక్టర్. ఈ సినిమాలో మనుషులతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఒక పాత్ర పోషిస్తాడు. సీతమ్మనురాముడితో కలిపిన హనుమంతుడు ఈ సినిమాలో పిల్లల ఊహలలో ఆలంబనగా నిలిచి వారికే కాదు ప్రేక్షకులకు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. ఆయనకు ప్రతీకగా ఒక కోతి పిల్లల భుజాల మీద ఎప్పుడూ ఉంటుంది. అదే సినిమాలో అల్లు రామలింగయ్యను శిక్షిస్తుంది. రాముడి నగలను కాజేయ బోయిన అల్లు రామలింగయ్య మీద కోతి దాడి చేస్తుంది. అప్పటి నుంచి అతడికి అందరూ కోతుల్లాగా కనిపించే మానసిక జాడ్యం వస్తుంది. ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చేసిన అల్లు రామలింగయ్య చప్పట్లు కొట్టించుకుంటారు. అలాగే కనిపించేది కొన్ని క్షణాలే అయినా ‘కాలుకెంత చేయికెంత కాలేజీ సీటుకెంత కన్సెసన్ ఏమైనా ఉందా?’ అంటూ చిటికెలు వస్తూ మాడ కూడా అందరికీ గుర్తుండిపోతాడు. అన్నట్టు ఈ సినిమాను ఎన్.టి.రామారావు చూసి సంగీత, శ్రీధర్ల మొదటి రాత్రి సన్నివేశాలను ప్రస్తావిస్తూ ‘మా పెళ్లిరోజులు గుర్తొచ్చాయి బ్రదర్’ అని ముళ్లపూడితో అన్నారట.‘ముత్యాల ముగ్గు’లాంటి సినిమాలు పదే పదే సంభవించవు. సంభవించినవి కలకాలం నిలుచుండిపోతాయి. ఇన్నాళ్ల తర్వాత ముత్యాల ముగ్గు గురించి మనం మాట్లాడుకుంటున్నది అందుకే. ఆ ముగ్గును మన జ్ఞాపకాలలో రీబ్రష్ చేసుకుంటున్నదీ అందుకే. అది వెలుగు. అది ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది... ‘ముత్యాల ముగ్గు’లో పాటలన్నీ పడవెక్కి ప్రయాణిస్తాయి. చులాగ్గా సాగిపోతూ ప్రేక్షకులకు ఆహ్లాదం పంచుతాయి. ఆరుద్ర రాసిన ‘ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు’ రామకృష్ణ గొంతులో ఎంతో అందంగా ఉంటుంది. ఆయనే రాసిన ‘ముత్యమంతా పసుపు’ పాటను ఇంటింట్లో ప్రతి ఇల్లాలు పాడుకుంది. సి.నారాయణ రెడ్డి తెలంగాణ జానపదం నుంచి స్వీరించి రాసిన ‘గోగులు పూచె గోగులు పూచె ఓ లచ్చ గుమ్మాడి’ పాట కొత్త దంపతుల ముచ్చట్ల మీద చిత్రీకరణ జరుపుకొని మనోహరంగా ఉంటుంది. ఇక హలం మీద తీసిన ‘ఎంతటి రసికుడవో తెలిసెరా’ అచ్చ తెనుగు శృంగారాన్ని పంచింది. ముత్యాల ముగ్గులో కనిపించే ప్యాలెస్ తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మ సతీమణి ‘రాణి ఇందిరా ధన్‌రాజ్ గిరి’ది. గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప కవి అయినా సినిమాలకు పాటలు రాయరు. కాని ముత్యాల ముగ్గు కోసం మొదటి, చివరి పాట రాశారు. అదే అద్భుతమైన ‘నిదురించే తోట లోకి పాట ఒకటి వచ్చింది’. అందులో తరలి వెళ్లిపోయిన భర్తను నావతో పోల్చి ‘రేవు బావురుమంటున్నదని నావకు చెప్పండి’ అని కథానాయిక చేత అనిపించడం శేషేంద్రశర్మ కవితాగాఢతకు నిదర్శనం. అన్నట్టు ఈ సినిమాలో మంగళంపల్లి పాడిన ‘శ్రీరామ జయరామ సీతారామ’ పాట ఉంది. – కె. -
టీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకుంటున్నా : హీరోయిన్
‘‘తమిళ, మలయాళ సినిమాలు, సీరియల్స్‌లో ఎక్కువ నటించడం వలన చెన్నైలో స్థిరపడ్డా. అందువల్ల, తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యా. నటిగా మంచి గుర్తింపునిచ్చిన మాతృభాషకు ఎందుకు దూరమవ్వాలనే ఆలోచన రావడంతో హైదరాబాద్ వచ్చేశా. జోవియల్‌గా ఉండే అమ్మ పాత్రలతో పాటు నా వయసుకు తగ్గ అన్ని తరహా పాత్రల్లో నటించాలనుంది’’ అని నటి సంగీత అన్నారు. ‘ముత్యాల ముగ్గు’ సంగీతగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారామె. తెలుగులో రీ-ఎంట్రీతో పాటు రాజకీయాల్లోనూ ప్రవేశించాలనుకుంటున్నారు. సంగీత మాట్లాడుతూ - ‘‘మా సొంతూరు వరంగల్. బాపు, విశ్వేశ్వర్రావుగార్ల అశీర్వాదంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. తెలుగులో హీరోయిన్గా వంద సినిమాలకు పైగా నటించా. నా తొలి తెలుగు సినిమా ‘తీర్పు’. కానీ, ‘ముత్యాల ముగ్గు’ ముందు విడుదలైంది. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సౌత్‌లో 600లకు పైగా సినిమాల్లో నటించా. భవిష్యత్తులో నిర్మాతగా మారే అవకాశాలున్నాయి. దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. గతంలో రాజకీయాల్లోకి రమ్మని చాలామంది ఆహ్వానించారు. అయితే, నేను ఆసక్తి చూపలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకుంటున్నా’’ అన్నారు. -
ముత్యాలముగ్గు సీతాయణం
రామాయణం ఎంత మధురంగా ఉంటుందో... అంతే కఠినంగా కూడా ఉంటుందనిపిస్తుంది! రాక్షసుడు భార్యాభర్తల్ని విడగొడతాడు. భక్తుడు భుజం మీద తల్లిని వెనక్కి తెస్తానంటే... రాముడే రావాలని సీతమ్మ అంటుంది. రామాయణం రాముడి గురించి అనుకుంటాం కానీ నాకు రామాయణంలో సీతమ్మవారి గొప్పతనమే ఎక్కువగా గోచరిస్తుంది. పట్టాభిషేకం అయింది... కథ సుఖాంతం అయింది... హమ్మయ్య... అనుకునేలోపు పామరుడు అన్న మాటకు సీతమ్మ మళ్లీ అడవిపాలు అవుతుంది. మొదటిసారి రాముడి కోసం... రాముడి వెంట... రాముడికి తోడుగా ఈసారి కూడా రాముడి కోసమే... రాముడు లేకుండా... రాముడి పిల్లల సాక్షిగా. అమ్మానాన్నల్ని కలపడానికి లవకుశులు చేసే ప్రయత్నం రామాయణంలో విఫలమైనా... ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో కవలలు... శ్రీధర్ని, సంగీతను కలుపుతారు. రాక్షసమూకను తరిమికొడతారు. బాపూ రమణల సినిమా మరి! రామాయణం కనపడక మానదు. సీతమ్మవారిని కీర్తింపక మానరు. తనపై అనుమానాన్ని, తనకు జరిగిన అవమానాన్ని... జయించిన సీత కథ ఇది. సీతాయణం ఇది. మళ్లీ చూడండి రామ్ ఎడిటర్, ఫీచర్స్ ఫస్ట్ నైట్. శ్రీధర్ పట్టెమంచం మీద ఉన్నాడు. సంగీత అతడి గుండెలపై తలవాల్చి ఉంది. పెళ్లి పీటలపై ‘అదృష్టవశాత్తూ’ పెళ్లి ఆగిపోతే.. అక్కడికక్కడ దొరికిన వరుడు శ్రీధర్. కోటీశ్వరుడైన రాజా రామ్‌దాసు కొడుకు అతడు. సంగీత అన్నయ్యకు స్నేహితుడు. మంచి మనసున్నవాడు. స్నేహితుడి చెల్లెలి పెళ్లికని శ్రీధరే తండ్రి చేత కట్నం డబ్బులు ఇప్పించాడు. తనూ ఆ పెళ్లికి వచ్చాడు. కానీ పెళ్లి చెడిపోయింది. సంగీతను అదృష్టం వరించింది. అప్పటికే ఎనభై పెళ్లిళ్లు చేసుకుని ఉన్న నిత్య వరుడు నూతన్ ప్రసాద్‌ను లాస్ట్ మినిట్‌లో పోలీసులు వచ్చి పెళ్లి పందిట్లోంచి పట్టుకెళ్లకపోతే సంగీతకు శ్రీధర్ అనే అదృష్టం పట్టేది కాదు. శ్రీమంతుల దగ్గర చెయ్యి చాచి తెచ్చిన పాపపు సొమ్ముతో పెళ్లి చేయబోతే ఇలాగే జరుగుతుందని పెళ్లి పెద్ద సాక్షి రంగారావు నోటికొచ్చినట్లు మాట్లాడకపోతే శ్రీధర్‌కు సంగీత అనే అపురూపం లభించేది కాదు. తన తండ్రిది పాపపు సొమ్ము కాదని చెప్పడానికి మాత్రమే సంగీత మెడలో తాళి కట్టలేదు శ్రీధర్. చిన్నపాటి పరిచయంలో అంతకుముందే ఆమె అంటే అతడికి ఇష్టం కూడా ఉంది. ‘కట్టుకథల కన్నా... జరిగే కథలే చిత్రంగా ఉంటాయి కదూ. నీకిది వరకు పెళ్లి చూపులు జరిగాయా?’ ‘ఆరుసార్లు’. ‘ఆరుసార్లా? అందులో నీకెందరు నచ్చారు?’ ‘నేను ఆడపిల్లని. పైగా పేద పిల్లని. మాకు నచ్చడం, ప్రేమించడం అంటూ ఉండవు. పెద్దవాళ్లు ఏదో కుదురుస్తారు. సరేనంటాం. పెళ్లయ్యాకే ప్రేమ’. ‘అంటే ఆ పెళ్లి కొడుకులకు నువ్వు నచ్చలేదా?’ ‘తెలీదు. ఒకళ్లిద్దరు కట్నం తక్కువని, ఒకళ్లిద్దరు తెల్లగా లేనని వద్దన్నారు. ఒకడు రెండో పెళ్లివాడు. మా అన్నయ్య పొమ్మన్నాడు’. ‘ఇంతకీ ఈ పెళ్లి కొడుకు నచ్చాడా?’ (తన గురించి శ్రీధర్). నవ్వులు. ‘మా అమ్మ చెప్పేది. తమలపాకు, వక్కపలుకు, తాంబూలంలా కలిసిపోయాక ఇక వాటిని దేవుడు కూడా విడదీయలేడని. ఇది ఆకు, ఇది వక్క అన్నమాటే ఉండదు’. ‘ఎంత చక్కని ఊహ! మన దాంపత్యం నిత్య తాంబూలమై పండాలి’. ఇద్దరూ అనుకున్నారు. కానీ ఆ దాంపత్యాన్ని పండనివ్వకూడదని ముక్కామల అనుకున్నాడు. అందుకు అల్లురామలింగయ్య హెల్ప్ తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి రావుగోపాల్రావు హెల్ప్ కోసం వెళ్లారు. రావుగోపాల్రావు నూతన్ ప్రసాద్‌కి పని పురమాయించాడు! ముక్కామల... రాజా రామ్‌దాసు (కాంతారావు) బావమరిది. శ్రీధర్ని తన కూతురికిచ్చి చేద్దామనుకుంటే ఇది దెయ్యంలా తగలడిందని సంగీత మీద కోపం. ఈ తాళిని తెంపించి, ఆ తాళిని కట్టించాలని అతడి ప్లాన్. అల్లురామలింగయ్య దివాణం మేనేజర్. రావుగోపాల్రావు కాపురాలు కూల్చే కాంట్రాక్టర్. ఇంకా చాలా చేస్తుంటాడు. ఖూనీలు, సెటిల్మెంట్లు వగైరాలు. నూతన్ ప్రసాద్ అతడికి రైట్ హ్యాండ్. నూతన్ ప్రసాద్‌కి రెగ్యులర్‌గా పెళ్లిళ్లు చేయిస్తుండేది రావుగోపాల్రావే. సంగీత తాళి తెంచే పథకం మొదలైంది. సంగీతపై శ్రీధర్‌కి అనుమానం తెప్పించి, ఆమెను తప్పించే పథకం అది. పథకం సక్సెస్ కూడా అయింది. అప్పటికే సంగీత గర్భిణి. ‘ఆ మనిషెవడో నీకు తెలీదు. గడియ వేసున్నా పడగ్గదిలోకి ఎలా దూరాడో కూడా నీకు తెలీదు. అవునా?’ ‘అవునండి. నిజం. మీ పాదాల సాక్షి’. ‘నోర్ముయ్’. ‘నన్ను నమ్మండి. కలలో కూడా...’ ‘ఛ... కళ్లతో చూసిన దానికి దిక్కులేదు.. కలలో పతిభక్తి గురించి మాట్లాడుకోవాలిక...’ ‘నా మాట వినండి. తెల్లనివన్నీ పాలూ కావు. నల్లనివన్నీ నీళ్లూ కావు’. ‘అదే నేను చేసిన పొరపాటు. ఉప్పును చూసి కర్పూరం అని మోసపోయాను. ఆనాడు నువ్వీ గడప తొక్కడం మా నాన్నగారికి ఇష్టం లేకున్నా కర్మ అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడీ సంగతి తెలిస్తే... ఆయన గుండె బద్దలైపోదూ.. మేం గౌరవానికి ప్రాణాలిచ్చే మనుషులం’. ‘ఏవండీ’ ‘ఇంకే చెప్పొద్దు. నేను నిన్నేం సాధించను. తిట్టి కొట్టి బాధించను. చంపి ఈ ఇంటిని మైలపరచను. నేను నిన్ను కోరేది ఒక్కటే. రచ్చ చెయ్యకుండా ఇక్కణ్ణుంచి వెళ్లిపోవాలి. ఈ దౌర్భాగ్యపు కథను ఈ గదిలోనే సమాధి చెయ్యాలి. రేపే నిన్ను మీ పుట్టింటికి పంపే ఏర్పాటు చేస్తాను. చేతనైనంత నటించి, నవ్వుతూనే సాగనంపుతాను. నువ్వు మహానటివి. పెద్దలయెడల గౌరవం, నాయందు విరహం నటించి వెళ్లిపో. వెళ్లి, నీకు మనసనేదే ఉంటే చచ్చిపో. నేను మాత్రం కొంతకాలం తర్వాత ఈ ఇంటి కోడలు చచ్చిపోయిందని ఇక్కడికి కబురు తెప్పిస్తాను. మా నాన్న గారు, అత్తయ్య, నీ మంచితనం మీద నమ్మకం ఉన్న మిగతా జనాభా ఓ ఏడుపు ఏడుస్తారు. వాళ్ల మీద దయ ఉంచి అక్కడితో సరిపెట్టు. నీక్కావలసింది డబ్బే కదా, కావలసినంత పట్టుకుపో. ఈ ఇంటి గౌరవం, మా నాన్న గారి మనశ్శాంతి తప్ప మిగతావన్నీ దోచుకుపో. ఫో. శ్రీధర్, సంగీత విడిపోయారు. రావుగోపాల్రావు, అల్లురామలింగయ్య దివాణాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. శ్రీధర్, అతడి తండ్రి కాంతారావు వైరాగ్యంలో పడిపోయారు. తన కూతుర్ని చేసుకొమ్మని అడగడానికి వచ్చిన ముక్కామలను తిట్టి పంపించాడు శ్రీధర్. ఏళ్లు గడుస్తున్నాయి. కాలం.. మొదట సంగీతను, కాంతారావును కలిపింది. కాంతారావుకు నిజం తెలిసింది. తన మనవణ్ణి, మనవరాలిని చూసి మురిసిపోయాడు. (సంగీతకు కవలలు). ‘అమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఇంటికిరా తల్లి. మనం ఆ బందిపోటు ముఠాను వెళ్లగొడదాం. అబ్బాయికి నేనంతా చెబుతాను. నువ్వు నట్టింట కాలుపెట్టి...’ ‘క్షమించండి మామగారు. నేను రాను. రాలేను’. ‘అమ్మా... నీకేం భయం లేదు. ఇప్పటికీ అబ్బాయి ఎంతో బాధపడుతున్నాడు. నేను స్వయంగా ఇక్కడి సంగతి చెబితే...’ ‘వద్దు మామగారు... సిఫారసులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు. నా గురించి నిజం ఆయనే తెలుసుకోవాలి. ఆయనే నన్ను గౌరవంగా ఇంటికి పిలవాలి. అంతవరకు నేను రాలేను’. ఇదంతా ఇద్దరు పిల్లలు విన్నారు. ఎలాగైనా అమ్మనీ, నాన్ననీ కలపాలనుకున్నారు. ఆలోచించారు. ఆచరణలోకి దిగారు. అక్క శాంతకు ఆంజేయస్వామి ఫ్రెండ్. తమ్ముడు రాముకు కోతి ఫ్రెండ్. ఈ ఇద్దరి ఫ్రెండ్స్ సహాయంతో అక్కాతమ్ముడు రంగంలోకి దిగారు. చివరికి సంగీత కోరుకున్నట్లే జరిగింది. శ్రీధర్ తన పొరపాటు తెలుసుకున్నాడు. సంగీతను చెంతకు చేర్చుకున్నాడు. క్షమించమని అడిగాడు. దివాణంలోని దుష్టులకు తగిన శాస్తి అయింది. అల్లురామలింగయ్య పిచ్చివాడయ్యాడు. ముక్కామల, రావుగోపాల్రావు తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డారు. ముక్కామల కూతుర్ని నూతన్ ప్రసాద్ చేసుకుని మోసం చేస్తే, రావుగోపాల్రావు కూతుర్ని సంగీత అన్నయ్య చేసుకుని, చిన్న నాటకం ఆడి రావుగోపాల్రావుకు బుద్ధి వచ్చేలా చేశాడు. ‘దేవుడా... నేనెప్పుడూ నిన్నేం కోరలేదు. నీ అవసరం వస్తుందని కూడా అనుకోలేదు. నాకు చాలా విద్యలు వచ్చుననుకున్నాను. ప్రాణాలు తియ్యడం, కొంపలు కూల్చడం, కాపరాలు చెడగొట్టడం చాలా చేశాను. కానీ ప్రాణం పొయ్యడం, కాపరం నిలబెట్టడం చేతకాదు. ఇదొక్కటే చేసిపెట్టి, నా బిడ్డ కాపరం దారికి పెట్టు. నీకు తీరికలేకపోతే సాయం చేసేవాళ్లను చూపెట్టు’ అని దేవుణ్ణి వేడుకుంటున్న రావుగోపాల్రావుని చూస్తుంటే.. అయ్యోపాపం అని కూడా అనిపిస్తుంది. విలన్లా, అసహాయుడైన ఆడపిల్ల తండ్రిలాను ఆయన ప్రేక్షకులను ఆయన కదిలించారు. రావుగోపాల్రావు ఎంట్రీ (రావు గోపాల్‌రావు అటు తిరిగి ఉంటాడు. సూర్యోదయాన్ని చూస్తూ. అప్పుడు అతడి సెక్రెటరీ వస్తాడు) ‘నారాయుడు వచ్చాడండి’. ‘వచ్చాడా? తీసుకొచ్చావా?’ (వచ్చాడు అంటే మనిషే వచ్చాడని. తీసుకురావడం అంటే డెడ్‌బాడీ వచ్చిందని) ‘ఎస్ సార్. తీసుకొచ్చాను చూస్తారా?’ ‘అబ్బా... సెగట్రీ... ఎప్పుడూ పనులు, బిజినెస్సేనా? ఆ.. పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెచ్చక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ’. ‘ఎస్ సార్’. ‘ఎస్ సార్. కాదు. కళ్లెట్టుకు చూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ... ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ. అద్భుతం సార్’. ‘ఆ... మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలయ్యా. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకి తేడా ఏటుంటదీ?’ ‘ఎస్ సార్. మీరోసారి చూసి సరే అనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. ‘సరే లెద్దూ... ఎదవ నూసెన్సూ. (సెవంటీస్‌లో ఎవరి నోట విన్నా... ‘ఆకాశంలో మర్డరైనట్టు లేదూ’ అనే డైలాగే. ‘దీని శిగదరగ’ అనేది ఇంకో డైలాగు. సినిమాలో రావుగోపాల్రావు ఊత పదం ఇది). పాటలు (రచన / గానం) 1. శ్రీ రామ జయరామ సీతారామ (ఆరుద్ర / బాలమురళీకృష్ణ) 2. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు (ఆరుద్ర / రామకృష్ణ) 3. ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ (ఆరుద్ర / సుశీల) 4. ఎంతటి రసికుడవో తెలిసెరా (సినారె / సుశీల) 5. గోగులు పూచె గోగులు పూచే ఓ లచ్చగుమ్మడి (సినారె / సుశీల, ఎస్పీబీ) 6. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది (గుంటూరు శేషేంద్ర శర్మ / సుశీల)