టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలనుకుంటున్నా : హీరోయిన్
‘‘తమిళ, మలయాళ సినిమాలు, సీరియల్స్‌లో ఎక్కువ నటించడం వలన చెన్నైలో స్థిరపడ్డా. అందువల్ల, తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యా. నటిగా మంచి గుర్తింపునిచ్చిన మాతృభాషకు ఎందుకు దూరమవ్వాలనే ఆలోచన రావడంతో హైదరాబాద్ వచ్చేశా. జోవియల్‌గా ఉండే అమ్మ పాత్రలతో పాటు నా వయసుకు తగ్గ అన్ని తరహా పాత్రల్లో నటించాలనుంది’’ అని నటి సంగీత అన్నారు.
‘ముత్యాల ముగ్గు’ సంగీతగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారామె. తెలుగులో రీ-ఎంట్రీతో పాటు రాజకీయాల్లోనూ ప్రవేశించాలనుకుంటున్నారు. సంగీత మాట్లాడుతూ - ‘‘మా సొంతూరు వరంగల్. బాపు, విశ్వేశ్వర్‌రావుగార్ల అశీర్వాదంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. తెలుగులో హీరోయిన్‌గా వంద సినిమాలకు పైగా నటించా. నా తొలి తెలుగు సినిమా ‘తీర్పు’. కానీ, ‘ముత్యాల ముగ్గు’ ముందు విడుదలైంది.
హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సౌత్‌లో 600లకు పైగా సినిమాల్లో నటించా. భవిష్యత్తులో నిర్మాతగా మారే అవకాశాలున్నాయి. దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. గతంలో రాజకీయాల్లోకి రమ్మని చాలామంది ఆహ్వానించారు. అయితే, నేను ఆసక్తి చూపలేదు. ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలనుకుంటున్నా’’ అన్నారు.