ముత్యాలముగ్గు సీతాయణం | mutyala muggu movie story | Sakshi
Sakshi News home page

ముత్యాలముగ్గు సీతాయణం

Published Sun, Sep 27 2015 12:07 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

ముత్యాలముగ్గు సీతాయణం - Sakshi

ముత్యాలముగ్గు సీతాయణం

రామాయణం ఎంత మధురంగా ఉంటుందో... అంతే కఠినంగా కూడా ఉంటుందనిపిస్తుంది!
రాక్షసుడు భార్యాభర్తల్ని విడగొడతాడు.
భక్తుడు భుజం మీద తల్లిని వెనక్కి తెస్తానంటే... రాముడే రావాలని సీతమ్మ అంటుంది.
రామాయణం రాముడి గురించి అనుకుంటాం కానీ
నాకు రామాయణంలో సీతమ్మవారి గొప్పతనమే ఎక్కువగా గోచరిస్తుంది.
పట్టాభిషేకం అయింది... కథ సుఖాంతం అయింది... హమ్మయ్య... అనుకునేలోపు
పామరుడు అన్న మాటకు సీతమ్మ మళ్లీ అడవిపాలు అవుతుంది.
మొదటిసారి రాముడి కోసం... రాముడి వెంట... రాముడికి తోడుగా
ఈసారి కూడా రాముడి కోసమే... రాముడు లేకుండా... రాముడి పిల్లల సాక్షిగా.
అమ్మానాన్నల్ని కలపడానికి లవకుశులు చేసే ప్రయత్నం రామాయణంలో విఫలమైనా...
‘ముత్యాల ముగ్గు’ సినిమాలో కవలలు... శ్రీధర్‌ని, సంగీతను కలుపుతారు.
రాక్షసమూకను తరిమికొడతారు.
బాపూ రమణల సినిమా మరి! రామాయణం కనపడక మానదు.
సీతమ్మవారిని కీర్తింపక మానరు.
తనపై అనుమానాన్ని, తనకు జరిగిన అవమానాన్ని...
జయించిన సీత కథ ఇది. సీతాయణం ఇది.
 
మళ్లీ చూడండి
రామ్
ఎడిటర్, ఫీచర్స్

 
ఫస్ట్ నైట్.
శ్రీధర్ పట్టెమంచం మీద ఉన్నాడు. సంగీత అతడి గుండెలపై తలవాల్చి ఉంది. పెళ్లి పీటలపై ‘అదృష్టవశాత్తూ’ పెళ్లి ఆగిపోతే.. అక్కడికక్కడ దొరికిన వరుడు శ్రీధర్. కోటీశ్వరుడైన రాజా రామ్‌దాసు కొడుకు అతడు. సంగీత అన్నయ్యకు స్నేహితుడు. మంచి మనసున్నవాడు. స్నేహితుడి చెల్లెలి పెళ్లికని శ్రీధరే తండ్రి చేత కట్నం డబ్బులు ఇప్పించాడు. తనూ ఆ పెళ్లికి వచ్చాడు.
 
కానీ పెళ్లి చెడిపోయింది. సంగీతను అదృష్టం వరించింది. అప్పటికే ఎనభై పెళ్లిళ్లు చేసుకుని ఉన్న నిత్య వరుడు నూతన్ ప్రసాద్‌ను లాస్ట్ మినిట్‌లో పోలీసులు వచ్చి పెళ్లి పందిట్లోంచి పట్టుకెళ్లకపోతే సంగీతకు శ్రీధర్ అనే అదృష్టం పట్టేది కాదు.
 
శ్రీమంతుల దగ్గర చెయ్యి చాచి తెచ్చిన పాపపు సొమ్ముతో పెళ్లి చేయబోతే ఇలాగే జరుగుతుందని పెళ్లి పెద్ద సాక్షి రంగారావు నోటికొచ్చినట్లు మాట్లాడకపోతే శ్రీధర్‌కు సంగీత అనే అపురూపం లభించేది కాదు. తన తండ్రిది పాపపు సొమ్ము కాదని చెప్పడానికి మాత్రమే సంగీత మెడలో తాళి కట్టలేదు శ్రీధర్. చిన్నపాటి పరిచయంలో అంతకుముందే ఆమె అంటే అతడికి ఇష్టం కూడా ఉంది.
   
‘కట్టుకథల కన్నా... జరిగే కథలే చిత్రంగా ఉంటాయి కదూ. నీకిది వరకు పెళ్లి చూపులు జరిగాయా?’
‘ఆరుసార్లు’.
‘ఆరుసార్లా? అందులో నీకెందరు నచ్చారు?’
‘నేను ఆడపిల్లని. పైగా పేద పిల్లని. మాకు నచ్చడం, ప్రేమించడం అంటూ ఉండవు. పెద్దవాళ్లు ఏదో కుదురుస్తారు. సరేనంటాం. పెళ్లయ్యాకే ప్రేమ’.
‘అంటే ఆ పెళ్లి కొడుకులకు నువ్వు నచ్చలేదా?’
‘తెలీదు. ఒకళ్లిద్దరు కట్నం తక్కువని, ఒకళ్లిద్దరు తెల్లగా లేనని వద్దన్నారు. ఒకడు రెండో పెళ్లివాడు. మా అన్నయ్య పొమ్మన్నాడు’.
‘ఇంతకీ ఈ పెళ్లి కొడుకు నచ్చాడా?’ (తన గురించి శ్రీధర్).
నవ్వులు.
 
‘మా అమ్మ చెప్పేది. తమలపాకు, వక్కపలుకు, తాంబూలంలా కలిసిపోయాక ఇక వాటిని దేవుడు కూడా విడదీయలేడని. ఇది ఆకు, ఇది వక్క అన్నమాటే ఉండదు’.
‘ఎంత చక్కని ఊహ! మన దాంపత్యం నిత్య తాంబూలమై పండాలి’. ఇద్దరూ అనుకున్నారు.
   
కానీ ఆ దాంపత్యాన్ని పండనివ్వకూడదని ముక్కామల అనుకున్నాడు. అందుకు అల్లురామలింగయ్య హెల్ప్ తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి రావుగోపాల్రావు హెల్ప్ కోసం వెళ్లారు. రావుగోపాల్రావు నూతన్ ప్రసాద్‌కి పని పురమాయించాడు!
ముక్కామల... రాజా రామ్‌దాసు (కాంతారావు) బావమరిది. శ్రీధర్‌ని తన కూతురికిచ్చి చేద్దామనుకుంటే ఇది దెయ్యంలా తగలడిందని సంగీత మీద కోపం. ఈ తాళిని తెంపించి, ఆ తాళిని కట్టించాలని అతడి ప్లాన్. అల్లురామలింగయ్య దివాణం మేనేజర్. రావుగోపాల్రావు కాపురాలు కూల్చే కాంట్రాక్టర్. ఇంకా చాలా చేస్తుంటాడు. ఖూనీలు, సెటిల్‌మెంట్‌లు వగైరాలు. నూతన్ ప్రసాద్ అతడికి రైట్ హ్యాండ్. నూతన్ ప్రసాద్‌కి రెగ్యులర్‌గా పెళ్లిళ్లు చేయిస్తుండేది రావుగోపాల్రావే.
 
సంగీత తాళి తెంచే పథకం మొదలైంది. సంగీతపై శ్రీధర్‌కి అనుమానం తెప్పించి, ఆమెను తప్పించే పథకం అది. పథకం సక్సెస్ కూడా అయింది. అప్పటికే సంగీత గర్భిణి.
   
‘ఆ మనిషెవడో నీకు తెలీదు. గడియ వేసున్నా పడగ్గదిలోకి ఎలా దూరాడో కూడా నీకు తెలీదు. అవునా?’
‘అవునండి. నిజం. మీ పాదాల సాక్షి’.
‘నోర్ముయ్’.
‘నన్ను నమ్మండి. కలలో కూడా...’
‘ఛ... కళ్లతో చూసిన దానికి దిక్కులేదు.. కలలో పతిభక్తి గురించి మాట్లాడుకోవాలిక...’
‘నా మాట వినండి. తెల్లనివన్నీ పాలూ కావు. నల్లనివన్నీ నీళ్లూ కావు’.
‘అదే నేను చేసిన పొరపాటు. ఉప్పును చూసి కర్పూరం అని మోసపోయాను. ఆనాడు నువ్వీ గడప తొక్కడం మా నాన్నగారికి ఇష్టం లేకున్నా కర్మ అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడీ సంగతి తెలిస్తే... ఆయన గుండె బద్దలైపోదూ.. మేం గౌరవానికి ప్రాణాలిచ్చే మనుషులం’.
 
‘ఏవండీ’
‘ఇంకే చెప్పొద్దు. నేను నిన్నేం సాధించను. తిట్టి కొట్టి బాధించను. చంపి ఈ ఇంటిని మైలపరచను. నేను నిన్ను కోరేది ఒక్కటే. రచ్చ చెయ్యకుండా ఇక్కణ్ణుంచి వెళ్లిపోవాలి. ఈ దౌర్భాగ్యపు కథను ఈ గదిలోనే సమాధి చెయ్యాలి. రేపే నిన్ను మీ పుట్టింటికి పంపే ఏర్పాటు చేస్తాను. చేతనైనంత నటించి, నవ్వుతూనే సాగనంపుతాను. నువ్వు మహానటివి. పెద్దలయెడల గౌరవం, నాయందు విరహం నటించి వెళ్లిపో. వెళ్లి, నీకు మనసనేదే ఉంటే చచ్చిపో. నేను మాత్రం కొంతకాలం తర్వాత ఈ ఇంటి కోడలు చచ్చిపోయిందని ఇక్కడికి కబురు తెప్పిస్తాను. మా నాన్న గారు, అత్తయ్య, నీ మంచితనం మీద నమ్మకం ఉన్న మిగతా జనాభా ఓ ఏడుపు ఏడుస్తారు. వాళ్ల మీద దయ ఉంచి అక్కడితో సరిపెట్టు. నీక్కావలసింది డబ్బే కదా, కావలసినంత పట్టుకుపో. ఈ ఇంటి గౌరవం, మా నాన్న గారి మనశ్శాంతి తప్ప మిగతావన్నీ దోచుకుపో. ఫో.
   
శ్రీధర్, సంగీత విడిపోయారు. రావుగోపాల్రావు, అల్లురామలింగయ్య దివాణాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. శ్రీధర్, అతడి తండ్రి కాంతారావు వైరాగ్యంలో పడిపోయారు. తన కూతుర్ని చేసుకొమ్మని అడగడానికి వచ్చిన ముక్కామలను తిట్టి పంపించాడు శ్రీధర్.
 
ఏళ్లు గడుస్తున్నాయి.
కాలం.. మొదట సంగీతను, కాంతారావును కలిపింది. కాంతారావుకు నిజం తెలిసింది. తన మనవణ్ణి, మనవరాలిని చూసి మురిసిపోయాడు. (సంగీతకు కవలలు).
 
‘అమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఇంటికిరా తల్లి. మనం ఆ బందిపోటు ముఠాను వెళ్లగొడదాం. అబ్బాయికి నేనంతా చెబుతాను. నువ్వు నట్టింట కాలుపెట్టి...’
‘క్షమించండి మామగారు. నేను రాను. రాలేను’.
‘అమ్మా... నీకేం భయం లేదు. ఇప్పటికీ అబ్బాయి ఎంతో బాధపడుతున్నాడు. నేను స్వయంగా ఇక్కడి సంగతి చెబితే...’
‘వద్దు మామగారు... సిఫారసులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు. నా గురించి నిజం ఆయనే తెలుసుకోవాలి. ఆయనే నన్ను గౌరవంగా ఇంటికి పిలవాలి. అంతవరకు నేను రాలేను’.
 
ఇదంతా ఇద్దరు పిల్లలు విన్నారు. ఎలాగైనా అమ్మనీ, నాన్ననీ కలపాలనుకున్నారు. ఆలోచించారు. ఆచరణలోకి దిగారు.
అక్క శాంతకు ఆంజేయస్వామి ఫ్రెండ్. తమ్ముడు రాముకు కోతి ఫ్రెండ్. ఈ ఇద్దరి ఫ్రెండ్స్ సహాయంతో అక్కాతమ్ముడు రంగంలోకి దిగారు.
   
చివరికి సంగీత కోరుకున్నట్లే జరిగింది. శ్రీధర్ తన పొరపాటు తెలుసుకున్నాడు. సంగీతను చెంతకు చేర్చుకున్నాడు. క్షమించమని అడిగాడు. దివాణంలోని దుష్టులకు తగిన శాస్తి అయింది. అల్లురామలింగయ్య పిచ్చివాడయ్యాడు. ముక్కామల, రావుగోపాల్రావు తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డారు. ముక్కామల కూతుర్ని నూతన్ ప్రసాద్ చేసుకుని మోసం చేస్తే, రావుగోపాల్రావు కూతుర్ని సంగీత అన్నయ్య చేసుకుని, చిన్న నాటకం ఆడి రావుగోపాల్రావుకు బుద్ధి వచ్చేలా చేశాడు.
 
‘దేవుడా... నేనెప్పుడూ నిన్నేం కోరలేదు. నీ అవసరం వస్తుందని కూడా అనుకోలేదు. నాకు చాలా విద్యలు వచ్చుననుకున్నాను. ప్రాణాలు తియ్యడం, కొంపలు కూల్చడం, కాపరాలు చెడగొట్టడం చాలా చేశాను. కానీ ప్రాణం పొయ్యడం, కాపరం నిలబెట్టడం చేతకాదు. ఇదొక్కటే చేసిపెట్టి, నా బిడ్డ కాపరం దారికి పెట్టు. నీకు తీరికలేకపోతే సాయం చేసేవాళ్లను చూపెట్టు’ అని దేవుణ్ణి వేడుకుంటున్న రావుగోపాల్రావుని చూస్తుంటే.. అయ్యోపాపం అని కూడా అనిపిస్తుంది.
విలన్‌లా, అసహాయుడైన ఆడపిల్ల తండ్రిలాను ఆయన ప్రేక్షకులను ఆయన కదిలించారు.
 
రావుగోపాల్రావు ఎంట్రీ
(రావు గోపాల్రావు అటు తిరిగి ఉంటాడు. సూర్యోదయాన్ని చూస్తూ. అప్పుడు అతడి సెక్రెటరీ వస్తాడు)
‘నారాయుడు వచ్చాడండి’.
‘వచ్చాడా? తీసుకొచ్చావా?’ (వచ్చాడు అంటే మనిషే వచ్చాడని. తీసుకురావడం అంటే డెడ్‌బాడీ వచ్చిందని)
‘ఎస్ సార్. తీసుకొచ్చాను చూస్తారా?’
‘అబ్బా... సెగట్రీ... ఎప్పుడూ పనులు, బిజినెస్సేనా? ఆ.. పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెచ్చక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ’.
‘ఎస్ సార్’.
‘ఎస్ సార్. కాదు. కళ్లెట్టుకు చూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ... ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ.
అద్భుతం సార్’.
‘ఆ... మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలయ్యా. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకి తేడా ఏటుంటదీ?’
‘ఎస్ సార్. మీరోసారి చూసి సరే అనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి.
‘సరే లెద్దూ... ఎదవ నూసెన్సూ.
(సెవంటీస్‌లో ఎవరి నోట విన్నా... ‘ఆకాశంలో మర్డరైనట్టు లేదూ’ అనే డైలాగే. ‘దీని శిగదరగ’ అనేది ఇంకో డైలాగు. సినిమాలో రావుగోపాల్రావు ఊత పదం ఇది).
 
పాటలు (రచన / గానం)
1.    శ్రీ రామ జయరామ సీతారామ (ఆరుద్ర / బాలమురళీకృష్ణ)
2.    ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు (ఆరుద్ర / రామకృష్ణ)
3.    ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ (ఆరుద్ర / సుశీల)
4.    ఎంతటి రసికుడవో తెలిసెరా (సినారె / సుశీల)
5.       గోగులు పూచె గోగులు పూచే ఓ లచ్చగుమ్మడి (సినారె / సుశీల, ఎస్పీబీ)
6.    నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది (గుంటూరు శేషేంద్ర శర్మ / సుశీల)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement