కాశీలో వదిలేస్తా! | special story to samasaram lo movie | Sakshi
Sakshi News home page

కాశీలో వదిలేస్తా!

Published Sun, Jul 9 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

కాశీలో వదిలేస్తా!

కాశీలో వదిలేస్తా!

సమ్‌సారం
సంసారంలో సినిమా


‘‘ఒరేయ్‌! వెధవా! మా ప్రయాణానికి టిక్కెట్లు బుక్‌ చేశావా. ఏంటో కాశీలో గంగా స్నానం చేయక పోతే జీవితానికి పరిపూర్ణత వచ్చినట్లే ఉండదు’’ స్కూలు బ్యాగ్‌ ఖుషీ వీపుకి తగిలిస్తూ అడిగింది లక్ష్మీదేవి.‘‘నీకూ, నాన్నకీ రానుపోనూ టిక్కెట్లు, ఉండడానికి బస కూడా రెడీ. టిక్కెట్లు నిన్ననే నాన్నకిచ్చాను’’ భార్య ముందు ఒరేయ్‌తో సరిపెట్టకుండా వెధవా మకుటం కూడా చేర్చినందుకు లోలోపలే కస్సుబుస్సుమంటున్నాడు భాస్కర్‌.‘‘బై అమ్మా, నాన్నా, నానమ్మా స్కూలుకి వెళ్లొస్తా’’ అని బెడ్‌రూమ్‌లోకి చూస్తూ ‘‘తాతయ్యా! బై. సాయంత్రం నేనొచ్చే లోపు కాశీకెళ్లిపోతారా’’ అడిగింది ఖుషీ. ‘‘అవును తల్లీ, మధ్యాహ్నమే రైలు. నువ్వొచ్చేసరికి బయలుదేరుతాం’’ అంటూ తనూ హాల్లోకి వచ్చి మనుమరాల్ని దగ్గరకు తీసుకున్నాడు తాతయ్య. ‘‘మళ్లీ ఎప్పుడొస్తారు నానమ్మా’’లక్ష్మీదేవి దగ్గరకు వెళ్లి ఆమెను చుట్టుకుంటూ గారాలు పోయింది ఖుషీ. ‘‘ఫిఫ్టీన్‌ డేసే... రెండు సన్‌డేల తర్వాత వచ్చేస్తాం బంగారూ’’ ఎంతో దూరంలో లేదన్నట్లు ఆ చిట్టిబుర్రకు నచ్చేలా చెప్పాడు తాతయ్య.

‘‘పాపకు సాక్స్‌ వేసే ముందు పాదాలు, వేళ్ల సందుల్లో పౌడర్‌ వేయండి’’ అన్నది సౌందర్య కిచెన్‌లో పాప లంచ్‌బాక్స్‌ సర్దుతూ.‘‘నీకెన్ని సేవలు చేయాలే తల్లీ. కాళ్లకూ పౌడరేయాలా’’ అంటూ డ్రెస్సింగ్‌ టేబుల్‌ మీదున్న పౌడర్‌ డబ్బా తీసుకుని ముందుగదిలోకొచ్చాడు భాస్కర్‌. ‘‘పౌడర్‌ వేయకపోతే సాయంత్రానికి పాదాలు చెమట పట్టి నానిపోతాయి నాన్నా’’ అన్నది ఖుషీ. కళ్లు, నోరు, చేతులూ తిప్పుతూ తనకంతా తెలుసన్నట్లు ఆరిందలా చెప్పింది కానీ, ఆ గొంతులో నాన్నా నీకిది కూడా తెలియదా అనే టోన్‌ వినిపిస్తోంది భాస్కర్‌కి. ఖుషీకి షూస్‌ వేసి బకిల్‌ పెడుతున్నాడు భాస్కర్‌. ‘‘ఇంకా వేయలేదా’’ అంటూ లంచ్‌బాక్స్, వాటర్‌ బాటిల్‌ సర్దిన బాస్కెట్‌ తెచ్చింది సౌందర్య.

‘‘షూస్‌ కరెక్ట్‌ సైజ్‌ తెచ్చావు. రెణ్నెల్లకే టైట్‌ అవుతాయి. మళ్లీ కొత్తవి కొనాలి. డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?’’ సౌందర్య కనిపించగానే భాస్కర్‌ అసహనం మాటల్లో ప్రవహించింది. భాస్కర్‌ వైపు ఓ సారి చూసి లోపలికి వెళ్లింది సౌందర్య స్కూల్‌ బ్యాగ్‌ తేవడానికి.‘‘నాన్నా! అమ్మ షూస్‌లోపల కాటన్‌ పెట్టింది. ఇప్పుడు నాకు సరిపోతున్నాయి. టైట్‌ అయినప్పుడు ఆ కాటన్‌ తీసేస్తుందట’’ ఖుషీ మెల్లగా చెవిలో చెప్పినట్లే చెప్పింది. కానీ భాస్కర్‌కి మాత్రం ‘నాన్నా! నీకిది కూడా తెలియదు’ అని ఎగతాళి చేస్తున్నట్లే ఉంది.‘‘నానమ్మ, తాతయ్య ఇంకా ఎన్నిరోజులకొస్తారు నాన్నా’’ అడిగింది ఖుషీ సడెన్‌గా. ‘‘దానికి రెండ్రోజులుగా వాళ్ల నానమ్మ గుర్తుకొస్తోంది. బెంగపెట్టుకున్నట్లుంది. ఫోన్‌ చేసినప్పుడు మాట్లాడించకపోయారా’’ స్కూలు బ్యాగ్‌ తెస్తూ అంది సౌందర్య.

‘‘నానమ్మా, తాతయ్యా’’ అరుస్తూ ఎదురెళ్లింది ఖుషీ.‘‘మీ నాన్న నీకు ఏమంటూ ఖుషీ అని పేరు పెట్టాడో కానీ, ఎప్పుడూ సంతోషంగా ఉంటావ్‌ బంగారు తల్లీ’’ మురిసిపోతూ మనుమరాలిని దగ్గరకు తీసుకుంది లక్ష్మీదేవి.‘‘మీ నాన్న నీకు లక్ష్మీదేవి అని పెట్టారు. ఏం లక్షలు కారిపోతున్నాయిక్కడ’’ బ్యాగ్‌ కింద పెట్టి సోఫాలో కూర్చుంటూ సాగదీశాడు ఖుషీ తాతయ్య. ‘‘నన్ను చేసుకోకముందు కోట్లు లెక్కపెట్టడానికి చేతులు నొప్పెట్టి పదిమంది జీతగాళ్లను పెట్టుకున్న వాళ్లాయే పాపం’’ మూతి విరిచింది లక్ష్మీదేవి. ‘‘స్నానాలు చేయండి, తర్వాత మాట్లాడుకుందాం’’ అంది సౌందర్య కాఫీ ఇస్తూ. ఖుషీ కోసం తెచ్చిన బొమ్మలు, కొడుకు, కోడలికి తెచ్చిన డ్రస్‌లు తీసి బయట పెడుతోంది లక్ష్మీదేవి. ‘‘నీకేం తెచ్చుకున్నావ్‌ నానమ్మా’’ అంటూ బ్యాగ్‌లో ఉన్న గులాబీ రంగు చీరను బయటకు తీసింది ఖుషీ.

‘‘ఈ కలర్‌ శారీస్‌ మీకు చాలానే ఉన్నాయి కదత్తయ్యా’’ అంటూ ఆ చీరను చేతిలోకి తీసుకుంది సౌందర్య.‘‘మీ మామయ్యతో వెళ్తే ఇక మరే రంగూ తీసుకోనివ్వడు కదా మరి’’ ఆ మాటలో విసుగు, కొంచెం మురిపెం కూడ.‘‘పెళ్లి చూపుల్లో ఈ రంగు చీరతోనే నన్ను మోసం చేశారు మీ వాళ్లు. కనీసం ఆ భ్రమలోనైనా బతుకుదామని’’ కౌంటర్‌ పడేసి తన బ్యాగ్‌ తీసుకుని గదిలోకి వెళ్లాడు ఖుషీ తాతయ్య.బ్యాగ్‌ ఓపెన్‌ చేసి లక్ష్మీదేవి తన కోసం కొన్న ముఖమల్‌ షాల్‌ని చేతిలోకి తీసుకున్నాడు. దానిని చేత్తో తడుముతూంటే పెదవుల మీద మెత్తటి చిరునవ్వు. ఎప్పుడో మాటల సందర్భంలో ముఖమల్‌ షాల్‌ తనకిష్టమని చెప్పాడు. ఎన్నేళ్లయిందో అలా చెప్పి. ఆ మాట గుర్తుపెట్టుకుని మరీ ఎక్కడికెళ్లినా అలాంటి షాల్‌ కోసమే వెతికేదట. అది దొరికే వరకు ఆ మాట కూడా చెప్పనేలేదు. రైల్లో వస్తూ చెప్పింది ఇన్నేళ్ల అన్వేషణ గురించి. తన ఇష్టాలను నేను గుర్తు పెట్టుకుని తీర్చినవి ఏమైనా ఉన్నాయా... అంతర్మధనం మొదలైంది ఆయనలో.

‘‘కాశీలో ఏం వదిలారత్తయ్యా’’ ఇడ్లీల హాట్‌బాక్స్‌ టేబుల్‌ మీద పెడుతూ అడిగింది సౌందర్య. లక్ష్మీదేవి పూజలో ఉంది.. విన్నట్లు లేదు. ‘‘కాశీలో ఏం వదులుతారమ్మా’’ ఖుషీ అందుకుంది. ‘‘కాశీకెళ్లిన వాళ్లు గయలో తమకు ఇష్టమైన వాటిని వదిలి వస్తారు. అమ్మమ్మ తనకు బాగా ఇష్టమైన గుత్తివంకాయ కూరను వదిలేసింది, తాతయ్యేమో...’’ సౌందర్య చెప్తుండగానే ‘‘మా నాన్నకు కొబ్బరి పచ్చడి ఇష్టం కదా, ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేయకూడదా సౌందర్యా’’ భాస్కర్‌ ప్లేటులో ఇడ్లీ పెట్టుకుంటూ అన్నాడు. మాటల్లోనే లక్ష్మీదేవి కూడా వచ్చి ప్లేటు తీసుకుంది ‘‘నానమ్మా! కాశీలో ఏం వదిలొచ్చావు’’ అడిగింది ఖుషీ. b‘‘మీ తాతయ్యను వదిలేద్దామనుకున్నా, వదిలేసినా రైలెక్కి ఇంటికే కదా వస్తాడు... అందుకే ఎక్కడికెళ్లినా తప్పని తద్దినాన్ని వదిలిపెట్టడం ఎందుకని తీసుకొచ్చా’’ అంది గదిలోకి వినిపించేటట్లు.
‘‘అందుకే చెబుతారు కాశీకి వెళ్లినా రాసినమొగుడేనని’’ గదిలో నుంచే రిటార్ట్‌.

‘‘నాన్నా! నువ్వు, అమ్మ కూడా కాశీకి వెళ్తారా’’ భాస్కర్‌ తలలో తెల్ల వెంట్రుకను లాగుతూ అడిగింది ఖుషీ.‘‘ఆ వెళ్తాం, నేనైతే మీ నాన్నను అక్కడే వదిలేసి వస్తా. మీ నానమ్మలా తిరిగి తీసుకురాను’’ అంది సౌందర్య దుప్పటి ముసుగుపెట్టుకుంటూ.‘‘నాన్నా! మరి... నసుగుతోంది’’ ఖుషీ.‘‘ఏంటి తల్లీ! చెప్పు’’ అన్నాడు భాస్కర్‌ కూతురిని బుగ్గలు పుణుకుతూ.‘‘మరి నాకు రోజూ స్కూల్‌కెళ్లేటప్పుడు షూస్‌ ఎవరేస్తారు, స్కూలు దగ్గర ఎవరు దింపుతారు?’’‘‘!?!’’ భాస్కర్‌కి నో డైలాగ్‌. స్టోరీ ఎండ్‌.

సినిమాలో సంసారం
తత్త్వం... బోధపడింది!

శంకర్‌ నారాయణ (చిరంజీవి) వారణాశిలో(కాశీ) ట్యాక్సీ డ్రైవర్‌. కాశీ కొచ్చిన బాలుని(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) అన్ని ఘాట్‌ వద్దకు తీసుకెళ్లి చూపించడానికి, కాశీ విశిష్టతను వివరించడానికి రూ.300 బేరం కుదుర్చుకుంటాడు శంకర్‌ నారాయణ. ఇద్దరూ గంగా నదిలో పడవలో వెళుతుంటారు. ‘కళలు 64 ఎలా ఉన్నాయో అలాగే ఈ ఘాట్స్‌ కూడా 64 ఉన్నాయండీ. పురాణాల్లో హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసిన ఘాట్‌ అదేనండీ. ప్రపంచమంతా బ్రతకడం కోసం చస్తుంటారండీ. కానీ, కాశీలో మాత్రం చావడం కోసమే బ్రతుకుతుంటారండీ’ అంటాడు శంకర్‌.

నువ్వు మాట్లాడుతుంటే ట్యాక్సీ డ్రైవర్‌ మాట్లాడుతున్నట్లు లేదు. ఆ అర్జునుడి రథం తోలిన కృష్ణ పరమాత్ముడు మాట్లాడుతున్నట్లుంది అంటాడు బాలు. ‘పొగడ్త పన్నీరు లాంటిదండీ.. అది ఒంటిమీద చల్లుకోవాలే తప్ప బాగుంది కదాని తాగేయకూడదు’ బదులిస్తాడు శంకర్‌ నారాయణ ‘ఇంద్ర’ సినిమాలో. జీవితంలో అనురాగం, సంతోషం, త్యాగం, వైరాగ్యం... అన్నీ ఉండాలనే తత్త్వం బోధపడుతుంది.
– మంజీర

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement