ఇది ఇంకో షోలే
భారతీయ సినిమా రంగంలో షోలే స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1975 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా దాని నిర్మాత, దర్శకులకు ఎన్ని వందల కోట్లు ఆ రోజుల్లోనే కలెక్ట్ చేసి పెట్టిందో ఎవరి ఊహకూ అందదు. అంతులేని సంపదను ఇప్పటికీ షోలే అందిస్తూనే ఉంది. ఎందరో నిర్మాతలకు, దర్శకులకు స్ఫూర్తినిచ్చిన ఈ సినిమా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 40 విడ్డూరాలు తెలుసుకుందాం.
►షోలే దర్శకుడు రమేశ్ సిప్పి నిర్మాత జి.పి.సిప్పీ కుమారుడు. అందాజ్ (1971), సీతా ఔర్ గీతా (1972) తీశాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ఈసారి భారీ సినిమా తీద్దాం అని నిర్ణయించుకోవడంతో షోలేకు అంకురార్పణ జరిగింది.
►సిప్పీలు సింథీలు. స్వస్థలం కరాచి. జి.పి.సిప్పీ కాశ్మిర్ నుంచి కార్పెట్లు తెచ్చి అమ్మేవాడు. ఆ తర్వాత బిల్డర్ అయ్యి డబ్బు సంపాదించి నిర్మాతగా మారాడు.
►రచయితలు సలీమ్-జావేద్ అప్పటికి ఇంకా గొప్ప పేరులోకి రాలేదు. కొన్ని కథల నుంచి ఒక కథను తయారు చేయడంలో సిద్ధహస్తులు. మన రాముడు- భీముడును తిరగేసి సీతా-గీత స్క్రిప్ట్ రాశారు. ఆ టాలెంట్ కనిపెట్టి వీరిద్దరినీ ఒక నెల పాటు కూచోబెట్టి రమేష్ సిప్పి ఈ కథను తయారు చేయించాడు.
► ‘వీరూ’ పాత్రకు ధర్మేంద్ర ముందే ఖాయమయ్యాడు. అయితే ‘జయ్’ పాత్ర శతృఘ్నసిన్హాను వరించాల్సింది. అమితాబ్‌కు రాసిపెట్టి ఉంది. అయితే ఇందులో ధర్మేంద్ర రికమండేషన్, జయబాధురి వేడుకోలు ఉన్నాయని అంటారు.
►గబ్బర్ సింగ్ అనే బందిపోటు 1950లలో నిజంగానే ఉండేవాడు. సలీమ్ తండ్రి గ్వాలియర్ ప్రాంతంలో పోలీస్ కావడం వల్ల ఆయన ద్వారా సలీమ్‌కు బందిపోట్ల కథలు తెలుసు. అలా ఆ పాత్ర వచ్చింది. దీనికి ముందు డేనీ డెంజోప్పాని అనుకున్నారు. కాని కొత్త నటుడు అంజద్‌ఖాన్ దీని కోసం ఇది వరకే పుట్టి ఉన్నాడు.
►షోలే కంటే ముందే హిందీలో అలాంటి కథాంశంతో ‘ఖోటే సిక్కే’, ‘మేరా గావ్ మేరా దేశ్’ సినిమాలు వచ్చాయి. ఆ రెండూ చూసినవారికి షోలే చూడటంలో థ్రిల్ కొంచెం తగ్గుతుంది.
►షోలే ఆదాయంలో కొంతభాగం నిజానికి జపాన్ దర్శకుడు అకిరా కురసావాకు దక్కాలి. షోలేకు మూలం లాంటి ‘సెవన్ సమురాయ్’ ఆయనే తీశాడు.
►షోలే డైలాగ్స్ రాసింది జావేద్ అక్తర్. కాని సినిమా మొత్తాన్ని ఆలోచించింది సలీమ్. పని విభజన అలా జరిగిందని తెలుసుకోవాలి.
►నిజజీవితంలో హేమమాలిని చాలా తక్కువ మాట్లాడుతుంది. జయబాధురి వాగుడుకాయ. షోలేలో ఈ స్వభావాలకు పూర్తి భిన్నమైన పాత్రలను వాళ్లిద్దరూ పోషించారు.
►షోలేలో నటించిన అమితాబ్, జయబాధురి అప్పటికే దంపతులు. ధర్మేంద్ర, హేమమాలిని సినిమా విడుదలైన 5 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నారు.
►బందిపోటు సినిమాలను అప్పటి వరకూ చంబల్‌లోయలో తీయడం ఆనవాయితీ. రమేష సిప్పీ దీనిని నిరాకరించడంతో ఆర్ట్ డెరైక్టర్ రామ్ ఎదేకర్ దేశమంతా ఒక కారేసుకుని తిరిగి బెంగుళూరు మైసూరు దారిలో ఉన్న కొండప్రాంతాన్ని ఎంపిక చేశారు. షోలే భక్తులు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. అక్కడ రామ్‌నగర్ అనే ఊరు కూడా ఉంది.
►షోలేను 1973లో మొదలుపెట్టి రెండున్నరేళ్లు తీశారు. గబ్బర్ అసిస్టెంట్ ‘సాంబ’ పాత్రను పోషించిన మెక్ మోహన్ లాంటి నటుడు ముంబై నుంచి బెంగుళూరుకి 26 సార్లు తిరగాల్సి వచ్చింది.
►సినిమాటోగ్రాఫర్ ద్వారకా ద్వివేచాకు పర్‌ఫెక్షనిస్ట్ అని పేరు. రాజీపడేవాడు కాదు. అరవైఏళ్లు పైబడిన ఆయన ఈ షూటింగ్ సమయంలో స్థానికంగా ఉండే ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.
►యూనిట్ బస చేసిన బెంగుళూరులో రోజూ పార్టీలు జరిగేవి. అందరికంటే ఎక్కువ తాగడం మేల్కోవడం అనే బాధ్యత సంజీవ్ కుమార్ తీసుకునేవాడు.
►షోలేలో చిన్న పాత్రలు వేసినవాళ్లకు చిరకీర్తి లభించింది. కాలియా పాత్రను ధరించిన విజూ ఖోటే ఈ పాత్ర వల్లే ఇండస్ట్రీలో కొనసాగాడు.
►ముస్లిం ఇమామ్ పాత్ర పోషించిన కె.ఎ.హంగల్‌కు చాలా పేరు వచ్చింది. అయితే హంగల్ ఆ పాత్రను అలా కాకుండా వేరేలా చేసి ఉండాల్సిందనే అసంతృప్తితోనే చివరి వరకూ గడిపాడు.
►జయబాధురి దీపాలు వెలిగించే సీన్ సినిమాలో ఒకటి రెండు నిమిషాలు ఉంటుంది. కాని దానిని పందొమ్మిది రోజులు తీశారు.
►షోలేలో హింస ఉంది కాని రక్తం కనపడదు. ఠాకూర్ మనవణ్ణి గబ్బర్‌సింగ్ కాల్చడం ఇందులో చాలా కలచివేసే దృశ్యం. కాని శవాన్ని చూపించరు. చీమను చంపడం ద్వారా ఇమామ్ కొడుకైన సచిన్‌ను చంపినట్టు సజెస్టివ్‌గా చూపిస్తాడు దర్శకుడు.
►రామ్‌లాల్ పాత్ర వేసిన సత్యన్‌కు ఇండస్ట్రీలో చాలా గౌరవం ఉండేది. ఆయన లెఫ్టిస్ట్. సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడు.
►షోలే కోసం హాలీవుడ్ స్టంట్స్‌మెన్ ఇద్దరు వచ్చి పని చేశారు. వాళ్లు తెచ్చిన సేఫ్టీ ఎక్విప్‌మెంట్ వల్లే ప్రమాదాలు లేకుండా ఆ పోరాటాలన్నీ తీయగలిగారు.
►సూర్మా భోపాలి పాత్రను వేసిన జగ్‌దీప్ పాత్ర ఎంత ఫేమస్ అంటే చివరకు ఆ పేరుతోనే అతడు హీరోగా యాక్ట్ చేసి సినిమా తీశాడు.
►జైలర్ పాత్ర అస్రానీకి చాలా పేరు తెచ్చింది. ఇప్పటికీ అలాగే నటించమని అతణ్ణి దర్శకులు పీక్కుతింటుంటారు.
►మౌసీ దగ్గరకు వెళ్లి ధర్మేంద్రతో బసంతి పెళ్లి గురించి అమితాబ్ మాట్లాడే సీన్ చాలా హిలేరియస్‌గా ఉంటుంది. కాని అది కిశోర్ కుమార్ నటించిన హాఫ్ టికెట్ సినిమాలోని సీన్‌కు కాపీ.
►ధర్మేంద్ర వాటర్ ట్యాంకర్ మీదెక్కి గోల చేసే సీన్‌ను బెంగుళూర్ ఎయిర్‌పోర్ట్‌లో జావేద్ అక్తర్ హడావిడిగా రాసిచ్చి బొంబాయి ఫ్లయిట్ ఎక్కాడు.
►సినిమాకు రాసిన ప్రతీ డైలాగ్ హిట్టే. జో డర్ గయా సంఝో మర్‌గయా... తేరా క్యా హోగా కాలియా.... యే హాత్ ముఝే దేదే ఠాకూర్... బసంతీ... ఇన్ కుత్తోంకే సామ్‌నే మత్ నాచ్‌నా.... ప్రతిదీ హిట్టే.
►షోలే విడుదలయ్యాక మొదటి రెండు వారాలు సూపర్ ఫ్లాప్. ప్రొడ్యూసర్ పారిపోబోతున్నాడనే పుకార్లు రేగితే ఫైనాన్షియర్లు ఎయిర్‌పోర్ట్ దగ్గర జి.పి.సిప్పీ కోసం కాపు కాచారు.
►{పివ్యూ చూసి షోలేను రాజ్‌కపూర్ కూడా అంచనా వేయలేకపోయాడు. మొదటి పది నిముషాల్లోనే అంత పెద్ద ట్రైన్ రాబరీ పెట్టేయడం ఆయనకు మింగుడు పడలేదు.
►బ్లాక్ టికెట్లు అమ్ముకున్నవాళ్లు ఈ సినిమాతో సెటిలైపోయారని అంటారు.
►సినిమా ఫ్లాపైతే తమ మీదకు ఎక్కడ వస్తుందోనని జావేద్ అఖ్తర్‌లు భయపడ్డారు. ఎందుకైనా మంచిదని అంజద్‌ఖాన్ మీద నెపం వెతుక్కున్నారు. ఒకవేళ ఫ్లాప్ అయితే అతని యాక్టింగ్ వీక్‌గా ఉండటం వల్లే పోయింది అని చెప్పాలనుకున్నారు. కాని సినిమా రిలీజయ్యి అంజాద్ ఖాన్‌కు ఎక్కడ లేని కీర్తి తెచ్చి పెట్టింది. అయితే వీళ్ల పథకం తెలిసిన అంజాద్ ఖాన్ మనసు కష్టపెట్టుకుని ఆ తర్వాత జావేద్ అఖ్తర్‌లు రాసిన ఏ సినిమాలోనూ పని చేయలేదు.
►ధర్మేంద్ర మెయిన్‌రోల్ వేసిన సినిమాల్లో అమితాబ్ యాక్ట్ చేశాడు తప్ప అమితాబ్ మెయిన్ రోల్ వేసిన సినిమాల్లో ధర్మేంద్ర యాక్ట్ చేయలేదు. షోలేలో ధర్మేంద్రదే మెయిన్ రోల్.
►ఆర్.డి.బర్మన్ ఈ సినిమాకు ఇచ్చిన రీరికార్డింగ్ పెద్ద హిట్. ఏ దోస్‌తీ పాట స్నేహానికి ఒక జాతీయ గీతంలా స్థిరపడింది.
►షోలేలో రఫీ ఒక్క పాట కూడా పాడలేదు.
►మెహబూబా... మెహబూబా... పాట మొదట ఆశాభోంస్లేతో అనుకున్నారు. కాని ఆర్.డి.బర్మన్ పాడాడు. హెలన్ డాన్స్ చేసింది. పాటగాడిగా జలాల్ ఆగా యాక్ట్ చేశాడు. అప్పటికే ఆమె సలీమ్‌తో ప్రేమలో ఉంది.
►స్టీరియోఫొనిక్‌లో తీయడం వల్ల సినిమా చివర్లో అమితాబ్ కాయిన్ విసిరితే ప్రేక్షకులు కుర్చీల కింద వెతికేవారు.
►షోలేలో ధర్మేంద్ర, అమితాబ్‌లు వాడిన బట్టలు రెండు మూడు జతలకు మించి ఉండవు.
►షోలేని కాస్త అటూ ఇటూ మార్చి శోభన్‌బాబుతో కక్ష తీశారు. ఈ కథను గుహనాథన్ తయారు చేశాడు.
►షోలేలోని కొన్ని సన్నివేశాలు అడవి రాముడులో కనిపిస్తాయి.
►షోలేకి రామ్‌గోపాల్ వర్మ ఎంత వీరాభిమాని అంటే దానిని రీమేక్ చేసి ఎక్కడలేని అప్రతిష్ట మూటగట్టుకున్నాడు.
►షోలే సినిమా వల్లే పవన్ కల్యాణ్‌కు గబ్బర్‌సింగ్ అనే హిట్ సినిమా టైటిల్ దొరికింది.
►విలన్‌ను కాళ్లు చూపిస్తూ ఇంట్రడ్యూస్ చేయడం ఆ తర్వాత వందలాది సినిమాలో విలన్‌లకూ హీరోలకూ అనుకరించారు.