పరిశీలన.. గ్రాహ్య శక్తి రెండేళ్ల పాపను రక్షించాయి.. పేపర్ నాప్‌కిన్స్, క్రైమ్‌సీన్ టేప్ పాతికేళ్ల అమ్మాయి పరువును కాపాడాయి.. పాలిథిన్ కవర్లు, కార్టన్స్.. ఇరవైఏళ్ల పిల్లను ప్రాణాలతో నిలబెట్టాయి.. నాలుగు గోడల మధ్య బందీ అయినప్పుడు ఆలోచనను మించిన ఆధారం ఉండదు! కామన్‌సెన్స్‌కు సరితూగే ఆయుధం దొరకదు! ఆ ముగ్గురూ ఉపయోగించింది అదే! ఆ సంఘటనలు నిరూపించిన సత్యమూ అదే!
సినిమా కథలే.. జీవితానికి పనికొచ్చే పాఠాలు!!
హండ్రెడ్‌కు డయల్ చేయాల్సింది.. ఏమైనా సరే జనం ఉన్నవైపు వెళ్లాల్సింది. తొమ్మిదిగంటల రాత్రి రోడ్డు మీద నిలబడ్డా.. టోల్‌ప్లాజాలో ఉన్నా చూసేవాళ్లు ఏమనుకుంటారు? రోజూ వచ్చేపోయే రూటే. అయినా పరిసరాలను ఎప్పుడూ గమనించింది లేదు. అందుకే పంక్చర్, మెకానిక్ షాపులు ఎక్కడుంటాయో.. ఏ వేళ వరకూ తెరిచి ఉంటాయో తెలియలేదు. కనీసం తెలిసినట్టు నటించే స్మార్ట్‌నెస్‌నూ ప్రదర్శించలేదు. తెగువ చూపించాల్సిన టైమ్ భయంతో భర్తీ అయింది. మనుగడ వాంఛ ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా చేస్తుంది.. ప్రాణాలతో నిలబెడుతుంది. చదువుల ఫ్యాక్టరీల్లోంచి మార్కుల అచ్చులుగా బయటకు వచ్చిన అమ్మాయిల్లో ఈ సర్వైవల్ ఇన్‌స్టింక్టే కొరవడిందని ‘దిశ’ సంఘటన రుజువు చేసింది. ఉండాల్సిన అవసరం ఎంత ఉందో ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు.. పిహూ (హిందీ), ‘ఆడై’ (తమిళ సినిమా.. తెలుగులో ‘ఆమె’గా డబ్ అయింది), ‘హెలెన్’ (మలయాళం) చూపించాయి.
పిహూ...
రెండేళ్ల పిల్ల పిహు. ఇంకా అమ్మ పాలు విడవని కూన. పిహూ రెండో పుట్టినరోజు రాత్రి అమ్మ, నాన్న పోట్లాడుకుంటారు. మరుసటి రోజు వేకువ జామునే మీటింగ్ ఉందని తండ్రి ఊరెళ్లిపోతాడు. మనస్తాపంతో ఉన్న తల్లి.. నిద్రమాత్రలు మింగుతుంది. ఉదయం నిద్రలేచిన పిహూ.. పక్కనే అచేతనంగా ఉన్న ‘అమ్మ’ను నిద్రలేపుతూంటుంది.. ‘టాయ్‌లెట్‌కి’ తీసుకెళ్లమని. ఎంతకీ కళ్లు తెరవని అమ్మను దాటుకుంటూ తనే బాత్రూమ్‌లోకి వెళ్తుంది. వచ్చి మళ్లీ అమ్మ పక్కనే పడుకుంటుంది. కాసేపాగి మళ్లీ తల్లిని తడుతుంది.. ఆకలేస్తోంది పాలిమ్మని. స్పందించని అమ్మ వైపు తిరిగి తానే పాలు తాగాలని ప్రయత్నిస్తుంది. బిగుసుకుపోయిన తల్లి శరీరం కదలక పోయేసరికి.. విసిగిపోయిన ఆ పిల్ల.. వంటింట్లోకి వెళ్లి.. స్టూలును గ్యాస్‌గట్టు దగ్గరకు లాక్కొని దాని మీద ఎక్కి స్టవ్ ఆన్ చేస్తుంది. బ్రెడ్ కాల్చుకోవాలని ట్రై చేసి చేయి కాల్చుకుంటుంది. ఏడుస్తూ తిరిగి బెడ్‌రూమ్‌లోకి వస్తుంది. తండ్రి ఊరు వెళ్లేముందు బట్టలు ఇస్త్రీ చేసుకోవాలని ఐరన్ బాక్స్ ఆన్ చేస్తాడు.
కరెంట్ పోవడంతో స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే వదిలేసి.. ఫ్లయిట్ టైమ్ అవుతోందని వెళ్లిపోతాడు. కరెంట్ వచ్చి ఇస్త్రీ పెట్టె వేడుక్కుతుంటూంటుంది. ఆ స్విచ్ బోర్డ్‌కే ఉన్న ఇంకో ప్లగ్‌లో సెల్ ఫోన్ చార్జింగ్ అవుతూంటుంది. వంటింట్లో స్టవ్ వెలుగుతూంటుంది. ఈ లోపు ఆ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ టేబుల్ దగ్గరకు వెళ్తుంది ఫోన్ తీసుకుందామని పిహూ. కాని ఆ టేబుల్ ఈ అమ్మాయికి అందదు. వైర్ పట్టుకొని లాగేసరికి పక్కనే నిలువుగా పెట్టి ఉన్న ఐరన్ బాక్స్ టేబుల్ మీద పడిపోయి కాలుతూంటుంది. బెడ్‌రూమ్ దగ్గరున్న ఫినాయిల్ క్యాన్‌లో ఫినాయిల్ తెల్లగా కనిపించేసరికి పాలు అనుకొని తన బాటిల్లో పోసుకుంటూంటే మొత్తం ఒలికిపోయి ప్రమాదం తప్పుతుంది పిహూకి. ఇలా ఓ 24 గంటలు ఒక రెండేళ్ల పాప ఆ ఇంట్లో ఎలా గడిపింది.. ఆ వయసుకు తగ్గ స్పృహతో ప్రమాదాల బారినుంచి ఎలా బయటపడింది అన్నదే ఈ సినిమా. 2014లో ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్త ఆధారంగా తీశారు.
ఆమె..
తమిళంలో ‘ఆడై’ పేరుతో వచ్చింది. ‘ఆడై’ అంటే ‘దుస్తులు’ అని అర్థం. కథానాయిక కామిని టీవీ యాంకర్. ప్రేక్షకులను బకరా చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూంటుంది. అలా ఒకరోజు సివిల్స్ మెయిన్స్ పరీక్షకు హాజరవబోతున్న ఓ పేదింటి అమ్మాయినీ బకరా చేస్తుంది. దాంతో ఆ రోజు ఆమె ఆ పరీక్ష రాయలేకపోతుంది. ఆ బాధను, అవమానాన్ని మనసులో పెట్టుకుంటుంది ఆ అమ్మాయి. తర్వాత కామిని బర్త్‌డే వస్తుంది. ఆ రాత్రి తన సహోద్యోగులతో తమ ఆఫీస్ పాత బిల్డింగ్‌లో పార్టీ చేసుకొని మత్తులో ఒళ్లు తెలియకుండా బాత్రూమ్‌లో పడిపోతుంది కామిని. మెలకువ వచ్చేసరికి నగ్నంగా ఉంటుంది. బాత్రూమ్‌లోంచి బయటకు రాగానే సెక్యూరిటీ వాళ్ల అలికిడి వినిపించడంతో నగ్నంగా ఉన్న తన శరీరం వాళ్ల కంటపడకుండా టేబుల్ కింద దాక్కుంటుంది. ఆ పాత బిల్డింగ్‌కి తాళం వేసే ముందు అన్ని అంతస్తులు చెక్ చేసుకుంటూ కామిని ఉన్న అంతస్తుకీ వస్తారు సెక్యూరిటీ వాళ్లు.
ఎవరూ లేరని నిర్థారించుకొని తాళం వేసి వెళ్లిపోతారు. బ్యాటరీ చివరి దశలో ఉన్న సెల్‌ఫోన్ తప్ప ఇంకే ఆధారం ఉండదు కామినీకి. ఆ రాత్రి ఏం జరిగిందో.. తన ఒంటి మీద బట్టలు ఎలా మాయమయ్యాయో.. తన కొలీగ్స్ ఎక్కడికి వెళ్లారో.. అంతుచిక్కకపోగా భయమూ మొదలవుతుంది ఆమెకు. బాత్రూమ్‌లో ఉన్న పేపర్ నాప్‌కిన్స్ రోల్, క్రైమ్‌సీన్ టేప్‌తో ఒళ్లంతా చుట్టుకుంటుంది. ఫోన్ డెడ్ అవకముందే తన తల్లికి, ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి తను ఉన్న పరిస్థితి చెప్పాలనుకుంటుంది. సిగ్నల్స్ లేక ఫోన్ పోదు. ఈలోపు ఆకలి మొదలవుతుంది. ఫుడ్ ఆర్డర్ చేసుకునేలోపు ఫోన్ డెడ్ అవుతుంది. ఆ విచిత్రమైన స్థితి నుంచి బయటపడ్డానికి 24 గంటలు పోరాడుతుంది. తన కామెన్‌సెన్స్‌ను ఉపయోగించి దుస్తులు తెప్పించుకొని, సురక్షితంగా ఆ బిల్డింగ్ నుంచి బయటకు వస్తుంది కామిని. ఇంతకీ ఆమెకు అలాంటి దుస్థితి కల్పించింది ఎవరో కాదు కామిని వల్ల సివిల్స్ మెయిన్స్ రాయలేకపోయిన అమ్మాయే.
హెలెన్..
మలయాళం సినిమా. కథానాయిక పేరు హెలెన్. అనారోగ్యంతో ఆమె తల్లి చనిపోతుంది. ఆ బాధలో ఉంటాడు తండ్రి. నర్సింగ్ కోర్స్ పూర్తయి కెనడాలో నర్స్ ఉద్యోగం సంపాదించుకునేందుకు కావల్సిన ట్రైనింగ్ తీసుకుంటూంటుంది. పార్ట్‌టైమ్‌గా ఒక మాల్‌లోని ‘మెక్ డొనాల్డ్స్’లో పనిచేస్తూంటుంది. అజహర్ అని హెలెన్‌కు బాయ్‌ఫ్రెండూ ఉంటాడు. ఒకసారి రాత్రి హెలెన్‌ను ఇంటిదగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తూండగా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్తాడు అజహర్. దీంతో ఆమె ప్రేమ వ్యవహారం తండ్రికి తెలుస్తుంది. మనసు నొచ్చుకొని హెలెన్‌తో మాట్లాడ్డం మానేస్తాడు. తండ్రిని బాధపెట్టానన్న పశ్చాత్తాపంతో అజహర్‌కి దూరంగా ఉంటుంది హెలెన్. ఈలోపు ఆమెకు కెనడాలో ఉద్యోగం ఖాయం అవుతుంది. వెళ్లేలోపు తండ్రిని క్షమాపణ అడగాలని విశ్వయత్నం చేస్తుంది హెలెన్.
కాని తండ్రి మనసు మారదు. ఒక రోజు మాల్ నుంచే తండ్రికి ఫోన్ చేస్తూంటుంది సారీ చెప్పాలని. తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో ఇంటికి వెళ్లాలనిపించక రాత్రి పదకొండున్నర దాకా మాల్‌లోనే ఉంటుంది. చివరకు పంచ్ చేసి బయలుదేరబోతూంటే కొలీగ్స్ వచ్చి.. ఆహార పదార్థాలు ఇస్తూ ఫ్రీజర్ (గది లాంటిది)లో పెట్టమని చెప్పి బయటకు వెళ్లిపోతారు. పర్స్, సెల్‌ఫోన్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి.. ఆ ఆహారపదార్థాలను తీసుకొని ఫ్రీజర్‌లోకి వెళ్తుంది హెలెన్. అప్పుడే అటువైపు వచ్చిన మేనేజర్ .. ఫ్రీజర్ గదికి తాళంలేకపోవడం చూసి.. తాళం వేసి రెస్టారెంట్ క్లోజ్ చేసి ఇంటిదారి పడ్తాడు. ఫ్రీజర్‌లో బందీ అయిపోతుంది హెలెన్.
రాత్రి పదకొండున్నర నుంచి తెల్లవారి అయిదు గంటల వరకు మైనస్ పదిహేడు డిగ్రీల సెంటిగ్రేడ్ చలిలో తనను తాను కాపాడుకోవడానికి అక్కడున్న ప్రతి చిన్న వస్తువునూ ఉపయోగించుకుంటుంది. చివరకు ఫోన్ కాల్ సిగ్నల్స్, వాచ్‌మన్ సమాచారంతో ఆ అమ్మాయిని బయటకు తెస్తారు. మిస్సింగ్ కేసుల్లో అయినవాళ్లు, పోలీసులు ఏఏ కోణాల్లో విచారణ జరపాలో కూడా స్పష్టంగా చూపిస్తుందీ సినిమా. ఏతావాతా.. ఈ మూడు చిత్రాలు ఇచ్చే సందేశం ఒక్కటే. కష్టాల్లో కామన్‌సెన్స్‌ను మించిన ఆయుధం ఉండదు అని. స్వేచ్ఛతోపాటు పరిసరాలపట్ల స్పృహ, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, ఆపదల నుంచి గట్టెక్కే తెగువ.. ఆత్మరక్షణాయుధాలు. మార్కులు, ర్యాంకులకన్నా ముఖ్యమైనవి. జీవిత దశను మార్చే దిశలు!
Comments
Please login to add a commentAdd a comment