రెండు లేవు... ఉన్నది ఒక్కటే మనసు
యువతరానికి నేను చెప్పేదొకటే... చిన్న చిన్న కష్టాలకు విచలితులైపోకండి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడడం, సూక్ష్మ బుద్ధితో వాటినుంచి తప్పుకోవడం అలవాటు చేసుకోండి. ప్రణాళికా బద్ధంగా జీవించండి. ఇటువంటి లక్షణాలుంటే మీరు రాణించగలరు. మీతో ఈ దేశానికి నవశకం ప్రారంభం కావాలి.
అబ్రహాం లింకన్ జీవితంలో ఒకానొకసారి ఒక అవమానకర సంఘటన జరిగింది. ఆయన అమెరికా అధ్యక్షుడయిన కొత్తల్లో దేశంలో పెట్టుబడుల్ని పెంచడానికి ధనవంతుల్ని, పారిశ్రామికవేత్తలను సమావేశపరచి అధ్యక్షోపన్యాసం చేయబోతున్నాడు. అసూయ అనే దిక్కుమాలిన గుణం కొందరిలో ఉంటుంది. వారు వృద్ధిలోకి రాలేరు, తెలిసినవారు వస్తే చూసి ఓర్వలేరు. వీలయినప్పుడల్లా వారిని బాధపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అబ్రహాం లింకన్ దేశాధ్యక్షుడయ్యాడని ఓర్వలేని ఓ ఐశ్వర్యవంతుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టాలనుకుని లేచి కాలికున్న బూటుతీసి ఎత్తిపట్టుకుని ‘‘లింకన్! నువ్వు చాలా గొప్పవాడిననుకుంటున్నావ్, దేశాధ్యక్షుడినని అనుకుంటున్నావ్. మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లుకుట్టాడు. ఇదిగో ఈ బూటు కూడా మీ నాన్న కుట్టిందే. నాకే కాదు, ఈ సభలో ఉన్న చాలామంది ఐశ్వర్యవంతుల బూట్లు కూడా ఆయనే కుట్టాడు. నువ్వు చెప్పులు కుట్టేవాడి కొడుకువి. అది గుర్తుపెట్టుకో. అదృష్టం కలిసొచ్చి ఆధ్యక్షుడివయ్యావ్. ఈ వేళ మమ్మల్నే ఉద్దేశించి ప్రసంగిస్తున్నావ్’’ అన్నాడు.
లింకన్ ఒక్క క్షణం నిర్లిప్తుడయిపోయాడు. నిజానికి ఆయన ఉన్న పరిస్థితిలో వెంటనే పోలీసుల్ని పిలిచి తనను అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఉండవచ్చు. కానీ అదీ సంస్కారం అంటే.. అదీ సంక్షోభంలో తట్టుకుని నిలబడడమంటే... అదీ తుఫాన్ అలను చాకచక్యంగా తప్పించుకోవడమంటే... లింకన్ వెంటనే తేరుకుని ఆ వ్యక్తికి శాల్యూట్ చేస్తూ ‘‘ఇంత పవిత్రమైన సభలో నా తండ్రిని గుర్తుచేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవమే. మీవి, మీ ఇంట్లోవారి బూట్లను కూడా కుట్టాడు. అలాగే ఈ సభలో కూడా ఎందరివో కుట్టాడు. నా తండ్రి వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు. అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నా. మా తండ్రి బూట్లు కుడితే అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం సైజుకన్నా ఎక్కువ తక్కువలు ఉండవు. ఒకవేళ మా తండ్రి కుట్టిన బూట్లలో ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి. నా తండ్రి నాకు కూడా బూట్లుకుట్టడం నేర్పాడు. నా తండ్రికి అప్రతిష్ఠ రాకూడదు. అందువల్ల నేను మీ ఇంటికొచ్చి ఆ బూట్లు సరిచేసి వెడతాను.
ఈ సభలో మా నాన్నగారిని గుర్తుచేసినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆనందబాష్పాలతో నా ప్రసంగం మొదలుపెడుతున్నా’’ అన్నాడు. అంతే! ఆయన్ని నలుగురిలో నవ్వులపాలు చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు. ఇదీ ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడమంటే. ఇదీ.. మనల్ని ముంచడానికి వచ్చిన అలమీద స్వారీ చేయడమంటే. పాఠాలతోపాటూ పిల్లలుగా ఇవీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన మెళకువలు.
ఒక మనిషిలో వచ్చిన ఒక చిన్న ఆలోచన ఆ తరువాత అతని భవిష్యత్తునే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను కూడా ఎలా ప్రభావితం చేస్తుందనేదానికి ఉదాహరణ - మన ధీరూబాయ్ అంబానీనే. ఆయన తండ్రి కేవలం ఒక ఉపాధ్యాయుడు. మొదట్లో బజ్జీలమ్ముకునేవాడు. తరువాత యెమెన్ లాంటి దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేశాడు. ఒక గ్యాస్ ఏజెన్సీలో సహాయకుడిగా చేశాడు. రు.50 వేల పెట్టుబడితో మొదట ఒక కాటన్ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంబానీకి ఆదర్శం ఎవరో తెలుసా! ఒక చీమ. అది నిరంతరం కష్టపడుతుంది. మనం బాగుపడాలని అనుకోవాలే గానీ మనకు ఆదర్శంగా చాలా కనిపిస్తాయి. కష్టపడి బతకడమంటే ఏమిటో చీమను చూసి నేర్చుకోవాలి. ధీరూబాయి కూడా ఒక్క క్షణం వృథా చేయలేదు. నియమబద్ధమైన జీవితం గడిపారు.
అంతదాకా ఎందుకు! మీరు పది గంటలకు ఒక చోటికి వెళ్ళాలి. అరగంట ప్రయాణమని తెలుసు. అటువంటప్పుడు పది నిమిషాలు తక్కువ పదికి ఎందుకు బయల్దేరాలి? బయల్దేరిన దగ్గరినుంచి హారన్ మీద బొటనవేలు ఎందుకు పెట్టి ఉంచాలి? ఎందుకంత స్పీడు? బండి నడుపుతూ ఎందుకా సెల్‌ఫోన్‌లో మాటలు? మీకు రెండు మనసులు లేవు. ఉన్నది ఒకటే. ఉన్న ఆ ఒక్క మనసు సెల్‌ఫోన్ వింటూంటే రోడ్డుమీద మీకు ఎదురుగా వచ్చేవారిని గురించి పట్టించుకోవడానికి మరో మనసు లేదు కదా! ప్రమాదం అనేది ఎంతసేపట్లో జరుగుతుంది? ఒక్క క్షణం... మనసు మీ దగ్గరలేని ఆ ఒక్క క్షణం... జీవితాల్ని ఎంత భయంకరం చేసేస్తుందో... క్షణం ఆలోచించండి.