ఆత్మావలోకనం | Died Every Man Who Is born | Sakshi
Sakshi News home page

ఆత్మావలోకనం

Published Mon, Apr 29 2019 12:29 AM | Last Updated on Mon, Apr 29 2019 1:00 AM

Died Every Man Who Is born - Sakshi

నువ్వు ఏమిటి అనేది నీ మెదడుకి ఒక బిందుమాత్రంగానే తెల్సి ఉంటుంది. అది నువ్వు గ్లాసు నీళ్లల్లో వేలు పెట్టి అవి వేడిగా ఉన్నాయో చల్లగా ఉన్నాయో చూడటం లాంటిది.

ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీలేదు. నువ్వు ఇంటికి వెళ్తున్నావు. కారు యాక్సిడెంటయింది. భార్యనీ ఇద్దరు పిల్లల్నీ వదిలేసి వచ్చేశావు. నిన్ను కాపాడుదామని డాక్టర్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నీ శరీరం ముక్కలయింది. నన్ను నమ్ము. నీ ప్రాణం పోయిన మరుక్షణం నన్ను కలిశావు. ‘‘ఏం జరిగింది? నేనెక్కడున్నాను?’’ నేను నిజం చెప్పాను. ‘‘నువ్వు మరణించావు. మళ్లీ మళ్లీ అడగాల్సిన పనిలేదు.’’ ‘‘ఆ ట్రక్కు... ఆ ట్రక్కు... దూసుకువచ్చి.’’ ‘‘అవును.’’ ‘‘నేను చచ్చిపోయానా?’’ ‘‘విచారించకు. పుట్టిన ప్రతిమనిషీ చావక తప్పదు.’’ చుట్టూ చూశాడు మరణించిన మనిషి. అంతా శూన్యం. ‘‘ఈ చోటు ఏమిటి? జీవితం ముగిశాక వచ్చేది ఇక్కడికేనా?’’ ‘‘దాదాపు అంతే!’’ ‘‘నువ్వెవరివి? దేవుడివా?’’ ‘‘అలాగే అనుకో.’’ ‘‘నా పిల్లలు... నా భార్య’’ ‘‘వాళ్లతో పనేమిటి?’’ ‘‘వాళ్లు క్షేమంగా ఉంటారా?’’

‘‘వాళ్లు క్షేమంగా ఉండాలని నేనూ అనుకుంటున్నా. నువ్వు ఇప్పుడే మరణించావు గనక నీ ఆలోచనలు నీ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి.’’ మరణించిన మనిషి తన ఎదురుగ్గా ఉన్న ఆకారం వైపు చూశాడు. అతడు దేవుడిలా కనపడలేదు. ఒక మామూలు మనిషిలా కనిపించాడు. ఒక ఆడమనిషిలా కనిపించాడు. ఒక అస్పష్టమైన రూపంలా కనిపించాడు. దేవుడిలా కాకుండా గ్రామర్‌ స్కూల్‌ టీచర్‌లా కూడా కనిపించాడు. ‘‘పెళ్లాం పిల్లల గురించి బాధపడకు. నీ సంతానం నిన్నొక మంచి మనిషిగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్లది నీ పట్ల కోపంగానీ ద్వేషంగానీ ఉండే వయస్సు కాదు. నీ భార్య పైకి దుఃఖిస్తుందేమో గానీ ఎలాగూ మీ పెళ్లి ‘బ్రేక్‌’ అవబోతున్నది కనుక ఆమెకు ఇది ఉపశమనమే. మహా అయితే కొంచెం విచారిస్తుందేమో!’’ ‘‘ఇప్పుడేం జరుగుతుంది? నేనెక్కడికి వెళ్తాను? స్వర్గానికా, నరకానికా?’’

‘‘ఎక్కడికీ వెళ్లవు. మళ్లీ పుడ్తావు.’’ ‘‘ఆ... అంటే... అదే కరెక్టా. హిందువులు చెప్పేదే నిజమా?’’ ‘‘అన్ని మతాలూ వాటి పద్ధతుల్లో కరెక్టే. నాతోరా!’’ మరణించిన మనిషి ఆ ఆకారాన్ని అనుసరించాడు. ‘‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’’ ‘‘ఫలానా చోటనేం లేదు. మాట్లాడుతూ నడుద్దాం, బాగుంటుంది.’’ ‘‘నేను మళ్లీ పుడితే... మళ్లీ అన్నీ మొదట్నించీ అనుభవించాలా?’’ ‘‘అన్ని గత జన్మలలోనూ నువ్వు సంపాదించిన జ్ఞానమూ అనుభవమూ నీ లోపలే ఉంటాయి. కానీ వాటిని నువ్వు గుర్తుచేసుకోలేవు’’ అంటూ మరణించిన మనిషిని ఆ ఆకారం తన భుజం మీద వేసుకుంది. ‘‘నీ ఆత్మ ఎంత గొప్పదో ఎంత అందమైనదో నువ్వు ఊహించలేవు. నువ్వు ఏమిటి అనేది నీ మెదడుకి ఒక బిందుమాత్రంగానే తెల్సి ఉంటుంది. అది నువ్వు గ్లాసు నీళ్లల్లో వేలు పెట్టి అవి వేడిగా ఉన్నాయో చల్లగా ఉన్నాయో చూడటం లాంటిది. గత నలభై ఎనిమిది యేళ్ల నుంచి మనిషిగా ఉన్నావు. అయినా నీ లోపల ఉన్న చైతన్య శక్తి గురించి నీకు తెలీదు. చాలాకాలం పాటు నాతో ఉంటే నీకది తెలుస్తుంది. కానీ జన్మ జన్మకీ మధ్య అంత తీరికా అవకాశమూ దొరకదు నీకు.’’

‘‘నేను ఎన్నిసార్లు పుట్టి ఉంటాను?’’ ‘‘అనేకసార్లు. వేల సార్లు. అనేక రూపాల్లో. ఈసారి నువ్వు చైనాలో ఓ రైతుకి బిడ్డగా పుడ్తావు అదీ 540 ఎ.డి.లో.’’ ‘‘ఆగాగు. ఏమిటీ? నువ్వు నన్ను కాలంలో వెనక్కి పంపుతావా?’’ ‘‘అవును. సాంకేతికంగా కాలం అనేది మీ ప్రపంచంలోనే ఉంటుంది. నేను ఎక్కడ్నుంచి వచ్చానో అక్కడ అది వేరుగా ఉంటుంది.’’ ‘‘నువ్వు ఎక్కడ్నించి వచ్చావో చెప్తావా?’’ ‘‘తప్పకుండా. నేను ఎక్కడ్నించి వచ్చానో అక్కడ నాలాంటి వాళ్లు ఉన్నారు. అక్కడ ఎలా ఉంటుందో తెల్సుకోవాలని ఉందికదా నీకు. కానీ సూటిగా చెప్పాలంటే అది నీకు అర్థం కాదు.’’ ‘‘కాలంలో వేరు వేరు ప్రాంతాల్లో నేను మళ్లీ మళ్లీ జన్మించి ఉంటే ఇదివరకు ఎప్పుడో నేను నీతో మాట్లాడి ఉంటానే.’’ ‘‘మాట్లాడే ఉంటావు. కానీ ఏ జన్మలోనూ నీ జీవితకాలంలో ఏం జరుగుతున్నదో నీకు తెలియదు.’’ ‘‘అంటే? జీవితానికి అర్థం ఏమిటి?’’ ‘‘సీరియస్‌గా అడుగుతున్నావా? ఇదొక రొటీన్‌ ప్రశ్న.’’ ‘‘కాదు. నా ప్రశ్నకు జవాబు కావాలి.’’ ‘‘నేను ఈ సమస్త విశ్వాన్ని ఎందుకు చేశానో, జీవితానికి అర్థం ఏమిటో తెల్సుకోవడానికి మానసిక పరిపక్వత ఉండాలి. నీకది లేదు.’’

‘‘అంటే? మానవజాతికా? మానవజాతి ఇంకా పరిపక్వత చెందలేదా?’’ ‘‘మానవజాతి కాదు. నువ్వు! ఈ విశ్వాన్నంతటినీ నీ కోసమే చేశాను. నీ కోసం మాత్రమే. ప్రతి కొత్త జన్మలో నువ్వు మానసికంగా పరిపక్వం అవుతూవుంటావు.’’ ‘‘నేను మాత్రమేనా? మరి మిగిలినవాళ్లంతా?’’ ‘‘ఇంకెవరూ లేరు. ఆ విశ్వంలో నువ్వూ నేనూ అంతే.’’ మరణించిన మనిషికి అర్థం కాలేదు. ‘‘కానీ భూమ్మీద ఇంతమంది మనుషులు ఉన్నారు కదా?’’ ‘‘అందరూ నువ్వే. అన్ని రూపాలూ నీవే.’’ ‘‘ఏమన్నావు? అందరూ నేనేనా? ఈ భూమ్మీద జీవించిన వాళ్లంతా నేనేనా? ప్రతి ఒక్కరూ నేనేనా?’’ ‘‘కాక. నువ్వే. అందరూ నువ్వే.’’ ‘‘అబ్రహం లింకన్‌ని నేనేనా?’’ ‘‘జాన్‌ వల్కస్‌ బూత్‌వి కూడా నువ్వే’’ (లింకన్‌ను హత్య చేసిన అమెరికా నటుడు. ‘‘హిట్లర్‌ని కూడా.’’ ‘‘హిట్లర్‌ చంపిన లక్షలాది మందివి కూడా నువ్వే.’’ ‘‘జీసస్‌ని కూడా నేనేనా?’’ ‘‘ఆయనని అనుసరించిన వాళ్లందరూ నువ్వే.’’ మరణించిన మనిషి మౌనంగా ఉండిపోయాడు. ‘‘జన్మించిన ప్రతిసారీ నువ్వు ఎవరో ఒకరిని బలిపశువుని చేశావు. లేదా నువ్వే బలిపశువువి అయ్యావు. ఏ మనిషి అయినా అనుభవించిన సుఖమూ దుఃఖమూ అనుభవించబోయే ఆనందమూ విషాదమూ నువ్వే అనుభవిస్తావు.’’ ‘‘ఎందుకు? ఎందుకిదంతా?’’

‘‘ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు నాలా మారిపోవడానికి. నువ్వున్నది నాలా మారడానికే. నువ్వు నా జాతివాడివి. నువ్వు నా సంతానానివి.’’ ‘‘ఏమిటీ విచిత్రం? అంటే నువ్వే కాదు నేను కూడా దేవుడినా?’’ ‘‘కాదు. ఇంకా కాలేదు. నువ్వు పిండానివి. నువ్వు ఇంకా పెరుగుతూనే ఉన్నావు. మళ్లీ మళ్లీ మరణించి మళ్లీ మళ్లీ పుట్టి మానవ జీవితాలన్నీ అనుభవించాక... అప్పుడు దేవుడివవుతావు. ఈ విశ్వమంతా కేవలం ఒక అండం మాత్రమే. నువ్వు మరో జన్మలోకి ప్రయాణం చేయాల్సిన సమయం అయింది’’ అంటూ ఆ ఆకారం మరణించిన మనిషిని మరో జన్మలో ప్రవేశపెట్టింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement