కాలుష్య తీవ్రతను సూచించే ‘చిత్ర’మిది: ప్రపంచాన్నే అబ్బురపరిచేంతగా ఢిల్లీని కాలుష్యం ఆవరించింది. ఇటీవల జరిగిన ఇండియా అండ్ శ్రీలంక క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాళ్లు మాస్క్ ధరించి ఆడటం కాలుష్య తీవ్రతను సూచించింది.
ఢిల్లీలో ఇవ్వాళ్ల ఉన్న కాలుష్యం... కొన్ని రోజుల్లోనే మనకీ రావచ్చనుకోడానికి ఎవరూ సందేహించనక్కర్లేదు. అంటే ఢిల్లీ దూరం లేనట్టేగా? మరి ఢిల్లీలాంటి కాలుష్యాల్నుంచి... మనల్ని దూరంగా ఉంచడానికి
మన ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? వాటిని కాపాడుకోడానికి మనం ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం!
కాలుష్యం ఎంతటి తీవ్రమైన అనర్థాలు తెచ్చిపెడుతుందో ఇటీవల ఢిల్లీ నగరం మనకు పాఠాలు చెప్పింది. రోజుల తరబడి స్కూళ్లకు సెలవులివ్వడం, ఆంక్షలతో మాత్రమే వాహనాలను రోడ్డు మీదకి అనుమతించడం... ఈ వార్తలను కొన్నాళ్ల పాటు దాదాపు ప్రతిరోజూ విన్నాం. కాలుష్యం ఇప్పుడు ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదు. అన్నిచోట్లా ఉంది. పైగా ఈ చలికాలంలో ‘ఇన్వర్షన్’ అనే వాతావరణ ప్రక్రియ వల్ల గాలి అంతా ఒకచోట కదలకుండా ఉండిపోతుంది. ఇలాంటి సమయాల్లో కాలుష్యం అక్కడే అలాగే చాలాసేపు ఉండిపోతుంది. ఇలా ఒకేచోట స్టాగ్నేట్ అయిపోయి... అక్కడి పొగ, మంచు, కాలుష్యం కలగలిసిపోయి... ‘స్మాగ్’ అనే పేరున్న కాలుష్యమేఘం అందరినీ ఆవరిస్తుంది. శీతాకాలంలోని చలి వాతావరణంలో కాలుష్యం ఎటూ కదలలేకపోవడం వల్ల వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు, వాటిని నివారించడానికి అవసరమైన జాగ్రత్తలను తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. కాలుష్యం ఒక చోట పోగుపడిపోవడానికి కేవలం కాలుష్య కారణాలు మాత్రమే కారణం కాదు. కేంద్రీకృతమైన జనసాంద్రత, వారు ఉపయోగించే కార్లు, ఇతర ఉపకరణాలూ ఇందుకు కారణమవుతాయి. భూమి మీది స్మాగ్ ఓజోన్ (దీన్నే గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటారు) కూడా ఇందుకు కారణమవుతుంది. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది.
హానికారక ఓజోన్ వేరు... పైన ఉండే ఓజోన్‌పొర వేరు
ఇక్కడ ఓజోన్ అనగానే మానవాళితో పాటు సకల జీవరాశినీ రక్షించేందుకు పైన ఉండే ఓజోన్ పొరగా పొరబాటు పడకూడదు. వాతావరణం పైన ఉండే ఆ ఓజోన్ పొర... అల్ట్రా వాయొలెట్ కిరణాల వంటి హానికరమైన రేడియేషన్ నుంచి మొత్తం గ్లోబును కాపాడుతుంది. ఇలా కింద ఏర్పడే ఈ ఓజోన్‌ను ‘గ్రౌండ్ లెవెల్ ఓజోన్’ అంటారు. ఇది వాతావరణంలోని నైట్రోజన్‌తో ఆక్సైడులు, ఇతర వోలటైల్ ఆర్గానిక్ రసాయనాలు చర్య జరపడం వల్ల పుడుతుంది. ఇందులో కాలుష్యాలతో కూడిన పొగ, మంచు, రసాయనాలు కలగలిసి ఉంటాయి. ఈ కాలుష్యాలన్నీ మన శరీరం మీద అనేక దుష్ప్రభావాలు చూపుతాయి. అయితే మనం నిత్యం ఊపిరి పీలుస్తూ ఉంటాం కాబట్టి... ప్రత్యేకంగా ఊపిరితిత్తుల మీద మరింత దుష్ప్రభావాలు చూపుతాయి. దాంతో ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతులో మంట, ఇరిటేషన్, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. (అమెరికా వంటి దేశాల్లో అక్కడి ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఈపీఏ) అని పిలిచే సంస్థ... ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ తీవ్రతను లెక్కిస్తూ ఉంటుంది). దీని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఇది చిన్నపిల్లల, వృద్ధుల ప్రాణాలు సైతం బలిగొనే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) వంటి ప్రమాదకరమైన జబ్బులకు దారితీయవచ్చు. అందుకే కాలుష్యం నుండి మనల్ని మనమే కాపాడుకోవాలి.
మరి ఊపిరితిత్తులకు రక్షణ ఎలా?
ఈ సీజన్‌లో చలివల్ల ఇలా హాని కారక కాలుష్యాలూ, వాతావరణంలో వేలాడుతుండే పొగ తాలూకు నల్లటి నుసి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ధూళికణాలు, పుప్పొడి, ఇతరత్రా ఫారిన్‌బాడీస్ (వీటన్నింటినీ కలుపుకొని సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్ అంటారు) మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే ఆస్కారం ఉంది కదా. అయితే వాటినన్నింటినీ స్వాభావికంగానే బయటకు పంపడానికి వీలైన రక్షణ వ్యవస్థ మనలో ఉంటుంది. ఈ పని కోసం ఊపిరితిత్తులతో పాటు ముక్కులో ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఊపిరితిత్తులోని కాలుష్యాలను బయటికి పంపే అత్యంత సునిశితమైన అవయవ సముదాయం పేరే ‘మ్యూకో సీలియేటరీ ఎస్కలేటర్స్’. కాలుష్యాలను బయటికి నెట్టివేసే మ్యూకో సీలియరీ ఎస్కలేషన్ వ్యవస్థను రక్షించుకుంటే చాలావరకు మనల్ని మనం కాపాడుకున్నట్లే.
ఎలా పనిచేస్తాయి ఈ ఎస్కలేటర్స్?
మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్‌లో అనేక రకాల కణాలు ఉంటాయి. వీటి ఉపరితలంలో ప్రత్యేకంగా పొడవైన కణాలు ఉంటాయి. వీటిని సీలియా అంటారు. ఈ సీలియాలు వెంట్రుకలను పోలి ఉండి, నిరంతరం అదేపనిగా కదులుతూ ఉంటాయి. అలా వేగంగా కదలడం ద్వారా అవి మన శ్వాసవ్యవస్థలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ స్రావాలను, కణాలను, బ్యాక్టీరియాను బయటకు నెట్టేస్తూ ఉంటాయి. పదార్థాలను బయటకు నెట్టివేసే సీలియా సక్రమంగా పనిచేయడానికి వీటి చుట్టూ పలుచని మ్యూకస్ ఎప్పుడూ తయారవుతూ ఉంటుంది. ఇలా సాధారణంగా మన శరీరంలో రోజూ 15–20 మి.లీ. మ్యూకస్ (ఫ్లమ్) తయారవుతూ ఉంటుంది. ఇలా ఊపిరితిత్తుల నుంచి ముక్కు వరకు చేరిన మ్యూకస్ ఎప్పుడూ ఎండిపోతూ, గాలికి రాలిపోతూ ఉంటుంది.
కాలుష్యాలను గెంటేయడానికి దగ్గు ఉపయోగపడేదెలా?
సీలియరీ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి మన దగ్గు కూడా మనకు దోహదపడుతుంటుంది. మనలోని ఊపిరితిత్తుల్లో రక్షణ కోసం కొన్ని స్రావాలు ఊరుతాయన్నది తెలిసిందే కదా. అలా అక్కడ ద్రవాలు చేరినప్పుడు మనకు స్వాభావికంగా దగ్గు వచ్చేలా ప్రకృతి ఒక ఏర్పాటు చేసింది. మనం దగ్గినప్పుడు మన శ్వాసనాళాల్లోని గాలి చాలా వేగంగా బయటకు వస్తుంది. దాంతోపాటు హానికారకమైన కాలుష్య కణాలూ బయటకు వెళ్లిపోతాయి. ఇలా దగ్గు ఒక రక్షణ ప్రక్రియలా కాలుష్యాలను బయటకు నెట్టేస్తుంది. మన ఊపిరితిత్తుల్లో స్రావాలు చిక్కబడ్డా, అక్కడ వాయునాళాల్లో ఏదైనా అడ్డుపడ్డా, మనకు దగ్గు పెరుగుతుంది. దగ్గుతో పాటు కళ్లె / కఫం పడుతుంది. వాటితో పాటు కొన్ని కాలుష్యాలూ బయటకు వెళ్తాయి.
మనకు సీలియరీ ఎస్కలేటర్స్ ఎలా ఉపయోగపడతాయి?
ఇవి బయట నుంచి శరీరంలోకి వచ్చే పదార్థాలను నెట్టేస్తూ ఉంటాయి. మనం పీల్చుకునే గాలిలోని తేమను అదుపు చేస్తాయి.ఇన్ఫెక్షన్స్‌నుంచి మనల్ని కాపాడతాయి. సీలియా చుట్టూ ఉండే స్రావాలలో ఐజీఏ, ఐజీఈ, ఐజీఎమ్ అనే ఇమ్యునోగ్లోబ్యులిన్స్, తెల్ల రక్తకణాలు (రక్షణ కణాలు), యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి మనల్ని కాపాడతాయి. ఈ సీజన్‌లో కాలుష్యం ఉన్నచోట మనం శ్వాసించినప్పుడు మనలోకి ప్రవేశించే విషవాయువులను ఇవి పలచబారుస్తాయి. (డైల్యూట్ చేస్తాయి). ఆ విషవాయువు లను తటస్థీకరిస్తాయి. అంటే న్యూట్రలైజ్ చేస్తాయన్నమాట.
మరి మన సీలియాలను రక్షించుకోవడానికి ఏం చేయాలి...?
కాలుష్యాల నుంచి దూరంగా ఉండాలి. అందుకోసం వీలైనంతగా ఈ చలివాతావరణంలో బయటకు రాకపోవడం ఉత్తమం. మరీ తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముక్కుకు అడ్డుగా మాస్క్ లేదా మఫ్లర్ లేదా పరిశుభ్రమైన గుడ్డను కట్టుకోవాలి. ఈ సీజన్‌లో వాకింగ్ వంటి వ్యాయామాలను వీలైతే కాలుష్యం లేని చోట చేయాలి. ఇకవేళ బాగా కాలుష్యం ఉన్నచోటనైతే ఇన్‌డోర్స్‌లో చేస్తే మంచిది. మన రక్షణ వ్యవస్థలోని సీలియా బాగా పనిచేయడానికి గాలిలో తేమ అవసరం. ఇందుకోసం చలి వాతావరణంలో ఆవిరి పట్టడం చాలా బాగా ఉపకరిస్తుంది. డాక్టర్ సలహా మేరకు అక్కడ స్రావాలు ఎక్కువగా చేరినా, శ్వాసకు ఇబ్బంది అయినా డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి.దగ్గును మందులతో అణచకూడదు.కొన్ని సందర్భాల్లో దగ్గుతో పాటు కఫం పడుతున్నప్పుడు... ఆ కఫం తేలిగ్గా బయట పడేందుకు వీలుగా డాక్టర్ సలహా మేరకు కొన్ని మందులు వాడాలి.ఈ చలికాలంలో కాలుష్యాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల ప్రధానంగా సీవోపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) వంటి తీవ్రమైన జబ్బుతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలూ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో లక్షణాలను చూసి... సమస్యను తక్కువగా అంచనా వేయకుండా, ఒకసారి డాక్టర్‌కు చూపించి తగిన సలహా లేదా అవసరమైన చికిత్స తీసుకోవాలి.
డాక్టర్ ఎస్.ఎ. రఫీ
కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్
కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment