జ్ఞానోదయాల్లో గ్యాపులు!
ఉత్త(మ)పురుష
లక్ష పూల నుంచి కొద్దికొద్దిగా మకరందాన్ని పోగేసి, తేనె పట్టు వేసినట్లుగా మావారి సంపాదనలో పైసా పైసా కూడబెట్టి రెండేళ్ల క్రితం ఎట్టకేలకు ఓ సోఫా సెట్టు, ఓ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాన్నేను. అవి తీసుకున్నప్పట్నుంచీ నా మీద ఆయన సెటైర్లు మొదలు. శ్రీవారికి ఫోన్ చేసిన స్నేహితులకూ, తానే స్వయంగా ఫోన్ చేసి మిత్రులకూ నా షాపింగ్ గొప్పదనాన్ని కామెడీగా వివరించడం మొదలుపెట్టారు. ఇలా అడిగిన వారికీ, అడగని వారికీ మినహాయించి మిగతావారెవ్వరికీ తానేమీ చెప్పడం లేదంటూ చమత్కారమొకటి.
అవును... ఇంటికి అవసరమైన ఈ వస్తువులు తీసుకున్నాన్నేను. వృత్తిపరంగా ఎంతోమంది మా ఇంటికి వచ్చి, ముందుగదిలోనే అఫీషియల్ కాన్ఫరెన్సుల్లాంటివాటిని అనఫీషియల్‌గా నిర్వహిస్తుంటారు మావారు. ఇది ఆయన ఆఫీసులో చేసే పనికి అదనం. ఎంతోమంది పెద్దలూ, పిన్నలూ, మాన్యులూ, అసామాన్యులూ వస్తుంటారు గాబట్టి సోఫా ఒకటి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక డ్రెస్సింగ్ టేబుల్ అంటారా... అదేదో నేను మేకప్ చేసుకోడానికి కాకుండా, మీలో వస్తున్న మార్పులను నిత్యం పరికించడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. కానీ మావారికెంతసేపటికీ... రెండేళ్ల నుంచి సంపాదించిన మొత్తాన్ని రెండు గంటల షాపింగ్‌లో ఖర్చు చేసినట్లుగా గత రెండునెలలుగా నా మీద జోకులేస్తున్నారు.
ఆఫీసునుంచి పెద్దలు రాగానే సోఫాల్లో ఆసీనులను చేయించారు మావారు. కాఫీ ఏదైనా తెమ్మంటూ నాకు పురమాయింపు. మొత్తానికి ఆ రోజు మీటింగులో సోఫాలు కూడా చట్టంలాగే తమ పనిని తాము నిశ్శబ్దంగా చేసుకుపోయినట్టు అనిపించింది మా శ్రీవారికి. ఎందుకంటే... అంతకు ముందు మా ఇంట్లో ఒకదానిలో మరొకటి దూరిపోయేలా ఉంచేసే నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు ఉండేవి. ఎవరైనా అతిథులు రాగానే ఆయన హడావుడిగా ఆ బండిల్ సెట్టును లోపల్నుంచి తెచ్చి గబగబా కుర్చీలోంచి కుర్చీని లాగేసి పేర్చేవారు. ఇలాంటి ఒక శుభముహూర్తానే... మీటింగ్ తర్వాత ఓ కుర్చీలోకి మరో కుర్చీని దూర్చేప్పుడు ఒకదాని కాలు మరోదాని సీటుమీద బలంగా పడి ఓ రంధ్రం కూడా పడింది.
ఆ కుర్చీలో తాను కూర్చుని సదరు రంధ్రాన్వేషణ ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా తనను తాను సర్దుకుంటూ కూర్చుంటుండేవారు మా వారు. కానీ ఈ సోఫాల పుణ్యమా అని ఆయనకు ఆ బాధ తప్పిపోయింది. మధ్యతరగతి మాడెస్టీల ప్రకారం ఆ మాత్రం సోఫాలకు మనమూ డిజర్వింగే సుమా అనే ఒకలాంటి భావన నెలకొంది మా శ్రీవారిలో. ఇక డ్రెస్సింగ్ టేబుల్ వచ్చాక అందులో నన్ను నేను చూసుకుంటూ మేకప్పు అయ్యిందెంతో తెలియదు గానీ... మా ఆయనే వెనక్కు తిరిగినప్పుడు టక్కూ... ముందుకు తిరిగినప్పుడు స్టమక్కూ చూసుకోవడం సరిపోయింది. ఇవన్నీ నేను గమనిస్తునే ఉన్నా... ఆయన నాపై వేసే జోకులనూ చూసీచూడనట్లుగానే పోతున్నా. ఎందుకంటే నాకు తెలుసు... నేను చేసింది వేస్ట్ కాదని.
రెండేళ్ల తర్వాత ఆయనే అన్నారు. స్నేహితుడితో ఫర్నిచర్ షాపుకు వెళ్లారట. ఆ రాత్రి నాతో అన్నారు. ‘‘నువ్వు సోఫా, డ్రెస్సింగ్ టేబులూ రెండేళ్ల క్రితం మనం కొనడం మంచిదైంది. అప్పటి ఇరవై వేలు... ఇప్పటి ముప్ఫై అయిదు వేలు. కాబట్టి ఇవ్వాళ్టి లెక్క ప్రకారం చూసినా మనకు పదిహేను వేలు ఆదా’’ అంటూ రెండేళ్ల క్రితం నేను చేసిన ‘దుబారా’లో... ‘మనం’ అంటూ తానూ వాటా కలిశారు.
ఇక్కడ నేను మాట చెప్పదలిచాను. దేన్నో వెతుక్కుంటూ వెళ్లి తపస్సు చేసిన సిద్ధార్థుడికి జ్ఞానోదయమై, బుద్ధి కలిగి బుద్ధుడు కావడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలియదుగానీ... ఆయన అడవులకు వెళ్లిపోయిన రోజే మొగుడి మీద ఆధారపడకూడదని గౌతముడి భార్య యశోధరకు ఆ క్షణంలోనే జ్ఞానోదయమై ఉంటుంది. అలాగే రెండేళ్ల క్రితమే నాక్కూడా. కాకపోతే మగాళ్లకు జ్ఞానోదయమై సత్యం తెలిసి రావడానికి మాత్రం చాలా టైం గ్యాప్ అవసరమవుతుంది. అదీ తేడా!
- వై!