స్టాప్ డెత్ ఆఫ్ డెమోక్రసీ | stop the Death of Democracy | Sakshi
Sakshi News home page

స్టాప్ డెత్ ఆఫ్ డెమోక్రసీ

Published Fri, Nov 4 2016 11:10 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

స్టాప్ డెత్ ఆఫ్ డెమోక్రసీ - Sakshi

స్టాప్ డెత్ ఆఫ్ డెమోక్రసీ

ఇది గూండా రాజ్యం అనుకోవాలా? రౌడీ రాజ్యం అనుకోవాలా?
ర్యాగింగ్ చేసి చంపినా పట్టించుకోరా?
మోటర్‌బైక్‌తో గుద్దేసి ఉసురు తీసినా బేఖాతరా?
వేధించి, సాధించి ప్రాణాలు పిండేసినా జాన్తానహీనా?
మొన్న రిషితేశ్వరి... నిన్న లావణ్య... నేడు సంధ్యారాణి.
కుమిలిపోతోంది... ప్రజాస్వామ్యం కుమిలిపోతోంది.
కుళ్లిపోతోంది... వ్యవస్థ కుళ్లిపోతోంది.
కుంగిపోతోంది... యువత మనోధైర్యం కుంగిపోతోంది.
పాలక వ్యవస్థ కీచకపర్వాన్ని చూస్తూ ఊరుకుంటే...
పోతున్న మానం, ప్రాణం మన బిడ్డలదే కాదు, భరతమాత గౌరవం కూడా!
దిస్ ‘డెత్ ఆఫ్ డెమోక్రసీ’ హ్యాజ్ టు బి అరెస్టెడ్.
సంధ్యారాణిని పొట్టన పెట్టుకున్న ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చెయ్యాలి.
లేకపోతే... ఈ పర్వానికి పాలక అండ ఉందని నమ్మక తప్పదు.
ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో
ప్రజాకాంక్షల హత్య... ప్రజాశయాల ఖూనీ... ప్రజాస్వామ్యం మర్డర్...
నహీ చలేగా... నహీ చలేగా... నహీ చలేగా.
హత్య... సంధ్యది. ఖూనీ... ఆమె కడుపులోని రెండు నెలల బిడ్డది.
మర్డర్.. చావు బతుకుల్లో ఉన్న ఆమె భ ర్త జీవితేచ్ఛది.
స్టాప్ ది డెత్ ఆఫ్ డెమోక్రసీ.

 

నిలదీసినా... పట్టించుకోరా?
ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి?   కష్టం ఉందని ప్రజలు మొర పెట్టుకొంటే, కన్నీళ్ళు తుడవాలి. కష్టాల్ని తీర్చాలి... సమస్యల్ని పరిష్కరించాలి...  కానీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ పని చేస్తోందా? కాలేజీ స్టూడెంట్ల నుంచి కష్టాల్లో ఉన్న రైతుల దాకా ఎవరి గోడు అయినా పట్టించుకుంటోందా? ర్యాగింగ్ చేస్తున్నారన్నా... వేధింపులు వెంటాడుతున్నాయన్నా...  ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... గద్దెనెక్కిన పెద్దలకు చీమ కుట్టినట్టయినా ఉండట్లేదు. విద్యార్థులు, ప్రతిపక్ష నాయకుడు ఉద్యమబాట పడితే కానీ... చలనం రావట్లేదు  గత ఏడాది నాగార్జున యూనివర్సిటీ ర్యాగింగ్‌కు బలైన రిషితేశ్వరి ఆత్మకథ... ఇదే!  గుంటూరు ఆసుపత్రిలో... ఎలుకలు కొరికిన పసికందు ఆత్మఘోష... ఇదే! విశాఖలో అధికార మదాంధులు వెంటపడి, బైకును ఢీ కొట్టడంతో... ప్రాణం పోయిన లావణ్య విషాదగాథ... ఇదే!  అదే గుంటూరు ఆసుపత్రిలో... తాజాగా లేడీ ప్రొఫెసర్ వేధింపులకు బలైన సంధ్యారాణి వ్యధ... ఇదే!  వైజాగ్‌లో ప్రేమించిన నేరానికి కుర్రాడి ప్రాణాలు తీసిన అధికార పార్టీ గూండాల అండదండల కథా... ఇదే!  ప్రజల కష్టాలకు స్పందించాల్సిన ప్రభుత్వం, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పాలకులు... ఇవాళ పోరాటం చేస్తే కానీ పట్టించుకోని పరిస్థితి.  జనం, జననేత వై.ఎస్. జగన్ గొంతెత్తితే కానీ, కాలు కదపని ఈ సర్కార్  గుడ్లప్పగించి చూసిన కొన్ని తాజా విషాదకథలపై ‘సాక్షి’ ఫోకస్.

దోషులకే బాబు మంత్రుల వత్తాసు!
నా కొడుక్కి పెళ్లయి పదినెలలైనా కాలేదు. మరో నాలుగు మాసాల్లో కోర్సు పూర్తి చేయాల్సిన మా కోడలు సంధ్యారాణి ప్రొఫెసర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. భార్యను చాలా ప్రేమగా చూసుకునే మా అబ్బాయి రవి ఆత్మహత్యాయత్నం చేశాడు. మా కోడలు ఆత్మహత్య చేసుకొని ఇన్ని రోజులైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. కాలేజ్ విద్యార్థులంతా ప్రొఫెసర్ లక్ష్మి వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌రావుకు కూడా చెప్పారు. అయినా, కఠిన చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి కామినేని, ప్రొఫెసర్ లక్ష్మి భర్త స్నేహితులని తెలిసింది. అందుకే వారిపై కఠినచర్యలు తీసుకోవడం లేదని అనుమానం. ఆంధ్రప్రదేశ్ మంత్రులు సామాన్యులమైన మాకు కాకుండా బలవంతులైన దోషులకు అండగా నిలిచారు.
- ఈశ్వరమ్మ, సంధ్యారాణి అత్త

నా కొడుకు, కోడలు సంతోషంగా ఉండేవారు!
నా కొడుకు రవి, కోడలు సంధ్యారాణి చాలా సంతోషంగా ఉండేవారు. గుంటూరులో కోడలు పీజీ పూర్తి కాగానే  కొడుకు, కోడలు మిర్యాలగూడలో ఆసుపత్రి పెట్టుకొని సంతోషంగా జీవిస్తారని ఆశించాం. ఇంతలోనే ఇలా అయిపోయింది!
- చిట్టిపోలు సత్యనారాయణ, సంధ్యారాణి మామ, మిర్యాలగూడ

న్యాయం జరగలేదు!
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజీ స్టూడెంట్ డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్య కేసులో మాకు న్యాయం జరగలేదు. ‘ప్రభుత్వ జనరల్ హాస్పిటల్’ (జి.జి.హెచ్)కు వచ్చే పేద రోగుల వైద్యసేవలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే మేము విధుల్లో చేరాం. కానీ సమ్మెకు మేము ఫుల్ స్టాప్ పెట్టలేదు. కామా పెట్టాం... అంతే. ప్రొఫెసర్ లక్ష్మి వల్ల భవిష్యత్తులో ఏ ఒక్క స్టూడెంట్ కూడా వేధింపులకు గురవకుండా ఆమెను ప్రభుత్వ సర్వీస్ నుండి తొలగించి, వైద్యవృత్తి చేసేందుకు అనర్హురాలిగా ప్రకటించాలి. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సంధ్యారాణి కేసు విషయంలో న్యాయం జరగడం లేదనిపిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని జూనియర్ డాక్టర్లనూ కలుపుకొని మళ్ళీ సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
- డాక్టర్ పి. నాగేశ్వరరావు,  జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షులు
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల

విచారణ... అన్నారు!
అతీ లేదు... గతీ లేదు!

డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య కేసును మెజిస్ట్రేట్‌తో విచారణ చేయిస్తామని జిల్లా కలెక్టర్ మాకు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు మెజిస్ట్రేట్ విచారణ జరుగుతున్నట్లు ఆర్డర్ కాపీ విడుదల కాలేదు. ముగ్గురు వైద్యులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ... తమ నివేదికను జూడాల సంఘానికి తెలియజేయకుండా నేరుగా ప్రభుత్వానికి అందజేయడం అనుమానాలు రేపుతోంది. గతంలో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులపై ఆస్పత్రి అధికారులకు పలుమార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. రెండు నెలల క్రితం రోగులు సైతం ఆమె ప్రవర్తనపై ఫిర్యాదులు చేశారు. అయినా, ఆమెకు ఉన్న రాజకీయ బలంతో ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. హైపవర్ కమిటీకి 100 మందికి పైగా నర్సులు, 40 మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు, 20 మందికి పైగా పీజీ వైద్యులు ఫిర్యాదు చేశారు. గతంలో గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌లో పీజీ కోర్సు పూర్తిచేసి వెళ్ళినవాళ్ళు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు కూడా ఇప్పుడు మాకు ఫోన్‌లు చేసి, ప్రొఫెసర్ చేతిలో తాము గతంలో ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తున్నారు. మాకు మద్దతు తెలియజేస్తున్నారు. బహిరంగ విచారణకైనా వచ్చి, వేధింపులపై సాక్ష్యం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. వేధింపులకు పాల్పడ్డ ప్రొఫెసర్ లక్ష్మిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి, విద్యార్థులలో మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలి. - డాక్టర్ సంధ్యారాణి సహ విద్యార్థులు

కాలేజీలో చేరినప్పటి నుంచి వేధింపులే!
మా అమ్మాయి, ప్రొఫెసర్ లక్ష్మి వాళ్లమ్మాయి ఎంబీబీఎస్‌లో క్లాస్‌మేట్స్. గైనకాలజీ కోసం ఇద్దరూ ప్రిపేరయ్యారు. మా అమ్మాయికి సీట్ వచ్చింది. లక్ష్మిగారమ్మాయికి రాలేదు. పైగా మా అమ్మాయికి ఆ లక్ష్మి పని చేసే గుంటూరు మెడికల్ కాలేజ్‌లోనే వచ్చింది. కాలేజ్‌లో చేరినప్పటి నుంచి మా అమ్మాయిని ప్రొఫెసర్ వేధించేది. ‘హైదరాబాద్ నుంచి ఎందుకొస్తారే ఇక్కడికి? ఈ సీట్‌కి మేము మూడు కోట్లు పెట్టినా దొరకలేదు. మీకెందుకే?’ అంటూ అందరి ముందు తిట్టేదట. మా అమ్మాయి ఫోన్ చేసి ఏడ్చేది.

మా అమ్మాయిని ఇబ్బంది పెట్టవద్దని బతిమిలాడుకుందామని ప్రొఫెసర్ లక్ష్మిని కలిశాం. సంధ్య, అల్లుడు, నేను పండ్లు, స్వీట్లు తీసుకుని లక్ష్మి ఇంటికి వెళ్లాం. ‘మా అమ్మాయి కూడా మీ అమ్మాయి లాంటిదే కదా! ఆమె ఏమన్నా తప్పు చేస్తే సర్ది చెప్పండి’ అని వేడుకున్నాం. ఆమె మా మాటలకు అడ్డు తగిలి, గట్టిగా మా అమ్మాయి మీద కేకలేసింది. సర్దిచెప్పడానికి ట్రై చేసినా వినిపించుకోలేదు. ఆ తర్వాత మా అమ్మాయికి ఫోన్ చేసి, ‘నువ్విట్లా మీ వాళ్లను తీసుకొస్తే నా గురించి అందరూ ఏం అనుకుంటారు? నువ్వు ఎలా పాసవుతావో చూస్తా’ అని బెదిరించిందట. టార్చర్ పెంచిందట.     - బాల సత్తయ్య, సంధ్యారాణి తండ్రి

పెళ్లి చేసుకున్నావ్... కానీ ప్రెగ్నెంట్ కావద్దు!
లక్ష్మి వేధింపులకు భయపడిన బిడ్డ కాలేజ్‌కి వెళ్లాలంటేనే భయపడ్డది. పోయినేడాది డిసెంబర్‌లో పెళ్లి చేశాం. పెళ్లి కోసం 20 రోజులు లీవ్ అడిగితే నరకం చూపించింది. అందరి ముందరే ‘పెళ్లికి నీకు 20 రోజులు సెలవు అవసరమా? నా పెళ్లికైతే నేను అయిదు రోజులే లీవ్ తీసుకున్నా. నీకెందుకే 20 రోజులు? ఇదిగో.. పెళ్లయితే చేసుకున్నావ్ కాని ప్రెగ్నెంట్ కావద్దు’ అని బెదిరించిందట. ఇట్ల మా బిడ్డ ఏం చేసినా తప్పు పట్టేదట. ఆ భయంతోనే అది ప్రెగ్నెంట్ అయినా మాకు చెప్పలేదు. బ్యాగ్‌లో గర్భం పోవడానికి వాడే మాత్రలు దొరికాయి. అప్పటికే ఒకటి మింగినట్లుంది. లక్ష్మి మాటలకు భయపడే గర్భాన్ని పోగొట్టుకోవాలనుకుంది. ప్రతి విషయం నాకు ఫోన్లో చెప్పేది. కానీ ఈ సంగతి దాచింది.  - బాల ప్రమీల, సంధ్యారాణి తల్లి, హైదరాబాద్

కఠినంగా శిక్షించాలి
మా అన్న వదినలు అన్యోన్యంగా ఉండేవారు. వదిన పీజీ చదువు పూర్తయ్యాక ఇద్దరూ కలిసి క్లినిక్ నడపాలనుకున్నారు. ప్రొఫెసర్ వేధిస్తున్నట్టుగా వదిన మా అందరితోనూ చెప్పింది. వదిన మృతితో అన్నయ్య తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉరేసుకోవడంతో మెడ నరాలు తిన్నాయనీ, మెదడు సమస్యలొచ్చే ముప్పుందనీ డాక్టర్లన్నారు. ఎంతో ఆనందంగా ఉండే మా కుటుంబం అన్యాయమైపోయింది. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి.  - మురళి, సంధ్యారాణి మరిది

రెండు రోజుల దాకా నో ఎఫ్‌ఐఆర్!
మా చెల్ల్లెలికి చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. రోజుకు పదహారు గంటలు చదివేది. గైనకాలజీ తనకిష్టమైన కోర్స్. గైనకాలజిస్ట్‌గా గ్రామీణ మహిళలకు హెల్త్ సర్వీస్ ఇవ్వాలని ఆశయం. ఆ కల తీరకుండానే పోయింది. ఇన్ని రోజులవుతున్నా దీనికి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మి ఆచూకీ తెలుసుకోలేకపోయారంటేనే తెలుస్తోంది ఆమెకెంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉందో! మా చెల్లి పోయిన రెండు రోజుల వరకు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయనే లేదు.  - బాల రవికుమార్, సంధ్యారాణి అన్నయ్య

మూడేళ్ళుగా కంప్లయింట్స్!
ప్రొఫెసర్ లక్ష్మి పెట్టే టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకోవాలని మా అక్క అక్టోబర్ 6నే డిసైడ్ చేసుకుంది. డైరీలో రాసింది. ఆ ప్రొఫెసర్‌పై మూడేళ్ళుగా కంప్లయింట్స్ ఉన్నాయి. ‘మీ స్టూడెంట్ సూసైడ్‌తో ఆమె పేరెంట్స్ వచ్చారు’ అని పోలీసులు ఆమెకు చెబితే, ‘వాళ్ల వల్ల ఏమవుతుంది! ఏదో ఒకటి చెప్పి పంపేయండి’ అందట. ఆమె ఇన్‌ఫ్లుయెన్స్‌కు ఇదే ఉదాహరణ.   - బాల ప్రవీణ్, సంధ్యారాణి తమ్ముడు

నిన్న రిషితేశ్వరి... 
గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణ విషాదం ఇంకా మరువనన్నా లేదు. ఇప్పుడు డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య ఉలిక్కిపడేలా చేసింది. వ్యవస్థలో సామాన్య పౌరుల గోడు వినేవారు ఎవరూ లేరని తేలింది. విద్యార్థుల ర్యాగింగ్‌కీ, కష్టం చెప్పుకున్నా స్పందించని ప్రిన్సిపాల్ చర్యలకూ రిషితేశ్వరి బలైతే, సంధ్య సాక్షాత్తూ లేడీ ప్రొఫెసర్ వేధింపులకు బలైంది. రిషితేశ్వరి చనిపోయి ఏడాది దాటుతున్నా ఆ కాలేజ్ ప్రిన్సిపాల్‌పై చర్యలు అంతంతే. ఇప్పుడు డాక్టర్ సంధ్య చావుకి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మి ‘కనిపించడం లేదు’ట! విద్యార్థులే మన సమాజ భవిష్యత్తు. ఆ భవిష్యత్ ఇలా నేల రాలుతున్నా, రాజకీయ అండతో నిందితులు తప్పించుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement