మనలో, మన చుట్టూ ఆత్మ లేక అనంతశక్తి అంతటా వ్యాపించి ఉంది. కాని, మనలో చైతన్యం ఆత్మ కాదు. ఆత్మ వలన జనించిన ప్రాణమది. ఈ ప్రాణానికి శరీరం ఆధారం.ఈ ప్రాణం లేక చైతన్యం మన శరీరంలో ఆహారం వలన నిలబెట్టబడుతుంది. మనలో ఈ చైతన్యాన్ని నిలిపే ఏదేని ప్రధాన అవయవం నశిస్తే మనలో ప్రాణం లేక చైతన్యం నిలిచిపోతుంది. అదే ప్రాణం పోవడం. అంతేగాని, మనకో ప్రత్యేక ఆత్మ అనేది లేదు, ఉండదు. ఆత్మ మరో జన్మకోసం విశ్వంలో తిరగడమంటూ ఉండదు. ఆ అనంతమైన ఆత్మ తనలోనే, తనకు తానుగనే బహురూపాలలో తిరిగి తిరిగి పుడుతోంది, కాని ఫలానా ఆత్మ అంటూ ప్రత్యేకంగా ఒకటుండదు.
పంచభూతాలలో నుండి వచ్చిన శరీరం విఘటనం చెంది పంచభూతాలలోకే ప్రయాణం సాగిస్తుంది. ఈ పంచభూతాలు ఎక్కడివో కావు, అనంతశక్తిలో నుండే ఉద్భవించిన అంశాలే. ఈ విషయాన్ని గుర్తెరిగి, సర్వత్రా వ్యాపించి ఉన్నది ఒకే ఒక ఆత్మ అనే సత్యం మన ఆలోచనల్లో నిండిపోతే, మన మనసుల్లో అరిషడ్వర్గాలకు స్థానం ఉండదు. భేదభావాలకు అతీతంగా మన ఆలోచనలు, కర్మలు శాంతి దిశగా సాగుతాయి. కులమతాలు, లింగభేదాలు మనలను ఆవహించవు. విశ్వనరులమై, ప్రకృతితో మమేకమై శాంతియుతంగా ఆనందకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం తద్వారా గీతలో చెప్పబడినట్లుగా కర్మయోగులమై విశిష్ట ఉన్నతిని పొందగలుగుతాం.
ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు ఎంత సుళువుగా చెప్పిందో చూడండి. వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్‌ం శరీరమ్! ఓం క్రతో స్మర కృతగ్‌ం స్మర క్రతో స్మర కృతగ్‌ం స్మర!! ఈ శరీరం కాలి బూడిదైపోతుంది. ఇందులోని ప్రాణం మరణం లేని ప్రాణం(అనంతశక్తి)లో కలిసిపోతుంది. ఓ మనసా! చేసిన వాటిని చింతన చేసి చూడు..... మానవ వికాస తొలినాళ్లలో ఎంత అద్భుత ఆలోచన! నేటి సైంటిస్టులూ తేల్చుకోలేని విషయాన్ని రెండుపాదాల శ్లోకంలో గుదిగుచ్చడమెంత విచిత్రం! మనమూ అజ్ఞానంతో పునర్జన్మ, గతజన్మ అంటూ ఊహించుకోవడమెంత గమ్మత్తు! ధర్మబద్ధకర్మ మన కర్తవ్యం. ఆ ధర్మబద్ధ కర్తవ్యం మనమే చేసినా, దాని పలితం మనమే అనుభవించినా దానిని అంటుకోని నిష్కామ స్థితే మోక్షస్థితి. అష్టావక్ర, శివగీతల్లో చిత్జడ గ్రంథి నశించడమే మోక్షం అని చెప్పడమైంది. అంటే ఏదేని విషయవాసన లేని మానసిక స్థితే మోక్షం. ఈ మోక్షస్థితి లోనే ఎనలేని ఆనందం అనుభవించగలుగుతాం. ఏ కర్మైనా మనకు సమానమే. ఏ ఫలితమైనా తృణప్రాయమే.
– రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment