నిలబడి చప్పట్లు కొట్టండి! | Story of Jessica Newton | Sakshi
Sakshi News home page

నిలబడి చప్పట్లు కొట్టండి!

Published Mon, Nov 20 2017 12:02 AM | Last Updated on Mon, Nov 20 2017 3:37 AM

Story of Jessica Newton - Sakshi - Sakshi

అమ్మాయి ఒళ్లు చూసే ప్రపంచం ఇది. ఎవరి తల్లీ.. ఎవరి బిడ్డా.. ఎవరి చెల్లీ.. ఎవరి భార్యా.. ఆ కొలతల చూపుల్నుంచి తప్పించుకోలేరు. అలాంటి కళ్లను.. అవి ఎన్ని కళ్లయినా సరే.. పొడిచేయాలనిపిస్తుంది! కానీ ‘‘కంటికి కన్ను సమాధానం కాదు.. అలా అయితే ప్రపంచమే చూపులేనిదైపోతుంది’’ అన్నారు గాంధీజీ! మరేం చేయాలి? అదే ఒళ్లుతో అవే కళ్లను తెరిపించాలి..  ప్రపంచాన్ని మార్చాలి.. పెరూ పేరును మార్చాలి... అనుకున్నారు జెస్సికా న్యూటన్‌! అద్భుతమైన కథ.. మీరందరూ చదవాల్సిన కథ..లేచి చప్పట్లు కొట్టాల్సిన కథ!

ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ జెస్సికా
జెస్సికా న్యూటన్‌.. 1987లో మిస్‌ పెరూగా ఎన్నికైంది. మోడల్‌గా పనిచేసింది. అది గ్లామర్‌ ప్రపంచం! అమ్మాయిని చూపించి వ్యాపారం చేసుకునే మార్కెట్‌. దురదృష్టవశాత్తు స్త్రీ కూడా కమాడిటీయే. ఒక కమాడిటీని చూపించి ఎన్నో కమాడిటీస్‌ను అమ్ముకునే సంత. తమ మీద ఆధారపడి సాగే మార్కెట్‌లో కూడా తమకు విలువ లేదు. అంతా పురుషుల రాజ్యమే. అవకాశం చూపించి ఏమైనా ఆశించొచ్చు. అది వాళ్ల హక్కు. నేమ్, ఫేమ్, ఆశ, ఆశయం.. చివరకు మనీ... కోసం తప్పదు కొన్నిసార్లు వీళ్లకు! తనకు కనడ్డవి.. చవిచూసినవి అన్నీ ఒకెత్తు! కంట్రీ ఆఫ్‌ ది రేపిస్ట్స్‌ అని దేశానికి ఉన్న పేరు ఒకెత్తు! ఇన్ని రోజులు పేపర్లలో, టీవీ న్యూస్‌ చానళ్లలో, చాలా చదివింది, చూసింది.. సోషల్‌ మీడియాలో చాలానే ఫోలో అయింది.

ఎక్కడైనా ఒకటే.. హాంటిగ్‌ ఇష్యూ.. వయలెన్స్‌ ఎగైన్‌స్ట్‌ విమెన్‌! డొమెస్టిక్‌ వయలెన్స్, హెరాస్‌మెంట్‌.. డిస్క్రిమినేషన్, ట్రాఫికింగ్‌.. రేప్‌! ఓ గాడ్‌.. సేవ్‌ విమెన్‌ అని చాలా సార్లే అనుకుంది. మౌనంగా దేవుడిని వేడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని తన చేతకాని తనాన్నీ తిట్టుకుంది. కాని కిందటి రాత్రి చూసిన నివేదిక.. అందులో ఒళ్లు గగుర్పొడిచే స్టాట్స్‌.. ఆమెను నిద్రపోనివ్వలేదు.

ఈసారి బ్యూటీకాంటెస్ట్‌ నిర్వహణా బాధ్యతను ఇవ్వడానికి ఆర్గనైజర్స్‌ వచ్చినప్పుడు.. బ్రహ్మాండంగా నిర్వహించి అంతకుముందున్న రికార్డ్‌ను బద్దలు కొట్టాలి అనుకుంది.. ఆ దిశగానే ప్లాన్‌ చేసుకుంది. ప్రాక్టీస్‌ చేస్తోంది కూడా. కాని ఆ నివేదిక రాత్రికి రాత్రే జెస్సికా ప్లాన్‌ను మార్చేసింది. ఆ క్షణమే కమిటీలో ఉన్న తన స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పింది అప్పుడే పుట్టిన తన  ఆలోచనను. ‘‘శభాష్‌.. గో అహెడ్‌’’ అని ప్రోత్సహించారు! తెల్లవారే.. కకావికలమైన మనసుతో తన ప్రణాళికను ఆచరణలో పెట్టింది.


పెరూ రాజధాని లిమాలో...
2018 బ్యూటీ కంటెస్ట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘ఈసారి లాస్‌ వేగస్‌లో జరగబోయే 66వ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఎలాగైనా మిస్‌ పెరూ ఎన్నికవ్వాలి. దానికి ఈ మిస్‌ పెరూ బ్యూటీకాంటెస్ట్‌ డయాస్‌ కావాలి’  జెస్సికా న్యూటన్‌కు చెవిలో జోరీగలాగా చెప్తున్నారు ఆర్గనైజర్స్, స్పాన్సర్స్‌!

కిందటి రోజు దాకా చాలా ఉత్సాహంగా ఉన్న జెస్సికా.. ఎందుకనో ఆ రోజు ఉదయం నుంచి చాలా అన్యమనస్కంగా ఉంది. ఆర్గనైజర్స్, స్పాన్సర్స్‌ మాటలు చెవికెక్కడం లేదు. ఆ పనంతా వదిలేసి పారిపోవాలనుంది. ఉండుండీ దుఃఖం వస్తోంది. అప్పటికే రెండుసార్లు రెస్ట్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసినా భారం తగ్గట్లేదు. ఏమీ పట్టనట్టున్న ఆమె ప్రవర్తన వింతగా తోస్తోంది మిగతా వాళ్లకు.

‘‘మెనోపాజ్‌ ఏమో..’’.. ‘హిహి.. హార్మోనల్‌ ఇంబాలెన్స్‌’’ లాంటి కామెంట్స్‌ వినపడతున్నాయి వెకిలి నవ్వుకి తోడుగా ఆమెకు! అవేవీ ఆమెకు ఆశ్చర్యంగా ఏమీ అనిపించలేదు. అలవాటే. పైగా అంతకుముందు తాను విన్నవాటితో, కిందటి రోజు రాత్రి తాను చదివిన ఓ నివేదికలోని సారాంశంతో పోల్చి చూసుకుంటే ఆ కామెంట్స్‌ నథింగ్‌. విరక్తిగా నవ్వుకుంది. ఏదో తెలియని బాధ, వేదన అనుభవిస్తోంది. అయినా తాను చేయాల్సిన ఓ పని గురించి బ్రెయిన్‌ షార్ప్‌గానే ఆలోచిస్తోంది.  తనదైన పంథాలో ప్రణాళిక వేస్తోంది.

రిహార్సల్స్‌ హాల్లోకి వెళ్లింది. 23 మంది అమ్మాయిలు.. అందరూ దాదాపుగా పద్దెనిమిది నుంచి 20 ఏళ్లలోపు వాళ్లే! ఆ కళ్లల్లో ఆశలు.. ఆ క్యాట్‌వాక్‌లో కాన్ఫిడెన్స్‌.. తన యవ్వనపు రోజులు గుర్తొచ్చాయి ఆమెకు. తనూ ఇలాగే చాలా యాంబిషియస్‌గా ఉండేది. ఫస్ట్‌ టైమ్‌ స్విమ్‌ సూట్‌లో ర్యాంప్‌ మీదకి రావడానికి చాలా నెర్వస్‌గా ఫీలయింది. ఇబ్బంది పడింది. గెలిచినప్పుడు ఆ నెర్వస్‌నెస్‌ను, ఇబ్బందిని దుఃఖంతో బయటకునెట్టేసింది. ఇప్పుడు.. వాళ్లలో తనను చూసుకుంటోంది. వీళ్లు.. కొత్తగా కనపడాలి.. ఈ బ్యూటీకాంటెస్ట్‌ పర్పస్‌ చేంజ్‌ అవ్వాలి! థీమ్‌ బేస్‌ కాదు.. ఇష్యూ బేస్డ్‌గా బయటకు రావాలి!

అందరినీ విష్‌ చేసి.. రిహార్సల్స్‌ ఆపించి ఆ హాల్లో ఒక చోట సమావేశపర్చింది. తన మనసులో ఉన్నది వాళ్లకు చెప్పింది. చేతిలో ఉన్న కాపీలను వాళ్లకు పంచింది. ఏం చేయాలో వివరించింది. ఆ 23మంది మొహాల్లో ఒకరకమైన భావన! అర్థంకాని ఎక్స్‌ప్రెషన్‌! కాని అన్నిజతల కళ్లల్లోనూ ఒక మెరుపు! ఓ కొత్త పనికి పూనుకోబోయే ముందు వచ్చే ఒక పులకరింపు ఒంట్లో! మొత్తానికి ఏదో సరికొత్త శక్తిని ఆవహించుకున్నట్టయితే కనిపించారు వాళ్లు జెస్సికాకు! ఈ ఉత్సాహం చాలు అనుకుంది ఆమె!

అక్టోబర్‌ 29.. ఆదివారం
అందాల పోటీల రోజు రానే వచ్చింది.  లిమాలోని ‘ట్రీటో మున్సిపల్‌ డి లిమా’ వేదిక! పోటీల్లో ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు లిమా గురించి చెప్పుకోవాలి. ఆడవాళ్ల భద్రత, రక్షణ విషయంలో ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన నగరాల్లో లిమా అయిదో స్థానంలో ఉంది. అబ్‌రప్ట్‌గా ఈ ప్రస్థావన ఎందుకంటే.. 23 మంది ఫైనలిస్ట్‌లు ఒకొక్కరే స్టేజ్‌ మీదకు వస్తున్నారు తమను తాము పరిచయం చేసుకునేందుకు! ఇక్కడా ఇంకో విషయం చెప్పాలి.. క్షమించండి.. మళ్లీ అంతరాయం కలిగించినందుకు! పెరూ అందాల పోటీల్లో పాల్గొనే వాళ్లు స్టేజ్‌ మీద తమ పేరు, ఊరు, వయసుతోపాటు విధిగా తమ శరీర కొలతలనూ చెప్పాలి. ఇది పోటీల నియమం. 1950ల్లో పెరూలో అందాల పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి సడలని, సడలించని, సడలించడానికి వీల్లేని నియమం! ఇక విషయంలోకి...

హాలంతా కిక్కిరిసిపోయి ఉంది. ఒక వైపు జడ్జీలు ఆసీనులయ్యారు. ఇంకో వైపు ఆర్గనైజర్స్‌. ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్న యాంకర్‌ చాలా హుషారుగా ఉన్నారు. కొన్ని వినోద కార్యక్రమాలు అయిపోయాక అందాల పోటీలు స్టార్ట్‌ అయ్యాయి. ఫస్ట్‌ కంటెస్టెంట్‌ను పిలిచారు. ఆ నడకలో సహజంగా అందాల పోటీల్లో ఉండే కంటెస్టెంట్‌లో ఉన్న వయ్యారం లేదు. ప్రశ్నిస్తున్నట్టుంది బాడీ లాంగ్వేజ్‌. జడ్జెస్‌ అందరి మొహాల్లో ఒక ప్రశ్నార్థకం ఒకేసారి! ‘‘ఐయామ్‌ కెమిలా కానికోబా.. ఫ్రమ్‌ లిమా’’ తన పేరు, ఊరు చెప్పింది ర్యాంప్‌ మీద. ఆ తర్వాత బాడీ కొలతలే. అందరూ చెవులు రిక్కించారు.. ఉత్సుకతతో చూస్తున్నారు.. ‘మై మెజర్‌మెంట్స్‌ ఆర్‌.. రెండువేల రెండు హత్యలు. గత తొమ్మిదేళ్లలో నా దేశంలో నమోదైన ఆడపిల్లల హత్యలు అక్షరాలా రెండువేల రెండు’’ అని చెప్పి అంతే వేగంగా ర్యాంప్‌ మీద నుంచి స్టేజ్‌ మీదకు వెళ్లింది.

అందరిలో అయోమయం జడ్జెస్‌తో సహా! బ్యాక్‌స్టేజ్‌లో ఉన్న జెస్సికా పిడికిలి బిగించి ‘యెస్‌’అనుకుంది కసిగా! తను అనుకున్నట్టే జరుగుతోంది ప్రోగ్రామ్‌. కెమిలా ఎంతో నమ్మకాన్నిచ్చింది. ప్రారంభం బాగుంది. థ్యాంక్యూ కెమిలా.. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది జెస్సికా! సెకండ్‌ కంటెస్టెంట్‌ ర్యాంప్‌ మీదకు వచ్చి.. ‘‘మై నేమ్‌ ఈజ్‌ కరేన్‌ క్యూటో.. మై మెజర్‌మెంట్స్‌ ఆర్‌.. ఈ యేడు డొమెస్టిక్‌ వయలెన్స్‌ కింద 82 మంది మహిళల హత్య, 156 రేప్‌లు’’ అని చెప్పింది. ఇంకో కంటెస్టెంట్‌.. ‘‘నా పేరు రొమినా లొజానో. కల్లావో నుంచి వచ్చా.

నా కొలతలు 2014 నుంచి ఇప్పటి వరకు మూడు వేల నూట పధ్నాలుగు మంది అమ్మాయిలు ట్రాఫికింగ్‌’’. నాలుగో కంటెస్టెంట్‌.. ‘‘నా పేరు లోంజానో.. నా దేశంలోని యూనివర్శిటీల్లో అసాల్ట్‌కు గురైన అమ్మాయిలు 65 శాతం!’’. ఆ తర్వాత.. ‘‘నా పేరు సమంతా బాటల్లనోస్‌.. నా మెజర్‌మెంట్స్‌.. సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌తో ప్రతి ఆరు నిమిషాలకో బాలిక చచ్చిపోతోంది’’. ‘‘నా పేరు జువానా అసెవేడో. నా కొలతలు.. నా దేశంలో 70 శాతం మంది మహిళలు స్ట్రీట్‌ హెరాస్‌మెంట్‌కు గురవుతున్నారు’’... ఇలా 23 మంది పోటీదారులు పెరూలో మహిళల మీద రకరకాల రూపంలో జరుగుతున్న హింసను లెక్కలతో సహా చెప్పారు వాళ్ల కొలతలకు బదులుగా! స్విమ్‌ సూట్‌ రౌండ్‌కైతే... స్టేజ్‌ వెనకాల.. మహిళల మీద దాడులు, రేప్‌లు, ఇతర అరాచకాలు, దాష్టీకాలకు సంబంధించిన వార్తా పత్రికల న్యూస్‌ క్లిప్పింగ్, న్యూస్‌ చానళ్ల ఫుటేజ్‌తో మాంటేజ్‌ను ప్రదర్శించారు.

ఈ పోటీ అయిపోయే సరికి ఆహూతులు, జడ్జీలు.. కరతాళ ధ్వనులు చేయలేదు. అవమానం దహించేస్తుండగా.. విచారం కమ్మేయగా లేచి నిలబడి తలవంచుకున్నారు! జెస్సికా కళ్లల్లో ఉద్వేగంతో కూడిన నీళ్లు! రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది. వీళ్లందరిలో ఆలోచనను రేకెత్తించింది. కనీసం ఇన్‌సల్ట్‌ ఫీలయ్యేలాగైనా చేసింది. అలా ఏడుస్తూనే ఉంది. కెమెరాలు, మైక్‌లతో మీడియా వాళ్లు వచ్చేవరకు! ‘‘బ్యూటీకంటెస్ట్‌ను మహిళల మీద జరుగుతున్న హింసకు ప్రొటెస్ట్‌గా మార్చాలనే ఐడియా ఎలా వచ్చింది?’’ మీడియా ప్రశ్న. ‘‘ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి ఐడియా రానక్కర్లేదు. ఆ బాధను అనుభవిస్తే తెలుస్తుంది దాన్ని ఎలా ప్రొటెస్ట్‌ చేయాలో.

హెరాస్‌మెంట్, మిస్‌ట్రీట్‌మెంట్, రేప్‌.. ఇక ఉండకూడదు అనుకున్నా. ఇన్నాళ్లు అమ్మాయిల బాడీ కొలతలు చెప్పడం.. పోటీలో మ్యాండెటరీగా ఉండింది. కాని మన దేశంలోని జెండర్‌ డిస్క్రిమినేషన్, వయెలెన్స్‌ ఎగైనెస్ట్‌ విమెన్‌ స్టాటిస్టిక్స్‌ను బాడీకొలతలుగా చెప్పించాలనుకున్నా. అలాగైనా ఈ కంటెస్ట్‌ తీరు మారుతుందని, కనీసం కొంతమందైనా మహిళల గురించి ఆలోచిస్తారని’’ ఆన్సర్‌ చేసింది జెస్సికా. ‘‘ఈ ప్లాట్‌ఫామ్‌ ఇప్పుడు మహిళా సాధికారత వేదిక. అందాల పోటీల్లో పాల్గొనే అమ్మాయిలకు బుర్ర ఉండదని చాలామంది అభిప్రాయం. ఆ భ్రమను తొలగించాలి.. భ్రాంతిని బద్దలు చేయాలని ఈ కంటెస్టెంట్స్‌కి చెప్పా! వీ ఆర్‌ బ్యూటీస్‌ విత్‌ నాట్‌ ఓన్లీ బ్రెయిన్స్‌ బట్‌ ఆల్సో విత్‌ హార్ట్‌ అని నిరూపించారు వీళ్లు! సో.. మీడియా.. అండ్‌ సోకాల్డ్‌ మెన్స్‌ వరల్డ్‌.. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి! ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి.

ఎటు పడితే అటు నోరు పారేసుకోడానికి వీల్లేదు.. వేలెత్తి చూపితే కుదరదు. మేం యే బట్టలు వేసుకోవాలి? ఎలా ఉండాలి అన్నది మా వ్యక్తిగత విషయం. వ్యక్తిగత నిర్ణయం. ఇది మీడియాకు వార్త కాదు.  వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ఒకవేళ మేం అరకొర దుస్తులతోనే బయటకు వెళ్లాలనుకుంటే వెళ్తాం. అది మా ఇష్టం. నేను బికినీ వేసుకుని బయటకు వెళ్లినా.. ఈవినింగ్‌ డ్రెస్‌లో వెళ్లినంత డీసెంట్‌గానే వెళ్తా!’’ అని కొనసాగించింది జెస్సికా న్యూటన్‌. ఈ సారి పెరూ అందాల పోటీ ఇదివరకటికన్నా ప్రాచుర్యం పొందింది. మహిళల పట్ల హింస, లైంగికదాడులు, వివక్ష, గౌరవలేమి.. ఒక్క పెరూకే పరిమితం కాదు.

ఆడవాళ్ల భద్రత, రక్షణ విషయంలో అత్యంత ప్రమాదకరమైన సిటీ లిమానే కాదు మన రాజధాని ఢిల్లీ కూడా. క్రైమ్‌ ఎగైనెస్ట్‌ విమెన్‌కు సంబంధించి మన అపకీర్తి ఆకాశాన్నంటుతోంది. మన దగ్గర అందాల పోటీలూ కొలతలనే ప్రస్తావిస్తాయి. ఈ విషయంలో పెరూ బ్యూటీకంటెస్ట్‌ స్ఫూర్తిని మనమూ సాగిస్తే బాగుంటుంది. చిన్న మనవి.. ఇదీ బయోగ్రఫే! వివక్ష, అన్నిరకాల హింసకు గురవుతున్న ప్రతిదేశంలోని మహిళ బయోగ్రఫీ. దాన్ని ఎదిరించాలనుకునే సాహసి బయోగ్రఫీ! అందం.. ఆలోచన.. మనసు ఉన్న మహిళ బ్రయోగ్రఫీ!

– శరాది
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement