ఓ అమ్మ ఆవేదన | A story of a mother | Sakshi
Sakshi News home page

ఓ అమ్మ ఆవేదన

Published Sun, Nov 4 2018 12:58 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

A story of a mother - Sakshi

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఓ వీరుడి భార్య సౌందర్యవతి. యవ్వనవతి. అయినా సరే మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. పిల్లలతోనే జీవితమనుకుంది. అక్కడా ఇక్కడా కష్టపడి పని చేసుకుంటూ, వచ్చిన నాలుగు డబ్బులతో కొడుకును సాకుతూ వాడిని చదివిస్తోంది. కొడుక్కి అనుకోకుండా అమెరికాలో చదువుకునే అవకాశం వచ్చింది.

అమ్మను ఒప్పించి అమెరికా వెళ్ళిపోయాడు. బాగా చదువుకున్నాడు. అక్కడ ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అక్కడే ఉండిపోయాడు. సుఖవంతమైన జీవితం సాగిస్తున్నాడు. అమ్మ ఎంత కష్టపడి పెంచిందో తెలుసుకున్న వాడిగా అతను క్రమం తప్పకుండా డబ్బులు పంపుతూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. పండగలూ, పబ్బాలూ వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఈ యువకుడు మాత్రం ఇంటికి వెళ్ళడానికి ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. అమ్మను చూడాలని కూడా అనుకోలేదు.

కొంతకాలానికి అమ్మ చనిపోయినట్టు అతనికి కబురందుతుంది. వెంటనే అతను ఇంటికి చేరుకుంటాడు. తన దగ్గరున్న డబ్బులతో భారీ ఎత్తున అమ్మకు అంత్యక్రియలు చేస్తాడు.
శ్మశానవాటిక నుంటి ఇంటికి చేరుకుంటాడు. అమ్మ పడుకున్న గదిలో మంచం పక్కగా ఓ పెట్టె కనిపిస్తుంది. అదేమిటా అని తీసి చూస్తాడు. అంతే! ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తాడు. విషయం తెలుసుకున్న సమీప బంధువులు, ఇరుగుపొరుగువారు విస్తుపోతారు. తల్లి శవాన్ని చూసినా  అంతగా చలించని అతను ఇప్పుడు ఇంతగా ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాదు. ఆ పెట్టెనిండా డబ్బులు కనిపిస్తాయి. అందులో ఓ చిన్న ఉత్తరం కనిపిస్తుంది. అందులో ఇలా రాసి ఉంది...

‘‘కుమారా, నువ్వు క్రమం తప్పకుండా డబ్బులు పంపుతూనే ఉన్నావు. కాదనను. కానీ మన ఇంటికి కావలసిన డబ్బులు నేను ఎలాగోలా సంపాదించుకుంటూనే ఉన్నాను. నువ్వు పంపిన దాంట్లో ఒక్క పైసా కూడా నేను ముట్టలేదు. అవన్నీ ఇందులోనే ఉన్నాయి. నువ్వు ఎప్పుడెప్పుడు పంపావో తేదీలతో సహా రాసి ఉంచాను. డబ్బుల మాట అటుంచు. నేను నిన్ను చాలా చాలా మిస్సవుతూనే ఉన్నాను. నీ కోసం ఈ అమ్మ కళ్ళు ఎంతగా నిరీక్షించాయో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు.

నువ్వు పంపిన డబ్బులన్నీ అలాగే ఉన్నాయి. నువ్వెప్పుడూ బాగుండాలి. నీకు ఏ అనారోగ్యం రాకూడదు. ఒకవేళ వస్తే ఈ డబ్బులన్నీ మందులకు వాడుకో. వీలుంటే అనాథాశ్రమాలకు ఇవ్వు. అంతేతప్ప దుబారా చేయకు. ఇవి నీ డబ్బులే. నీకిలా చెప్పకూడదు. వాటిని ఎలా ఖర్చు పెట్టాలో నీకు తెలుసు. నేను చెప్పక్కర్లేదు. కానీ ఓ తల్లిగా చెప్పాలనిపించి ఈ నాలుగు మాటలూ చెప్పాను... నీకిష్టమైనట్లే చెయ్యగలవు...’’ దీంతో అతనెందుకు ఏడుస్తున్నాడో అందరికీ తెలిసింది.

– తలశిల మహిమ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement