పెళ్లి అయ్యాక భార్య ఇంటి పేరు మార్పు అవసరమా..? | The Story Of What Our Laws Say After Getting Married Woman Should Change Her Surname | Sakshi
Sakshi News home page

పెళ్లి అయ్యాక భార్య ఇంటి పేరు మార్పు అవసరమా..?

Published Thu, Aug 22 2019 8:59 AM | Last Updated on Fri, Sep 6 2019 12:01 PM

The Story Of What Our Laws Say After Getting Married Woman Should Change Her Surname - Sakshi

శ్వేతకు పెళ్లయింది. ఆమె భర్త ఎలాంటి బాధ్యత లేకుండా సంపాదించకపోగా.. డబ్బుల కోసం శ్వేతపైనే ఆధారపడేవాడు. వీరికి ఎనిమిదేళ్ల బాబు ఉన్నాడు. పరిస్థితుల నేపథ్యంలో శ్వేత తన ఇంటి పేరు మార్చుకోకుండా అలానే కొనసాగింది. ఒక రోజు ఆమె కంగుతినే డైలాగ్‌ వినింది. ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు కన్నతల్లిని పట్టుకుని.. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్‌కాదు. ఎందుకంటే డాడీకి, నాకు పేరు ముందున్న ఇంటి పేరు, నీ పేరు ముందున్న పేరు ఒకటి కాదు అనడంతో శ్వేత నిశ్చేష్టురాలైపోయింది.

భారతీయ స్త్రీ పెళ్లయి అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆమెజీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యక్తులతో కలసి నూతన జీవితం ప్రారంభించే ఆ మహిళ పేరులోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. నిజానికి పెళ్లయినతర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చి భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా.? మన చట్టాలు ఏం చెబుతున్నాయనే అంశంపై కథనమిదీ.

సాక్షి, విశాఖపట్నం: అమ్మాయి పెళ్లి అయ్యాక, అత్తారింటికి వెళ్లి అక్కడ వారితో కలసిపోతుంది. పెళ్లయిన తర్వాత మహిళ భర్తతో కలసి సాగుతుంది. వారి కుటుంబంలో భాగమైపోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. మన సమాజంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం ఇది. కానీ, చట్టప్రకారం పెళ్లయిన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం అది పూర్తిగా వారి ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగాలన్నది వ్యక్తుల ఇష్టం. అయితే పేరు మార్చుకునేవిషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి.  వివాహిత తనకు పెళ్లి కాక ముందు ఉన్న ఇంటి పేరునే (మెయిడెన్‌  నేమ్‌) కొనసాగించుకోవచ్చు. పెళ్లికాక ముందు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం రెండోది. మన దేశంలో అధిక శాతం మంది అనుసరించే విధానం ఇది.

పెళ్లి కాక ముందు ఉన్న ఇంటి పేరును మార్చుకోకుండానే... భర్త పేరును కూడా చేర్చుకోవడం మరో విధానం. ఉదాహరణకు ఐశ్వర్యరాయ్‌. అభిషేక్‌ బచ్చన్‌ ను పెళ్లాడిన తర్వాతతన పూర్తి పేరు చివర్లో బచ్చన్‌ ను చేర్చుకుంది. సమస్యలు రాకుండా ఉండాలంటే.. పెళ్లి కాక ముందున్న పేరుతోనే పెళ్లయిన స్త్రీ కొనసాగితే... భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబపరమైన వివాదాలు తలెత్తితే ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. అప్పుడు ఆ మహిళ గుర్తింపునకు సంబంధించిన ప్రశ్నలు ఉదయిస్తాయి. ఊహించని ఆస్తి, ఇతరత్రా వివాదాలుతలెత్తినా సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పెళ్లయిన మహిళ తన ఇంటిపేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడంమంచిదని కొందరు సూచిస్తుంటారు. ఒకవేళ పేరు మార్చుకునేట్టు అయితే, ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేయించుకోవాలి. రెండు, మూడో ఆప్షన్లలో ఏదైనా ఆ మేరకు కీలక డాక్యుమెంట్లలో పేర్లను కూడా మార్చుకోవాలి. దాంతో ఆర్థిక, ఆస్తి లావాదేవీల సమయంలో ఎలాంటి సమస్యలూ తలెత్తవని చెబుతున్నారు నిపుణులు.  
            
అన్నింట్లోనూ మార్చుకోవాలి... 
భర్త ఇంటి పేరును స్వీకరిస్తే... ఆధార్‌కార్డు, ఓటర్‌ కార్డు, పాన్‌  కార్డు, పాస్‌ పోర్ట్‌ వంటి వాటిలో ఆ మేరకు మార్చుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలోనూ పేరు మార్చుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు కీలకం బ్యాంకు ఖాతా. ఇక మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్‌ ఖాతాల్లోనూ మార్పులు చేసుకోవాలి. వీటిల్లో పేర్ల మార్పు కోసం అఫిడవిట్‌ జిరాక్స్‌ కాపీ లేదా వివాహ నమోదుధ్రువీకరణ పత్రం కాపీలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇతరత్రా ఎక్కడెక్కడ పేరు మార్చకోవాలన్నది మీకున్న వ్యవహారాలను బట్టి తెలిసిపోతుంది. ఉద్యోగం చేస్తుంటే.. సంబంధిత కార్యాలయంలోని రికార్డుల్లోనూ మార్పులు చేసుకోవడం తప్పనిసరని మర్చిపోవద్దు.

ప్రాక్టికల్‌ సమస్యలివీ..
పేర్లు మార్చుకోకుండా కొంతమంది వ్యవహరిస్తుంటారు. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో చిత్రమైన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌లో మహిళ పెళ్లి తర్వాత కొనసాగించదలచుకున్నపేరు మాత్రమే వచ్చేలా జాగ్రత్త పడాలి. లేకుంటే అదో తలనొప్పి అవుతుంది. కొంతమంది భార్యాభర్తలు రిజిస్టర్‌ కార్యాలయం నుంచి వివాహ నమోదు ధ్రువీకరణ పత్రాన్ని పొందినప్పుడు వివాహిత పేరులో భర్త ఇంటి పేరు కానీ, తల్లిదండ్రుల ఇంటి పేరు కానీ లేకుండా వస్తే.. దాన్ని సరిచేసేందుకు మాత్రం రిజిస్ట్రార్‌లు తిరస్కరిస్తారు. ఇలా జరిగినప్పుడు మరోసారి వివాహ రిజిస్ట్రేషన్‌  సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకుని తప్పుల్లేకుండా సరైన పత్రాల్ని పొందాల్సిందే. కాబట్టి.. ఇంటి పేరు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. 

పేర్లను ఎక్కడెక్కడ మార్చుకోవాలి?
ముందుగా వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకోవాలి. నిజానికి చట్ట ప్రకారం దేశంలో ప్రతీ వివాహాన్ని తప్పకుండా రిజిస్టర్‌ చేయించుకోవాలంటూ ‘కంపల్సరీ రిజిస్ట్రేషన్‌  ఆఫ్‌ మ్యారేజెస్‌ యాక్ట్‌–2005’ చెబుతోంది. కానీ, ఈ చట్టం పటిష్టంగా అమలు కావడం లేదు. వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత రిజిస్ట్రార్‌ కార్యాలయం ఓ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ జారీ చేస్తుంది. పెళ్లయిన తర్వాత ఏ పేరుతో అయితే కొనసాగుతారో... అదే పేరు కూడా రిజస్ట్రేషన్‌  సర్టిఫికెట్‌ లో ఉండేలా చూసుకోవాలి. ఈ సర్టిఫికెట్‌ అన్నింటికీ ఆధారంగా పనిచేస్తోంది. ఒకవేళ గుర్తింపు, వారసత్వ హక్కుల విషయంలో ప్రశ్నలు తలెత్తితే ఈ సర్టిఫికెట్‌ కీలకంగా మారుతుంది. వివాహ రిజిస్ట్రేషన్‌  సర్టిఫికెట్‌ పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌ కార్యాలయంలో పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక పత్రికల్లో గెజిట్‌ కార్యాలయం ప్రకటన ఇచ్చిన తర్వాత పేరు మారుస్తుంది. లేదంటే భర్తతో కలసి సంయుక్తంగా అఫిడవిట్‌ తీసుకుంటే సరిపోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement