కలల్ని వెంటాడే విద్యార్థులు | Student's poetry | Sakshi
Sakshi News home page

కలల్ని వెంటాడే విద్యార్థులు

Published Mon, Aug 28 2017 12:57 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

కలల్ని వెంటాడే విద్యార్థులు - Sakshi

కలల్ని వెంటాడే విద్యార్థులు

♦ విద్యార్థుల కవిత్వం

ఈ ఎనిమిది మంది కవులు వాక్యాల మంత్రజలం చల్లి, వొక కొత్త సందేశాన్ని మన వొట్టిపోయిన రోజువారీ బతుకుల్లోకి వొంపుతున్నారు. వాళ్ళు వాళ్ళ కలల్ని వెంటాడుతూ వెళ్తూ మనం మరచిపోతున్న కలల్ని కూడా తట్టి లేపి వెళ్తున్నారు. అందుకే, వీళ్ళు ‘స్వప్నసాధకులు’.

యంత్రాల సహవాసంలో యాంత్రికతే జీవితపు ఇరుసు అయిపోయిన సందర్భంలో అక్షరాలు అసందర్భమవుతాయి. సాహిత్యం అప్రస్తుత ప్రసంగమే అవుతుంది. కవిత్వం అనేది విరోధాభాసగా మిగిలిపోతుంది. ఆ చేదు విషాన్ని జీర్ణించుకోలేని విషాదంలో వుండగానే ఇదిగో ఇక్కడ ఎనిమిది మంది విద్యార్థులతో అష్ట దిగ్బంధనం చేస్తున్నాడు బాలసుధాకర్‌ మౌళి. ఈ ఎనిమిది మంది కవులు వాక్యాల మంత్రజలం చల్లి, వొక కొత్త సందేశాన్ని మన వొట్టిపోయిన రోజువారీ బతుకుల్లోకి వొంపుతున్నారు. వాళ్ళు వాళ్ళ కలల్ని వెంటాడుతూ వెళ్తూ మనం మరచిపోతున్న కలల్ని కూడా తట్టి లేపి వెళ్తున్నారు. అందుకే, వీళ్ళు ‘స్వప్నసాధకులు’.

స్వప్నం అంటే దాన్ని సాధించడం అంటే ఎప్పుడైనా నాకు గుర్తొచ్చే పేరు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌. నల్లజనం హక్కుల కోసం నినదించిన స్వరం. కాని, అది కేవలం నల్లజనం స్వరమే కాదు, పీడితులు ఎక్కడైనా అదే స్వరతీవ్రతతో మాట్లాడ్తారు, మాట్లాడుతూనే వున్నారు, అదే స్వప్న జ్వరంతో! ఆ స్వప్న సాధనలో మార్టిన్‌ ఎప్పుడో అన్న ఈ వొక్క వాక్యం మనమూ అంటున్నామా లేదా అన్నది ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిలదీసి ప్రతివొక్కరినీ అడగాలి.

I have a dream that my four little children will one day live in a nation where they will not be judged by the color of their skin but by the content of their character.
యీ వాక్యం యే తరానికైనా మేనిఫెస్టో కావాలి.
అందుకే, ఇవాళ హరి అంటున్నాడు: ఆకలి నాకు తోబుట్టువు లాంటిది–అని! అక్కడితో ఆగితే అది కేవలం కవిత్వ వాక్యమే అయ్యేది. ఆ తరవాత ఏమన్నాడో చూడండి:
మేమిద్దరమే గదిలో మాట్లాడుకుంటున్నాం
మాకు తోడూ నీడా లేదు
మాతో మాట కలపడానికి ఎవరూ లేరు
ప్రభుత్వాలు మార్తున్నాయి
అధికారాలు మార్తున్నాయి
అయినా మేమిద్దరమే మాట్లాడుకుంటున్నాం.
కవిత్వం ఎక్కడ కవిత్వం అవుతుందీ అంటే అది పరిసరాలతో, చుట్టూ వున్న మనుషుల్తో సంభాషణలో పడ్డప్పుడు! ఈ యెనిమిది మంది కవులూ కవిత్వం కోసం కవిత్వం రాయలేదు. వొక మాట్లాడక తప్పని పరిస్థితి శాసించడం వల్ల కవిత్వం రాశారు.
మోహిని కవిత వినండి:
అతని కోసం ఎదురుచూస్తున్నాం
అతని అడుగుల జాడని వెతుక్కుంటూ వున్నాం
ఆకలితో పోరాటం చేసిన వాడే జీవితంతోనూ పోరాడగలడు. పనికిమాలిన పాఠాల మధ్య తరగతి గదిని సమాధి చేయకుండా నిత్య చైతన్య ఉత్సవంగా మార్చగలడు. అతని ప్రతి వాక్యం వీరగానమే అవుతుంది. వొక్క మోహిని మాత్రమే అలాంటి గానం కోసం ఎదురుచూస్తోందా?! కాదు!
అలా ఎదురుచూసే వాళ్ళ ముఖాలు విజయ అన్నట్టు ‘ఈ రాత్రి ఆకాశం /ఒక స్త్రీ ముఖంలానూ కనిపిస్తుంది!’ ఎదురుచూపులకు జెండర్‌ లేదు, కులం లేదు, మతం లేదు, రంగు లేదు. ఆకలికి లేనట్టే!
ఆకలి అంతమయ్యే రోజు వస్తుందన్న ఊహాజీవి ఉమామహేశ్‌ని వినండి:
ఈ రోజు ఉదయం కురిసిన వాన
పంటలను పండిస్తుంది.
చిన్న వాక్యం చాలు కదా, వొక ఆశ వెలగడానికి!
దాలినాయుడు ఆచరణ వేపు వెళ్తూ అంటున్నాడు:
ఒక అర్ధరాత్రి వేళలో
అమ్మ, నేనూ
చెరువులో వున్న నీటిని
పొలంలోకి తోడుతున్నాం.
ఆచరణ పొలాల్లో మొదలవ్వాలి. అనుచరులు పల్లెలోంచి రావాలి. పొలం పోరాట ప్రతీక కావాలి.
అలాంటప్పుడు గౌతమ్‌ చెప్పినట్టు: వూరు వెళ్లి రావాలి/ ఒక్కసారైనా ఆ ప్రపంచాన్ని కలిసి రావాలి
అలా వెళ్ళినప్పుడల్లా శేఖర్‌ అన్నట్టు:
ఒక్కొక్కటి ఏరుకుంటూ
ఒక దగ్గరకు పోగు చేయాలి.
ఎన్ని వొంటరి ప్రపంచాలు కలిస్తే వొక సమూహం అవుతుందో విద్యార్థులకే బాగా తెలుసు.
జీవితమంతా అలజడికీ యుద్ధానికీ మధ్యనే వుందని కమలాకర్‌ అంటున్నాడు ఇదే సందర్భంలో.
ఇన్ని కవిత్వ సందర్భాల్ని ఈ విద్యార్థుల జీవితాల్లోకి ప్రసరించిన తొలి ఉపాధ్యాయుడు బాల సుధాకర మౌళికి తోటి ఉపాధ్యాయుడిగా నా మాటల్లో చెప్పలేనిది ఇదిగో ఈ గ్రీకు రచయిత చెప్తున్నాడు వేరే సందర్భంలో:
True teachers are those who use themselves as bridges over which they invite their students to cross; then, having facilitated their crossing, joyfully collapse, encouraging them to create their own.''  (Nikos Kazantzakis)

కాని, ఆ గ్రీకు రచయిత కన్నా, నా కన్నా బాగా మౌళి విద్యార్థి మోహిని ఇంకా బాగా చెప్పింది:
అతను చెప్పిన మాటలు రక్తంలో ఇంకిపోతాయి.
గొప్ప జీవన పాఠం చేసే పని అదే కదా! కల చేసే పని కూడా అదే!

(స్వప్న సాధకులు: సంపాదకుడు: బాలసుధాకర్‌ మౌళి; ప్రచురణ: చంపావతి ప్రచురణలు; ప్రతులకు: సంపాదకుడు, బోయ స్ట్రీట్, నెల్లిమర్ల, విజయనగరం–535217. ఫోన్‌: 9676493680)-  v  అఫ్సర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement