రోడ్డెక్కిన విద్యార్థులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ‘బస్సులు సకాలంలో రావడం లేదు...వచ్చినవీ ఆగకుండా వెళ్లిపోతున్నాయి.. రోడ్డుపై అడ్డంగా నిలబడి బస్సును ఆపినా అందులో కండక్టర్ లేరన్న కారణంతో డ్రైవర్లు అనుమతించడం లేదు..ఈ పరిస్థితుల్లో మేము ఎలా కళాశాలలకు చేరుకోవాలి..మాపై దయ ఉంచి బస్సులు నడపండి’ అని పలువురు విద్యార్థులు బుధవారం అనంతపురం ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగారు. పామిడి, కల్లూరు, గార్లదిన్నె, లోలూరుకు చెందిన పలువురు విద్యార్థులు అనంతపురంలోని వివిధ కళాశాలల్లో చదువుకుంటున్నారు.
సకాలంలో బస్సులు తిరగకపోవడం..వచ్చినవీ ఆపకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. ఈ సంర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వచ్చారని, పుష్కరాలు ఉన్నాయని, పండుగొచ్చిందనీ తమ రూట్లో నడిపే రెగ్యులర్ సర్వీసులను ఇతర ప్రాంతాలకు పంపడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
దీంతో తామంతా కళాశాలలు మానేసి ఇళ్ల వద్దే ఉండిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంబినేషన్ టికెట్ తీసుకుంటామని చెప్పినా.. గుత్తి, గుంతకల్లుæడిపోల బస్సుల్లో కండక్టర్లు తమను అనుమతించడం లేదన్నారు. విద్యార్థుల ఆందోళనతో సుమారు గంట పాటు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.
బస్సుల కొరత ఉంది..
పుష్కరాలకు, జీడిపల్లికి బస్సులను నడుపుతున్నాం. అందువల్ల బస్సుల కొరత ఉంది.. అందరూ ఒకేసారి కళాశాలలు బయలు దేరడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతోంది. విద్యార్థులను కాంబినేషన్ టికెట్‌పై అనుమతించే అంశాన్ని గుత్తి, గుంతకల్లు డిపో మేనేజర్లతో మాట్లాడాను. పుష్కరాలు ముగిశాక సమస్యను పరిష్కరిస్తాం.
–బాలచంద్రప్ప, అనంతపురం డిపోమేనేజర్