‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ గడువు పొడిగింపు
- ఈనెల 30 వరకు రిజిస్ట్రేషన్లు
సాక్షి, విజయవాడ : దేశంలోనే ప్రతిష్టాత్మక ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించారు. పాఠశాల విద్యార్థుల్లో సృ జనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న స్పెల్‌బీ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు విద్యార్థుల్లో ఆంగ్ల పదాల స్పెలింగ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఈపోటీలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆగస్టు ఒకటో తేదీ నుంచి పేర్ల నమోదు ప్రారంభించారు. వాస్తవానికి ఈనెల నాలుగో తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగియనుంది. అయితే వరుస సెలవులు రావటం, పాఠశాల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు రిజిస్ట్రేషన్ల గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించారు.
పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఇంగ్లిషు గ్రామర్, పదాలతో కూడిన రిఫరెన్స్ బుక్‌ను అందజేస్తారు. మొత్తం నాలుగు కేటగిరిల్లో పోటీలు జరుగుతాయి. మొదటి కేటగిరిలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు, రెండో కేటగిరిలో మూడు, నాలుగు తరగతులు, మూడో కేటగిరిలో ఐదు, ఆరు, ఏడు తరగతుల విద్యార్థులు, నాలుగో కేటగిరిలో ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు పాల్గొంటారు. ఈపోటీలు నాలుగు దశల్లో జరుగుతాయి. మొదటి మూడు దశలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి నిర్వహిస్తారు. నాలుగో దశలో (ఫైనల్స్) రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా పోటీ పరీక్షలు ఉంటాయి.
తొలిదశలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి పాఠశాల స్థాయిలోనే ఇండియా స్పెల్‌బీ పరీక్ష ఆక్టోబర్ 15న (రాత పరీక్ష) ఉంటుంది.
రెండోదశలో భాగంగా తొలిదశలో ఎంపికైన విద్యార్థులకు నవంబర్ 9న జిల్లా ప్రధాన కేంద్రం అయిన విజయవాడలోని ప్రత్యేక కేంద్రాల్లో (క్వార్టర్‌ఫైనల్స్) పరీక్షలు నిర్వహిస్తారు.
మూడో దశలో సెమీ ఫైనల్స్ స్టేజ్ పరీక్షలు కూడా జిల్లా కేంద్రాల్లోనే జరుగుతాయి.
ఫైనల్‌కు అర్హత సాధించిన విద్యార్థులలో ఒక్కొక్క కేటగిరి నుంచి పది మంది చొప్పున ఎంపిక చేసి ఫైనల్ పరీక్ష నిర్వహిస్తారు.
మొదటి బహుమతిగా...
అంతిమ విజేతలకు మొదటి బహుమతిగా బంగారుపతకంతో పాటు రూ.25 వేల నగదు అందజేస్తారు. రెండో బహుమతిగా రజత పతకం, రూ.15 వేల నగదు , మూడో బహుమతిగా కాంస్య పతకం, రూ.10వేల నగదును అందజేస్తారు. రెండు, మూడు దశల్లో లైవ్ టెలికాస్ట్ ద్వారా నిర్వహించే పోటీల్లో ప్రేక్షకులు కూడా స్పెల్లింగ్‌లను పంపి బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది.
పేర్ల నమోదు ఇలా...
ఈపోటీల్లో పాల్గొనే విద్యార్థులు WWW.INDIASPELLBEE.INవైబ్‌సైట్ ద్వారా పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ‘సాక్షి’, విజయవాడ బ్రాంచ్ కార్యాలయం (0866-2547433), మేనేజర్ ఐ.సూర్యనారాయణ (మొబైల్: 9912272599) ఫోన్ నంబర్లకు కాల్ చేసి పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.