యువత చెడుకు దూరంగా ఉండాలి
‘సాక్షి టీవీ యువమైత్రి’ సదస్సులో సైకాలజిస్ట్ జవహర్‌లాల్ నెహ్రూ
మెహిదీపట్నం: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు మీద ధ్యాస చూపిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని ప్రముఖ సైకాలజిస్ట్ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. సాక్షి టీవీ యువ మైత్రి ఆధ్వర్యంలో గురువారం మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. నేటి యువతరం తల్లిదండ్రులు, సోదరుల కంటే ఇతరుల మాటలకే విలువ ఇస్తున్నారన్నారు.
చిన్న చిన్న అపోహలు, అపార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. చదువుమీద దృష్టిసారింది, తమను పెంచిపోషిస్తున్న తల్లిదండ్రుల మాటకు విలువిస్తూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. సమాజం కూడా యువతపై ఎంతో నమ్మకం పెట్టుకుందని, సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా ఎదుగుతామన్న ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. విశ్వవ్యాప్తంగా వ్యాపించిన సోషల్ మీడియా వల్ల ప్రయోజనాలు ఉన్నాయని, అయితే దీనికి రెండవ వైపు నష్టాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినిలు, యువమైత్రి ప్రతినిధులు పాల్గొన్నారు.