నవయువం: స్టైల్ స్టైల్‌రా... హెయిర్ స్టైల్‌రా!
ఆట కోసం వారు స్టేడియంలోకి దిగితే అది ర్యాంప్ అవుతోంది. ఫ్యాషన్‌కొక ట్రెండ్‌ను నేర్పుతుంది. యువతకు ఒక గైడ్ అవుతుంది. వెరైటీ హెయిర్ స్టైల్ అవుతుంది! ఆకట్టుకునే ఆట తీరే కాదు.. ఆకర్షించే స్టైల్ కూడా వారి సొంతం. వ్యక్తిగత ప్రతిభ వారిని స్పోర్ట్స్ స్టార్స్‌గా నిలిపితే... వ్యక్తిగత ఆసక్తులు స్టైల్‌స్టార్‌లను చేస్తున్నాయి. స్పెషల్‌గా నిలుపుతున్నాయి. యూత్‌కు స్టైల్ గైడ్స్‌ని ఇస్తున్నాయి. అందరిలోకి భిన్నంగా కనిపించడమే ఫ్యాషన్. అందరినీ ఆకట్టుకునేదే స్టైల్... ఆటతోనే కాక తమ స్టైల్స్‌తో కూడా యువతను ఆకట్టుకునే ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ప్రత్యేకించి నిత్యం హెయిర్ స్టైల్స్‌ను మారుస్తూ ఆకట్టుకునేవాళ్లు కూడా ఉన్నారు. అలా యువతను ప్రభావితం చేస్తున్న క్రీడాకారుల గురించి...
ధనాధన్ హెయిర్ స్టైల్...
భారత యువతకు బాగా ఇష్టమైన ఆట క్రికెట్. ప్రస్తుతం బాగా ఇష్టమైన ఆటగాడు ధోనీ. బాగా ఆసక్తిని రేపుతున్నది ధోనీ హెయిర్ స్టైల్. హెయిర్‌స్టైల్ విషయంలో అరంగ్రేటం నుంచే అదుర్స్ అనిపిస్తున్నాడు ఈ రాంచీ రాక్‌స్టార్. కెరీర్ తొలినాళ్లలో ధోనీ హెయిర్ స్టైల్‌ను చూసి ముషారఫ్ ముచ్చటపడ్డాడు. దేశీయ యువత ఇష్టపడ్డారు. ఇంకేముంది ధోనీ క్రికెట్ స్టైల్ మాత్రమేకాక హెయిర్ స్టైల్ కూడా ఫేమస్ అయ్యింది. ఆదిలో వచ్చిన ఇమేజ్‌కు అనుగుణంగా ఇప్పటికీ ధోనీ విభిన్నమైన స్టైల్స్‌ను కొనసాగిస్తున్నాడు. అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ధోనీ తన ‘మొహాక్ హెయిర్‌స్టైల్’ తో వార్తల్లోకి వచ్చిన విషయం కూడా తెలిసిందే. దీన్ని అనుకరించేవారు కొంచెం తక్కువమందే ఉండవచ్చు కానీ ఆకర్షణీయంగా ఉందంటూ ఆసక్తిగా గమనించేవాళ్లు మాత్రం ఎంతోమంది.
ప్రపంచం ఫాలో అవుతుంది...
ఫుట్‌బాల్ మ్యాచ్‌ల విషయంలో సీజన్లు ఎలా మారుతుంటాయో, బెక్‌హమ్ హెయిర్‌స్టైల్స్ కూడా అలాగే మారుతుంటాయి. దేశీయ యువతకు హెయిర్‌స్టైల్ విషయంలో కొత్త స్టైల్స్‌ను పరిచయం చేసింది ధోనీ అయితే ధోనీకి ముందు దశాబ్దం నుంచే ఇంగ్లండ్ సాకర్ హీరో బెక్‌హమ్ హెయిర్ స్టైల్స్ విషయంలో స్టైలిష్ అన్న పేరు పొందాడు. బహుశా.. బెక్ మార్చినన్ని హెయిర్ స్టైల్స్ మరే స్పోర్ట్స్ పర్సన్ కూడా మార్చలేదేమో! పాశ్చాత్య ప్రపంచంలో బెక్ హెయిర్ డ్రస్సింగ్‌ను అనుకరించినవారు కూడా ఎంతోమంది.
టార్జాన్ స్టైల్ నుంచి గుండు వరకూ...
ఇప్పుడైతే అగస్సీ పూర్తి గుండుతో కనిపిస్తున్నాడు కానీ.. ఒకప్పుడు తన హెయిర్ స్టైల్‌తో అబ్బాయిలకు నిద్ర లేకుండా చేశాడు. టార్జాన్ స్టైల్లో తల వెంట్రుకలు పెంచిన అగస్సీ, బ్యాండ్ ధరిస్తే ఎక్కడలేని అల్లరితనం దర్శనమిచ్చేది. విషాదం ఏమిటంటే.. తర్వాతి రోజుల్లో అగస్సీకి హెయిర్ ఫాల్ మొదలైంది. బట్టతల వచ్చింది. టార్జాన్‌లా ఉన్నవాడు కాస్తా అరగుండుతో కనపడలేక ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో కనిపిస్తాడు.
ఒకే స్టైల్‌తో మెరిసినవారూ ఉన్నారు..
నిత్యం స్టైల్స్ మారుస్తూ ఆకట్టుకునే వారే గాక ఒకే హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నవారూ ఉన్నారు. తన పొడవాటి హెయిర్ స్టైల్‌తో ఫేమస్ అయ్యాడు స్పెయిన్ టెన్నిస్ కెరటం నాదల్, ఇంకా అర్జెంటీనా సాకర్ హీరో మెస్సీ హెయిర్ స్టైల్ కూడా అభిమానులను సంపాదించుకుంది. యువతలో అటెన్షన్ తీసుకువచ్చింది. ఆ మధ్య సచిన్ టెండూల్కర్ కూడా కొంత భిన్నమైన హెయిర్‌స్టైల్ ట్రై చేశాడు. దానికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా వ్యక్తులు మారుతున్నారు, స్టైల్స్ మారుతున్నాయి. ఆకట్టుకునే హెయిర్ స్టైల్ అయితే వారికి యూత్‌లో ఫాలోయింగ్‌ను పెంచుతుంది.