హీట్ పోయి కూల్ వచ్చె...
హోమ్‌టెక్ ఫ్రిజ్‌లు ఎలా పనిచేస్తాయి..?
కరెంటు లేని కాలంలో మన పూర్వికులు ఎలా జీవించారోనని ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడైతే ఫ్యాను, ఫ్రిజ్, టీవీ లేని ఇంట్లో ఉండేందుకు పిల్లలు కూడా ఇష్టపడడం లేదు. వేసవిలో అయితే ఫ్యాను, టీవీల కన్నా కూడా ఫ్రిజ్ నిత్యావసర, అత్యవసర ఉపకరణంలా మారిపోతుంది. ఒక్క వేసవి లోనే కాదు, అన్ని కాలాల్లోనూ మనకు ఆప్తబంధువు అయింది ఫ్రిజ్.
వస్తువుల నుంచి వేడిని తీసేయడం ద్వారా వాటిని చల్లగా ఉంచడమే ఫ్రిజ్ (రిఫ్రిజిరేటర్) లోని టెక్నాలజీ. ప్రధానంగా ఇది పరిసరాల పీడనంపై ఆధారపడి పనిచేస్తుంది. ఎలాగంటే – ఒక పదార్ధం ద్రవస్థితి నుంచి ఆవిరిగా మారేటప్పుడు కొంత వేడిని గ్రహిస్తుంది. అలాగే వాయువు ద్రవంగా మారేటప్పుడు వేడిని విడుదల చేస్తుంది. ఫ్రిజ్ పని తీరు వెనుక ఉన్న సూత్రం ఇదే. ఫ్రిజ్ లోపలి నుంచి వేడిని లాగేయడం వల్ల ఫ్రిజ్ లోపలి వస్తువులు చల్లగా మారతాయి. (చల్లటి వాతావరణంలో ఆహార పదార్ధాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయన్న విషయం తెలిసిందే).
ఆహార పదార్థాలను పాడవకుండా నిల్వ చేయడానికి ప్రధానమైన ప్రక్రియలు... రిఫ్రిజిరేషన్, ఫ్రీజింగ్. ఇవి కాక కేనింగ్, ఇర్రేడియేషన్, పాశ్చరైజేషన్ వంటి విధానాలూ అవసరాన్ని బట్టి వాడుకలో ఉన్నాయి. అయితే వీటన్నిటిలోనూ రిఫ్రిజిరేషన్ ఒక్కటే సాధారణ సాధనం అయింది. చల్లని నీటి కోసం ఫ్రిజ్, తాజా పెరుగు కోసం ఫ్రిజ్; పచ్చని ఆకుకూరలు, కూరగాయల కోసం ఫ్రిజ్... ఇలా మన దైనందిన జీవనశైలిని ఫ్రిజ్ ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో ఫ్రిజ్ పని తీరు గురించి, దాన్ని జాగ్రత్తగా వాడుకునే పద్ధతుల గురించి తెలుసుకోవడం అవసరం.
ఫ్రిజ్‌లో భాగాలు
ముందే చెప్పినట్లు ద్రవాన్ని ఆవిరిగా మార్చి వేడిని పీల్చుకునే సూత్రం మీద ఆధారపడి ఫ్రిజ్ పనిచేస్తుంది. ఇందులో వాడే ద్రవాన్ని ‘రిఫ్రిజిరెంట్’ అంటారు. ఈ ద్రవాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరయ్యేలా చూస్తారు. ఇందుకోసం ఫ్రిజ్‌లో 5 భాగాలు ఉంటాయి. అవి: 1. కంప్రెసర్
2. వేడిని మార్పులకు లోనుచేసే గొట్టాలు (చుట్టలు చుట్టినట్లు ఫ్రిజ్ వెనుక భాగంలో ఇవి కనిపిస్తాయి).
3. వ్యాకోచం చెందే వాల్వ్
4. వేడిని మార్పిడి చేసే లోపలి గొట్టాలు (ఇవి ఫ్రిజ్ లోపల ఉంటాయి)
5. రిఫ్రిజిరెంట్ (తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆవిరయ్యేద్రవం). ఇవికాక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే థర్మోస్టాట్ ఒకటి వుంటుంది. మొదట్లో అమ్మోనియా వాయువును స్వచ్ఛమైన రూపంలో తీసుకొని రిఫ్రిజరేటర్‌గా వాడేవారు. ఎందుకంటే, స్వచ్ఛమైన అమ్మోనియా వాయువు –27 డిగ్రీల ఫారన్‌హీట్ (–32 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత దగ్గర ఆవిరౌతుంది. ప్రస్తుతం ‘ఫ్రియాన్’ వాయువును వాడుతున్నారు. ఫ్రియాన్ అనేది క్లోరోఫ్లోరో కార్బన్ అనే రసాయనానికి వ్యవహారనామం.
ఫ్రిజ్ ఎలా పనిచేస్తుంది?
స్థూలంగా చెప్పాలంటే – ఫ్రిజ్‌లో ఉండే కంప్రెసర్ రిఫ్రిజరెంట్‌గా వున్న వాయువును కుదిస్తుంది. ఈ కుదించడాన్నే కంప్రెసింగ్ అంటారు. ఆ వాయువు ఇలా కుదింపునకు లోనవడం వల్ల దాని పీడనం, ఉష్ణోగ్రత పెరుగుతాయి. ఫ్రిజ్‌కి లోపలా బయటా చుట్ట చుట్టిన గొట్టాలుంటాయి కదా! వాటిలో బయట ఉండే గొట్టాలు ఈ వాయువులో ఒత్తిడి వల్ల పెరిగిన ఉష్ణోగ్రతను గ్రహించి బయటకు పంపుతాయి. దాంతో వాయువు ఘనీభవించి ద్రవరూపాన్ని పొందుతుంది. ఈ ద్రవరూపంలో ఉండే వాయువు వ్యాకోచం చెందే వాల్వు ద్వారా హెచ్చు పీడన ప్రాంతం నించి తక్కువ పీడనం ఉండే ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. అప్పుడు ఆ ద్రవం కాస్తా వ్యాకోచం చెంది ఆవిరిగా మారుతుంది. ఆవిరిగా మారేటప్పుడు వేడిని గ్రహించి లోపల మొత్తంగా ‘చల్ల’ బరుస్తుంది. అలా గ్రహించిన వేడిని ఫ్రిజ్‌లోపల ఏర్పాటు చేసిన చుట్ట చుట్టబడ్డ గొట్టాలు గ్రహిస్తాయి. ఇదీ ఫ్రిజ్‌ను ‘చల్ల’బరిచే చక్రం.
ఎంత ఉష్ణోగ్రత మేలైనది?
అసలు ఫ్రిజ్ ఉద్దేశం ఏమిటి? ఆహార పదార్థాలు పాడుకాకుండా, వాటిని ఎక్కువ కాలం నిలవ ఉంచడం. అంటే బ్యాక్టీరియా ఎదుగుదల వేగాన్ని తగ్గించడం. అందుకు బ్యాక్టీరియాని అస్సలు ఎదగనీయకుండా చేయాలి. అప్పుడు ఆహారపదార్థాలు గడ్డకడతాయి. అదే ఫ్రీజింగ్! దీని కోసం ఫ్రిజ్‌లలో ఫ్రీజర్ కంపార్ట్‌మెంట్ ఒకటి ఉంటుంది. వివిధ పదార్థాలను ఎక్కువకాలం నిల్వ ఉంచాలంటే 35–38 డిగ్రీల ఫారన్‌హీట్ (1.7–3.3 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత తప్పనిసరి. అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగితే ఆహారపదార్థాలు చెడిపోతాయి. అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతకు పడిపోతే ఫ్రీజింగ్ సమస్యగా మారుతుంది. పాత మోడల్ రిఫ్రిజిరేటర్లలో ఫ్యాన్‌లుండేవి కావు కానీ, నేడు వచ్చే ఫ్రాస్ట్–ఫ్రీ రిఫ్రిజిరేటర్లలో ఒకటి లేదా రెండు చిన్న ఫ్యాన్లు ఉంటున్నాయి. ఫ్రీజర్ కేబినెట్‌లో మైనస్ 18డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా జీరో డిగ్రీల ఫారిన్‌హీట్ వుంటే, ఫ్రిజ్ కంపార్ట్‌మెం ట్లలో 5 డిగ్రీల సెంటీగ్రేడ్ (40 డిగ్రీల ఫారన్ హీట్)ఉంటుంది. కూరగాయల క్యాబిన్‌లో 10డిగ్రీల సెంటీగ్రేడ్ (50 డిగ్రీల ఫారన్ హీట్) ఉంటుంది.
జీవనశైలిపై ప్రభావం
మధ్యతరగతి ఇళ్ళలో ఫ్రిజ్ ఒక తప్పనిసరి ఉపకరణం అయింది. దీనికి మనమంతా 18వ శతాబ్దానికి చెందిన విలియం కల్లెస్‌కీ, మైకేల్ ఫారడేకీ ఆజన్మాంతం ఋణపడి ఉన్నాం. విలియం కల్లెస్ 1748లో తొలిసారిగా గ్లాస్‌గో విశ్వవిద్యాలయంలో కృత్రిమ పద్ధతిలో రిఫ్రిజిరేషన్ చేసే విధానాన్ని ప్రదర్శించారు. దానికి మైకేల్ ఫారడే పరిశోధనా ఫలితాలెంతో ఉపకరించాయి. 1805 ప్రాంతాల్లో ఆలివర్ ఇవాన్స్ తొలి రిఫ్రిజిరేటర్‌ని ద్రవంతోగాక ఆవిరితోపనిచేసేలా రూపొందిస్తే, 1902లో విలియం హవిలేండ్ క్యారియర్ తొలి ఏర్ కండిషనర్‌ని రూపొందించాడు. 1915లో తొలి ‘గార్డియన్’ యూనిట్‌కి జనరల్ ఎలక్ట్రిక్ అంకురార్పణ చేస్తే, 1916లో కెల్వినేటర్, సెర్వెల్‌లు కలిసి రెండు కొత్త మోడల్స్‌తో వచ్చాయి. 1918 నాటికి కెల్వినేటర్ ఆటోమేటిక్ కంట్రోల్స్‌తో పనిచేసే ఫ్రిజ్‌తో వూర్కెట్‌లోకొచ్చింది.
ఫ్రిజ్‌లలో ఫ్రియాన్ వాయువును వాడటం 1930లలో ఆరంభమైంది. ఐతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే ఫ్రిజ్ అనేది ఇళ్ళలోకి ప్రవేశించింది. నిజానికి ఆటోమేటిక్ డీ ఫ్రాస్టింగ్ 1960ల్లోనే మెుదలైంది. వునం ఆటో డీఫ్రాస్ట్ ఫ్రిజ్‌లను వాడటం మెుదలెట్టింది మాత్రం 1980 తర్వాతే! 1970, 80 దశాబ్దాల్లో రిఫ్రిజిరేటర్ రూపు రేఖలూ, పనితీరూ, పరిజ్ఞానం అన్నిట్లోనూ ఎంతో అభివృద్ధి జరిగింది. ఐతే ఫ్రీయాన్ వాయువ#ను సీల్డు కంప్రెసర్లలో వాడటంవల్ల ఓజోన్ పొరకు, పర్యావరణానికి వుుప్పు వాటిల్లుతోందన్న భయాలున్నాయి. గ్లోబల్ వార్మింగ్‌కీ ఇది కారణం అవుతోందన్నది శాస్త్రవేత్తల వాదన. కార్బన్‌డై ఆక్సైడ్ చేసే హాని తర్వాత అంత హాని ఈ ఫ్రీయాన్ (సిఎఫ్‌సి) వాయువ# చేస్తుందనీ, ఈ క్లోరోఫ్యూరో కార్బన్ కన్నా హైడ్రో క్లోరోఫ్యూరో కార్బన్ లేదా హైడ్రోఫ్లూరో కార్బన్స్ పదార్ధాల సమ్మేళన వాయువ#లు వాడటం వుంచిదని కొందరంటున్నారు. కొత్త కొత్త పరిజ్ఞానాలు రూపొందిస్తున్నారు కూడా!
పోషకాలు కోల్పోకుండా...
⇒ ఫ్రిజ్‌లో లేదా షెల్ఫ్‌లలో పదార్థాలను ఒకే పాకెట్‌లో 3–4 రకాలవి వేసి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆయా పదార్థాలకున్న ప్రత్యేక వాసన, పోషకాలు కోల్పోతాయి.
⇒ పదార్థాలను కట్‌చేసేటప్పుడు, వేరు చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి.
⇒ కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసాహారాన్ని శుభ్రపరిచేటప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటిని ఉపయోగించాలి.
⇒ కటింగ్ బోర్డులు, గిన్నెలు ఉపయోగించడానికి ముందు, తర్వాత తప్పనిసరిగా సబ్బు నీటితో శుభ్రపరచాలి. నీచు వాసన రాకుండా ఉండటానికి ఘాటువాసనలు లేని బ్లీచ్‌ని ఉపయోగించవచ్చు.
⇒ వంటగదిలో పాత్రలు, స్టౌ, ఉపయోగించే ఇతర పరికరాలు సురక్షితమైనవే ఎంచుకోవాలి.
⇒ రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన మాంసం గానీ, కూరగాయలు గానీ 30 నిమిషాల లోపు వండాలి.
⇒ మిగిలిపోయిన పదార్థాలను రెండు గంటలకన్నా మించి బయట ఉంచకూడదు. ఫ్రిజ్‌లో అయితే ఒక రోజులోనే వాటిని పూర్తి చేయాలి.
⇒ ఫ్రిజ్‌లో కూరగాయలు, ఆకుకూరలు నిల్వచేసే బాక్స్ అడుగున పేపర్ టవల్ వేయాలి. ఇలా చేయడం వల్ల తేమ పేపర్ టవల్ పీల్చుకుంటుంది. కూరగాయలు త్వరగా పాడవవు.
⇒ మష్రూమ్స్ పేపర్ టవల్‌లో చుట్టి, బాక్స్‌లో పెట్టి ప్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
ఫ్రాస్ట్‌ఫ్రీ అంటే ఏమిటి?
రిఫ్రిజిరేటర్‌లో మనం సాధారణంగా ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవడానికి వీలుంటుంది. దాని ప్రకారం చల్లగా అవుతుంది. ఆ ఉష్ణోగ్రతను నియంత్రించేం దుకు ఒక ధర్మోస్టాట్ ఉంటుంది. ముఖ్యంగా అది ఫ్రీజర్ ఛాంబర్‌ను నియంత్రిస్తుంది. ఐతే కొన్ని గంటలు అదే పనిగా పనిచేశాక నీరు గడ్డకట్టడం ఆరంభమై ఐస్ తయారవుతుంది. దాన్ని నివారించడానికి రోజూ రాత్రిళ్ళు ‘డీఫ్రాస్ట్’ బటన్‌ని నొక్కి పడుకోవాల్సి వచ్చేది. ఏరోజైనా అలా డీఫ్రాస్ట్ చేసి ఐస్‌ను తొలగించకపోతే ఫ్రిజ్ సరిగా పనిచేసేది కాదు.
లేదా బయటకు నీళ్ళు కారిపోయి చికాకు పెట్టేది. ఈ ఇబ్బందులను అధిగమించడానికే ఆటో డీఫ్రాస్ట్ లేదా ఫాస్ట్‌ఫ్రీ రిఫ్రిజిరేటర్లు రూపొందాయి. అంటే, ఫ్రీజర్ లోపలే చిన్నపాటి ఫ్యాన్‌ను ఏర్పాటు చేసి తద్వారా ఐసు ఏర్పడకుండా చూస్తారన్న మాట. దీనికి టెంపరేచర్ కంట్రోలర్, టైమర్, హీటింగ్ కాయిల్ వంటి భాగాలు తోడ్పడతాయి. ఆటో డీఫ్రాస్ట్ చేయడం వల్ల రోజూ మనకు ‘డీఫ్రాస్ట్’ బటన్ నొక్కే పని తప్పుతుంది. వస్తువులు పాడవవు. వాసనలూ రావు. లోపలి ఐసును తొలగించే క్రమంలో ఉత్పత్తి అయ్యే వేడిని ఫ్రిజ్... క్యాబినెట్ ద్వారా బయటకు పంపడం వల్లనే ఈ వేడి. అందువల్ల ఫ్రిజ్‌ను గోడలకు మరీ దగ్గరగా కాకుండా కొంత ఎడంగా ఉంచడం మంచిది.