టచ్‌.. చేస్తోంది | Suraksha setu team in gujarat | Sakshi
Sakshi News home page

టచ్‌.. చేస్తోంది

Published Mon, Sep 3 2018 12:31 AM | Last Updated on Mon, Sep 3 2018 12:31 AM

Suraksha setu team in gujarat - Sakshi

ఆమె యంగ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌. ఒక మంచి పని చేయాలనుకుంది. అదీ.. లైంగిక దాడులు లేని సమాజాన్ని నిర్మించడం కోసం! స్కూళ్లలోనే పిల్లల్ని దిద్దినట్లయితే కాలేజీల్లో ఈవ్‌ టీజింగ్‌లుండవు. వీధుల్లో మహిళలపై వేధింపులు, లైంగిక దాడులుండవు అని ఆమె నమ్మింది. అందుకు అనుగుణంగా వెంటనే కార్యాచరణలోకి దిగింది.  పన్నెండు మంది మహిళాపోలీసులతో ‘సురక్షా సేతు’ అనే సొసైటీ ఏర్పాటు చేసింది. వాళ్లతో కలిసి స్కూళ్లకు వెళ్లి.. గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ గురించి చెబుతూ పిల్లల్ని, టీచర్లను, తల్లిదండ్రులను చైతన్య పరుస్తోంది. పోలీస్‌ ఖాకీ డ్రస్‌ చూసి పిల్లలు భయపడి పారిపోకుండా ఉండడానికి ఈ టీమ్‌ యూనిఫామ్‌ను కూడా మార్చేసింది. ఇంత మహోన్నతమైన పనికి పూనుకున్న ఆ ఆఫీసర్‌ పేరు సరోజ్‌ కుమారి. గుజరాత్‌లోని వడోదర నగర పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌.  


‘‘భుజం మీద నాన్న చెయ్యి వేసినప్పుడు.. ఆ స్పర్శ ‘నీకు రక్షణగా నేనున్నా’ నని చెబుతుంది. ఫ్యామిలీ ఫొటోలో అందరూ పడటం కోసం మామయ్యలు, బాబాయ్‌లు, పెదనాన్న, అన్న, తమ్ముడు, బావలు... ఎవరో ఒకరు మనకు అటో ఇటో... ముందో వెనకో నిలబడుతుంటారు. ఆ స్పర్శలు ‘మనమంతా ఒకటి’ అని ఆత్మీయతను పంచుతుంటాయి.  ప్రయాణిస్తున్నప్పుడో, పబ్లిక్‌ ప్లేస్‌లోనో అపరిచితులు మునివేళ్లతో తట్టినప్పుడు ‘పక్కకు జరగండి’ అని చెబుతుందా స్పర్శ ఇవేవీ కాకుండా ఒక చెయ్యి మన దేహాన్ని తాకకూడనట్లు తాకితే.. అది ప్రశ్నించాల్సిన స్పర్శ’’ అని చెబుతోంది సరోజ్‌ కుమారి.

అలలు ఆగినా కల్లోలం ఆగదు
తీవ్రమైన వేధింపుల బారిన పడని వాళ్లయినా సరే... జీవితంలో ఒక్కసారయినా బ్యాడ్‌ టచ్‌ బారిన మాత్రం పడి ఉండే అవకాశాలున్నాయి. ఆ బ్యాడ్‌ టచ్‌.. తాకిన చేతికి, తగిలిన దేహానికి తప్ప మూడో వ్యక్తికి తెలియకపోవచ్చు. కానీ ఆడపిల్ల మనసులో రేగిన కల్లోలం మాత్రం ఎప్పటికీ సమసిపోదు. చెరువులో రాయిని విసిరితే కొంత సేపు అలలు వస్తాయి, మరికొంత సేపటికి ఆనవాలుకు కూడా కనిపించవు, పూర్తిగా ఆగిపోతాయి. ఆగిపోయేది అలలు మాత్రమే, చెరువులో పడిన రాయి అలాగే ఉండిపోతుంది. బ్యాడ్‌టచ్‌ తాలూకు చేదు అనుభవం కూడా అలాంటిదే.

ఈ సున్నితమైన విషయం మగవాళ్ల మనసులో కూడా ‘తప్పు’ అనే రాయిలా పడిపోతే ఇక వాళ్లు ఎప్పటికీ బ్యాడ్‌టచ్‌తో ఇబ్బంది పెట్టరని నమ్ముతోంది సరోజ్‌. తాను చేపట్టిన ఉద్యమం అమ్మాయిల దృష్టిలో మగవాళ్లను నేరగాళ్లుగా చూపించడం కాదు, తనకు అన్యాయం జరిగే పరిస్థితులను గ్రహించగలిగేటట్లు అమ్మాయిలకు స్పృహ కలిగించడం, ధైర్యం చెప్పడం, తన గౌరవానికి భంగం వాటిల్లే పరిస్థితిలో గొంతు పెగల్చి ప్రమాదాన్ని నివారించగలిగే సామర్థ్యాన్ని  పెంచడమేనంటారామె.

ఇందుకోసమే ఆమె పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి పన్నెండు మంది మహిళలను ఎంచుకుంది. వారంతా దాదాపుగా పాతికేళ్ల వయసు వాళ్లే. స్కూళ్లకు వెళ్లి.. పిల్లలకు, తల్లిదండ్రులకు, టీచర్లకు.. జెండర్‌ సెన్సిటైజేషన్‌లో అవగాహన కల్పించవలసిన విషయాలపై వారంతా ముందుగానే  శిక్షణ పొందారు. ఆ తర్వాత ఇరవైకి పైగా స్కూళ్లను సందర్శించారు. రెండు వేల మంది పిల్లలకు ‘టచ్‌’ గురించి ప్రాక్టికల్‌గా తెలియచెప్పారు.

ఆడపిల్లలకు ధైర్యం చెబుతారు
ఈ టీమ్‌లోని పోలీసులు çస్కూళ్లకు వెళ్లి... ఎవరైనా బ్యాడ్‌గా టచ్‌ చేస్తే భయంతో బిగుసుకు పోకూడదు, ‘నో’ అని గట్టిగా అరచినట్లు చెప్పాలని, ఆ సంగతిని వెంటనే అమ్మానాన్న, టీచర్ల దృష్టికి కూడా తీసుకెళ్లాలని అమ్మాయిలకు చెప్తారు. అలాగే తమ స్కూల్లోని అబ్బాయిలు కానీ, మగటీచర్లు కానీ టాయిలెట్‌ల దగ్గరికి, వెళ్తూ రమ్మని పిలిస్తే వెళ్లకూడదని, ఏ మాత్రం భయపడకుండా ‘నేను రాను’ అని కచ్చితంగా చెప్పేయాలని కూడా నేర్పిస్తారు. నిర్మానుష్యంగా, చీకటిగా ఉన్న చోట్లకు అపరిచితులే కాదు, తెలిసిన వాళ్లు పిలిచినా సరే వెళ్లవద్దని సూచిస్తారు.

మగపిల్లలకు జాగ్రత్త చెబుతారు
ఇక అబ్బాయిలకు... బ్యాడ్‌టచ్‌కు పాల్పడటం చట్టరీత్యా నేరమని, ఆ నేరానికి పాల్పడితే చట్టంలో ఎలాంటి కఠినమైన శిక్షలున్నాయో పాఠం చెప్పినట్లు చెప్తారు. కాగా, ఈ సెషన్ల తర్వాత పిల్లల ప్రవర్తనలో గుణాత్మకమైన మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు టీచర్లు. ఈ పోలీస్‌ మేడమ్‌ చేస్తున్న ఈ పని చాలా టచింగ్‌గా ఉందనే ప్రశంసలు కూడా వస్తున్నాయి.

మనసు మెలిపెట్టినట్లయింది
సురక్షా సేతు సొసైటీల ద్వారా రెండువేల మందిని కలిశాం. మరీ చిన్నపిల్లలకు తాము బ్యాడ్‌టచ్‌కు లోనయ్యామనే సంగతి కూడా తెలియడం లేదు. కానీ టీనేజ్‌ అమ్మాయిలు చెప్పిన అనేక సంఘటనలు మనసుని మెలిపెట్టాయి. అలాంటివి విన్నప్పుడు మేము మొదలుపెట్టిన ఈ ప్రయత్నం చాలా అవసరమైందని మరోసారి నిర్ధారించుకున్నాం. మనుషుల్లో సున్నితత్వం అంతరించిపోవడమే దీనంతటికీ కారణం. కోల్పోయిన సున్నితత్వాన్ని తిరిగి మనసుల్లో చిగురింపచేయడానికి ప్రయత్నిస్తున్నాం. – సరోజ్‌ కుమారి, పోలీస్‌ డిప్యూటీ కమిషనర్, వడోదర, గుజరాత్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement