తల్లి ఒడి.. బడి... గుడి ఆధ్యాత్మికతకు ఆలవాలం | Swami Swatmanandendra Said That The Way Of Service Is Also A Spirituality | Sakshi
Sakshi News home page

తల్లి ఒడి.. బడి... గుడి ఆధ్యాత్మికతకు ఆలవాలం

Published Sun, Nov 17 2019 5:25 AM | Last Updated on Sun, Nov 17 2019 5:25 AM

Swami Swatmanandendra Said That The Way Of Service Is Also A Spirituality - Sakshi

సమస్యల పరిష్కారానికి ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. జీవాత్మను పరమాత్మలో లయం చేసుకోవటం ద్వారానే బతుకు సార్థకం అవుతుంది. భగవంతుని మీద భారం వేసి, తాను చేయాల్సిన కర్తవ్యాన్ని నెరవేర్చటం ప్రధానం. అందుచేత భగవంతుడ్ని సరళమైన రీతిలో సేవించుకోవటమే కలియుగంలో పరిష్కార మార్గం‘ అని అన్నారు స్వాత్మానందేంద్ర సరస్వతి. ఏదైనా పీఠానికి ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వారు దేశంలోని వివిధ ప్రాంతాల్ని పర్యటించి రావటం ఆనవాయితీ. కంచిపీఠం, శృంగేరీ పీఠం వంటి వాటిలో ఈ సాంప్రదాయం గోచరిస్తుంది. అదే స్ఫూర్తితో స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా ఇప్పుడు తెలుగు నాట వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాల్లో పర్యటించారు. అనేక శైవ, వైష్ణవ క్షేత్రాల్ని సందర్శించారు. వివిధ ప్రాంతాల్లో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రస్తుతం భాగ్యనగర పర్యటనలో ఉన్న స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతిని సాక్షి పలకరించింది.

ఏకత్వంలో భిన్నత్వం గోచరించటమే భారత సమాజంలోని విశిష్టత. వివిధ అంశాల మీద రక రకాల ఆలోచనలు ఉండవచ్చు గానీ, అంతస్సూత్రం మాత్రం సదాలోచన అయి ఉండాలి‘ అని చెప్పారు స్వాత్మానందేంద్ర సరస్వతి. అందుకే భగవంతుడ్ని సేవించుకొనేందుకు చాలా సరళమైన మార్గాల్ని, ఉత్తమ విధానాల్ని ప్రబోధిస్తుంటారు. ముఖ్యంగా ప్రస్తుత తరంలో హిందూమతంపై ఉన్న అపోహలు, దురభిప్రాయాలను తొలగించేందుకు ఈ విజయయాత్ర ద్వారా స్వాత్మానందేంద్ర ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి నేడున్న సామాజిక పరిస్థితుల్లో అనేకానేక మానసిక, శారీరక సమస్యలతో సతమతమవుతూ చిన్న విషయాలకే తల్లడిల్లిపోతున్న మానవాళి తీరుపై ఆయన స్పందించారు. ఆధ్యాత్మిక మార్గం అంటే సామాన్యులకు దూరంగా నిలిచేది కానే కాదన్నది ఆయన అభిమతం. ఆధ్యాత్మికత అర్థం పూజలు, బోధలు మాత్రమే కాదనీ, సేవ చేయడం, సేవామార్గం చూపడం కూడా ఆధ్యాత్మికతకు ఆనవాళ్లనీ స్వామి చెప్పారు. సంసారం అనే సాగరాన్ని ఈదటంలో ఇబ్బందులు పడుతుండటమే సామాన్యుల వైచిత్రి.

అటువంటప్పుడు సమస్యల పరిష్కారం మరో రకమైన ఇబ్బంది కాకూడదు అన్నది ఆయన మార్గం. ఈ క్రమంలో మైదాన ప్రాంతాల్లో మాత్రమే కాకుండా గిరిజన ప్రాంతాలను కూడా తమ పర్యటనలకు ఎంచుకున్నారు. ఎక్కువగా నిరక్షరాశ్యులుండే ఈ ప్రాంతాల వాసులకు ఆధ్యాత్మిక జీవిత ప్రాధాన్యత, ధర్మసూక్ష్మాలను సులభశైలిలో తెలియజేస్తున్నారు. ఇవన్నీ నిత్య జీవితంలో తేలికగా ఆచరించేలా వారిని సన్నద్ధులు చేస్తున్నారు. ఆధ్యాత్మికవేత్తలు, స్వాములంటే కేవలం పూజలు, బోధలకే పరిమితమై ఉంటారనే సార్వజనీన అభిప్రాయాన్ని తొలగించేందుకు శారదాపీఠం అడుగులు వేసింది. ఆధ్యాత్మికతకు సేవను కూడా జోడించి లోకకల్యాణానికి నిజమైన అర్థాన్ని తెలియజేసేందుకు ఈ పీఠం కంకణం కట్టుకుంది. సాధారణంగా సేవలనగానే మనుషులకు చేసే విద్య, వైద్య సేవలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. అయితే శారదాపీఠం మరో అడుగు ముందుకేసి జంతుజీవజాలానికి కూడా వైద్య సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

జీవకోటి ఉనికికి మూలమైన వ్యవసాయ రంగంలో జంతుజీవజాలం పాత్ర ఎంతో కీలకం. అందుకే, పశుపక్ష్యాదుల ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రత్యేక శిబిరాల నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. మాధవసేవ అంటే మనుషులకు మాత్రమే చేసే సేవ కాదన్నది శారదాపీఠం నిశ్చితాభిప్రాయం. ఈ విజయయాత్ర లక్ష్యం సమాజంలో మమేకమై సామాన్యులకు చేరువై ధర్మ సంస్థాపనకు మార్గం సుగమం చేయడమేనని స్వాత్మానంద తెలిపారు. పుట్టుక నుంచి ఒక స్పష్టమైన వ్యక్తిత్వం ఏర్పడే వరకూ తల్లి మార్గదర్శకత్వం వెలుగు బాటగా నిలుస్తుందని, కనుక మాతృమూర్తులు పిల్లల పెంపకంలో గొప్ప పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. తల్లి ఒడి నుంచి వచ్చిన చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో బడి కీలకపాత్ర పోషిస్తుందని, ఆ ఉత్తమపౌరులను అత్యుత్తమ మానవులుగా మలచడంలో గుడిదే కీలకపాత్ర అన్నారు.

దేవాలయాల నిర్వహణలో ఆర్షధర్మం సూచించిన వివిధ రకాల ఆగమ విధానాలు, మంత్రోపాసన ప్రక్రియలు ప్రజలను ఐకమత్యంతో సన్మార్గంవైపు నడిపించడంలో గొప్ప భూమిక పోషిస్తాయన్నారు.మానవ జీవితంలో ఇంత కీలక భూమికను పోషించే బడిని, గుడిని పటిష్టపరుచుకుంటే అదే నిజమైన లోకకల్యాణానికి బాసటగా నిలుస్తుందన్నారు. తమ పర్యటనలలో భాగంగా ఆయా ప్రాంతాలలో నెలకొని ఉన్న గోశాలలను సందర్శించి గోమాత విశిష్టతను భావితరాలకు అందించేందుకు నడుం కట్టారు. ఆధ్యాత్మిక క్రతువులతో పాటు ఆరోగ్యం, వాణిజ్యం, ఆహారం, వ్యవసాయ రంగాలలో భిన్న విధాలుగా గోవు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని పేర్కొంటూ అలాంటి గోమాతను పరిరక్షించుకోవలసిన అవశ్యకతను నేటి తరం గుర్తించి ఆచరించాలన్నది తన ఆకాంక్షగా తెలియజేశారు.
– వై. రమావిశ్వనాథన్, సీనియర్‌ పాత్రికేయులు

ఇప్పటివరకు శారదా పీఠం ఒక ఉత్కృష్టమైన ఒరవడితో ముందుకు సాగుతోంది. హైందవ ఆధ్యాత్మిక మార్గంలో మాకు ఒక విభిన్నమైన మార్గం ఉంది. అదే ఒరవడిలో ధర్మాన్ని సంరక్షించుకొనే మార్గంలో ముందుకు సాగుతాం. అన్ని వర్గాల ప్రజలకు శంకరవాణి సమర్థవంతంగా అందాలన్నదే మా అభిమతం
– స్వాత్మానందేంద్ర సరస్వతి
 ఉత్తరాధికారి, విశాఖ శ్రీ శారదాపీఠం

‘బాల్యం నుంచి ఆధ్యాత్మిక జీవితం మీదనే నాకు ఆసక్తి ఉండేది. మా గురువు గారైన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతితో ఎక్కువ కాలం గడపటం, ఆయనతో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించటంతో ఈ స్ఫూర్తి బలపడిందని అనుకోవచ్చు.. కలియుగంలో ప్రజలు వివిధ రకాల ఈతిబాధలతో సతమతం అవటం, భగవంతుడి అసలు తత్వాన్ని అర్థం చేసుకోలేక పోవటం వంటి అంశాల మీద  నాలో నేను తీవ్రంగా అంతర్మథనం చెందేవాడిని.

‘జీవాత్మను పరమాత్మలో లయం చేసుకోవడం ద్వారానే బతుకు సార్థకం అవుతుంది. నీలోనూ, మాలోను ఉన్నది ఒకటే బ్రహ్మ పదార్థం. దీన్ని తెలుసుకోవటమే శంకరాచార్యుల వారు ఉపదేశించిన అద్వైత మార్గం. ప్రజలకు శంకర భగవత్పాదుల వారి అద్వైత మార్గాన్ని, అసలు తత్వాన్ని అందించేందుకు అంకితం కావాలని నిర్ణయించుకొన్నాను. అదే కఠినమైన సన్యాసాశ్రమ దీక్ష వైపు నన్ను మళ్లించింది‘ అని చెప్పారు స్వాత్మానందేంద్ర సరస్వతి.
నిర్వహణ: డి.వి.ఆర్‌. భాస్కర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement