స్వర్గం నరకం
స్త్రీ చేతి సంసారపు సున్నితపు త్రాసు
నాటి సినిమా
నరకంలో సలసలకాగే నూనెలో మనిషిని వేగిస్తారట. అది సంసారంలో భార్య పలికే పరుషమైన మాటతో సమానం కావచ్చు. స్వర్గంలో తేనె ప్రవాహాలు దప్పిక తీరుస్తాయట. అది సంసారంలో భార్య ఆదరంగా అందించే మంచినీరే కావచ్చు.
స్వర్గం ఏదో ఆకాశంలో... నరకం పాతాళంలో ఉండవు. అవి పక్క పక్కనే ఉంటాయి– బొమ్మా బొరుసులా. భార్య దేనిని ఎంచుకుంటే అది దక్కుతుంది. సంసారం సున్నితపు త్రాసులాంటిది. మగవాడు ఉత్త దండెంలాంటి వాడు.స్త్రీ తన చేతితో ఆ దండేన్ని స్వర్గం వైపు వంచితే జీవితం స్వర్గం అవుతుంది. నరకం వైపు వంచితే బతుకు నరకం అవుతుంది. మంచి మాటలే తూకం రాళ్లు... పట్టువిడుపులే తక్కెడ గొలుసులు... దయా క్షమలే చెరోవైపు పళ్లేలుగా వ్యవహరిస్తే ఏ కాపురపు ముల్లైనా స్వర్గం వైపు వొంగుతుంది. లేదంటే అది నరకాన్ని దభేలున తాకుతుంది.
జయలక్ష్మి (పాత్ర పేరు కూడా అదే), అన్నపూర్ణ (పాత్ర పేరు అన్నపూర్ణే) కాలేజీలో స్నేహితులు. జయలక్ష్మి టపాకాయ లాంటిది. మంచికీ చెడ్డకీ టపాటపామని పేలుతుంటుంది. అన్నపూర్ణ మౌనంగా వెలిగి అగరుబత్తీ లాంటిది. నిశ్శబ్దంగా పరిమళం ఇవ్వడమే తప్ప, తనను తాను కాల్చుకోవడం తప్ప ఎదుటివారి మీద నిందలు వేసే మనిషి కాదు. జయలక్ష్మికి మగవాళ్లంటే సదభిప్రాయం లేదు. వాళ్లు తాగుతారని, తిరుగుతారని, పెళ్లి చేసుకుని భార్యలను అవస్థల పాలు చేస్తారని అనుకుంటూ ఉంటుంది. అన్నపూర్ణ మాత్రం అలాంటి బుద్ధులు కేవలం మగవారికే ఉండవని ఆడవారి అండ లేకుండా తప్పు చేసే మగవాడు ఉండడని అభిప్రాయపడుతూ ఉంటుంది. ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరి పెళ్లికి మరొకరు హాజరవుదామనుకుంటారు. కాని అనుకోకుండా ఇద్దరి పెళ్లిళ్లూ ఒకే ముహుర్తానికి నిశ్చితమవుతాయి. ఇద్దరూ స్వర్గంలాంటి కాపురాలను ఊహిస్తారు. కాని జయలక్ష్మి కాపురం స్వర్గం. అన్నపూర్ణ కాపురం నరకం.
జయలక్ష్మి భర్త ఈశ్వరరావు (పాత్ర పేరు అదే) లెక్చరర్. మంచివాడు. భార్య అంటే పంచ ప్రాణాలు. ‘ఏమండీ సాయంత్రం ఐదు గంటలకే ఇంటికి వచ్చేస్తారుగా’ అని భార్య అడిగితే ‘ఐదు వరకు ఎందుకు... నాలుగున్నరకే వచ్చేస్తాను’ అని భార్య చుట్టే తిరిగే రకం. జయలక్ష్మికి కూడా భర్త అంటే ఎంతో అనురాగం. భర్తను విడిచి ఒక్కరోజు ఊరు వెళ్లాల్సి వస్తే స్పృహ తప్పి పడిపోతుంటుంది. భర్త కాలేజీ క్యాంప్‌కు వారం రోజులు వెళతానంటే ఏడుపు మొదలెడుతుంటుంది. భర్త వారం రోజులు క్యాంప్‌కు వెళతాడు. అతణ్ణి రిసీవ్ చేసుకోవడానికి జయలక్ష్మి స్టేషన్‌కు వెళుతుంది. స్టేషన్‌లో కంపార్ట్‌మెంట్‌లో నుంచి భర్త దిగుతాడు. అతడితో పాటు మరో లేడీ లెక్చరర్ కూడా దిగుతుంది. ‘ఈమె మా కాలేజ్ లెక్చరర్.’ అని పరిచయం చేస్తాడు. అంతే. జయలక్ష్మి గుండెల్లో అనుమానపు టపాకాయలు టపాటపామని పేలుతాయి. ఈశ్వరరావు కొంచెం మతిమరుపు మనిషి.
మాటల్లో పడితే ఇంటి దగ్గర భార్యను మర్చిపోతుంటాడు. ఒకరోజు జయలక్ష్మి ఇంటికి త్వరగా రమ్మంటుంది. కాని సాయంత్రం స్నేహితులతో మాటల్లో పడి ఎగ్జిబిషన్‌కు వెళతాడు. అక్కడ తోటి కాలేజీ లెక్చరర్ కనిపిస్తే ఆమెతో మాటల్లో పడతాడు. అంతే కాదు పొరపాటున తన అద్దాలకు బదులు ఆమె అద్దాలను ఇంటికి తెస్తాడు. అతడి రాకలో ఆలస్యానికి ఇల్లు పీకి పందిరేసున్న జయలక్ష్మిని చూసి కంగారుగా ఏవో అబద్ధాలు చెప్తాడు. కాని అతడు తెచ్చిన అద్దాలు అతడు పని చేసే కాలేజీ లెక్చరర్‌వని బయటపడగానే జయలక్ష్మిలో అనుమానం రూఢీ అవుతుంది. అతడికి ఆమెతో సంబంధం ఉందని నమ్ముతుంది. ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఈశ్వరరావు జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. ‘మీరు ఎవరితో తిరిగితే నాకేం. ఎందరితో తిరిగితే నాకేం. మీరు దాంతోనే తిరగండి’ అని పుట్టింటికి వెళ్లిపోతుంది. ఈశ్వరరావుకు నిజంగానే ఇదంతా నరకం.
మరోవైపు అన్నపూర్ణ సంసారం ఘోరంగా ఉంటుంది. ఆమెను మోసం చేసి పెళ్లి చేసి ఉంటారు. భర్త మోహన్‌బాబు (పాత్ర పేరు మోహన్‌బాబు) ఉత్త తిరుగుబోతు. పెళ్లయిన రోజు రాత్రి కార్యం వేళకు అందరూ పెళ్లికొడుకును వెతుకుతుంటే అతడు భార్యతో కాకుండా మరొకరితో గడుపుతూ పట్టుబడతాడు. పెళ్లింట్లోనే పెద్ద గొడవైపోతుంది. అన్నపూర్ణ తండ్రి ఈ పెళ్లిని పెటాకులు చేద్దామని చూస్తాడు. కాని అన్నపూర్ణ ఒప్పుకోదు. తన రాత ఇలాగే ఉందని గ్రహించి మోహన్‌బాబుతోనే వెళ్లడానికి ఇష్టపడుతుంది. అత్తారింటికి చేరాక కూడా ఆమెకు సుఖం ఉండదు. భర్త ఆడవాళ్లను నేరుగా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాడు. లేదంటే స్నేహితులతో పేకాటకు వెళ్లిపోతుంటాడు. అన్నపూర్ణ సహనంగా అతడి ప్రవర్తనను భరిస్తూ ఉంటుంది.
మధ్యలో స్నేహితురాలిని చూడటానికి వచ్చిన జయలక్ష్మి అతడి ప్రవర్తన చూసి అన్నపూర్ణను చెడామడా తిడుతుంది. ‘నాతో వచ్చెయ్. అలాంటి వెధవకు వెంటనే విడాకులు ఇచ్చి పారెయ్’ అంటుంది. అయినా అన్నపూర్ణ వినదు. అతడి ప్రవర్తన చూసి చూసి తల్లి ఎదిరించి ఆ పెనుగులాటలో మెట్ల మీద పడి దొర్లి చనిపోతుంది. అప్పుడు కూడా అన్నపూర్ణ భర్తతో మెత్తగా అతడి బాధ్యతను గుర్తు చేస్తుంది తప్ప తీవ్ర నిందకు దిగదు. ఇదంతా చూసి మోహన్‌బాబు కరిగిపోతాడు. ఇంత దుర్మార్గంగా ఉన్నా ఈ స్త్రీ ఇంత సహనంగా ఉండటం చూసి మారిపోతాడు. భార్యను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. ఇప్పుడు ఆ సంసారం స్వర్గం.
స్వర్గంలా ఉండాల్సిన కాపురాన్ని జయలక్ష్మి సర్వనాశనం చేసుకుంది. లేడీ లెక్చరర్ ఇంటికి వెళ్లి భర్త ఏదో మాట్లాడుతుండగా జనాన్ని వేసుకొని వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని గొడవ గొడవ చేస్తుంది. అంతే కాదు భర్తకు కావల్సింది తన అడ్డు తొలగడమే అని భావించి ఆత్మహత్యాయత్నానికి కూడా పూనుకుంటుంది. విడాకుల కాగితం రాసి భర్త మొహాన కొడుతుంది. వీటన్నింటి పరాకాష్టగా ఆ లేడీ లెక్చరర్ ఈమె చేసే రాద్ధాంతాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ‘మంచి మనిషి ఈశ్వరరావు కాపురం అవస్థల పాలు కాకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నానని’ ఆమె రాసి చచ్చిపోతుంది. ఆమె చావు చూసి సున్నిత మనస్కుడైన ఈశ్వరరావు పిచ్చివాడైపోతాడు. అసలు వాస్తవాలను ఎట్టకేలకు గ్రహించిన జయలక్ష్మి భర్తను వెతుక్కుంటూ బయలుదేరి అతణ్ణి చేరుకోవడంతో కథ ముగుస్తుంది.
భర్తలకు సంపాదించడం తెలుసు. బాధ్యతలను మోయడం తెలుసు. అవసరాలు తీర్చడం తెలుసు. కాని సంసారపు ఆటుపోట్లను సజావుగా అర్థం చేసుకోవడం తెలీదు. సంసారానికి స్త్రీయే కేంద్రకం తప్ప పురుషుడు కాదు. ఆమె సంయమనం సమయస్ఫూర్తి సహనం లౌక్యం లేకపోతే ఆ సంసారం అభాసుపాలవుతుంది. పాలూనీళ్లులా కలిసి ఉండాల్సిన భార్యభర్తలు నిప్పు ఉప్పుల్లా మారరాదని చెప్పిన సినిమా స్వర్గం నరకం.కలతలతో కలహాలతో చిన్న గొడవలను పెద్ద సమస్యలుగా సృష్టించుకుంటున్న భార్యాభర్తల ఇవాళ్టి రోజుల్లో కూడా ఈ సినిమా ఒక లెసన్. ఒక పర్సనాల్టీ కరెక్షన్ క్లాస్. ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్. యూ ట్యూబ్‌లో ఉంది. వాచ్ ఇట్.
కొత్తవాళ్లతో దాసరి తీసిన సూపర్‌హిట్
స్వర్గం నరకం 1975లో విడుదలైంది. ఇది దర్శకుడు దాసరి నారాయణరావుకు పదో సినిమా. గతంలో ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్లతో ‘తేనె మనసులు’ తీసి కృష్ణ వంటి స్టార్‌కు జన్మనిచ్చారు. ఆ స్ఫూర్తితో దాసరి కూడా కొత్తవాళ్లతో సినిమా తీయాలని ‘స్వర్గం– నరకం’కు నడుం బిగించారు. హైదరాబాద్‌లో నాటకాల్లో కనిపించిన విశ్వేశ్వరావును ‘ఈశ్వరరావు’గా పేరు మార్చి ఒక హీరోగా తీసుకున్నారు. మరో పాత్రకు బోసుబాబు అనే నటుడు పోటీ పడ్డాడు. కాని దాసరి ఆ వేషాన్ని భక్త వత్సలం అనే నటుడికి ఇచ్చారు. ఆ భక్తవత్సలానికి పేరు మార్చి ‘మోహన్‌బాబు’గా ‘స్వర్గం–నరకం’లో పురుడుపోశారు.
బెజవాడలో నాటకాల్లో ఫేమస్ అయిన అన్నపూర్ణ ఒక హీరోయిన్ కాగా తర్వాతి రోజుల్లో ‘ఫటాఫట్’ జయలక్ష్మిగా పేరు పొందిన జయలక్ష్మి మరో హీరోయిన్. ఈ సినిమాలో దర్శకుడు కోడి రామకృష్ణ ఒక పాత్రలో కనిపిస్తాడు. అలాగే ఆ తర్వాతి కాలంలో ఫేమస్ అయిన ఆర్.నారాయణమూర్తి, జీవా తదితరులు అతి చిన్న పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఆచారి అనే పాత్ర ముఖ్యమైంది. అది కథకు అనుసంధానకర్తగా ఉంటుంది. పరాన్నభుక్కుగా జీవిస్తూ అందరి తలలో నాలుకలా ఉండే ఆ పాత్రను దాసరే స్వయంగా పోషించారు. ‘ఫినిష్’ అనేది ఆయన ఊతపదం. అప్పట్నించి ఆ మాట చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ ‘ఫినిష్’ ఫేమస్సే.
దాసరి సింబాలిక్ షాట్స్
ఈ సినిమాలో దాసరి సింబాలిక్ షాట్స్‌ను వాడారు. దానికి కారణం ఉంది. సినిమా పూర్తయ్యాక అన్నపూర్ణ క్లోజప్స్ పంపిణీదారులకు నచ్చలేదు. ఏం చేయాలా అని ఆలోచించిన దాసరి క్లోజప్స్ వచ్చినప్పుడల్లా కాలుతున్న అగరుబత్తుల్ని సింబాలిక్‌గా చూపించారు. అవసరం కోసం చూపినా ప్రేక్షకులు అది దర్శకుడి మంచి సృజనగా భావించారు. అలాగే జయలక్ష్మి మనసులో భావోద్వేగాలు కలిగినప్పుడల్లా టపాకాయలు పేలుతున్న చప్పుడు వినిపిస్తుంది. ఇదీ జనానికి నచ్చింది. సినిమా క్లయిమాక్స్‌లో భార్యాభర్తల అనుబంధాన్ని పాలూ నీళ్లతో పోలుస్తూ సింబాలిక్ షాట్స్ చూపడం ఆ రోజుల్లో కొత్తదనంగా భావించారు.
‘‘ఆడది మగవాణ్ణి గుప్పిట్లో కాదమ్మా పెట్టుకోవాల్సింది.. గుండెల్లో పెట్టుకోవాలి. మాటల్తో కాదమ్మా కట్టేయాల్సింది మనసుతో కట్టేయాలి. హక్కుల కోసం కాదమ్మా పోరాడాల్సింది బాధ్యతలతో పోరాడాలి. బరువు బాధ్యతలతో బయట తిరిగే మనిషి లక్షా తొంభై సమస్యలతో ఇంట్లో అడుగు పెడతాడు. ఇంట్లో అడుగు పెట్టీ పెట్టగానే ఏమండీ... ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు కుర్రాడికి జబ్బు చేసింది నాకు తలనొప్పి వచ్చింది మీరు ఎక్కణ్ణుంచి వచ్చారు ఎలా వచ్చారు ఎందుకింత ఆలస్యంగా వచ్చారు దేంతో తిరిగి వచ్చారు అని అడిగితే ఆ మగాడు ఏం సమాధానం చెప్తాడమ్మా.. ఆ ఇల్లు నరకం కాకుండా ఏమవుతుందమ్మా’’
– జయలక్ష్మి పాత్రతో ఆచారి పాత్ర
– కె