విచారిస్తున్నాం..! | Swati murder to the police challenge | Sakshi
Sakshi News home page

విచారిస్తున్నాం..!

Published Tue, Jul 5 2016 10:24 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

విచారిస్తున్నాం..! - Sakshi

విచారిస్తున్నాం..!

వరంగల్ జిల్లా కొత్తగూడ మండలంలోని మారుమూల అటవీ గ్రామం బావురుగొండ.

కొన్ని కేసులు మొండివి.
 తలాతోక అర్థం కానివి.
 ఓ పక్క కడుపు రగిలిపోతున్నా...
 ఇంకో పక్క కన్నీళ్లు రాలుతున్నా...
 వ్యవస్థ గట్టి ప్రయత్నాలు చేస్తున్నా...
 ఈ మొండిఘటాలు తేలిగ్గా తెగవు.
 కేసు ఇంకా సాల్వ్ కానందుకు విచారిస్తున్నాం.
 పోలీసులు ఇంకా విచారిస్తున్నారు.
 చదువుతున్నవాళ్లు..
 అయ్యోపాపం అని విచారిస్తున్నారు.

 
 
 
వీడని మిస్టరీ ఏడాది దాటినా కనిపించని పురోగతి మూడు జిల్లాలతో ముడిపడి ఉన్న స్వాతి హత్యకేసు పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన ‘బాపూ’ అన్నదే చివరి మాట..

 
 
వరంగల్ జిల్లా కొత్తగూడ మండలంలోని మారుమూల అటవీ గ్రామం బావురుగొండ.  వ్యవసాయం చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాలనుకున్నారు ఆదివాసీ దంపతులు దారం సమ్మయ్య, లక్ష్మి. వీరికి యూకేశ్వరి, మౌనిక, శివప్రసన్న, స్వాతి, శ్వేత అనే ఐదుగురు కుమార్తెలు, కుమారుడు పవన్ ఉన్నారు. యాకేశ్వరి, మౌనికకు పెళ్లిళ్లు చేశారు. శివప్రసన్న పీజీ పూర్తి చేసి గాంధీనగర్‌లోని జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా చేస్తోంది. అక్క పీజీ చేస్తున్న సమయంలోనే స్వాతి బీఎస్సీ నర్సింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని మారుతి కళాశాలలో సీటు వచ్చింది. రెండు సంవత్సరాలు నర్సింగ్ పూర్తి చేసింది. సెలవులకు ఇంటికి వచ్చి చివరి సంవత్సరంలో అడుగు పెట్టేందుకు అన్నీ సర్దుకుని 2015 జూన్ 10న భద్రాచలం బయలుదేరింది. తల్లి లక్ష్మి గంగారం వరకు వచ్చి ఇల్లందుకు వెళ్లే టాటా మ్యాజిక్ ఆటో ఎక్కించింది. కాలేజీకి వెళ్లగానే ఇంటికి ఫోన్ చేస్తానంటూ తల్లికి చెప్పింది స్వాతి. కూతురు కూర్చున్న ఆటో కదిలే వరకు అక్కడే ఉన్న తల్లి.. ఆ తర్వాత ఇంటికి వెళ్లింది. సాయంత్రం 5-6 గంటల మధ్యలో స్వాతి ఫోన్ చేసింది. తండ్రితో ‘బాపూ...’ అన్నది. అంతే! ఫోన్ కట్ అయింది. మారుమూల ప్రాంతం కావడంతో సిగ్నల్ సరిగా లేక కట్ అయి ఉంటుంది అనుకున్నారా తలిదండ్రులు.


కూతురు కాలేజీకి వెళ్లే ఫోన్ చేసిందని ధీమాగా ఉన్నారు. ఒక సంవత్సరం చదివితే స్వాతికి ఏదో ఒక ఆస్పత్రిలో ఉద్యోగం వస్తుందని, తన కాళ్లపై తాను నిలబడుతుందనే సంతోషంలో ఉన్నారా దంపతులు. సరిగ్గా వారం రోజులకు హుజురాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి కొత్తగూడ పోలీసులకు సమాచారం వచ్చింది. హుజురాబాద్ సమీపంలో ముళ్లపొదల్లో మృతదేహం లభించిందని, సమీపంలో స్వాతి కుటుంబ సభ్యుల పాస్‌ఫొటోలు లభించాయని, మృతదేహాన్ని గుర్తించడానికి వారిని తీసుకుని రావాలని చెప్పారు. విషయం తెలియగానే పొలం పనులు చేస్తున్న సమ్మయ్య, లక్ష్మి ఉన్నఫళంగా హుజురాబాద్ వెళ్లారు. అప్పటికే శవం కుళ్లిపోయి వాసన పట్టింది. వేసుకున్న దుస్తులు, ఫొటోల ఆధారంగా మృతదేహం స్వాతిదేనని తల్లిదండ్రులు గుర్తించారు. ఆ సమయంలో హుజురాబాద్‌లో ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఎవరో సామూహిక అత్యాచారం చేసి హత్యకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అరుుతే ఏడాది దాటినా ఇప్పటివరకు కేసులో ఎలాంటి పురోగతి లేదు. నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు.

భద్రాచలం వె ళ్లి.. హుజురాబాద్‌లో శవమై..
 గంగారంలో ఆటో ఎక్కిన స్వాతి.. ఆ తర్వాత ఖమ్మం జిల్లా కొత్తగూడెం డిపోకు చెందిన భద్రాచలం బస్సు ఎక్కింది. ఇంటి వద్ద సర్దుకున్న బ్యాగు బస్సులోనే ఉంది. రెండు రోజులు చూసిన  డ్రైవర్ బ్యాగును కొత్తగూడెం డిపోలో అప్పగించాడు. స్వాతి మృతదేహం లభించిన తర్వాత విచారణలో భాగంగా పోలీసులు కొత్తగూడెం డిపో నుంచి స్వాతి బ్యాగును స్వాధీనం చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. అనంతరం స్వాతి మాట్లాడిన ఫోన్, సిమ్ కార్డులను పోలీసులు తీసుకున్నారు. అరుుతే హంతకులెవరనేది మాత్రం ప్రశ్నగానే మిగిలింది.


కిడ్నాప్ చేశారా..?
కాలేజీకి వెళుతున్న స్వాతిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో అనే అనుమానం వ్యక్తం అవుతోంది. స్వాతి బ్యాగు బస్సులో ఉండటం.. కేవలం హ్యాండ్ పర్స్ మాత్రమే తనవద్ద ఉండడంతో ఎవరో కిడ్నాప్ చేసి హుజురాబాద్ తీసుకెళ్లి, సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది నిర్భయ సంఘటనల కంటే మించిందని, మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గిరిజన యువతి హత్యకు గురై సంవత్సరం గడిచినా నిందితులను గుర్తించడంలో జాప్యమేంటని ఆయూ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
 - సాదుల రాజు, సాక్షి, కొత్తగూడ, వరంగల్
 
 
తిన్న కూడు   ఒంట పడుతలేదు

సిన్న పిల్ల కాన్నుంచి సక్కగా సాదుకున్నం. బాగా సదువుకుని పైకొత్తదనుకుంటే.. కుళ్లిపోయిన శవమై కనిపించింది. ఎటు సూసినా బిడ్డ కండ్లల్లో కనబడుతోంది. ఇంట్లో దాని ఫొటో సూసినప్పుడల్లా దుఃఖం వస్తుంది. పోలీసులేమో మీరు ఏం చెప్తలేరంటూ మమ్మల్నే గద్దిస్తున్నారు. పాత ముచ్చట్లే చెపుతాండ్లంటూ ఈసడించుకుంటున్నారు. బయటోళ్లు తలోమాట అంటాడ్రు. బతికిన బతుకు కాదు.. సచ్చిన సావు కాదు.. తిన్న తిండి ఒంట బడతలేదు. చెట్టంత బిడ్డను మరువలేక తండ్రి క్యాలి లేకుండా మాట్లాడుతాండు. తోడబుట్టినోల్లు ఎక్కెక్కి ఏడుస్తాండ్రు.  - దారం లక్ష్మి, స్వాతి తల్లి
 
 
బయటకు వెళ్లి చదువుకోవాలంటే భయమేస్తోంది!

ఖానాపురం మండలం బుధరావుపేట మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతున్నా.. అక్కకు అలా జరిగినప్పటి నుండి చదువుకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఆడవాళ్లకు రక్షణ లేకుంటే ఎలా చదువుకునేది..? ప్రభుత్వం చెప్పే మాటలకు.. సమాజంలో జరిగే సంఘటనలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. బస్సెక్కిన అక్కను ఎవరెత్తుకెళ్లారని ఇప్పటికీ పోలీసులు తేల్చలేదంటే, మహిళలకున్న రక్షణ చర్యలు అర్థం చేసుకోవచ్చు.  - శ్వేత, స్వాతి చెల్లెలు
 
 
నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలి  
స్వాతిని హత్య చేసిన నిందితులను పోలీసులు వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఢిల్లీ లాంటి పట్టణాల్లో జరిగితేనే పట్టించుకుంటారా..? ఆదివాసీ గూడాల్లో.. ఆదివాసీ యువతులపై జరిగితే పట్టించుకోరా..? సంవత్సరం గడిచినా కేసు ముందుకు సాగలేదు. స్వాతి హత్య కేసును సీబీఐకి అప్పగించి నిందితులను గుర్తించాలి. లేదంటే మహిళలకు చట్టాలు, పోలీసులపై నమ్మకం పోతుంది.  - శివప్రసన్న, స్వాతి అక్క
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement