పథకం ప్రకారమే హత్య?
ప్రేమికులు నరేశ్, స్వాతిని పథకం ప్రకారమే హత మార్చినట్లు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రేమ వివాహం చేసుకుని దారుణ హత్యకు గురైన నరేశ్–స్వాతి స్వగ్రామాలైన పల్లెర్ల, లింగరాజుపల్లిని వారు మంగళవారం సందర్శించి వివరాలు సేకరించారు.
ఆత్మకూరు(ఎం)(ఆలేరు): ప్రేమికులు నరేశ్, స్వాతిది పథకం ప్రకారం జరిగిన హత్యలేనని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలు లభించకుండా పోలీసులు నిందితులకు సహకరించారని వారు ఆరోపించారు. ప్రేమించి వివాహం చేసుకుని దారుణ హత్యకు గురైన నరేశ్–స్వాతి స్వగ్రామాలైన పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలను తెలంగాణ రాష్ట్ర పౌర సామాజిక ప్రజా సంఘాల నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పాశం యాదగిరి, జాన్‌వెస్లీ, భూపతి వెంకటేశ్వర్లు, పైళ్ల ఆశయ్య, ఆశలత, కూరపాటి రమేష్ . మంగళవారం వారి స్వగ్రామాలైన పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలను సందర్శించారు. నరేశ్ తల్లిదండ్రులు అంబోజు వెంకటయ్య, ఇందిరమ్మ సోదరి నీలిమలను కమిటీ సభ్యులు వారి గృహంలో పరామర్శించారు. అనంతరం నరేశ్–స్వాతిల ప్రేమ వివాహం సంఘటన పూర్వ పరాలను హత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు వారి బంధువులను, గ్రామస్తులను విచారించారు.
అనంతరం స్వాతి స్వగ్రామమైన లింగరాజుపల్లిని సందర్శించారు. నిందితుడు తుమ్మల శ్రీనివాసరెడ్డి వ్యవసాయ బావి వద్ద నరేశ్–స్వాతిలను దహనం చేసిన ప్రదేశాలను పరిశీలించారు.శ్రీనివాసరెడ్డి చెబుతున్న విధంగా నరేశ్‌ను వ్యవసాయ బావి వద్ద కంది పొరక, టైర్లు వేసి మృతదేహాన్ని దహనం చేసినానని చెబుతున్న తీరుకు సంఘటన జరిగిన స్థలానికి పొంతన లేదని నిర్ధారణకు వచ్చారు. ఎట్టి పరిస్తితుల్లోనూ నరేశ్ మృతదేహాన్ని పరిసరాలను పరిశీలించి చూసినట్లయితే ఇక్కడే కాల్చి, వేసినట్లుగా తగిన ఆధారాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి నరేశ్ హత్యను చట్ట పరంగా దొరకకుండా పోలీసు అధికారుల సలహాలు, సూచనలతోనే శ్రీనివాసరెడ్డి హత్య చేసినట్లు ఆరోపించారు. తర్వాత శ్రీనివాసరెడ్డి ఇంటిని సందర్శించారు. తాళం వేసి ఉండటంతో పరిసరాలతో పాటు ఆవరణలో ఉన్న స్వాతి ఆత్మహత్యకు పాల్పడిన బాత్‌రూమ్‌ను పరిశీలించారు.
ఎట్టి పరిస్థితుల్లో స్వాతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడే ఆవకాశం లేదన్నారు. నరేశ్–స్వాతిలను ఈ నెల 18న హైకోర్టులో హాజరు పరుచాల్సి ఉండగా అప్పటికే నరేశ్‌ను హత్య చేసిన శ్రీనివాసరెడ్డి తన కూతురును కూడా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించి ఉండవచ్చునని వారు నిర్ధారణకు వచ్చారు. అంబోజు వెంకటయ్య బంధువులకు ఫోన్లు చేసి బెదిరించాడని, అంతే కాకుండా చంపుతానని హెచ్చరించినట్లు నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. వారి వెంట సభ్యులు ఎండీ జహంగీర్, రమ, గోపాల్, ఎంవీ రమణ, బాలకృష్ణ, అబ్బాస్, ప్రసాద్, ఆశాలత, మల్లు లక్ష్మి, ప్రభావతి, అనురాధ, కట్ట నర్సింహ, ఉడుత రవీందర్, కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, నీలం వెంకన్న, నాగరాజు, కొండమడుగు నర్సింహ, కీసరి అరుణ, సిర్పంగ స్వామి, అబ్ధుల్లాపురం వెంకటేషం, మాటూరి బాలరాజు ఉన్నారు.
పోలీస్‌లపై హత్యానేరం కేసు నమోదు చేయాలి
నరేశ్ హత్య, స్వాతి ఆత్మహత్య వ్యహారంలో పూర్తి వైఫల్యం పోలీసులదే. వారిపై హత్యనేరణం కేసులు నమోదుచేయాలి. అందుకు బాధ్యులైన రామన్నపేట , భువనగిరి సీఐలు , ఆత్మకూరు ఎస్‌ఐ సస్పెండ్‌చేసి ప్రాసిక్యూట్ చేయాలి. మానవీయ కోణంలో కేసును చూడాలి.
– పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు
ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలి...
నరేశ్, స్వాతి హత్యలపై ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేసి 3నెలల్లో తీర్పు వెలవరించాలి. నిందితులను గుర్తించి తగు శిక్ష విధించాలి. భవిష్యత్తులో ఈ లాంటి సంఘటనలు పునరావృతంకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నరేశ్,స్వాతి దారుణహత్యలో రామన్నపేట, ఆత్మకూరు పోలీసులు నేరస్తులకు సహకరించినట్లుగా ఉంది.
– మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు
ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.....
హత్యకు గురైన నరేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. యాదాద్రి జిల్లా కేంద్రానికి పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలు సమీపంలో ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా కలెక్టర్ సందర్శించక పోవడం విచారకరం.నిందితులు ఎంతటివారైనప్పటికీ కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– ప్రభావతి, ఐద్వా జిల్లా కార్యదర్శి