సూటబుల్‌ | Tabu Special Interview With Sakshi | Sakshi
Sakshi News home page

సూటబుల్‌

Published Sun, Nov 10 2019 12:23 AM | Last Updated on Sun, Nov 10 2019 12:23 AM

Tabu Special Interview With Sakshi

ఎవరికైనా ఒక పుట్టిన రోజు ఉంటుంది. టబూకి ప్రతి సినిమా ఒక పుట్టిన రోజు!ఆమె కోసమే పుట్టినట్లుంటుంది తను వేసే ప్రతి పాత్రా. డేర్‌గా ఉంటుంది.. డెవిలిష్‌గా ఉంటుంది. జీనియస్‌గా ఉంటుంది. ‘బ్యాడ్‌ క్యారెక్టర్స్‌ కూడా వేస్తారు కదా మీరు?’ఇదే మీ ప్రశ్నైతే కనుక.. టబు జవాబు కూడా వినాలి మీరు!! ‘క్యారెక్టర్‌కి బ్యాడ్‌ ఏంటి, గుడ్‌ ఏంటి? బ్యాడ్‌గా చేశామా, గుడ్‌గా చేశామా... అనేదొక్కటే ఉంటుంది’ అంటారామె!! ఏ పాత్రకైనా సూట్‌ అయిపోయే టబు.. ‘అల.. వైకుంఠపురములో..’ కొత్తగా దర్శనం ఇవ్వబోతున్నారు. అంతకన్నా ముందు..సాక్షి ‘ఫ్యామిలీ’లో.. ఎక్స్‌క్లూజివ్‌గా ఇలా!!

ముందుగా పుట్టినరోజు (నవంబర్‌ 4)ను ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారో చెబుతారా?
టబు: ఈసారి బర్త్‌డేకి ఇంట్లోనే ఉన్నాను. గత రెండేళ్లుగా నా పుట్టిన రోజు అప్పుడు షూటింగ్స్‌ కోసం జర్నీలో ఉన్నాను. అయినవాళ్లు దగ్గర లేకపోతే ఎంత ప్రత్యేకమైన రోజు అయినా మనకు మామూలుగానే అనిపిస్తుంది. ఈసారి స్పెషల్‌ డే చాలా స్పెషల్‌గా అనిపించింది. ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాను. మా అమ్మగారు, ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేశాను.

దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా (‘అల.. వైకుంఠపురములో..’) చేస్తున్నారు. తెలుగుకి ఎందుకింత గ్యాప్‌ ఇచ్చారు?
తెలుగు సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘అల వైకుంఠపురములో’ సినిమా నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చే మంచి సినిమాలను మిస్‌ కాకూడదని నా ఫీలింగ్‌. త్రివిక్రమ్‌ మీద నాకు నమ్మకం ఉంది.. మంచి పాత్ర రాస్తారని. నేను బాంబేలో చేస్తున్న సినిమాలకు కొంచెం డిఫరెంట్‌గా ఉంటేనే తెలుగు సినిమా చేయాలనుకున్నాను. ఈ సినిమా అలానే ఉంది.

1991లో ‘కూలీ నెం.1’ ద్వారా పరిచయం అయ్యారు. నటిగా 28 ఏళ్ల కెరీర్‌. పెద్దగా మార్పు లేకుండా బాగానే ఉన్నారు... డైట్‌ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారా?
నిజానికి నాకు ప్రత్యేకమైన డైట్‌  ఏమీ లేదు. పుడ్‌ విషయంలో మాత్రం చాలా కంట్రోల్‌లో ఉంటాను. స్వీట్స్‌ అస్సలు తినను. ఫ్రైలు, కేక్‌లు ముట్టుకోను కూడా. సాఫ్ట్‌ డ్రింక్స్‌ తాగను. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతాను. ఉదయం  కొద్దిపాటి ఎక్సర్‌సైజ్‌ చేస్తాను. వాకింగ్‌ చేస్తాను. ఈత కొడతాను. కొంచెం హైట్‌గా ఉంటాను కాబట్టి కొన్నిసార్లు బరువు పెరిగినా పెద్దగా కనిపించను. ఆ విషయంలో నేను లక్కీ.

ఈ హైట్‌ వల్ల మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయి? ఎత్తు తక్కువ ఉన్న హీరోల పక్కన యాక్ట్‌ చేసే అవకాశాలు కోల్పోయిన సందర్భాలు?
(నవ్వుతూ) నా ఎత్తు కారణంగా రిజెక్ట్‌ చేసినట్లు నా వరకూ రాలేదు. నన్ను అడగకుండా వదిలేశారేమో తెలియదు. అయితే నేను దాదాపు అందరి హీరోలతో వర్క్‌ చేశాను. నేను కెరీర్‌ స్టార్ట్‌ చేసిన టైమ్‌లో నాలా మంచి ఎత్తు ఉన్న హీరోయిన్లు తక్కువ. ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు మంచి హైట్‌ ఉంటున్నారు. హ్యాపీ.

‘నను నేను మరిచినా నీ తోడు.. విరహాన వేగుతూ ఈనాడు..’ వంటి ‘ప్రేమదేశం’లోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. మీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయిన ఆ సినిమా గురించి?
ఈ చిత్రదర్శకుడు ఖదీర్‌ చాలా టాలెంటెడ్‌. కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తారు. ఆయన సినిమాలో హీరోయిన్లను చూపించే విధానం కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కోసం కోటి రూపాయలతో మహాబలిపురంలో కాలేజ్‌ సెట్‌ వేశారు. అప్పట్లో కోటి రూపాయలతో సెట్‌ అంటే చాలా పెద్ద మొత్తం. ఆ సెట్‌లో తీసిన సీన్లు, పాటలు, ఆ సినిమాకి నేను వాడిన కాస్ట్యూమ్స్‌ అన్నీ గుర్తుండిపోయాయి. రెహమాన్‌ అద్భుతమైన సంగీతం అందించారు.

ఆ సినిమా తర్వాత ఎన్ని లవ్‌ లెటర్స్‌ వచ్చాయి?
గుర్తులేదు (పెద్దగా నవ్వుతూ). ఇప్పుడైతే సోషల్‌ మీడియా వల్ల మన గురించి ఎంతమంది పోస్ట్‌ పెడుతున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. ఉత్తరాలు లెక్కపెట్టుకునే తీరిక మాకు ఉండేది కాదు.

మీ టైమ్‌లో సోషల్‌ మీడియా ఉండుంటే ఇంకా పాపులారిటీ పొందేవాళ్లం అనిపిస్తుందా?
అప్పట్లో స్టార్‌డమ్‌ క్వాలిటీ డిఫరెంట్‌గా ఉండేది. ఇప్పడు  సోషల్‌ మీడియా వల్ల ఎంతో అటెన్షన్‌ దొరుకుతోంది. అలాగే ఎంతో సమాచారం కూడా అందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఇన్‌ఫర్మేషన్, ఫొటోలు వస్తుంటాయి. అందుకే రెండు నిమిషాల క్రితం ఎవరి ఫొటో చూశామో కూడా మర్చిపోతాం. మనం కూడా షార్ట్‌ మెమరీని అలవర్చుకుంటున్నాం.

ఆడియన్స్‌ కూడా మారారు. వాళ్ల అటెన్షన్‌ కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. వాళ్లకి టీవీ, వెబ్, ఫారిన్‌ సినిమా ఇలా చాలా ఉంది. ఫాస్ట్‌ యుగంలో వేగంగా పేరొస్తోంది... అంతే వేగంగా మరచిపోవడం కూడా జరుగుతోంది. అందుకని మా టైమ్‌లో సోషల్‌ మీడియా లేదనే ఫీలింగ్‌ లేదు.

బీబీసీ కోసం ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. ఆ అనుభవం?
దాని గురించి అప్పుడే మాట్లాడకూడదు. ఒక నవల ఆధారంగా ఈ సిరీస్‌ ఉంటుంది. మీరా నాయర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది నేమ్‌ సేక్‌’ సినిమా తర్వాత ఆమెతో కలిసి పని చేస్తున్నాను. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ మీరా నాయర్‌ డైరెక్షన్‌లో చేయడం ఓ స్పెషల్‌ ఫీలింగ్‌. ఈ మధ్యనే షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. బాగుంది.

బాలీవుడ్‌ మీడియా మిమ్మల్ని ‘రిస్క్‌ టేకర్‌’ అని సంబోధిస్తుంటుంది...?  
నేను చేసే పాత్రలు వేరేవాళ్లకు రిస్క్‌ అనిపించవచ్చు. ఎందుకంటే ఎవరూ ప్రయత్నించని పాత్రలు చేస్తూ వస్తున్నాను. కానీ రిస్క్‌ చేస్తున్నాననే ఫీలింగ్‌తో చేయను. ‘చాందినీ బార్, హైదర్, అంధాధూన్‌’ లాంటి విభిన్నమైన సినిమాలు వచ్చినప్పుడు రిస్క్‌ అని ఆలోచించకుండా ఒప్పుకున్నాను. కొందరు హిందీ హీరోయిన్లు చేసే రెగ్యులర్‌ క్యారెక్టర్లు నేను చేయలేదు. మామూలుగా హీరోయిన్‌ పాత్ర అంటే అన్నీ మంచి లక్షణాలు ఉండాలి. నైతికంగా కరెక్ట్‌గా ఉండాలి.

తప్పు చేయకూడదు లాంటివి కొన్ని ఉండిపోయాయి. అవన్నీ నేను నమ్మను. మనుషులందరం ఎప్పుడో ఓసారి తప్పు చేస్తాం. ఎప్పుడూ మంచిగానే ఉండం కదా. అలాంటి పాత్రను స్క్రీన్‌ మీద చూపిస్తే ఏమవుతుంది? ‘కూలీ నం.1’లో హెడ్‌వెయిట్‌ ఉన్న అమ్మాయిగా, ‘చాందినీ బార్‌’లో బార్‌ డ్యాన్సర్‌గా చేశాను. పాత్ర మంచిదా? చెడ్డదా అని ఆలోచించకూడదు. మంచిగా చేశామా? లేదా అన్నదే ముఖ్యం.

థర్టీ, ఫార్టీ ప్లస్‌ ఏజ్‌ హీరోయిన్లను అయితే అమ్మ లేకపోతే అత్తయ్య పాత్రలకంటూ ఇండస్ట్రీ ఓ స్టాంప్‌ వేసేస్తుంది. కానీ మీకు ఇప్పటివరకూ అలాంటి ట్యాగ్‌ వేయలేదు...
అది నిజమే. నాకు ఏదైనా పాత్ర ఇచ్చినప్పుడు నేను ముందు చూసేది ఏంటంటే తన పాత్ర ఏంటి? తన ప్రయాణం ఏంటి? కథలో తనేం చేస్తుంది? తను అమ్మ అయినా అత్త అయినా కూతురు అయినా వ్యక్తిగా తనేంటి? అన్నది నాకు ముఖ్యం. నేను చేసిన పాత్రలన్నీ అలాంటివే. ఆ పాత్రకు అభిప్రాయాలు ఉంటాయి. ఆ పాత్రకు ఒక ఆలోచనా విధానం ఉంటుంది. వ్యక్తిత్వం ఉంటుంది. అందుకే ప్రేక్షకులు ఆ పాత్రల్ని సాధారణ పాత్రల్లా చూడరు. అలా కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నాను కాబట్టి ‘అమ్మ, అత్త పాత్రలకే’ అన్నట్లు నన్ను పరిమితం చేయలేదు.

ఓకే.. 2019 ఎలా గడిచింది?
చాలా బావుంది. 2018లో ‘అంధాధూన్‌’ రిలీజ్‌ అయింది. 2019 ఏప్రిల్‌ వరకూ అదే టాపిక్‌గా నిలిచింది. ఈ ఏప్రిల్‌లో చైనాలో రిలీజ్‌ చేశాం. 400–500 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ‘అంధాధూన్‌’ తెలుగులో రీమేక్‌ కాబోతోంది.  ‘దేదే ప్యార్‌ దే’ సినిమా చేశాను. చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో ‘అల.. వైకుంఠపురములో..’ చేశాను. ఈ  సినిమా అందరికీ నచ్చుతుందని, హిట్‌ అవుతుందని అనుకుంటున్నాను. గ్యాప్‌ తర్వాత ఒక మంచి సినిమా సెలెక్ట్‌ చేసుకుని వస్తున్నానని ప్రేక్షకులు భావిస్తారనుకుంటున్నా.

‘అంధాధూన్‌’ తెలుగు రీమేక్‌లో చేస్తారా?
నన్ను సంప్రదించారు. ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు. ఆ సినిమాని తెలుగులో ఎలా అడాప్ట్‌ చేస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

2020లో ఎక్కువ తెలుగు సినిమాల్లో చూడొచ్చా?
మొదటినుంచి కూడా నేను కథల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటూ వస్తున్నాను. మరి.. మంచివి వస్తే తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తాను. తెలుగు తెర మీద ఎక్కువగా కనిపించాలని అనుకుంటున్నాను. హైదరాబాద్‌ వస్తే నా ప్రపంచంలోకి వచ్చినట్టు, నా రూట్స్‌ని పలకరించుకున్నట్టు ఉంటుంది. నా బంధువులందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్లను కలవొచ్చు.  

‘నిన్నే పెళ్లాడతా’లో గ్రీకువీరుడు కావాలని పాట పాడారు. పర్సనల్‌ లైఫ్‌లో కావాలనుకోలేదా?
(నవ్వుతూ) గ్రీకువీరుడు సినిమాల్లో ఉంటారు. నిజజీవితంలో గ్రీకువీరుడు ఎవ్వరూ ఉండరు.

మ్యారేజ్‌ మీద ఆసక్తి లేదా? పెళ్లి చేసుకుందాం అని ఎవ్వరూ ప్రపోజ్‌ చేయలేదా?
ఇన్నేళ్లుగా నా సినిమాలు చూస్తున్నారు. నా స్క్రిప్ట్‌ విషయంలోనే నేనెంత జాగ్రత్తగా ఉంటానో తెలుసు కదా(నవ్వు)

చాలా తెలివిగా చెప్పారు. సోలో లైఫ్‌ ఎలా ఉంటుంది? అమ్మతో అన్నీ షేర్‌ చేసుకుంటారా?  
నాది  సోలో లైఫ్‌. దీని గురించి మాత్రమే చెప్పగలను. అయితే సోలో లైఫ్‌ బెటరా? మ్యారీడ్‌ లైఫ్‌ బెటరా? అంటే ఏది బెటరో చెప్పలేను. సోలో లైఫ్‌ చాలా బాగుంది. అలాగని పెళ్లి కరెక్ట్‌ కాదు అని కూడా చెప్పలేను. ప్రతీదానికి ప్లస్, మైనస్‌లు ఉంటాయి. మనం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం. నటిగా చాలా మంది ప్రేమను పొందుతున్నాను. ఒక్క జీవితంలో ఇంత ప్రేమ, గౌరవం పొందడం చాలా అదృష్టం. ఐయామ్‌ హ్యాపీ.
– డి.జి. భవాని

‘ప్రేమదేశం’లో సాఫ్ట్‌గా, ‘కూలీ నం. 1’లో కొంచెం పొగరుగా కనిపించారు. రియల్‌లైఫ్‌లో మీ షేడ్‌ ఏంటి?
నాకే తెలియదు (నవ్వుతూ).

సీరియస్‌గా ఉంటారేమో? సరిగ్గా మాట్లాడరేమో అనిపిస్తూ ఉంటుంది..
కరెక్టే. నా మీద ఆ ఇమేజ్‌ ఉంది. కానీ ఏమీ చేయలేను.

డేట్స్‌ క్లాష్‌ వల్ల రానా ‘విరాట పర్వం’ వదులుకున్నారని విన్నాం..
అవును. ‘అల.. వైకుంఠపురములో..’ చేస్తున్నాను. ఆ వెంటనే ‘సూటబుల్‌ బాయ్‌’ కమిట్‌ అయ్యాను. డేట్స్‌ కుదర్లేదు. దాంతో తప్పుకోవాల్సి వచ్చింది.

ఆటోబయోగ్రఫీ రాస్తున్నారని తెలిసింది..
(నవ్వుతూ).. అస్సలు లేదు. నా జీవితంలో అంత డ్రామా లేదు. పుస్తకం రాసే అన్ని సంఘటనలు ఏమీ లేవు. సినిమాలు తప్ప ఎంటర్‌టైనింగ్‌గా నా జీవితంలో ఏదీ లేదు.

హైదరాబాద్‌లో పుట్టారు. చిన్నప్పుడు చార్మినార్, గోల్కొండను సందర్శించి ఉంటారు. పాత జ్ఞాపకాల గురించి?
అప్పుడు నేను పిక్‌నిక్‌కి వెళ్లిన జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు ఇల్లు  కట్టుకున్నాను. అప్పట్లో జూబ్లీ హిల్స్‌ పిక్‌నిక్‌ స్పాట్‌. ఇప్పుడు బాగా డెవలప్‌ అయింది. ఫలక్‌నుమా ప్యాలస్‌ హోటల్‌ అయింది.  నాంపల్లి, చార్మినార్‌ అన్నీ గుర్తున్నాయి. అప్పట్లో డబుల్‌ కా మీఠా  ఇష్టంగా తినేదాన్ని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement