ప్రకృతిని, ఊరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి 84 ఏళ్ల ఓ బామ్మ పలుగూ, పార చేత బట్టింది. వంటిళ్లని పచ్చని కూరగాయలతో నింపడానికి నిత్యం శ్రమిస్తోంది. రకరకాల కూరగాయల నారుపోసి, మొక్కలను పెంచి, వాటిని ఉచితంగా గ్రామ వాసులకు అందిస్తోంది. బామ్మపనికి ముగ్దులైన ఊరి ప్రజలు ‘సూపర్ మామ్మ’ అంటున్నారు.
తమిళనాడుకు చెందిన 84 ఏళ్ల నుంజమాల్ ఈ కరోనా టైమ్‌లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, అది కిచెన్‌లో తయరయ్యే వంటకాల నుంచే వస్తుందని, ఇంటిపంట అలవాటును అందరిలోనూ ప్రోత్సహించడానికి నడుము కట్టింది. రాష్ట్రమంతా కూరగాయల మొక్కలను పంపిణీ చేయాలని ఉందనే ఈ మామ్మ. ‘సొంతంగా కూరగాయలను పండించుకోవడం ద్వారా సేంద్రీయ పద్ధతులను అవలంబిస్తారు. దీనివల్ల పర్యావరణానికీ మేలు కలుగుతుంద’ని చెబుతోంది. ఇప్పుడు నుంజమాల్ అందరిళ్లకు వెళ్లి ఎవరింట్లో ఎన్ని మొక్కలు, ఎలా పెంచుతున్నారు అనే విషయాన్ని స్వయంగా కనుక్కుంటూ తీరికలేకుండా ఉంది. తనే స్వయంగా మొక్కలను నాటి, పాదులు తీసి నీళ్లు పోసి వస్తుంది. ఆమె కృషికి ఏపుగా పెరుగుతున్న కూరగాయల తోటలే నిదర్శనం. ఈ బామ్మ పెరటి తోటలను తయారు చేయడాన్ని మెచ్చుకుంటూ ఒక వార్తాసంస్థ ఆమె ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఆ వెంటనే ఈ బామ్మకు మద్దతుగా రీట్వీట్ల వరద మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment