రష్యాలోని ఎలబ్రసి పర్వతంపై తెలంగాణ మ్యాపుతో శ్రీదివ్య
బయోడేటా
పేరు : బొల్లెద్దు శ్రీ విద్య
తల్లిదండ్రులు : సైదులు, స్వరూప
అక్కలు : శ్రీహర్షిణీ, శ్రీవాణి
స్వగ్రామం : కట్టంగూరు మండలం పేరిందేవిగూడెం
మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత, చిమ్మచీకటి, మంచుతాకిడికి చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి. ముఖంపైనున్న మాస్క్ తీసి మాట్లాడలేని పరిస్థితి, రాత్రి కావడంతో నిద్ర ముంచుకు వస్తోంది. భయం వేస్తోంది. అమ్మానాన్న, అక్కలు గుర్తుకొచ్చారు. కాని, 2 లక్షల మంది విద్యార్థుల్లో నన్ను ఎంపిక చేసి పంపించారని గుర్తుతెచ్చుకుని ధైర్యం తెచ్చుకున్నాను. మారుమూల గ్రామంలో దళితకుటుంబంలో పుట్టిన నేను ఇంతదాకా వచ్చాను. శిఖరం అంచున జాతీయపతాకాన్ని ఎగురవేస్తాను అని పట్టుదలతో మౌంట్ ఎలబ్రస్ పర్వతశిఖరాన్ని అధిరోహించాను. ఆ క్షణాన నేను పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాను. సంతోషంతో ఎగిరి గంతేశాను. నాతో పర్వతం అధిరోహించిన నలుగురు మిత్రులతో కలిసి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి పర్వతమంతా సగర్వంగా నిలబడ్డాను అని చెప్పింది 16 సంవత్సరాల శ్రీవిద్య. ఆలేరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎం.ఇ.సి. ఇంటర్ సెకండియర్ చదువుతున్న శ్రీవిద్య రష్యాలో ఎలబ్రస్ మంచుపర్వతాన్ని అధిరోహించింది. ఆమె సాహసం గురించి ఆమె మాటల్లోనే...
‘‘మా అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలు, మేము ముగ్గురం ఆడపిల్లలం. ఇద్దరు అక్కల తర్వాత నేను. మా అక్కలు కూడా గురుకుల పాఠశాలల్లోనే చదువుకున్నారు. నా చిన్నతనంలో మా అక్కలతో కలిసి ఊరికి దగ్గర లో ఉన్న ఏనే (చిన్నపాటి రాతిగుట్ట) వరకు పరుగులు తీసి ఎక్కేదాన్ని. అలా చిన్నతనం నుంచి పరుగెత్తడం, గుట్టలు ఎక్కడం అలవాటు అయింది. దెబ్బలు తగిలినా, రక్తం వచ్చినా ఆటగానే తీసుకునేవాళ్లం. ఆలేరు రెసిడెన్షియల్ పాఠశాలలో 5 తరగతిలో చేరాను. 9వతరగతిలో పర్వతారోహణ శిక్షణకు అవకాశం వచ్చింది. రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల నుంచి 160 మంది బాలికలు వచ్చారు. అందులో మా బ్యాచ్ నుంచి నేను సెలక్ట్ అయ్యాను. పాఠశాల తరపున భువనగిరి ఖిలాపై రాక్‌క్లైంబింగ్‌లో శిక్షణ ఇప్పించారు. భువనగిరి ఖిలా చూసినప్పుడు భయం వేసింది. కొన్ని వ్యాయామాలు చేసిన అనంతరం ‘ఎహే గిదెంత’ అని మనసులో అనుకుని అవలీలగా ఎక్కేశాను. కాని వయసు తక్కువని ఎవరెస్ట్ ఎక్కడానికి అప్పుడు నన్ను తీసుకుపోలేదు.
ఏర్‌పోర్‌కు వెళ్లేదాకా తెలియదు! రష్యాలోని ఎలబ్రస్ పర్వతాన్ని ఎక్కడానికి పోతున్నప్పుడు ఎలబ్రస్ పర్వతారోహణ అని నాకు చెప్పలేదు. న్యూఢిల్లీ నుంచి మాస్కోకు ఆరున్నర గంటలు, అక్కడినుంచి మరో విమానంలో 2 గంటల ప్రయాణం. అక్కడి నుంచి కారులో ప్రయాణం చేసి ఎలబ్రస్‌కు చేరుకున్నాం. నాతోపాటు ఎవరెస్ట్ అధిరోహించిన మాలవత్ పూర్ణ, ఏపీకి చెందిన సత్యారావు, రఘు, పుణేకు చెందిన వర్షలు వచ్చారు. ఎలబ్రస్ ఎక్కడానికి రెండురోజులు ప్రయత్నాలు చేసి వెనుదిరిగి వచ్చాం. విపరీతమైన మంచు, వర్షం కురియడంతో మధ్యలోనే దిగివచ్చాం. 27వ తేదీ రాత్రి మూడోసారి విజయవంతంగా ఐదున్నర గంటల్లో పైకి చేరుకున్నాం. 50 అడుగుల జాతీయ పతాకం ఎగురవేశాం. అనంతరం నాలుగు గంటల్లో భూమి మీదికి వచ్చాం.
నా తదుపరి లక్ష్యం ఎవరెస్ట్: ఎలబ్రస్ ఎక్కిన తర్వాత నాలో ఆత్మస్తైర్యం పెరిగింది. ఇక ఎంతటి పర్వతాన్నైనా అవలీలగా ఎక్కేస్తాను. నా తర్వాత టార్గెట్ అత్యంత ఎల్తైన ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పర్వతాలు ఎక్కేస్తాను. పర్వతారోహణతోపాటు చదువులో రాణించి ఐపీఎస్ సా«ధిస్తాను. ఎలబ్రస్ అధిరోహించిన తర్వాత నాకు లభించిన ప్రశంసలు మరచిపోలేను. నాతోటి విద్యార్థులు, ఉపాధ్యాయులేగాక జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలేరు ఎమ్మెల్యే... ఇలా ఎందరో నన్ను అభినందిస్తున్న తీరు నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది’’ అంటున్న శ్రీవిద్య లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షిద్దాం... ఆల్ ది బెస్ట్ చెబుదాం. – యంబ నర్సింహులు సాక్షి, యాదాద్రి జిల్లా
తల్లిదండ్రులతో శ్రీదివ్య