గుర్తు తెలియని వాహనంతో కొందరు ఆయధాలతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారనే సమాచారాన్ని ఉన్నతాధికారుల నుంచి అందుకున్నారు మహిళా కమేండోలు. వెంటనే రంగంలోకి దిగి ఆ వాహనాన్ని గుర్తించారు... వారిపై మెరుపు దాడి చేసి వాహనంలో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు... ఇవే కాకుండా ఆయుధం లేకుండా శత్రువును మట్టి కరిపించడం... సాయుధులైన శత్రువులను కూడా ఉట్టి చేతులతో అదుపులోకి తీసుకోవడం లాంటి కఠినమైన శిక్షణను పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి మహిళ కమేండో బృందంగా గుర్తింపు పొందారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి అలోచన మేరకు 39 మంది సుక్షితులైన మహిళ కమేండోలు అందుబాటులోకి వచ్చారు...
క్రావ్‌మగా యుద్ధతంత్ర కళ
గతంలో సూర్యాపేట జిల్లాలో బస్టాండ్‌లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆయుధాలతో ఇద్దరు పోలీసు అధికారులను కాల్చి చంపారు... ఇటీవల మొయినాబాద్‌లో కత్తితో పోలీసును గాయపర్చిన సంఘటన... బెంగుళూరులో కత్తిపోట్లు తదితర సంఘటనల దృష్ట్యా పోలీసుల వద్ద ఆయుధం లేని సమయంలో శత్రువు దాడి చేసినప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పే శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందనుకున్నారు కమలాసన్ రెడ్డి. నిరాయుధులుగా ఉన్న వారిపై శత్రువు అకస్మాత్తుగా సాయుధ దాడి చేస్తే ఆత్మరక్షణ చేసుకుంటూనే శత్రువును లొంగదీసుకునేందుకు ఇజ్రాయిల్‌దేశం క్రావ్‌మగా అనే యుద్ధతంత్ర కళలను అమలు చేస్తోంది. ఈ కళను వినియోగించి శత్రువును సులభంగా లొంగదీసుకోవడం సులువవుతుంది. 2017 జూన్‌లో పురుష పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మహిళ బృందాన్ని ఎంపిక చేసి వారికి కఠోర శిక్షణ ఇప్పించి వారిని కమెండోలుగా రూపుదిద్దారు.
శిక్షణ ఇలా...
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న 97 మంది మహిళ సిబ్బంది నుంచి చురుకుగా ఉన్న 39 మంది మహిళ పోలీసులను ఎంపికచేశారు. వారికి కఠోరమైన క్రావ్‌మగా శిక్షణ ఇచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ శిక్షణలో మొదటి గంట వరకూ ఫిజికల్ ఫిట్‌నెస్, పీటీ సర్క్యూట్, అజిలిటి డ్రిల్ (అప్రమత్తతో కూడిన) శిక్షణ ఇస్తారు... ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ పోరాట పద్ధతులు, వాటిని ఎదుర్కొనే తీరుపై 32 రోజులు పాటు నిర్విరామంగా శిక్షణ ఇచ్చారు.
సిద్ధమైన కమెండో బృందం
రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళ పోలీసు కమెండోల బృందం ఈ నెల 1వ తేదీన ఆవిర్భవించింది. నెల రోజుల పాటు కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కమెండోలు వారి నైపుణ్యాలను, విన్యాసాలను ఈనెల 1న కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్, సీపీ కమలాసన్‌రెడ్డి, పలువురు అధికారుల ముందు ప్రదర్శించి అందరినీ అశ్చర్యపరిచారు. ఇజ్రాయిల్ దేశపు యుద్ధతంత్ర కళలో శిక్షణ పొందిన మహిళ కమెండోలు ఎలాంటి ఆయుధాలు లేకుండా అసాంఘిక శక్తులను అడ్డుకోవడం, జనసమూహన్ని చెదరకొట్టడం, అనుమానాస్పద వ్యక్తులు ఎదురు పడిన సందర్భాల్లో అదుపులోకి తీసుకోవడం.
ఆయుధాలు ధరించి సంచరించే వారిని గుర్తించడంలో మెళకువలు, శత్రువు ఆయుధం ఎక్కుపెట్టిన సందర్భాల్లో వారిని ఎదిరించి లొంగదీసుకోవడం, వాహనాల్లో పారిపోతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతోబాటు అధునాతన ఆయుధాలతో యుద్ధతంత్ర కళల్లోని పలు విన్యాసాలను చేసి ఆహూతులను అబ్బురపరిచారు. పూర్తిస్థాయి కమేండోలుగా మారిన ఈ బృందాన్ని అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా క్యూఆర్టీ(క్విక్ యాక్షన్ టీం)గా ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరికి పెట్రోలింగ్ విధులనూ కేటాయించారు. ఎలాంటి సమస్య వచ్చినా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారీ కమేండోలు.
– పుల్లమళ్ల యాదగిరి, సాక్షి, కరీంనగర్
ఎలాంటి పరిస్థితులనైనా సరే..
మహిళా పోలీస్‌గా పలు ప్రాంతాలు ఒంటరిగా తిరిగే సమయంలో బెరుకుగా, ఇబ్బందిగా ఉండేది. కమేండో శిక్షణ పూర్తయిన తర్వాత ఒంటరిగా ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది.
– జ్యోతి, కానిస్టేబుల్
కొండంత ధైర్యం వచ్చింది!
గతంలో షీ టీమ్ బృందంలో పని చేసినప్పుడు.. కొంతమంది పోకిరీలను అదుపులోకి తీసుకునే సమయంలో కొంత ఇబ్బందిగా ఉండేది. మాకు కమేండోగా మారే అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్నాం. ఇప్పుడు కొండంత ధైర్యం వచ్చింది. శత్రువు చేతిలో ఆయుధం ఉన్నా ఎదుర్కోగలం.
– గౌతమి, కానిస్టేబుల్
Comments
Please login to add a commentAdd a comment