‘ముద్దమందారం’లో పూర్ణిమ
‘ముద్దుకే ముద్దొచ్చే మందారం... మువ్వల్లే నవ్వింది సింగారం’. బహుశా...పూర్ణిమను చూసే వేటూరి ఈ పాట రాశారేమో! వెండితెరపై తెలుగుదనానికి ప్రతీకలా ఉండేవారామె. పరికిణీలో పూర్ణిమ నిజంగా ముద్దమందారమే. ఆహార్యంలోనే కాదు, అభినయంలో కూడా పూర్ణిమ అభినందనీయురాలే. జంధ్యాల వంటి దిగ్గజం ప్రశంసలు ఆమెకు లభించాయంటే కారణం అదే. ఇటీవలే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న పూర్ణిమ ఇంటర్‌వ్యూ కోసం ఆమె మొబైల్‌కి కాల్ చేసింది ‘సాక్షి’. ‘నువ్వు నేనూ కలిసుంటేనే నాకెంతో ఇష్టం..’ అంటూ ‘గంగోత్రి’ సినిమా లోని పాట కాలర్‌ట్యూన్‌గా వినిపించింది. చరణం పూర్తయ్యేలోపే ‘హలో’ అన్నారు పూర్ణిమ. ఆ తర్వాత జరిగిన సంభాషణ.
మీ కాలర్‌ట్యూన్ వింటే... మీకు సినిమాలంటే బాగా ఇష్టమని అర్థమవుతోంది...
అవును... ఇప్పటికీ సినిమాలు బాగా చూస్తుంటాను. ఇప్పటి హీరోల్లో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ అబ్బాయిని చూడాలనుంది. అలాగే చిరంజీవిగారబ్బాయి చరణ్ యాక్షన్ అన్నా నాకు ఇష్టమే. రవితేజ, సిద్దార్థ్‌ల సినిమాలు కూడా బాగానే చూస్తా. ఇక హీరోయిన్లలో సమంత, కాజల్, అనుష్క, తమన్నా అంటే ఇష్టం. అప్పట్లో సౌందర్య కూడా నాలాగే తెరపై పద్ధతిగా కనిపించింది. తనంటే ఇంకా ఇష్టం.
మీరు తెలుగుదనానికి ప్రతీకలా ఉండేవారు కదా. ఇప్పుడొస్తున్న హీరోయిన్ల పోకడలు చూస్తే ఏమనిపిస్తుంది?
మనం ఎవర్నీ తప్పు పట్టలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటివి చేయక తప్పదు. పాపం... హీరోయిన్లే ఐటమ్‌సాంగులు కూడా చేయాల్సొస్తోంది.
మీరు ఈ జనరేషన్‌వారు కాకపోవడం వల్ల హ్యాపీగా ఫీలయ్యారా?
నేను సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. అసలు సినిమాల్లో చేయడమే మా ఇంట్లో ఇష్టం లేదు. ‘ఒక్క సినిమానే’ అనేసరికి చేశాను. కమిట్‌మెంట్‌తో నడుచుకున్నాను కాబట్టే, అమ్మానాన్న కూడా నన్ను విభేదించలేదు. 1989లో నేను సినిమాలకు దూరమయ్యాను. అప్పుడు కొంతమంది దర్శక, నిర్మాతలు ట్రెండీగా కనిపిస్తే... పారితోషికం కూడా ఎక్కువిస్తామని అన్నారు. కానీ... నేను మాత్రం నా అభిమతాన్ని మార్చుకోలేదు.
మీరు గాయని కూడా కదా?
అవును.. అప్పట్లో చాలా పాటలు పాడాను. కొన్ని ఫంక్షన్లలో కూడా పాడాను.
తొలుత గాయని అవుదామనే జంధ్యాల గారిని కలిశారట కదా?
కాదండీ... ‘ముద్దమందారం’ హీరోయిన్ కోసం జంధ్యాల దాదాపు వందమంది అమ్మాయిలను చూశారు. ఆయనకు ఎవరూ సరిగ్గా నచ్చలేదు. అనుకోకుండా ఓ సందర్భంలో నా ఫొటో చూసి, ‘నా సినిమాలో నాయిక ఈ అమ్మాయే’ అని ఫిక్సయిపోయారట. మా నాన్నగారి వద్దకు తన కో-డెరైక్టర్‌ని పంపించి మాట్లాడించారు. నేను మాత్రం చేయనని కరాఖండీగా చెప్పేశాను. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేయాలని నాకుండేది. కానీ నచ్చజెప్పడంతో ఒక సినిమా చేసి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ... తర్వాత అదే జీవితం అయిపోయింది. దాదాపు వంద సినిమాల్లో నటించాను. ముద్దమందారం, మల్లెపందిరి, నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, ఆడపడుచు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య... ఇలా నాకు పేరు తెచ్చిన సినిమాలెన్నో.
మీరు మరచిపోలేని పాత్ర?
‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’లో ‘పిచ్చితల్లి’ పాత్రను ఎప్పటికీ మరువలేను.
‘ఆ సినిమా ఒప్పుకోడానికి పూర్ణిమ పాత్రే కారణం’ అని ఓ సందర్భంలో చిరంజీవి చెప్పారు...
అవునా... అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. చిరంజీవిగారు కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులవి. కళ్లజోడు పెట్టుకొని చాలా క్యూట్‌గా ఉండేవారాయన. నన్ను ‘పూరీ.. పూరీ’ అని పిలిచేవారు. ఇద్దరం సెట్ అంతా అల్లరి చేసేవాళ్లం. మాధవి రిజర్డ్వ్ పర్సన్. ఎవరితోనూ కలిసేవారు కాదు. అందుకే... చిరంజీవిగారూ నేనూ కూడబలుక్కొని మరీ ఆమెను ఏడిపించేవాళ్లం. ఆ పాత్రను నేను చాలా బాగా చేశానని అందరూ అంటుంటారు. నిజానికి ఆ క్రెడిట్ మొత్తం కోడి రామకృష్ణగారిదే. ప్రతి సన్నివేశంలోనూ ఆయన నటించి చూపించేవారు.
చిరంజీవిగారిని తర్వాత ఎప్పుడైనా కలిశారా?
మొన్న టి.సుబ్బరామిరెడ్డిగారి పుట్టినరోజు వేడుక మా వైజాగ్‌లో జరిగింది. అప్పుడు కేవలం చిరంజీవిగారిని కలవడానికే వెళ్లాను. చూడగానే... ‘ఏమ్మా... బావున్నారా’ అన్నారు. నిజంగా నాకు ఎంత ఆనందమనిపించిందో. నిజంగా ఆయన చాలా గ్రేట్. నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ చిరంజీవిగారి అభిమానినే.
‘మా వైజాగ్’ అంటున్నారు! మీరు ప్రస్తుతం అక్కడే ఉంటున్నారా?
అవును.. ‘ముద్దమందారం’, ‘నాలుగు స్తంభాలాట’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’.. ఇలా చాలా సినిమాల షూటింగులు ఇక్కడే జరిగేవి. జంధ్యాల గారికి కూడా వైజాగ్ ఇష్టం. ఇక్కడే షూటింగ్స్ జరిపేవారు. జంధ్యాలగారు కుడివైపుకి తిరిగి నిలబడమంటే, నేను ఎడమవైపు తిరిగి నిలబడేదాన్ని. దాంతో నన్ను ‘తింగరి..’ అని పిలిచేవారు. చనిపోయేవరకూ నన్ను అలాగే పిలిచారాయన. నిజంగా ఆ రోజులు మళ్లీ తిరిగిరావు. నా కెరీర్ ఎక్కువ భాగం వైజాగ్‌లోనే సాగింది. అయితే.. పెళ్లయ్యాక సినిమాలకు దూరమయ్యాను.
మీ శ్రీవారు ఏం చేస్తారు?
ఒరిస్సాలో ఉద్యోగం ఆయనకు. అందుకే అక్కడే స్థిరపడిపోయాం. ఇప్పుడు పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. నాతోటి హీరోయిన్లందరూ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడితే.. నాక్కూడా నటించాలనిపించింది. అందుకే... వైజాగ్ వచ్చేశాం. తొమ్మిది నెలల నుంచీ ఇక్కడే ఉంటున్నాం.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
ఉందిలే మంచికాలం ముందుముందునా, తొండి, 33 ప్రేమకథలు, సాహసం చేయరా డింభక, సాహెబా సుబ్రమణ్యం ఇలా పలు సినిమాల్లో తల్లి పాత్రలు చేశాను, చేస్తున్నాను. అయినా ఈ వయసులో అమ్మ పాత్రలు చేయడమే కరెక్ట్ కదా.
సంభాషణ: బుర్రా నరసింహ
ఉద్యోగం చేయాలనుకున్నా కానీ, సినిమాల్లోకి రావాలనుకోలేదు!
Published Sat, Oct 11 2014 11:06 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM
Advertisement
Advertisement