పార్వతి ఓ పల్లెటూరి పేదింటి అమ్మాయి. కలవారింటి కోడలు అవుతుంది. పెద్దంటి కోడలిగా ఆ ఇంట్లో ఆమె ఎదుర్కొనే సంఘటనలతో ముద్దమందారం సీరియల్ జీ తెలుగులో ప్రసారమవుతోంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పార్వతిగా పరిచయం అయ్యింది తనూజ. ఈ బెంగుళూరుమందారం తెలుగింటి సింగారంగా ఎలా మారిందో ముచ్చటగా చెప్పుకొచ్చింది తనూజ.
‘‘పార్వతిగా ఇది నా డ్రీమ్ క్యారెక్టర్. సీరియల్‌లోకి నేను రాకముందే ఒక పల్లెటూరి అమ్మాయిలాంటి క్యారెక్టర్‌ని చేయడం ఎంత బాగుంటుందో కదా అనుకునేదాన్ని. ఈ మాట మా అమ్మతో తరచూ చెబుతుండేదాన్ని. ‘ముద్దమందారం’లో పార్వతి స్టోరీ చెప్పినప్పుడు మొదట నాకు అంతగా అర్ధం కాలేదు. అప్పుడు నాకు తెలుగు రాదు. ఆఫర్ వచ్చింది కదా అని క్యాజువల్‌గా ఓకే చేశాను. నిజానికి అప్పటికి ఇండస్ట్రీ గురించే అంతగా ఐడియా లేదు. అంతా కొత్త. తర్వాత్తర్వాత యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కోటి నేర్చుకుంటూ, కథ తెలుసుకుంటూ, నటిస్తూ.. క్యారెక్టర్‌లో లీనమైపోయా. పార్వతిగా మారిపోయా. చాలా మంది ఎంతో గొప్పగా పొగుడుతుంటారు. సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు మరో సీరియల్ చేస్తే ‘పార్వతి’గా ఉన్నప్పటి ఫాలోవర్స్ తర్వాత ఉంటారా అని భయపడుతుంటాను.
టీచర్ అవ్వమన్నారు
నేను పుట్టి, పెరిగింది అంతా బెంగుళూరులోనే. ముందు మా ఇంట్లో వాళ్లెవరికీ నేనీ ఫీల్డ్‌లోకి రావడం ఇష్టం లేదు. వద్దు మనకీ యాక్టింగ్ అనేవారు అమ్మనాన్న. ‘చదువులో ముందుంటున్నావు. బాగా చదువుకో, టీచర్ లేదా లెక్చరర్ అవ్వు’ అనేవారు నాన్న. హాబీ కోసం డ్యాన్స్ నేర్చుకునే టైమ్‌లో ఉదయం టీవీలో యాంకర్‌గా చేశాను. ఆ సమయంలోనే కన్నడలో ఓ షార్ట్ హారర్ మూవీలో నటించాను. అది తెలుగులో ‘చిత్రం కాదు నిజం’గా డబ్ అయ్యింది. మంచి పేరొచ్చింది. అప్పుడే ఈ తెలుగు సీరియల్ ఆఫర్ వచ్చింది. క్యాజువల్‌గా వెళ్లి కలిస్తే సెలక్ట్ అయ్యాను. దీంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ ఫీల్డ్‌కి వచ్చాను. షార్ట్‌ఫిల్మ్, ఈ సీరియల్ బాగా హిట్టవడంతో అమ్మానాన్నలు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు.
అప్పట్లో వాళ్లు భయపడినంతగా ఇక్కడ ఎలాంటి నెగిటివిటీ లేదు. నా పర్సనల్ ఫ్యామిలీకన్నా సీరియల్ ఫ్యామిలీతో అటాచ్‌మెంట్ ఎక్కువ అయిపోయింది. సీరియల్ అయిపోతే ఇంత పెద్ద, మంచి ఫ్యామిలీని మిస్ అవుతాను కదా అనిపిస్తుంటుంది. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలని వచ్చినదాన్ని కాదు. ఎలాగో వచ్చాను, నా టాలెంట్‌ను చూపించుకోవాలని కృషి చేస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇదే నా బ్యూటిఫుల్ జర్నీ అనీ నమ్మి, వర్క్స్ చేసుకుంటూ వెళుతున్నాను.
నాదైన ప్రపంచం
మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ షూటింగ్‌కి కూడా రారు. ‘నీ ఓపికకు ఓ దండం తల్లీ’ అనేస్తారు. కారణం, ఉదయం ఏడు గంటలకు షూటింగ్ స్పాట్‌కి వెళితే తిరిగి ఎప్పుడు ఇల్లు చేరుకుంటానో నాకే తెలియదు. అలా ఉంటుంది వర్క్‌షెడ్యూల్. అయినా, ఇంకా వర్క్ కావాలి అనుకుంటున్నాను. బయటి ప్రపంచాన్ని మిస్ అవుతున్నాను అనే భావనే లేదు. నాదైన ఒక ప్రపంచం ఈ ఇండస్ట్రీలోనే ఉంది. పేరెంట్స్‌ని మిస్ అవుతున్నాను అని చెబితే చాలు... వాళ్లు బెంగుళూరు నుంచి వచ్చి ఓ రోజు టైమ్ స్పెండ్ చేసి వెళ్లిపోతారు. ‘మీరు ఈ రోజు సీరియల్‌లో కాస్త డల్‌గా అనిపించారు. ఎండ ఎక్కువ ఉంది, కేర్ తీసుకోండి’ అని నా ఫ్యాన్స్ చెబుతుంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. మరో అదృష్టం ఏంటంటే ఎక్కడకు వెళ్లినా నన్ను అమ్మలా చూసుకునే వాళ్లు దొరుకుతారు. ఇప్పుడు హరిత(అఖిలాండేశ్వరి పాత్రగా నటిస్తున్న హరిత)మ్మ ‘ఇది తిను, కాసేపు రెస్ట్ తీసుకో’.. అని చెబుతుంటారు. డైరెక్టర్, కెమరామెన్.. ఇలా ప్రతి ఒక్కరూ నా గురించి కేర్ తీసుకుంటారు.
ముగ్గురు లక్ష్ములు
అమ్మానాన్నలకు ముగ్గురం ఆడపిల్లలం. అక్క అనూజ లాయర్, నేను యాక్టర్, చెల్లి పూజ ఇంజనీయర్. మా అమ్మ నాన్న ‘మా ముగ్గురు లక్ష్ములు’ అని గర్వంగా చెబుతుంటారు. మా అమ్మను ఎప్పుడైనా అడుగుతాం ‘ముగ్గురం ఆడపిల్లలమే కదా, మగ పిల్లలు పుడితే బాగుండు అనుకున్నారా!’ అని. అప్పుడు అమ్మ ‘నేను అమ్మాయిలు పుట్టాలనే మొదటి నుంచీ దేవుళ్లకు మొక్కుకున్నాను. మీరు అబ్బాయిలకన్నా ఎందులో తక్కువ’ అంటుంది. అప్పుడైతే చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. నాకు కూడా ఫ్యూచర్‌లో ఆడపిల్లే పుట్టాలని కోరుకుంటాను మా అమ్మ లాగ.
కొంచెం మోడ్రన్
ముందు నుంచీ కాస్ట్యూమ్స్‌ది నాదే బాధ్యత అన్నారు. అందుకే, నా క్యారెక్టర్ మొదట ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉండేలా జాగ్రత్తపడుతున్నాను. కాస్ట్యూమ్స్ విషయంలో మా మమ్మీకి థాంక్స్ చెప్పాలి. మా మమ్మీవి కొత్త కొత్త చీరలన్నీ వచ్చేటప్పుడు దొంగతనంగా తెచ్చేసుకుంటాను (నవ్వుతూ). అమ్మ ఫోన్‌చేస్తుంది ‘పెళ్లికి వెళ్లాలని తీసుకున్నాను, నువ్వు తీసుకెళ్లావా?’ అంటుంది. మా సీరియల్‌లో కూడా ఈ రోజు పెళ్లి ఉందని నవ్వేస్తాను. అమ్మ కూడా నవ్వేస్తుంది. మా చెల్లెలు పూజ నాకు కాస్ట్యూమ్ విషయంలో, హెయిర్ స్టైల్స్ విషయంలో సూచనలు ఇస్తూ ఉంటుంది. నాకు ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. వాటిలో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పల్లెటూరి అమ్మాయిలా యాక్ట్ చేస్తున్నాను. నెక్ట్స్ సీరియల్‌లో కొంచెం మోడ్రన్ అమ్మాయిలా క్యారెక్టర్ వస్తే బాగుండు అనుకుంటున్నాను.’
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment