ఒకరు సచిన్‌లా... ఒకరు ధోనీలా... | Telugu Warriors practice vigorously for ccl match | Sakshi
Sakshi News home page

ఒకరు సచిన్‌లా... ఒకరు ధోనీలా...

Published Sun, Feb 9 2014 8:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

Telugu Warriors practice vigorously for ccl match

సినిమా... క్రికెట్ ...
వీటిలో దేనిపై ఎక్కువ మక్కువ? వెంటనే సమాధానం చెప్పడం కష్టం. క్రికెటర్లు తెరపై కనిపించడం చాలా తక్కువ. కానీ, నటులు క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెట్టి చాన్నాళ్లయింది. సరదా కోసమో, నిధుల సేకరణ నిమిత్తమో సినీ తారలు బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చిన సందర్భాలు 1950ల నాటి నుంచి ఉన్నాయి. ఇక, ఇటీవలి కాలంలో స్టార్ క్రికెటర్లు ఏటా ఏదో ఒక సందర్భంలో క్రికెట్ స్టేడియంలో దాదాపు ప్రొఫెషనల్స్‌లా తమ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. ఒకరు సచిన్‌లా... మరొకరు ధోనీలా మైదానంలో చెలరేగుతున్నారు. అటు సినిమా ఫ్యాన్స్, ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కేరింతల మధ్య  సిక్స్‌లు, ఫోర్లు కొడుతూ అభిమానాన్ని బౌండరీలు దాటిస్తున్నారు.  ఓ వైపు షూటింగ్, మరోవైపు క్రికెట్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న స్టార్ క్రికెటర్లను పలకరిస్తే వారు ఎన్నెన్నో కబుర్లు చెప్పారు.
 
సేవ పేరుతో మొదలైన స్టార్ క్రికెట్ ఆటలు ఇప్పుడు కప్‌లు గెలుచుకునేవరకూ వెళ్లాయి. మూడేళ్లుగా పరభాషా నటులతో కలిసి మన స్టార్‌లు ఆడుతున్న మ్యాచ్‌లను చూస్తుంటే సినిమా అభిమానులకు, క్రికెట్ అభిమానులకు కన్నుల పండువలా ఉంది. ఇలా క్రికెటర్ల అవతారమెత్తి స్టేడియంలో దర్శనమివ్వడం హీరోలకు కూడా కొత్తగా, గర్వంగా ఉంటోంది. క్రికెటర్ల హోదాలో అందుకుంటున్న ఆతిథ్యం దగ్గర నుంచి కొట్టే సిక్స్, పట్టే క్యాచ్ వరకూ అన్నీ వారికి అపురూపమైన జ్ఞాపకాలే. ఇంత గొప్ప వేడుక వెనుక వారు చేస్తున్న కసరత్తు విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. మూడు వారాల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఔటర్‌రింగ్‌రోడ్డుకి సమీపంలోని ఓ గ్రౌండ్‌లో మన ‘తెలుగు వారియర్స్’ జట్టు  ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. రోజుకి ఐదు గంటల చొప్పున వారానికి నాలుగురోజులు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న మన హీరోల సాధన అనుభవాలు వింటే మనకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది.
 
సాధనే గెలుపు మంత్రం: వెంకటేష్

ఏ ఆటకైనా సాధన ఉండాలి. అదే గెలుపునకు దారి చూపెడుతుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా అవసరం. సిసిఎల్4 (సెల బ్రెటీ క్రికెట్ లీగ్4) స్టార్ క్రికెటర్స్‌కి ఇది చాలా అవసరం. పైగా ఇది మన ఊళ్లో మనవాళ్లతో ఆడుతున్న ఆటకాదు. ఎనిమిది రాష్ట్రాల నుంచి ఎనిమిది టీమ్‌లు బరిలోకి దిగాయి. అన్నీ కూడా నువ్వా...నేనా అన్నట్టు ఉన్నాయి. అలాగని ఇది పూర్తిగా ఒత్తిడిని ఎదుర్కొనే గేమ్ కాదు. చాలా ఆరోగ్యకరమైన పోటీ. మన దేశంలోని సినిమా రంగం ఆటపేరుతో ఏర్పాటు చేసుకున్న అందమైన వేదిక. మా తెలుగు వారియర్స్ జట్టు చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. నేను కూడా ఇక్కడికి రోజూ వస్తున్నాను. ఇంట్లో రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌తో పాటు ఇక్కడ ఆట నన్ను మరింత ఫిట్‌గా ఉంచుతోంది. ఈ మధ్యనే కాలికి గాయం అవ్వడం వల్ల కొన్నిసార్లు బ్యాటింగ్ నుంచి తప్పుకుంటున్నాను. వైస్ కెప్టెన్ అఖిల్ దగ్గర నుంచి నిఖిల్ వరకూ అందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి పవర్‌ప్లేలో(మొదటి ఆరు ఓవర్లలో) హీరోలు మాత్రమే ఆడాలి. సిసిఎల్ పేరుతో ఏడాదిలో నెల రోజులు మరో ప్రొఫెషన్‌లో బిజీగా గడపడాన్ని స్టార్ క్రికెటర్లందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
 
ఆ కోరిక తీరింది: అఖిల్

చిన్నప్పటి నుంచి క్రికెటర్‌ను అవ్వాలన్న కోరిక ఇప్పుడు తీరిపోయింది. క్రికెట్ అంటే ఇష్టం ఉండని అబ్బాయి ఎవరుంటారు చెప్పండి. తెలుగు వారియర్స్‌కి వైస్ కెప్టెన్‌గా ఆడుతున్నాను. క్రికెట్‌పై నాకున్న ఆసక్తి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి ఆదివారం క్రికెట్ ఆడాల్సిందే. రెండే రెండు కారణాలు మాత్రం నా ఆదివారం ఆటను ఆపగలవు. ఒకటి వర్షం, రెండోది నేను ఊళ్లో లేకపోవడం. నేను ఆస్ట్రేలియాలో చదువుకున్న రోజుల్లో కూడా క్రికెట్టే నా ప్రపంచం. ప్రతి వీకెండ్‌కి అక్కడ స్పెషల్ మ్యాచ్‌లు ఆడేవాడిని. అందులో భాగంగా కొంత శిక్షణ కూడా తీసుకున్నాను. ఇక ఇక్కడ ప్రాక్టీస్ అంటారా...ఒక్కరోజు ఎగ్గొట్టినా లోపల భయం మొదలవుతుంది. పైగా వైస్ కెప్టెన్ కావడంవల్ల టీం ప్రాక్టీస్‌ని సీరియస్‌గా గమనించే బాధ్యత కూడా నేను చూసుకోవాలి. వెంకీ అంకుల్ అందిస్తున్న ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ముప్పై, నలభై వేలమంది ప్రజల మధ్య బ్యాట్ పట్టుకుని  గ్రౌండ్‌లోకి దిగడాన్ని గర్వంగానే కాదు పెద్ద బాధ్యతగా కూడా ఫీలవుతున్నాం.
 
అంతా క్రికెట్ పుణ్యమే: నిఖిల్

ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడినపుడు సచిన్ వాడిన డ్రసింగ్ రూమే మాకూ ఇచ్చారు. ఆ సమయంలో నేనెంత గర్వపడ్డానంటే....కేవలం స్టార్ క్రికెటర్స్ మ్యాచ్‌ల పుణ్యమే ఇదంతా అనిపించింది. సల్మాన్‌ఖాన్ లాంటి స్టార్ హీరో మాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆల్‌దిబెస్ట్ చెప్పిన సంఘటన వెనకున్న కారణం కూడా క్రికెట్టే. అందుకే దీన్ని మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం. రోజూ ఇక్కడ ఐదు గంటల ప్రాక్టీస్ ఉంటుంది. ఒకపక్క షూటింగ్‌లు... మరో పక్క క్రికెట్ ప్రాక్టీస్. రెండింటికీ న్యాయం చేయడంలో కొంత ఇబ్బంది పడ్డా... ఏడాదిలో ఒకే ఒక్కసారి వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకోలేం కదా! మా ఫిజియో వెంకట్ కూడా మాకు బాగా సాయపడుతున్నారు. ప్రతి ప్రాక్టీస్‌గేమ్‌కి ముందు ఆయన మా బాడీ ఫిటెనెస్ పరీక్ష చేసి ఎక్కడైనా నొప్పి ఉన్నా...ఒత్తిడిగా ఫీలయినా మసాజ్‌తో సరిచేస్తారు. ఆ తర్వాత వార్మప్ అయ్యాక మా బాడీ ఆటకు రెడీ అవుతుందన్నమాట.
 
కప్ గ్యారెంటీ: తరుణ్

సినిమాల్లోకి రాకపోతే నేను తప్పనిసరిగా క్రికెటర్‌నే అయ్యేవాడిని. అందులో సందేహం లేదు. ఆ లోటును తీర్చడానికే సిసిఎల్ వచ్చిందనిపిస్తోంది. అదే క్రికెట్ గ్రౌండ్...అదే జనం...అవే వసతులు..అవే మర్యాదలు...వీటి మధ్య బ్యాట్ పట్టుకుని ఒకరు సచిన్‌లా ఫీలైతే ఒకరు ధోనీలా ఫీలవుతూ కొట్టే షాట్‌లు, పట్టే క్యాచ్‌లు...నిజంగా మేం చాలా అదృష్టం చేసుకున్నాం.  వీకెండ్ ఉండే మ్యాచ్ రాత్రిపూట ఉంటే ఇక్కడ రాత్రివేళలో ప్రాక్టీస్ చేస్తున్నాం. మధ్యాహ్నం ఉంటే ఇక్కడ కూడా మధ్యాహ్నమే ఆడుతున్నాం. ఆడబోయే సమయానికి అప్పుడున్న వాతావరణానికి అలవాటు పడడానికి రకరకాల పద్ధతుల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈసారి కప్పు కచ్చితంగా గెలుస్తామని చెబుతున్నాను.
 
ఇక ఆ పొరపాటు జరగదు: సచిన్

మా తెలుగు వారియర్స్ జట్టు తప్పకుండా కప్ గెలుస్తుందని చెప్పడానికి ఇక్కడ జరుగుతున్న ప్రాక్టీస్‌మ్యాచ్‌లే నిదర్శనం. ఇలాంటి ప్రత్యేక శిక్షణ పెద్దగా లేకపోవడం వల్లనో ఏమో గత ఏడాది చాలామంది ఆటగాళ్లకు గాయాలయ్యాయి. ఈసారి అలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిరోజూ ప్రాక్టీస్ మ్యాచ్ పెట్టుకున్నాం. చాముండేశ్వరీనాథ్‌గారు కూడా మాలోని లోపాల్ని గమనించి వాటిని అధిగమించేలా శిక్షణనిస్తున్నారు.
 
కేవలం పండ్లు, ప్రొటీన్ షేక్స్: రఘు
 
ఈ ప్రాక్టీస్ వల్ల అనుభవం రావడమే కాక ప్రతి ఒక్కరు నాలుగేసి కిలోల బరువు కూడా తగ్గిపోయారు. ఎన్ని రకాల జిమ్‌లకు వెళ్లినా రాని ఫిట్‌నెస్ వస్తోందిక్కడ. ఇక మానసిక ఉల్లాసమంటారా...ఇక్కడ తోటినటులతో సాన్నిహిత్యంతో పాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న నటులతో పరిచయాలు... స్నేహాలు అన్నీ మా పాలిట వరాలే. సిసిఎల్ లేకుండా భోజ్‌పురిలో పాపులర్ నటుడి గురించి మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. బెంగాలీలో ఉన్న నటులతో స్నేహం ఎలా కుదురుతుంది చెప్పండి. అలాగని వారితో కలిసి ఆడే అవకాశంగా భావించి ఊరుకుంటే సరిపోదు. ఈసారి కప్ తేకుంటే తెలుగు వారియర్స్‌ని తెలుగు ప్రేక్షకులు క్షమించరు జుట్టును. (నవ్వుతూ) ఒక పక్క కర్ణాటక, మరో పక్క బాలీవుడ్ ఎడాపెడా వాయించేస్తున్నాయి. మేం కూడా వారికి దీటుగా ఆడడానికే సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ నెలరోజులు ఆరోగ్య విషయంలో, ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
గ్లామర్ తగ్గకుండా జాగ్రత్తలు: సామ్రాట్

చిన్నప్పుడు స్కూల్లో గ్రౌండ్‌లో ఆడిన జ్ఞాపకాలన్నీ మా కళ్లముందు కదలాడే క్షణాలివి. ఫేవరెట్ స్పోర్ట్ ఏంటని ఎవరిని అడిగినా ప్రశ్న పూర్తవ్వకుండా చెప్పే సమాధానం క్రికెట్. ఒకపక్క తెరపై గ్లామర్‌గా కనిపించాలి. మరోపక్క ఇక్కడ ఇలా ఎండలో ప్రాక్టీస్ చేయాలి. రెండూ ముఖ్యమైనవే కాబట్టి రిస్క్ తీసుకోవడం తప్పడం లేదు. ప్రొఫెషనల్ క్రికెటర్స్‌కే గ్రౌండ్‌లోకి వెళ్లగానే ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. ఇక మా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి! అందుకే ఈ తిప్పలన్నీ. మా వెంకీసార్ చెప్పినట్టు సాధనొక్కటే అలాంటి ఆందోళన నుంచి బయటపడేస్తుంది. అందుకే అన్ని పనులూ పక్కన పెట్టి మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇక్కడ వాలిపోతున్నాం. లోపాల్ని అధిగమించడానికి నేను ఎక్కువగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను.
 
కొత్త స్నేహితులు దొరికారు: సుధీర్‌బాబు
 
నేను ఆల్‌రౌండర్‌ని. మోహన్‌బాబుగారి అబ్బాయి విష్ణు, నేను చిన్నప్పుడు క్లాస్‌మేట్స్‌మి. మా ఇద్దరికీ స్కూల్ జ్ఞాపకాలకంటే క్రికెట్ గ్రౌండ్ జ్ఞాపకాలే ఎక్కువ. ప్రస్తుతం నా ఆటను చూసి సలహాలిస్తుంటాడు. అతనొక్కడే కాదు..చాలామంది చిన్ననాటి స్నేహితులు నన్ను గ్రౌండ్‌లో చూసి సంతోషపడుతున్నారు. స్టార్ క్రికెట్ వల్ల  పరభాషానటులతో పరిచయాలు, అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకునే అవకాశం కలిగింది మాకు. ఎనిమిది టీమ్‌ల నటుల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటికే చాలావరకూ మా ఫేస్‌బుక్‌లోకి వచ్చేశారనుకోండి. అలాగే నిజమైన క్రికెటర్ల స్థానంలో ఉండి ఆడుతున్నాం అనే ఫీలింగ్ మమ్మల్ని మరింత సంతోషంగా ఉంచుతోంది.

- భువనేశ్వరి
 
టీంవర్క్‌ని నమ్మారు...

గుడ్ టీం. తెలుగు వారియర్స్ ఈసారి చాలా పట్టుదలగా ఉన్నారు. ‘షూటింగ్‌లు...ముఖ్యమైన పనులు అన్నీ ప్రాక్టీస్ తర్వాతే’ అంటున్నారు. వీరి ఉత్సాహం, ప్రాక్టీస్ చేసే విధానం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్‌గారి కెప్టెన్సీలో యువహీరోలంతా చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి టీంవర్క్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టారు.  
 - చాముండేశ్వరీనాథ్, ‘తెలుగు వారియర్స్’ జట్టు మెంటర్
 
ప్రాక్టీస్ మ్యాచ్‌లే కోచింగ్ క్యాంపులు!

మన తెలుగు హీరోలు చేస్తున్న ప్రాక్టీస్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చెన్నై, కర్ణాటక టీమ్‌లు వీకెండ్‌కి ముందు ప్రత్యేకంగా కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దానికి భిన్నంగా మన తెలుగు స్టార్స్ ప్రతి రోజు ఐదుగంటలపాటు ఇక్కడ లోకల్ ఆటగాళ్లతో పోటీ మ్యాచ్‌లు ఆడుతున్నారు. అవే వాళ్లకు పెద్ద కోచింగ్ క్యాంపులు. వాళ్ల సీరియస్‌నెస్ చూస్తుంటే వారిలో ప్రొఫెషనల్ క్రికెటర్స్ కనిపిస్తున్నారు.
 - విష్ణు ఇందూరి, సిసిఎల్ ఫౌండర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement