కొండకోనలలో కొండంత భక్తితో... | That way the divine appearance of nuclear | Sakshi
Sakshi News home page

కొండకోనలలో కొండంత భక్తితో...

Published Thu, Dec 25 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

కొండకోనలలో  కొండంత  భక్తితో...

కొండకోనలలో కొండంత భక్తితో...

ఇటు అటూ... ఎటు చూసినా పచ్చదనం.
చెట్ల చిటారు కొమ్మల నుంచి వినిపించే పక్షిగానాలు..
స్వర సవ్వడులను ఇచ్చే సెలయేళ్లు... నీలిమలై కొండల ధ్యాన దీక్షలు,
పవిత్ర పంబా నది భక్తి రాగాలాపనలు...


కేరళ రాష్ట్రంలో పత్తినంతిట్ట జిల్లాలో... సహ్యాద్రి పర్యతశ్రేణులలో కొలువై ఉన్నాడు హరిహరసుతుడు అయ్యప్ప.  సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో, పద్దెనిమిది కొండల మధ్య దట్టమైన అడవుల మధ్య కొలువుదీరినాడు. ఎరుమేలి నుంచి సాగే అయ్యప్ప భక్తుల యాత్రలో ఎన్నెన్నో ప్రకృతి సోయగాలు! అయ్యప్ప దర్శనానికి చేరే మార్గమంతా పచ్చటి ప్రకృతిమయం.
 
ఆ మార్గంలోనే అణువణువూ  దైవ దర్శనం...
నిర్మలారెడ్డి

శబరిమల యాత్రకు ప్రతి యేడాది భక్తులు దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండలపూజ నవంబర్ 17, మకరవిళక్కు (మకరజ్యోతి) జనవరి 14 - ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. మిగతా అన్ని రోజుల్లోనూ దేవాలయాన్ని మూసి ఉంచుతారు. అయితే, ప్రతి మలయాళ నెలలో ఐదు రోజుల పాటు గుడిని తెరచి ఉంచుతారు. ఇప్పటికే దీక్షలో ఉన్నవారు గురుస్వామి నాయకత్వంలో ఒక బృందంగా శబరిమలకు బయల్దేరి వెళుతుండటం పరిపాటిగా కనిపించే దృశ్యం.
 
ఎరుమేలి నుంచి...
 
దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల యాత్ర ఎరుమేలి వద్ద మొదలవుతుంది. ఎరుమేలి నుండి అయ్యప్ప దేవాలయానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరం. ఎరుమేలి కొట్టాయం జిల్లాలో ఉంది. కొచ్చిన్ నుంచి 98 కిలోమీటర్లు, తిరువనంతపురం (త్రివేండ్రం) నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎరుమేలి. యాత్రికులకు కొట్టాయం కానీ కొచ్చి కానీ అనుకూలమైన కూడలి. పంబ నుంచి 7 కి.మీ దూరం ఉంటుంది సన్నిధానం. పంబ వరకు వాహనంలోనో, కాలినడకనో వెళ్లి, అక్కడ నుంచి తప్పనిసరిగా కాలినడకన కానీ, డోలీలో కానీ వెళ్లాలి.
 
ముందుగా ఎరుమేలిలో ‘వావరు’ స్వామిని భక్తులు దర్శించుకుంటారు. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్లినప్పుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే ‘వావరు’ స్వామి. ‘నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు’ అని అయ్యప్ప ‘వావరు’కు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం. వావరు కొలువున్నది కూడా ఒక మసీదులోనే! ఎరుమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్పస్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఎరుమేలి నుంచి ‘పంబ’కు రెండు మార్గాలున్నాయి. ఒకటి కాలి నడక (పెద్దపాదం), రెండోది బస్సు మార్గం.
 
పాదయాత్ర ప్రారంభం...

‘పెద్ద పాదం’ అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. దాదాపు 52 కిలోమీటర్ల దారి అంతా చిట్టడవి. తలపై ఇరుముడులు పెట్టుకొని, పాదరక్షలు లేకుండా కీకారణ్యంలో రాళ్లు రప్పల మీదుగా అస్తవ్యస్తమైన మార్గం గుండా రాత్రింబవళ్లూ సాగుతారు.  దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా ‘కాలైకట్టి’ వద్ద నుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట. ఇక్కడికి కొద్ది దూరంలోనే ‘అళుదా’నది ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి ఒక రాయిని తీసుకుని వెళతారు. ఆ రాతిని ‘కలీద ముకుంద’ అనే మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటున పడేస్తారు. తర్వాత యాత్ర ముందుకు సాగి ‘కరిమల, పెరియాన వట్టమ్, చెరియానవట్టమ్’ అనే స్థలాల గుండా ‘పంబ’నది చేరుకుంటారు. బస్సుమార్గాన వచ్చేవారు కూడా ఈ పంబకే చేరుకుంటారు. పంబ గ్రామం నుండి స్వామి సన్నిధానానికి సుమారు 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ  కొలువై ఉన్న వినాయకుడిని ‘కన్నెమూల గణపతి’ అంటారు. ఇక్కడ నుండి ‘చిన్నపాదం’ యాత్ర మొదలవుతుంది.

అయ్యప్ప సన్నిధానం...
 
భక్తులు పంబానదిలో స్నానం చేసి, ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో నీలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో ‘శరమ్‌గుత్తు’ అనే చోట ఉంచుతారు. ఇక్కడ నుండి అయ్యప్ప సన్నిధానానికి కిలోమీటర్ దూరం ఉంటుంది. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను ‘పదునెట్టాంబడి’ అంటారు. 40 రోజుల దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుంది. ఇరుముడి, దీక్ష లేనివారు ‘పదునెట్టాంబడి’కి కుడిచేతివైపు వేరేమార్గం గుండా దర్శనానికి వెళ్లాలి.

ఆన్‌లైన్‌లో దర్శన క్యూ కూపన్ల కోసం...

 దర్శనానికి లక్షలాది భక్తులు బారులు తీరే ఈ సీజన్‌లో అవాంఛనీయ ఘటనలను నివారించడానికి కేరళ పోలీసుల సూచన మేరకు కొన్నేళ్ల క్రితమే ఆన్‌లైన్ బుకింగ్  సదుపాయాన్నీ ప్రారంభించారు. భక్తులు తమ పేరు, వయసు, చిరునామా, ఫొటో ఐడి వివరాలను ‘ఈ పోర్టల్’లో నమోదు చేసుకొని.. లభ్యతను బట్టి తమకు అనువైన తేదీ, సమయాల్లో దర్శన క్యూ కూపన్లను ముందుగానే రిజర్వు చేసుకోవచ్చు.
 
మోసాలకు అడ్డుకట్ట...

 
గత ఏడాది కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వెబ్‌సైట్‌ను కొందరు వినియోగించుకుని యాత్రికుల వద్ద అధిక డబ్బులు వసూలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకని శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం కేరళ పోలీసులు వర్చువల్ క్యూ సిస్టం పేరిట వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఆ వెబ్‌సైట్ నుంచి ముందుగా దర్శనం టికెట్లను ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.
 
ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న బుకింగ్ కూపన్లను ప్రింట్ తీసుకొని యాత్రికులు విధిగా తమ వెంట తీసుకెళ్లాలి. సన్నిధానం వద్ద పోలీసులు ఆ కూపన్లను పరిశీలించి ఆనంతరం అయ్యప్పస్వామి దర్శనం కోసం ఎంట్రీ కార్డు ఇస్తారు. జనవరి వరకు శబరిమల యాత్రకు వెళ్లేవారు ఈ ఉచిత వెబ్‌సైట్ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు దర్శనం సౌకర్యాన్ని కల్పిస్తారు. ఆన్‌లైన్‌లో శబరిమలలో వసతి సదుపాయం పొందాలంటే... ఠీఠీఠీ. ట్చఛ్చటజీఝ్చ్చ్చఛిఛిౌఝౌఛ్చ్టీజీౌ.ఛిౌఝ లాగిన్ అవ్వచ్చు. పేమెంట్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారానే చేయాలి. రిజర్వేషన్ చార్జ్ రూ.100 ఉంటుంది. రూమ్ రెంట్ అదనం.
 
మరిన్ని వివరాలకు...
కేరళ టూరిజం, పార్క్ వ్యూ, తిరువనంతపురం
టోల్ ఫ్రీ నెం: 1-800-425-4747,
ఇండియా టూరిజమ్ హైదరాబాద్, 040-23409199
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement