Sabarimala pilgrimage
-
ఇక వారిని ‘అయ్యప్పే ఆదుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘అప్పుడు నాకు పాతికేళ్లు. యవ్వనంతో దృఢంగా ఉన్నా. సైన్యంలో చేరేందుకు కసరత్తు చేసి బలంగా తయారయ్యాను. అయినప్పటికీ సైన్యం శారీర దారుఢ్య పరీక్షలో పాస్‌కాలేక పోయాను. కొల్లాం జిల్లా పునలూరులోని మా గ్రామానికి వచ్చి పడ్డాను. ఇక చాలు, వచ్చి నా ఉద్యోగంలో చేరంటూ నా తండ్రి ఆదేశించాడు. చేసేదేమీలేక పుణ్యమూ, పురుషార్థమూ రెండూ దక్కుతాయనుకొని వచ్చి ఈ వృత్తిలో చేరాను. ఇప్పుడు నాకు 53 ఏళ్లు. దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కొండలెక్కేటప్పుడు భరించలేని ఒళ్లు నొప్పులు వస్తాయి. పంటి బిగువున నొప్పిని భరిస్తాను. అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. విశ్రాంత వేళలో కూడా కీళ్ల నొప్పులు, వెన్నుముక నొప్పి వేధిస్తాయి. ప్రతి రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకొనిదే నిద్రరాదు’ శబరిమల ఆలయం వద్ద డోలి సర్వీసులో పనిచేసే సత్యన్ తెలిపారు. ఇక్కడ డోలి అంటే రెండు కర్రల మధ్య ఓ వెదురు కుర్చీని బిగిస్తారు. ఆ వెదురు కుర్చీలో భక్తులను కూర్చో బెట్టుకొని నలుగురు కూలీలు తీసుకెళ్లడమే డోలీ సర్వీసు. దానిలో భక్తులను పంబా నది నుంచి నాలుగు కి లోమీటర్ల దూరంలోని సన్నిధానం అయ్యప్ప ఆలయానికి తీసుకెళతారు. సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తులో సన్నిధానం ఉంది. అక్కడికి భక్తులు చెప్పులకు పాదరక్షలు లేకుండా అడ్డదిడ్డంగా ఉండే అటవి బాటలో వెళ్లాల్సి ఉండేది. శారీరకంగా బలహీనంగా ఉండే భక్తులకు అలా వెళ్లడం కష్టం కనుక 1966లో కేవలం పది డోలీలతో ఈ సర్సీసు ప్రారంభమైంది. అప్పటి ‘ట్రావన్‌కోర్ దేవసం బోర్డు’ చైర్మన్ ప్రక్కులం భాసి ఈ డోలి సర్వీసును ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డు ఆధ్వర్యంలోనే ఈ డోలి సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం 500 డోలీలు ఉండగా, వాటిని లాగేందుకు 2000 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కో భక్తుడి నుంచి డోలీ సర్వీసు కింద 4,200 రూపాయలను వసూలు చేస్తారు. అందులో 200 రూపాయలు దేవసం బోర్డుకు వెళుతుంది. నాలుగు వేల రూపాయలను నలుగురు కూలీలు సమంగా పంచుకోవాలి. సీజన్లో ఒక్కో కూలీకి 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సీజనంటే ప్రస్తుతం నడుస్తున్న మండల సీజన్. ఈ సీజన్లో 41 రోజులు అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. ఇది మలయాళం క్యాలండర్ ప్రకారం వృశ్చిక మాసంలో వస్తుంది. ఆ తర్వాత మకరవిలక్కసు సీజన్ వస్తుంది. అదో 20 రోజులు, రెండు సీజన్లు కలిసి 61 రోజులు ఆలయం తెరచి ఉంటుంది. ఈ సీజన్లోనే డోలీ కూలీలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మొత్తం ఏడాదిలో 126 రోజులు మాత్రమే అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. డోలీ కూలీలు బస్టాండుకు వెళ్లి భక్తులను అక్కడే ఎక్కించుకొని పంబా నది తీరానికి రావాలి. నదిలో స్నానమాచరించాక మళ్లీ వారిని ఎక్కించుకొని కొండపైన అయ్యప్ప ఆలయానికి తీసుకెళ్లాలి. ఆ భక్తులే అదే రోజు వెనక్కి వస్తానంటే తీసుకరావాలి. మరుసటి రోజు వస్తానంటే మరుసటి రోజే తీసుకరావాల్సి ఉంటుంది. వారు భక్తులను రెండు గంటల్లో కొండపైకి తీసుకెళతారు. మార్గమధ్యంలో పది నిమిషాల చొప్పున మూడుసార్లు ఆగుతారు. వారికి గతంలో పంబా నది తీరాన విశ్రాంతి మందిరం ఉండేది. గత ఆగస్టు నెలలో వచ్చిన వరదల్లో అది కాస్త కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆరు బయటే వారి విశ్రాంతి. కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన డోలీ కూలీలు సీజనంతా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. వారు దేవసం బోర్డు పరిధిలో కాంట్రాక్టు కూలీలుగా పనిచేస్తున్నందున వారికి సెలవులు లేవు. రోగమొస్తే, నొప్పొస్తే ఉచిత వైద్య సౌకర్యం లేదు. మంచాన పడినా పింఛను సౌకర్యం లేదు. ఒకప్పుడు ముళ్ల పొదలు, కొనదేలి కోసుకుపోయే రాళ్ల మీది నుంచి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు సిమ్మెంట్ రోడ్డు మీద వెళుతున్నారు. భక్తులులాగే వీరు కూడా పాద రక్షలు లేకుండానే వెళ్లాలి. రావాలి. వృత్తి కారణంగా వారికి కీళ్ల నొప్పులే కాకుండా ‘డిస్క్ పొలాప్స్’ లాంటి వెన్నుముఖ జబ్బులు కూడా వస్తున్నాయి. 53 ఏళ్లు వచ్చినా మన సత్యన్ ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు కనిస్తున్నాడుకానీ చాలా మంది కూలీలు 50 ఏళ్లకే చనిపోతారట. ఇప్పుడు వారికి నిరుద్యోగం భయం పట్టుకుంది. యాత్రికుల తాకిడి ఎక్కువవడం, వారి నుంచి టీడీబీకి వస్తున్న ఆదాయం కూడా పెరగడంతో భక్తుల సౌకర్యార్థం పంబా నది నుంచి సన్నిధానం వరకు ‘రోప్ వే’ను ప్రవేశ పెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో డోలీ సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పుడు తాము రోడ్డున పడతామని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ పాలక, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక తమకు అయ్యప్పే దిక్కని, ఆయన ఎలా కాపాడుతారో చూడాలి అని వారు మొరపెట్టుకుంటున్నారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై రాష్ట్ర అసెంబ్లీలో కుమ్ముకుంటున్న పాలక, ప్రతిపక్షాలకు వీరి గురించి పట్టించుకునే తీరికెక్కడిది! సోమవారం కూడా కేరళ అసెంబ్లీ స్తంభించిపోయింది. -
శబరిమల వివాదం : హిందూ సంఘాలపై స్వామి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ సంస్థలు, నిరసనకారులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. ‘సుప్రీం కోర్టు ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు అది తమ సంప్రదాయమని హిందువులు చెబుతున్నారని, ట్రిపుల్ తలాక్ కూడా సంప్రదాయమేనని, కానీ దాన్ని రద్దు చేసిన తర్వాత అందరూ స్వాగతించారని, హిందువులు కూడా ఇదే మాదిరి వ్యవహరించా’లని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇది హిందూ పునరుజ్జీవానికి, తిరోగమనానికి మధ్య సాగుతున్న పోరాటమని అభివర్ణించారు. హిందువులందరూ ఒకటేనని, కుల వ్యవస్థ రద్దు కావాలని హిందూ పునరుజ్జీవ శక్తులు కోరుతున్నాయన్నారు. బ్రాహ్మణులు ప్రస్తుతం కేవలం మేథావులుగానే మిగిలిపోలేదని, వారు సినిమా, వ్యాపారం తదితర రంగాల్లోనూ ఉన్నారని చెప్పుకొచ్చారు. పుట్టుకతోనే కులం నిర్ధారణ అవుతుందని ఎక్కడ రాశారని, శాస్ర్తాలను సవరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయంలోకి పది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశాన్ని హిందూ నిరసనకారులు అడ్డగిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. -
శబరిమలలో భారీ భద్రత
నీలక్కల్ : శబరిమల ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని నిరసనకారులు అడ్డుకుంటున్న క్రమంలో ఆలయ ప్రవేశ ద్వారం ఉన్న నీలక్కల్ పరిసర ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. పంబా బేస్ క్యాంప్ సమీపం నుంచే నిరసనకారులు 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి రాకుండా అడ్డగిస్తున్నారు. నీలక్కల్, పంబా బేస్ క్యాంప్‌ల వద్ద 200 మంది మహిళా పోలీసులతో సహా వేయి మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. సన్నిధానం వద్ద 500 పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి అన్ని వయసుల మహిళలతో భక్తులందరికీ శబరిమల ఆలయ పోర్టల్ మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది.మరోవైపు నీలక్కల్లో శబరిమల అచార్య సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసనకారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాన్ని పోలీసులు తొలగించారు. భక్తులను శబరిమల వెళ్లకుండా ఎవరైనా అడ్డుకుంటే ఉపేక్షించేంది లేదని, కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరించారు. పంబా వైపు వెళుతున్న వాహనాలను పరిశీలించి, మహిళా భక్తులను అడ్డుకుంటున్న నిరసనకారులపై తీవ్ర చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు దంపతులను నిరసనకారులు అడ్డుకోగా వారిని పోలీసులు సురక్షితంగా పంబకు చేర్చారు. కాగా టీవీ న్యూస్ ఛానెళ్ల ప్రతినిధులను సైతం నీలక్కల్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా నిరసనకారులు కోరారు. ఆ ప్రాంతంలో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించిన అనంతరం మీడియా ప్రతినిధులు తిరిగి తమ విధుల్లో నిమగ్నమయ్యారు. హిందూ సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని శివసేన హెచ్చరించింది. శబరిమల వెళ్లే భక్తులను అడ్డుకునేందుకు ఎవరినీ అనుమతించమని కేరళ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. -
శబరిమల తీర్పును సవాల్ చేయం..
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని కేరళ ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలో మహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. శబరిమల తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయదని, ఆలయాన్ని సందర్శిఃచే మహిళా భక్తుల భద్రతకు, సౌకర్యాలకు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు కేరళ సహా పొరుగు రాష్ట్రాల నుంచి మహిళా పోలీసులను నియమిస్తామని చెప్పారు. శబరిమల ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లే మహిళలను ఎవరూ అడ్డుకోరని తేల్చిచెప్పారు. కాగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును పలు మహిళా హక్కుల సంస్థలు స్వాగతించగా, హిందూ సంఘాల ప్రతినిధులు తీర్పుతో విభేదించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు సైతం వ్యతిరేకిస్తోంది. -
శబరిమలలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
తిరువనంతపురం : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో శబరిమలలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కేరళ సర్కార్ చర్యలు చేపట్టింది. పంబా నదీతీరంలో మహిళల కోసం ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేయడంతో పాటు బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు, మహిళలకు అనుకూలంగా ఉండేలా టాయ్లెట్ల నిర్మాణం వంటి పలు ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. హజ్ యాత్ర తర్వాత శబరిమల యాత్రనే ప్రపంచంలో రెండో అతిపెద్ద యాత్రగా పరిగణిస్తారు. దశాబ్ధాలుగా శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం లేని క్రమంలో సర్వోన్నత న్యాయస్ధానం ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును మేథావులు, అభ్యుదయవాదులు స్వాగతించగా, సంప్రదాయాలు, ఆచారాలకు ఈ తీర్పు విరుద్ధమని హిందూ వర్గాలు మండిపడుతున్నాయి. కాగా కోర్టు ఉత్తర్వులను అమలుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలో మంత్రి దేవసోమ్ సురేంద్రన్, ఆలయ బోర్డు సభ్యులు, సీనియర్ పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. మహిళా యాత్రికులు శబరిమల సందర్శించేలా తాము అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని సమావేశానంతరం మంత్రి సురేంద్రన్ వెల్లడించారు. -
కొండకోనలలో కొండంత భక్తితో...
ఇటు అటూ... ఎటు చూసినా పచ్చదనం. చెట్ల చిటారు కొమ్మల నుంచి వినిపించే పక్షిగానాలు.. స్వర సవ్వడులను ఇచ్చే సెలయేళ్లు... నీలిమలై కొండల ధ్యాన దీక్షలు, పవిత్ర పంబా నది భక్తి రాగాలాపనలు... కేరళ రాష్ట్రంలో పత్తినంతిట్ట జిల్లాలో... సహ్యాద్రి పర్యతశ్రేణులలో కొలువై ఉన్నాడు హరిహరసుతుడు అయ్యప్ప. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో, పద్దెనిమిది కొండల మధ్య దట్టమైన అడవుల మధ్య కొలువుదీరినాడు. ఎరుమేలి నుంచి సాగే అయ్యప్ప భక్తుల యాత్రలో ఎన్నెన్నో ప్రకృతి సోయగాలు! అయ్యప్ప దర్శనానికి చేరే మార్గమంతా పచ్చటి ప్రకృతిమయం. ఆ మార్గంలోనే అణువణువూ దైవ దర్శనం... నిర్మలారెడ్డి శబరిమల యాత్రకు ప్రతి యేడాది భక్తులు దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండలపూజ నవంబర్ 17, మకరవిళక్కు (మకరజ్యోతి) జనవరి 14 - ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. మిగతా అన్ని రోజుల్లోనూ దేవాలయాన్ని మూసి ఉంచుతారు. అయితే, ప్రతి మలయాళ నెలలో ఐదు రోజుల పాటు గుడిని తెరచి ఉంచుతారు. ఇప్పటికే దీక్షలో ఉన్నవారు గురుస్వామి నాయకత్వంలో ఒక బృందంగా శబరిమలకు బయల్దేరి వెళుతుండటం పరిపాటిగా కనిపించే దృశ్యం. ఎరుమేలి నుంచి... దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల యాత్ర ఎరుమేలి వద్ద మొదలవుతుంది. ఎరుమేలి నుండి అయ్యప్ప దేవాలయానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరం. ఎరుమేలి కొట్టాయం జిల్లాలో ఉంది. కొచ్చిన్ నుంచి 98 కిలోమీటర్లు, తిరువనంతపురం (త్రివేండ్రం) నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎరుమేలి. యాత్రికులకు కొట్టాయం కానీ కొచ్చి కానీ అనుకూలమైన కూడలి. పంబ నుంచి 7 కి.మీ దూరం ఉంటుంది సన్నిధానం. పంబ వరకు వాహనంలోనో, కాలినడకనో వెళ్లి, అక్కడ నుంచి తప్పనిసరిగా కాలినడకన కానీ, డోలీలో కానీ వెళ్లాలి. ముందుగా ఎరుమేలిలో ‘వావరు’ స్వామిని భక్తులు దర్శించుకుంటారు. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్లినప్పుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే ‘వావరు’ స్వామి. ‘నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు’ అని అయ్యప్ప ‘వావరు’కు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం. వావరు కొలువున్నది కూడా ఒక మసీదులోనే! ఎరుమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్పస్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఎరుమేలి నుంచి ‘పంబ’కు రెండు మార్గాలున్నాయి. ఒకటి కాలి నడక (పెద్దపాదం), రెండోది బస్సు మార్గం. పాదయాత్ర ప్రారంభం... ‘పెద్ద పాదం’ అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. దాదాపు 52 కిలోమీటర్ల దారి అంతా చిట్టడవి. తలపై ఇరుముడులు పెట్టుకొని, పాదరక్షలు లేకుండా కీకారణ్యంలో రాళ్లు రప్పల మీదుగా అస్తవ్యస్తమైన మార్గం గుండా రాత్రింబవళ్లూ సాగుతారు. దారిలో పెరుర్తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా ‘కాలైకట్టి’ వద్ద నుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట. ఇక్కడికి కొద్ది దూరంలోనే ‘అళుదా’నది ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి ఒక రాయిని తీసుకుని వెళతారు. ఆ రాతిని ‘కలీద ముకుంద’ అనే మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటున పడేస్తారు. తర్వాత యాత్ర ముందుకు సాగి ‘కరిమల, పెరియాన వట్టమ్, చెరియానవట్టమ్’ అనే స్థలాల గుండా ‘పంబ’నది చేరుకుంటారు. బస్సుమార్గాన వచ్చేవారు కూడా ఈ పంబకే చేరుకుంటారు. పంబ గ్రామం నుండి స్వామి సన్నిధానానికి సుమారు 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న వినాయకుడిని ‘కన్నెమూల గణపతి’ అంటారు. ఇక్కడ నుండి ‘చిన్నపాదం’ యాత్ర మొదలవుతుంది. అయ్యప్ప సన్నిధానం... భక్తులు పంబానదిలో స్నానం చేసి, ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో నీలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో ‘శరమ్గుత్తు’ అనే చోట ఉంచుతారు. ఇక్కడ నుండి అయ్యప్ప సన్నిధానానికి కిలోమీటర్ దూరం ఉంటుంది. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను ‘పదునెట్టాంబడి’ అంటారు. 40 రోజుల దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుంది. ఇరుముడి, దీక్ష లేనివారు ‘పదునెట్టాంబడి’కి కుడిచేతివైపు వేరేమార్గం గుండా దర్శనానికి వెళ్లాలి. ఆన్లైన్లో దర్శన క్యూ కూపన్ల కోసం... దర్శనానికి లక్షలాది భక్తులు బారులు తీరే ఈ సీజన్లో అవాంఛనీయ ఘటనలను నివారించడానికి కేరళ పోలీసుల సూచన మేరకు కొన్నేళ్ల క్రితమే ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్నీ ప్రారంభించారు. భక్తులు తమ పేరు, వయసు, చిరునామా, ఫొటో ఐడి వివరాలను ‘ఈ పోర్టల్’లో నమోదు చేసుకొని.. లభ్యతను బట్టి తమకు అనువైన తేదీ, సమయాల్లో దర్శన క్యూ కూపన్లను ముందుగానే రిజర్వు చేసుకోవచ్చు. మోసాలకు అడ్డుకట్ట... గత ఏడాది కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వెబ్‌సైట్‌ను కొందరు వినియోగించుకుని యాత్రికుల వద్ద అధిక డబ్బులు వసూలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకని శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం కేరళ పోలీసులు వర్చువల్ క్యూ సిస్టం పేరిట వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఆ వెబ్సైట్ నుంచి ముందుగా దర్శనం టికెట్లను ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న బుకింగ్ కూపన్లను ప్రింట్ తీసుకొని యాత్రికులు విధిగా తమ వెంట తీసుకెళ్లాలి. సన్నిధానం వద్ద పోలీసులు ఆ కూపన్లను పరిశీలించి ఆనంతరం అయ్యప్పస్వామి దర్శనం కోసం ఎంట్రీ కార్డు ఇస్తారు. జనవరి వరకు శబరిమల యాత్రకు వెళ్లేవారు ఈ ఉచిత వెబ్సైట్ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు దర్శనం సౌకర్యాన్ని కల్పిస్తారు. ఆన్లైన్లో శబరిమలలో వసతి సదుపాయం పొందాలంటే... ఠీఠీఠీ. ట్చఛ్చటజీఝ్చ్చ్చఛిఛిౌఝౌఛ్చ్టీజీౌ.ఛిౌఝ లాగిన్ అవ్వచ్చు. పేమెంట్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారానే చేయాలి. రిజర్వేషన్ చార్జ్ రూ.100 ఉంటుంది. రూమ్ రెంట్ అదనం. మరిన్ని వివరాలకు... కేరళ టూరిజం, పార్క్ వ్యూ, తిరువనంతపురం టోల్ ఫ్రీ నెం: 1-800-425-4747, ఇండియా టూరిజమ్ హైదరాబాద్, 040-23409199