
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని కేరళ ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలో మహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. శబరిమల తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయదని, ఆలయాన్ని సందర్శిఃచే మహిళా భక్తుల భద్రతకు, సౌకర్యాలకు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.
ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు కేరళ సహా పొరుగు రాష్ట్రాల నుంచి మహిళా పోలీసులను నియమిస్తామని చెప్పారు. శబరిమల ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లే మహిళలను ఎవరూ అడ్డుకోరని తేల్చిచెప్పారు. కాగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును పలు మహిళా హక్కుల సంస్థలు స్వాగతించగా, హిందూ సంఘాల ప్రతినిధులు తీర్పుతో విభేదించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు సైతం వ్యతిరేకిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment