
నీలక్కల్ : శబరిమల ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని నిరసనకారులు అడ్డుకుంటున్న క్రమంలో ఆలయ ప్రవేశ ద్వారం ఉన్న నీలక్కల్ పరిసర ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. పంబా బేస్ క్యాంప్ సమీపం నుంచే నిరసనకారులు 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి రాకుండా అడ్డగిస్తున్నారు. నీలక్కల్, పంబా బేస్ క్యాంప్‌ల వద్ద 200 మంది మహిళా పోలీసులతో సహా వేయి మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. సన్నిధానం వద్ద 500 పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి అన్ని వయసుల మహిళలతో భక్తులందరికీ శబరిమల ఆలయ పోర్టల్ మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది.మరోవైపు నీలక్కల్‌లో శబరిమల అచార్య సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసనకారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాన్ని పోలీసులు తొలగించారు. భక్తులను శబరిమల వెళ్లకుండా ఎవరైనా అడ్డుకుంటే ఉపేక్షించేంది లేదని, కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరించారు.
పంబా వైపు వెళుతున్న వాహనాలను పరిశీలించి, మహిళా భక్తులను అడ్డుకుంటున్న నిరసనకారులపై తీవ్ర చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు దంపతులను నిరసనకారులు అడ్డుకోగా వారిని పోలీసులు సురక్షితంగా పంబకు చేర్చారు. కాగా టీవీ న్యూస్ ఛానెళ్ల ప్రతినిధులను సైతం నీలక్కల్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా నిరసనకారులు కోరారు. ఆ ప్రాంతంలో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించిన అనంతరం మీడియా ప్రతినిధులు తిరిగి తమ విధుల్లో నిమగ్నమయ్యారు.
హిందూ సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని శివసేన హెచ్చరించింది. శబరిమల వెళ్లే భక్తులను అడ్డుకునేందుకు ఎవరినీ అనుమతించమని కేరళ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment