కొచ్చి : శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టడం ఆమోదయోగ్యం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కొచ్చికి చెందిన గోవింద్ మధుసూధన్ బెయిల్ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిరసనలు తెలపడం సుప్రీం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని పేర్కొంది.
శబరిమల వద్ద సమ్మెలు చేపట్టడం సమ్మతం కాదని అక్కడ మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే క్రమంలో అరెస్ట్ అయిన నిరసనకారుల్లో ఒకరైన కొచ్చి నివాసి మధుసూధన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మధుసూధన్ అరెస్ట్ అయ్యారు. పోలీసులు 3500 మంది నిరసనకారులను అరెస్ట్ చేయగా, వీరిలో 540 మందిపై కేసు నమోదు చేశారు. దాదాపు 100 మంది వరకూ ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
మరోవైపు శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించే లక్ష్యంతో బీజేపీ గురువారం రథయాత్రను ప్రారంభించింది. ఇక ఈ వివాదాన్ని రాజకీయం చేసేందుకు బీజేపీ, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ విపక్ష కాంగ్రెస్ సైతం కాసర్‌గాడ్, అలప్పుజ, తిరువనంతపురంల నుంచి యాత్రలను ప్రారంభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment