బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ సంస్థలు, నిరసనకారులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. ‘సుప్రీం కోర్టు ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు అది తమ సంప్రదాయమని హిందువులు చెబుతున్నారని, ట్రిపుల్ తలాక్ కూడా సంప్రదాయమేనని, కానీ దాన్ని రద్దు చేసిన తర్వాత అందరూ స్వాగతించారని, హిందువులు కూడా ఇదే మాదిరి వ్యవహరించా’లని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.
ఇది హిందూ పునరుజ్జీవానికి, తిరోగమనానికి మధ్య సాగుతున్న పోరాటమని అభివర్ణించారు. హిందువులందరూ ఒకటేనని, కుల వ్యవస్థ రద్దు కావాలని హిందూ పునరుజ్జీవ శక్తులు కోరుతున్నాయన్నారు. బ్రాహ్మణులు ప్రస్తుతం కేవలం మేథావులుగానే మిగిలిపోలేదని, వారు సినిమా, వ్యాపారం తదితర రంగాల్లోనూ ఉన్నారని చెప్పుకొచ్చారు.
పుట్టుకతోనే కులం నిర్ధారణ అవుతుందని ఎక్కడ రాశారని, శాస్ర్తాలను సవరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయంలోకి పది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశాన్ని హిందూ నిరసనకారులు అడ్డగిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment