ఇక వారిని ‘అయ్యప్పే ఆదుకోవాలి’ | The Health Travails Of Sabarimala Dolly Bearers | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 4 2018 10:49 AM | Last Updated on Tue, Dec 4 2018 4:18 PM

The Health Travails Of Sabarimala Dolly Bearers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘అప్పుడు నాకు పాతికేళ్లు. యవ్వనంతో దృఢంగా ఉన్నా. సైన్యంలో చేరేందుకు కసరత్తు చేసి బలంగా తయారయ్యాను. అయినప్పటికీ సైన్యం శారీర దారుఢ్య పరీక్షలో పాస్‌కాలేక పోయాను. కొల్లాం జిల్లా పునలూరులోని మా గ్రామానికి వచ్చి పడ్డాను. ఇక చాలు, వచ్చి నా ఉద్యోగంలో చేరంటూ నా తండ్రి ఆదేశించాడు. చేసేదేమీలేక పుణ్యమూ, పురుషార్థమూ రెండూ దక్కుతాయనుకొని వచ్చి ఈ వృత్తిలో చేరాను. ఇప్పుడు నాకు 53 ఏళ్లు. దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కొండలెక్కేటప్పుడు భరించలేని ఒళ్లు నొప్పులు వస్తాయి. పంటి బిగువున నొప్పిని భరిస్తాను. అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. విశ్రాంత వేళలో కూడా కీళ్ల నొప్పులు, వెన్నుముక నొప్పి వేధిస్తాయి. ప్రతి రోజు పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకొనిదే నిద్రరాదు’ శబరిమల ఆలయం వద్ద డోలి సర్వీసులో పనిచేసే సత్యన్‌ తెలిపారు.

ఇక్కడ డోలి అంటే రెండు కర్రల మధ్య ఓ వెదురు కుర్చీని బిగిస్తారు. ఆ వెదురు కుర్చీలో భక్తులను కూర్చో బెట్టుకొని నలుగురు కూలీలు తీసుకెళ్లడమే డోలీ సర్వీసు. దానిలో భక్తులను పంబా నది నుంచి నాలుగు కి లోమీటర్ల దూరంలోని సన్నిధానం అయ్యప్ప ఆలయానికి తీసుకెళతారు. సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తులో సన్నిధానం ఉంది. అక్కడికి భక్తులు చెప్పులకు పాదరక్షలు లేకుండా అడ్డదిడ్డంగా ఉండే అటవి బాటలో వెళ్లాల్సి ఉండేది. శారీరకంగా బలహీనంగా ఉండే భక్తులకు అలా వెళ్లడం కష్టం కనుక 1966లో కేవలం పది డోలీలతో ఈ సర్సీసు ప్రారంభమైంది. అప్పటి ‘ట్రావన్‌కోర్‌ దేవసం బోర్డు’ చైర్మన్‌ ప్రక్కులం భాసి ఈ డోలి సర్వీసును ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డు ఆధ్వర్యంలోనే ఈ డోలి సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం 500 డోలీలు ఉండగా, వాటిని లాగేందుకు 2000 మంది కూలీలు పనిచేస్తున్నారు.

ఒక్కో భక్తుడి నుంచి డోలీ సర్వీసు కింద 4,200 రూపాయలను వసూలు చేస్తారు. అందులో 200 రూపాయలు దేవసం బోర్డుకు వెళుతుంది. నాలుగు వేల రూపాయలను నలుగురు కూలీలు సమంగా పంచుకోవాలి. సీజన్‌లో ఒక్కో కూలీకి 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సీజనంటే ప్రస్తుతం నడుస్తున్న మండల సీజన్‌. ఈ సీజన్‌లో 41 రోజులు అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. ఇది మలయాళం క్యాలండర్‌ ప్రకారం వృశ్చిక మాసంలో వస్తుంది. ఆ తర్వాత మకరవిలక్కసు సీజన్‌ వస్తుంది. అదో 20 రోజులు, రెండు సీజన్‌లు కలిసి 61 రోజులు ఆలయం తెరచి ఉంటుంది. ఈ సీజన్‌లోనే డోలీ కూలీలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మొత్తం ఏడాదిలో 126 రోజులు మాత్రమే అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది.

డోలీ కూలీలు బస్టాండుకు వెళ్లి భక్తులను అక్కడే ఎక్కించుకొని పంబా నది తీరానికి రావాలి. నదిలో స్నానమాచరించాక మళ్లీ వారిని ఎక్కించుకొని కొండపైన అయ్యప్ప ఆలయానికి తీసుకెళ్లాలి. ఆ భక్తులే  అదే రోజు వెనక్కి వస్తానంటే తీసుకరావాలి. మరుసటి రోజు వస్తానంటే మరుసటి రోజే తీసుకరావాల్సి ఉంటుంది. వారు భక్తులను రెండు గంటల్లో కొండపైకి తీసుకెళతారు. మార్గమధ్యంలో పది నిమిషాల చొప్పున మూడుసార్లు ఆగుతారు. వారికి గతంలో పంబా నది తీరాన విశ్రాంతి మందిరం ఉండేది. గత ఆగస్టు నెలలో వచ్చిన వరదల్లో అది కాస్త కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆరు బయటే వారి విశ్రాంతి. కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన డోలీ కూలీలు సీజనంతా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది.
 

వారు దేవసం బోర్డు పరిధిలో కాంట్రాక్టు కూలీలుగా పనిచేస్తున్నందున వారికి సెలవులు లేవు. రోగమొస్తే, నొప్పొస్తే ఉచిత వైద్య సౌకర్యం లేదు. మంచాన పడినా  పింఛను సౌకర్యం లేదు. ఒకప్పుడు ముళ్ల పొదలు, కొనదేలి కోసుకుపోయే రాళ్ల మీది నుంచి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు సిమ్మెంట్‌ రోడ్డు మీద వెళుతున్నారు. భక్తులులాగే వీరు కూడా పాద రక్షలు లేకుండానే వెళ్లాలి. రావాలి. వృత్తి కారణంగా వారికి కీళ్ల నొప్పులే కాకుండా ‘డిస్క్‌ పొలాప్స్‌’ లాంటి వెన్నుముఖ జబ్బులు కూడా వస్తున్నాయి. 53 ఏళ్లు వచ్చినా మన సత్యన్‌ ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు కనిస్తున్నాడుకానీ చాలా మంది కూలీలు 50 ఏళ్లకే చనిపోతారట.

ఇప్పుడు వారికి నిరుద్యోగం భయం పట్టుకుంది. యాత్రికుల తాకిడి ఎక్కువవడం, వారి నుంచి టీడీబీకి వస్తున్న ఆదాయం కూడా పెరగడంతో భక్తుల సౌకర్యార్థం పంబా నది నుంచి సన్నిధానం వరకు ‘రోప్‌ వే’ను ప్రవేశ పెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో డోలీ సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పుడు తాము రోడ్డున పడతామని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ పాలక, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక తమకు అయ్యప్పే దిక్కని, ఆయన ఎలా కాపాడుతారో చూడాలి అని వారు మొరపెట్టుకుంటున్నారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై రాష్ట్ర అసెంబ్లీలో కుమ్ముకుంటున్న పాలక, ప్రతిపక్షాలకు వీరి గురించి పట్టించుకునే తీరికెక్కడిది! సోమవారం కూడా కేరళ అసెంబ్లీ స్తంభించిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement